ఒక కొండపై యేసు రూపాంతరం చెందడం

కైసరయ ఫిలిప్పీ దగ్గర ఒక కొండపై (బహుశా హెర్మోను) యేసు రూపాంతరం చెందుతాడు.

క్రీ.శ. 29 లేదా 28

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

మత్తయి రాసిన సువార్త 17:1–8

17:1 ఆరు రోజుల తరువాత యేసు పేతురు, యాకోబు, అతని సోదరుడు యోహానులను తీసుకుని ఎత్తయిన ఒక పర్వతం మీదికి వెళ్ళాడు.

2 వారు చూస్తూ ఉండగానే ఆయన రూపం మారిపోయింది. ఆయన ముఖం సూర్యుడిలాగా ప్రకాశించింది. ఆయన వస్త్రాలు కాంతి లాగా తెల్లనివయ్యాయి.

3 అదే క్షణంలో మోషే, ఏలీయాలు యేసుతో మాట్లాడుతూ వారికి కనిపించారు.

4 అప్పుడు పేతురు యేసుతో, “ప్రభూ, మనమిక్కడే ఉండిపోదాం. నీకిష్టమైతే ఇక్కడ నీకు, మోషేకు, ఏలీయాకు మూడు పాకలు వేస్తాను” అన్నాడు.

5 అతడు మాట్లాడుతూ ఉండగానే గొప్ప వెలుగుతో నిండిన ఒక మేఘం వారిని కమ్ముకుంది. ఆ మేఘంలో నుండి ఒక స్వరం వారితో, “ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనంటే నాకు చాలా సంతోషం. మీరు ఈయన చెప్పేది వినండి” అని పలికింది.

6 శిష్యులు ఈ మాటలు విని భయంతో బోర్లాపడిపోయారు.

7 యేసు వారి దగ్గరికి వచ్చి, వారిని తాకి, “భయపడకండి, ఇక లేవండి” అన్నాడు.

8 వారు కళ్ళు తెరచి చూస్తే, యేసు తప్ప ఇంకెవరూ వారికి కనబడలేదు.

మార్కు రాసిన సువార్త 9:2–8

9:2 ఆరు రోజుల తరవాత యేసు పేతురు, యాకోబు, యోహానులను తీసుకుని ఏకాంతంగా ఒక ఎతైన కొండ మీదికి వెళ్ళాడు. అక్కడ వారి ముందు యేసు రూపాంతరం చెందాడు.

3 ఆయన వస్త్రాలు ధగధగా మెరవసాగాయి. ప్రపంచంలో ఏ చాకలీ ఉతకలేనంత తెల్లగా మారిపోయాయి.

4 అప్పుడు ఏలీయా, మోషేలు అక్కడ ప్రత్యక్షమై యేసుతో మాటలాడడం శిష్యులు చూశారు.

5 పేతురు యేసుతో, “రబ్బీ! మనం ఇక్కడే ఉండడం మంచిది. మేము మూడు పాకలు వేస్తాం, ఒకటి నీకు, ఒకటి మోషేకి, ఒకటి ఏలీయాకి” అన్నాడు.

6 తానేమి అంటున్నాడో అతనికి తెలియలేదు. ఆ శిష్యులంతా తీవ్రమైన భయానికి లోనయ్యారు.

7 అప్పుడు ఒక మేఘం వచ్చి వారిని కప్పివేసింది. ఆ మేఘం నుండి ఒక స్వరం ఇలా వినిపించింది. “ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన మాట వినండి.”

8 వెంటనే వారు తమ చుట్టూ చూశారు, యేసు తప్ప మరెవ్వరూ వారికి కనిపించలేదు.

లూకా రాసిన సువార్త 9:28–36

9:28 ఈ మాటలు పలికిన తరువాత సుమారు ఎనిమిది రోజులయ్యాక ఆయన పేతురు, యోహాను, యాకోబులను తీసుకుని ప్రార్థన చేయడానికి ఒక కొండ ఎక్కాడు.

29 ఆయన ప్రార్థిస్తూ ఉండగా ఆయన ముఖరూపం మారిపోయింది. ఆయన ధరించిన వస్త్రాలు తెల్లగా ధగధగా మెరిసాయి.

30 ఇద్దరు వ్యక్తులు ఆయనతో మాట్లాడుతున్నారు. వారు మోషే ఏలీయాలు. 31 వారు తమ మహిమతో కనపడి ఆయన యెరూషలేములో పొందబోయే మరణాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నారు. 32 పేతురూ ఇంకా అతనితో ఉన్నవారూ నిద్ర మత్తులో ఉన్నారు. వారికి మెలకువ రాగానే ఆయన తేజస్సునూ ఆయనతో ఉన్న ఇద్దరు వ్యక్తులనూ చూశారు.

