యేసు అర షెకెలు దేవాలయ పన్ను చెల్లించడం

మెస్సీయ అయిన యేసు దేవాలయం కోసం అర షెకెలు చెల్లిస్తాడు.

గలిలయ నుండి వైదొలిగి గడిపిన కాలం ఇప్పుడు ముగిసింది. ఈ కాలంలోని మిగిలిన సంఘటనలకు బహుశా కొన్ని రోజులు మాత్రమే పట్టి ఉంటుంది.

కపెర్నహూము

క్రీ.శ. 29 లేదా 28

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

మత్తయి రాసిన సువార్త 17:24–27

17:24 వారు కపెర్నహూముకు చేరగానే అర షెకెలు పన్ను వసూలు చేసేవారు పేతురు దగ్గరికి వచ్చి, “మీ గురువుగారు ఈ అర షెకెలు పన్ను చెల్లించడా?” అని అడిగారు. 25 అతడు, “అవును, చెల్లిస్తాడు” అన్నాడు. అతడు ఇంట్లోకి వెళ్ళి యేసుతో ఆ విషయం చెప్పక ముందే ఆయన, “సీమోనూ, ఈ భూమి మీద రాజులు సుంకం, పన్ను ఎవరి దగ్గర వసూలు చేస్తారు? తమ కొడుకుల దగ్గరా లేక బయటివాళ్ళ దగ్గరా?” అని అడిగాడు. 26 అతడు, “బయటివాళ్ళ దగ్గరే” అని చెప్పాడు. యేసు, “అలాగైతే కొడుకులు స్వతంత్రులే. 27 అయినా ఈ పన్ను వసూలు చేసేవారిని ఇబ్బంది పెట్టకుండా నీవు సముద్రానికి వెళ్ళి, గాలం వేసి, మొదట పడిన చేపను తీసుకుని దాని నోరు తెరువు. దానిలో ఒక షెకెలు నాణెం నీకు దొరుకుతుంది. దాన్ని నాకోసం, నీకోసం వారికి ఇవ్వు” అన్నాడు.

ఎవరు గొప్పవారని పన్నెండుమంది వాదించుకోవడం

మెస్సీయ పరిపాలనలో ఎవరు గొప్పవారవుతారని పన్నెండుమంది వాదించుకుంటారు. ఆయన ప్రజలు చిన్నపిల్లల్లా ఉండాలి.

కపెర్నహూము

మత్తయి రాసిన సువార్త 18:1–5

18:1 ఆ రోజుల్లోనే శిష్యులు వచ్చి, “పరలోక రాజ్యంలో అందరికంటే గొప్పవాడు ఎవరు?” అని యేసుని అడిగారు.

2 అప్పుడాయన ఒక చిన్న పిల్లవాణ్ణి పిలిచి, వారి మధ్యలో నిలబెట్టి ఇలా అన్నాడు, 3 “మీరు మారుమనస్సు పొంది చిన్నపిల్లల్లాంటి వారైతేనే పరలోకరాజ్యంలో ప్రవేశించగలరని మీతో కచ్చితంగా చెబుతున్నాను.

4 కాబట్టి ఈ చిన్నవాడిలాగా ఎవడైతే తగ్గించుకుంటాడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు.

5 5 ఇలాంటి చిన్నవారిని నా పేరిట స్వీకరించేవాడు నన్ను స్వీకరించినట్టే.

మార్కు రాసిన సువార్త 9:33–37

9:33 వారు కపెర్నహూము చేరారు. అందరూ ఇంట్లో చేరాక యేసు వారితో, “దారిలో మీరు దేని గురించి చర్చించుకుంటున్నారు?” అని అడిగాడు. 34 అందరూ మౌనంగా ఉండిపోయారు. ఎందుకంటే దారిలో వారు తమలో ఎవరు గొప్ప, అని వాదించుకున్నారు.

