పాపం చేసే సహోదరునితో ఎలా వ్యవహరించాలి, ఎలా క్షమించాలి
నీకు వ్యతిరేకంగా పాపం చేసిన సహోదరునితో వ్యవహరించవలసిన సరైన విధానం, సహోదరుణ్ణి ఓపికగా క్షమించవలసిన బాధ్యత (కనికరం లేని దాసుని ఉపమానం).
క్రీ.శ. 29 లేదా 28
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
మత్తయి రాసిన సువార్త 18:15–35
18:15 “ఇంకో విషయం. నీ సోదరుడు నీ పట్ల తప్పు చేస్తే, అతడు ఒంటరిగా ఉన్నప్పుడు ఆ తప్పిదం గురించి అతనిని గద్దించు. అతడు నీ మాట వింటే నీవు నీ సోదరుణ్ణి సంపాదించుకొన్నట్టే. 16 అతడు వినకపోతే, ‘ప్రతి విషయమూ ఇద్దరు ముగ్గురు సాక్షుల మాట వలన రుజువు కావాలి.’ కాబట్టి నీవు ఒకరిద్దరిని తీసుకుని అతని దగ్గరికి వెళ్ళు. 17 అతడు వారి మాట కూడా వినకపోతే ఆ సంగతి సంఘానికి తెలియజేయి. అతడు సంఘం మాట కూడా తోసిపుచ్చితే ఇక అతణ్ణి బయటి వారిలో ఒకడుగా, పన్ను వసూలుదారుడుగా పరిగణించు.
18 “నేను మీతో కచ్చితంగా చేప్పేదేమంటే, భూమి మీద మీరు దేనిని బంధిస్తారో దాన్ని పరలోకంలో కూడా బంధిస్తారు. దేని కట్లు విప్పుతారో, దాన్ని పరలోకంలో కూడా విప్పుతారు. 19 ఇంకో విషయం, దేవుణ్ణి వేడుకొనే విషయంలో ఈ భూమి మీద మీలో కనీసం ఇద్దరు ఏకీభవిస్తే దాన్ని నా పరలోకపు తండ్రి తప్పక అనుగ్రహిస్తాడు.
20 “ఎందుకంటే ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామంలో సమకూడతారో అక్కడ వారి మధ్య నేను కూడా ఉంటాను.”
21 అప్పుడు పేతురు వచ్చి, “ప్రభూ, నా సోదరుడు నా విషయంలో తప్పు చేస్తే నేను ఎన్నిసార్లు అతణ్ణి క్షమించాలి? ఏడు సార్లు సరిపోతుందా?” అని యేసుని అడిగాడు. 22 అందుకు యేసు అతనికి జవాబిస్తూ, “ఏడు సార్లు వరకే కాదు, ఏడుకు డెబ్భై సార్ల వరకూ అని నీతో చెబుతున్నాను. 23 కాబట్టి పరలోక రాజ్యం ఒక రాజు తన పనివారి దగ్గర లెక్కలు చూడడానికి పూనుకున్నట్టు ఉంది.
24 అతడు లెక్క చూడడం ప్రారంభించగానే, అతనికి పదివేల తలాంతులు బాకీపడిన ఒక పనివాణ్ణి తీసుకొచ్చారు. 25 ఆ బాకీ తీర్చడానికి అతని దగ్గర ఏమీ లేదు. ఆ రాజు అతనినీ అతని భార్యనూ అతని పిల్లలనూ, ఇంకా అతనికి ఉన్నదంతా అమ్మివేసి తన బాకీ తీర్చాలని ఆజ్ఞాపించాడు. 26 అప్పుడా పనివాడు ఆ రాజుకు సాష్టాంగ నమస్కారం చేసి, ‘రాజా, నా విషయం కొంచెం ఓపిక పట్టు, నీ బాకీ అంతా తీర్చేస్తాను’ అని వేడుకున్నాడు. 27 ఆ రాజు జాలిపడి, అతని బాకీ అంతా క్షమించి, అతనిని విడిచి పెట్టేశాడు.