33 ఆ ఇద్దరు వ్యక్తులూ ఆయన దగ్గర నుండి వెళ్ళిపోతుండగా పేతురు, “ప్రభూ, మనం ఇక్కడ ఉండడం బాగుంటుంది. నీకు ఒకటీ, మోషేకు ఒకటీ, ఏలీయాకు ఒకటీ మూడు పర్ణశాలలు మేము కడతాం” అంటూ తానేమి మాట్లాడుతున్నాడో తనకే తెలియకుండా మాట్లాడాడు.

34 అతడు ఈ విధంగా మాట్లాడుతూ ఉండగా ఒక మేఘం వచ్చి వారిని ఆవరించింది. ఆ మేఘం వారిని కమ్ముకోగా శిష్యులు చాలా భయపడ్డారు.

35 తరువాత, “ఈయన నేను ఏర్పాటు చేసుకున్న నా కుమారుడు. ఈయన మాట వినండి” అని ఒక శబ్దం ఆ మేఘంలో నుంచి వచ్చింది.

36 ఆ శబ్దం వచ్చిన తరువాత వారికి యేసు మాత్రమే కనిపించాడు. ఆ రోజుల్లో వీరు తాము చూసిన వాటిలో దేనినీ ఎవరికీ చెప్పలేదు.

ఏలీయా గురించి ముగ్గురు శిష్యులు తికమకపడడం

కొండ దిగివస్తున్నప్పుడు, ఆ ముగ్గురు శిష్యులు పునరుత్థానం గురించీ ఏలీయా గురించీ తికమకపడతారు.

మత్తయి రాసిన సువార్త 17:9–13

17:9 వారు కొండ దిగి వచ్చేటప్పుడు, “మనుష్య కుమారుడు చనిపోయి తిరిగి సజీవుడై లేచే వరకూ ఈ దర్శనం మీరు ఎవ్వరితో చెప్పవద్దు” అని యేసు వారికి ఆజ్ఞాపించాడు.

10 అప్పుడు శిష్యులు, “మరి మొదట ఏలీయా రావాలని ధర్మశాస్త్ర బోధకులు ఎందుకు చెబుతున్నారు?” అని అడిగారు.

11 అందుకు ఆయన ఇలా జవాబిచ్చాడు, “ఏలీయా ముందుగా వచ్చి అంతా చక్కబెడతాడనే మాట నిజమే.

12 అయితే నేను కచ్చితంగా మీతో చెప్పేదేమంటే, ఏలీయా ఇప్పటికే వచ్చేశాడు గానీ వారు అతణ్ణి గుర్తించలేదు. పైగా, అతణ్ణి ఇష్టం వచ్చినట్టుగా బాధించారు. అదే విధంగా మనుష్య కుమారుడు కూడా వారి చేతిలో బాధలు అనుభవించబోతున్నాడు.”

13 బాప్తిసమిచ్చే యోహాను గురించి ఆయన తమతో చెప్పాడని శిష్యులు గ్రహించారు.

మార్కు రాసిన సువార్త 9:9–13

9:9 వారు కొండ దిగి వస్తూ ఉండగా యేసు, “మనుష్య కుమారుడు చనిపోయి తిరిగి బతికే వరకూ మీరు చూసిన ఈ దృశ్యాన్ని ఎవ్వరికీ చెప్పకండి” అని ఆజ్ఞాపించాడు.

10 అందువల్ల వారు ఆ విషయం తమలోనే దాచుకుని, “చనిపోయి తిరిగి బ్రతకడం” గురించి తమలో తాము చర్చించుకున్నారు.

11 అప్పుడు వారు, “ఏలీయా మొదట రావాలని ధర్మశాస్త్ర పండితులు ఎందుకు అంటున్నారు?” అని ఆయనను అడిగారు.

12 యేసు జవాబు చెబుతూ, “ఏలీయా మొదట వచ్చి అన్నిటినీ సరిచేస్తాడన్న మాట నిజమే. కాని, మనుష్య కుమారుడు అనేక బాధలు అనుభవిస్తాడనీ తిరస్కారానికి గురి అవుతాడనీ లేఖనాల్లో ఎందుకు రాసి ఉంది?

13 నేను మీతో చెప్పేదేమంటే, ఏలీయా వచ్చాడు, అతని గురించి రాసి ఉన్న ప్రకారం ప్రజలు తమకు ఇష్టం వచ్చినట్టు అతనికి చేశారు” అన్నాడు.