35 యేసు కూర్చుని పన్నెండు మందిని పిలిచి, “మీలో ఎవడైనా ముఖ్యుడుగా ఉండాలంటే అతడు అందరికన్నా చివరివాడై అందరికీ సేవకుడై ఉండాలి” అని వారితో అన్నాడు.

36 అప్పుడాయన ఒక చిన్న బిడ్డను తీసుకుని వారి మధ్య నిలబెట్టాడు. ఆ బిడ్డను ఎత్తుకుని ఇలా అన్నాడు,

37 “నా పేరిట ఇలాంటి చిన్నవారిలో ఒకరిని ఎవరైనా స్వీకరిస్తే నన్ను స్వీకరించినట్టే. నన్ను స్వీకరించేవారు నన్ను కాదు, నన్ను పంపిన ఆయనను కూడా స్వీకరిస్తున్నారు.”

లూకా రాసిన సువార్త 9:46–48

9:46 తమలో ఎవరు గొప్పవాడు అనే వాదం వారిలో పుట్టింది.

47 యేసు వారి హృదయాల్లోని ఆలోచనలను తెలుసుకుని ఒక చిన్న బిడ్డను తన దగ్గర నిలబెట్టుకుని,

48 “ఇలాంటి చిన్న బిడ్డను నా పేర ఎవరైనా స్వీకరిస్తే అతడు నన్ను స్వీకరిస్తున్నాడు. నన్ను స్వీకరించేవాడు నన్ను పంపిన దేవుణ్ణి స్వీకరిస్తున్నాడు. మీలో ఎవరు అందరి కంటే చిన్నవాడిగా ఉంటాడో వాడే గొప్పవాడు.”

యోహాను తప్పుడు ఉత్సాహాన్ని యేసు గద్దించడం

యేసు తగిన ఉపమానాలతో అపొస్తలుడైన యోహాను తప్పుడు ఉత్సాహాన్ని గద్దిస్తాడు.

కపెర్నహూము

మత్తయి రాసిన సువార్త 18:6–14

18:6 కానీ నన్ను నమ్మిన ఈ చిన్నవారిలో ఒక్కడిని ఎవరైనా పాపానికి ప్రేరేపిస్తే వాడి మెడకి ఒక పెద్ద తిరగలి బండ కట్టి చాలా లోతైన సముద్రంలో పడవేయడం అతనికి మేలు.

7 “నా విషయంలో ఆటంకాలు కలిగించడం లోకానికి తీర్పుకు కారణమౌతుంది. ఆటంకాలు రాక మానవు. కానీ అవి ఎవరి వలన కలుగుతాయో, ఆ వ్యక్తికి శిక్ష తప్పదు.

8 నీ చెయ్యి గాని, నీ పాదం గాని నీకు ఆటంకంగా ఉంటే, దాన్ని నరికి పారవెయ్యి. రెండు చేతులూ రెండు పాదాలూ ఉండి నిత్యాగ్నిలో పడడం కంటే కుంటివాడుగానో, అంగహీనుడుగానో జీవంలో ప్రవేశించడం నీకు మంచిది.

9 నీ కన్ను నీకు ఆటంకంగా ఉంటే దాన్ని పెరికి దూరంగా పారవెయ్యి. రెండు కళ్ళు కలిగి నరకంలో పడడం కంటే ఒకే కంటితో జీవంలో ప్రవేశించడం నీకు మంచిది.

10 10 ఈ చిన్నపిల్లల్లో ఎవరినీ తక్కువగా చూడవద్దు. వీరిని కాపాడే దూతలు ఎప్పటికప్పుడు పరలోకంలో నా తండ్రి సన్నిధిలో నిలబడి ఆయన వైపు చూస్తూ ఉంటారు.