28 అయితే ఆ పనివాడు బయటికి వెళ్ళి తనకు కేవలం వంద దేనారాలు బాకీ ఉన్న తోటి పనివాణ్ణి చూసి ‘నా బాకీ తీర్చు’ అని అతని గొంతు పట్టుకున్నాడు. 29 అందుకు అతని తోటి పనివాడు సాగిలపడి, ‘కొంచెం ఓపిక పట్టు, నీ బాకీ అంతా తీర్చేస్తాను’ అని వేడుకున్నాడు. 30 కాని దానికి అతడు ఒప్పుకోక తన బాకీ తీర్చేవరకూ అతణ్ణి ఖైదులో పెట్టించాడు.
31 “అదంతా చూసిన ఇతర పనివారు చాలా బాధపడి, వెళ్ళి జరిగిందంతా రాజుకు వివరించారు. 32 అప్పుడా రాజు ఆ మొదటి పనివాణ్ణి పిలిపించి, ‘నువ్వు చెడ్డవాడివి. నీవు నన్ను వేడుకున్నప్పుడు నీ బాకీ అంతా క్షమించేశానే! 33 నేను నీ మీద దయ చూపించినట్టే నీవు కూడా నీ తోటి పనివాణ్ణి క్షమించాలి కదా’ అని చెప్పి 34 అతని మీద కోపంతో అతడు తనకు బాకీపడినదంతా పూర్తిగా తీర్చేదాకా చిత్రహింసలు పెట్టే వారికి అతన్ని అప్పగించాడు.
35 మీలో ప్రతి ఒక్కడూ తన సోదరుడి తప్పిదాల విషయంలో హృదయపూర్వకంగా క్షమించకపోతే నా పరలోకపు తండ్రి కూడా మీకు ఆ విధంగానే చేస్తాడు” అని వారితో చెప్పాడు.
మెస్సీయ అనుచరులు అన్నిటినీ విడిచిపెట్టాలి
మెస్సీయ అనుచరులు ఆయన సేవ కోసం అన్నిటినీ విడిచిపెట్టాలి.
మత్తయి రాసిన సువార్త 8:19–22
8:19 అప్పుడు ధర్మశాస్త్ర పండితుడు ఒకడు వచ్చి, “బోధకా! నీవు ఎక్కడికి వెళ్ళినా సరే, నేను నీ వెంటే వస్తాను” అన్నాడు.
20 అందుకు యేసు అతనితో, “నక్కలకు గుంటలున్నాయి. పక్షులకు గూళ్ళు ఉన్నాయి, మనుష్య కుమారుడికి మాత్రం తల వాల్చుకునే స్థలం కూడా లేదు” అన్నాడు.
21 ఆయన శిష్యుల్లో మరొకడు, “ప్రభూ, మొదట నేను వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టడానికి నాకు అనుమతి ఇవ్వండి” అని ఆయనను అడిగాడు.
22 అయితే యేసు అతనితో, “నాతో రా. చనిపోయిన వారిని పాతి పెట్టడానికి చనిపోయిన వారు ఉన్నారులే!” అన్నాడు.
లూకా రాసిన సువార్త 9:57–62
9:57 వారు దారిన వెళ్తుండగా ఒకడు వచ్చి, “నువ్వెక్కడికి వెళ్ళినా నీ వెనకే వస్తాను” అని ఆయనతో అన్నాడు.
58 అందుకు యేసు, “నక్కలకు గుంటలు ఉన్నాయి. ఆకాశంలో ఎగిరే పక్షులకు గూళ్ళున్నాయి, కానీ మనుష్య కుమారుడికి తల వాల్చుకోడానికైనా చోటు లేదు” అని అతనికి చెప్పాడు.
59 ఆయన మరో వ్యక్తిని చూసి “నా వెంట రా” అన్నాడు. ఆ వ్యక్తి, “ముందు నేను వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టి రావడానికి నాకు అనుమతి ఇయ్యి” అన్నాడు.
60 అందుకాయన, “చనిపోయినవారు తమ చనిపోయిన వారిని పాతి పెట్టుకోనియ్యి. నువ్వు వెళ్ళి దేవుని రాజ్యాన్ని ప్రకటించు” అని అతనితో చెప్పాడు.
61 మరొకడు, “ప్రభూ, నీ వెనకే వస్తాను గానీ మా ఇంట్లోని వారి దగ్గర అనుమతి తీసుకుని వస్తాను. నాకు సెలవియ్యి” అన్నాడు. 62 దానికి యేసు, “నాగలిపై చెయ్యి పెట్టి వెనక్కి చూసేవాడు ఎవడూ దేవుని రాజ్యానికి తగడు” అని వాడితో చెప్పాడు.
యేసు తన సోదరుల సలహాను తిరస్కరించడం
యేసును నమ్మని ఆయన సోదరులు యూదయలో తనను తాను కనబరచుకోవాలని ఆయనను కోరతారు; ఆయన వారి సలహాను తిరస్కరిస్తాడు.
యోహాను రాసిన సువార్త 7:2–9
7:2 ఇంతలో యూదుల పర్ణశాలల పండగ సమీపించింది.
3 అప్పుడు ఆయన తమ్ముళ్ళు ఆయనతో, “నువ్వు చేసే కార్యాలు నీ శిష్యులు చూడాలి కదా. అందుకే ఈ స్థలం వదిలి యూదయకు వెళ్ళు. 4 అందరూ మెచ్చుకోవాలని చూసేవాడు తన పనులు రహస్యంగా చేయడు. నువ్వు నిజంగా ఈ కార్యాలు చేస్తున్నట్టయితే లోకమంతటికీ తెలిసేలా చెయ్యి. నిన్ను నువ్వే చూపించుకో” అన్నారు.
5 ఆయన తమ్ముళ్ళు కూడా ఆయనలో విశ్వాసం ఉంచలేదు. 6 అప్పుడు యేసు, “నా సమయం ఇంకా రాలేదు. మీ సమయం ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. 7 లోకం మిమ్మల్ని ద్వేషించదు. కానీ దాని పనులన్నీ చెడ్డవని నేను సాక్ష్యం చెబుతున్నాను కాబట్టి అది నన్ను ద్వేషిస్తూ ఉంది. 8 మీరు పండక్కి వెళ్ళండి. నా సమయం ఇంకా సంపూర్ణం కాలేదు. కాబట్టి నేను ఈ పండక్కి ఇప్పుడే వెళ్ళను” అని వారితో చెప్పాడు. 9 వారికి ఇలా చెప్పి ఆయన గలిలయలో ఉండిపోయాడు.
యేసు ఎవరికీ తెలియకుండా సమరయ గుండా యెరూషలేముకు వెళ్లడం
లూకా రాసిన సువార్త 9:51–56
9:51 యేసు తాను పరలోకానికి ఎక్కిపోవలసిన సమయం దగ్గర పడింది అని గ్రహించి 52 ఆయన యెరూషలేముకు వెళ్ళడానికి మనసులో నిశ్చయం చేసుకున్నాడు. ఆయన తనకంటే ముందుగా దూతలను పంపాడు. వారు వెళ్ళి ఆయనకు అంతా సిద్ధం చేయడానికి ఒక సమరయ గ్రామంలో ప్రవేశించారు. 53 ఆయన యెరూషలేముకు వెళ్ళడానికి నిశ్చయం చేసుకున్నాడని తెలిసి వారు ఆయనను స్వీకరించలేదు. 54 శిష్యులైన యాకోబు యోహానులు అది చూసి, “ప్రభూ, ఆకాశం నుండి అగ్ని దిగి వీరిని నాశనం చేయాలని మేము వీరిని శపించడం నీకిష్టమేనా?” అని అడిగారు. 55 ఆయన వారి వైపు తిరిగి వారిని మందలించాడు. 56 అప్పుడు వారు మరో గ్రామానికి వెళ్ళారు.
యోహాను రాసిన సువార్త 7:10
7:10 కానీ తన తమ్ముళ్ళు పండక్కి వెళ్ళిన తరువాత ఆయన బహిరంగంగా కాకుండా రహస్యంగా వెళ్ళాడు.