11 “మీరేమంటారు? ఒక మనిషికి వంద గొర్రెలు ఉండి వాటిలో ఒకటి తప్పిపోయింది అనుకోండి, 12 మిగిలిన తొంభై తొమ్మిది గొర్రెలను కొండల మీద విడిచిపెట్టి తప్పిపోయిన గొర్రెను వెదకడానికి వెళ్తాడు గదా? 13 అది అతనికి దొరికినప్పుడు తొంభై తొమ్మిది గొర్రెల గురించి కంటే ఆ ఒక్క గొర్రెను గురించి ఎక్కువగా సంతోషిస్తాడని మీతో కచ్చితంగా చెబుతున్నాను. 14 అదే విధంగా ఈ చిన్నవారిలో ఒక్కడు కూడా నశించడం పరలోకంలోని మీ తండ్రికి ఇష్టం లేదు.

మార్కు రాసిన సువార్త 9:38–50

9:38 యోహాను ఆయనతో, “బోధకా! ఒకడు నీ పేరట దయ్యాలను వెళ్ళగొట్టడం చూశాం. అతడు మనవాడు కాదు. అందువల్ల అతన్ని అడ్డగించాం” అన్నాడు.

39 అయితే యేసు, “అతనిని ఆపకండి. నా పేరట అద్భుతం చేసే వాడెవడూ నా గురించి అంత తేలికగా చెడు మాట్లాడలేడు. 40 మనకు వ్యతిరేకంగా లేని వాడు మన పక్షంగా ఉన్నవాడే. 41 మీతో కచ్చితంగా చెప్పేదేమంటే, మీరు క్రీస్తుకు చెందిన వారని గుర్తించి నా పేరట ఒక గిన్నెడు నీళ్ళు ఎవరైనా మీకు తాగడానికి ఇస్తే అతడు తప్పక దాని ఫలం పొందుతాడు.

42 “కాని, నన్ను నమ్ముకున్న ఇలాంటి ఒక చిన్నబిడ్డకి ఎవరైనా అడ్డుబండగా ఉంటే అతని మెడకు పెద్ద తిరగలి రాయి కట్టి, అతన్ని సముద్రంలో పడవేయడం అతనికి మేలు.

43-44 మీరు పాపం చేయడానికి మీ చెయ్యి కారణమైతే దాన్ని నరికివేయండి! రెండు చేతులుండి, నరకంలోని ఆరని అగ్నిలోకి పోవడం కంటే ఒక చెయ్యి లేకుండా నిత్యజీవంలో ప్రవేశించడం మీకు మేలు.

45-46 ఒకవేళ మీరు పాపం చేయడానికి మీ కాలు కారణమైతే దాన్ని నరికివేయండి. రెండు కాళ్ళు ఉండి నరకంలో ఆరని అగ్నిలోకి పోవడం కంటే ఒక కాలు లేకుండా నిత్యజీవంలో ప్రవేశించడం మీకు మేలు.

47 అలాగే మీరు పాపం చేయడానికి మీ కన్ను కారణమైతే దాన్ని పీకి పారవేయండి. రెండు కళ్ళు ఉండి నరకంలో పడడం కంటే ఒకే కన్నుతో దేవుని రాజ్యంలో ప్రవేశించడం మీకు మేలు.

48 నరకంలో వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. 49 ప్రతి ఒక్కరూ మంటల మూలంగా ఉప్పు సారం పొందుతారు. 50 ఉప్పు మంచిదే కాని దానిలో ఉన్న ఉప్పదనం పోతే ఆ స్వభావం తిరిగి ఎలా వస్తుంది? మీలో ఉప్పదనం కలిగి ఉండండి, ఒకరితో ఒకరు సామరస్యంగా ఉండండి” అని చెప్పాడు.

లూకా రాసిన సువార్త 9:49–50

9:49 అప్పుడు యోహాను, “ప్రభూ, ఎవరో ఒక వ్యక్తి నీ పేర దయ్యాలను వెళ్ళగొడుతున్నాడు. వాడు మనలను అనుసరించేవాడు కాదు కాబట్టి వాణ్ణి అడ్డుకున్నాం” అని యేసుతో చెప్పాడు.

50 అందుకు యేసు, “మీరు వాణ్ణి అడ్డుకోవద్దు. మీకు విరోధి కాని వాడు మీ వైపు ఉన్నవాడే” అని చెప్పాడు.