యేసు పన్నెండుమంది విశ్వాసాన్ని పరీక్షించడం
కైసరయ ఫిలిప్పీ దగ్గర, తాను మెస్సీయననే పన్నెండుమంది విశ్వాసాన్ని యేసు పరీక్షిస్తాడు.
క్రీ.శ. 29 లేదా 28
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
మత్తయి రాసిన సువార్త 16:13–20
16:13 యేసు కైసరయ ఫిలిప్పీ ప్రాంతాలకు వచ్చినపుడు తన శిష్యులను ఇలా అడిగాడు, “మనుష్య కుమారుడు ఎవరని ప్రజలు మాట్లాడుకుంటున్నారు?”
14 వారు, “కొందరేమో నీవు బాప్తిసమిచ్చే యోహానువనీ, మరి కొందరు ఏలీయావనీ, కొందరు యిర్మీయావనీ, లేక ఎవరో ఒక ప్రవక్తవనీ అనుకొంటున్నారు” అన్నారు.
15 “అయితే మీరు నేనెవరినని భావిస్తున్నారు?” అని వారిని అడిగాడు. 16 వెంటనే సీమోను పేతురు, “నీవు అభిషిక్తుడివి! సజీవుడైన దేవుని కుమారుడివి!” అని చెప్పాడు.
17 అందుకు యేసు అతనితో ఇలా అన్నాడు, “యోనా కుమారా, సీమోనూ, నీవు ధన్యుడివి. ఎందుకంటే ఈ సత్యం నీకు వెల్లడి చేసింది పరలోకంలోని నా తండ్రే గాని మానవ మాత్రులు కాదు. 18 ఇంకో విషయం, నీవు పేతురువి. ఈ బండమీద నా సంఘాన్ని నిర్మిస్తాను. పాతాళ లోకపు ద్వారాలు దాన్ని ఎదిరించి నిలబడలేవు. 19 పరలోక రాజ్యపు తాళాలు నీకిస్తాను. నీవు భూమి మీద దేనిని బంధిస్తావో దాన్ని పరలోకంలో బంధించడం, దేనిని విడిపిస్తావో దాన్ని పరలోకంలో విడిపించడం జరుగుతుంది.”
20 అప్పుడు తానే క్రీస్తు అని ఎవరికీ చెప్పవద్దని యేసు తన శిష్యులకు గట్టిగా ఆజ్ఞాపించాడు.
మార్కు రాసిన సువార్త 8:27–30
8:27 యేసు ఆయన శిష్యులతో కలిసి ఫిలిప్పు కైసరయ పట్టణం చుట్టూ ఉన్న గ్రామాలకు వెళ్ళాడు. దారిలో ఆయన, “నేను ఎవరినని ప్రజలు చెప్పుకుంటున్నారు? అని తన శిష్యులను అడిగాడు.
28 అందుకు వారు, “బాప్తిసం ఇచ్చే యోహానని కొందరూ, ఏలీయా అని కొందరూ, ప్రవక్తల్లో ఒకడు అని కొందరూ అంటున్నారు” అని చెప్పారు.
29 “అయితే మీరు నేనెవరినని అనుకుంటున్నారు?” అని ఆయన వారిని అడిగాడు. దానికి జవాబుగా పేతురు, “నీవు అభిషిక్తుడివి!” అన్నాడు.
30 అప్పుడు ఆయన తనను గురించి ఎవ్వరికీ చెప్పవద్దని వారిని హెచ్చరించాడు.
లూకా రాసిన సువార్త 9:18–21
9:18 ఒకసారి ఆయన ఒంటరిగా ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఆయన శిష్యులు ఆయన దగ్గర ఉన్నారు. “నేను ఎవరని ప్రజలు చెప్పుకుంటున్నారు?” అని ఆయన వారిని అడిగాడు.
19 వారు, “బాప్తిసమిచ్చే యోహాననీ, కొందరు ఏలీయా అనీ, కొందరేమో పూర్వకాలంలో నివసించిన ప్రవక్త లేచాడనీ చెప్పుకుంటున్నారు” అని ఆయనకు జవాబిచ్చారు.
20 అప్పుడు ఆయన, “మరి నేను ఎవరని మీరు భావిస్తున్నారు?” అని వారిని అడిగాడు. అందుకు పేతురు, “నువ్వు దేవుని అభిషిక్తుడివి” అన్నాడు.
21 ఆయన ఈ విషయం ఎవరికీ చెప్పవద్దని వారికి కచ్చితంగా ఆజ్ఞాపించాడు.
యేసు తన మరణం, పునరుత్థానం గురించి ముందుగా చెప్పడం
మెస్సీయ అయిన తాను తిరస్కరించబడి, చంపబడి, మూడవ రోజున తిరిగి లేస్తానని యేసు స్పష్టంగా ముందుగా చెబుతాడు.
మత్తయి రాసిన సువార్త 16:21–26
16:21 అప్పటినుంచి యేసు తాను యెరూషలేము వెళ్ళి అక్కడి పెద్దల, ప్రధాన యాజకుల, ధర్మశాస్త్ర పండితుల చేతుల్లో అనేక హింసలు పొంది, చనిపోయి, మూడవ రోజు తిరిగి సజీవంగా లేవడం తప్పనిసరి అని తన శిష్యులతో చెప్పడం మొదలుపెట్టాడు.
22 అప్పుడు పేతురు ఆయన్ని ఒక పక్కకి తీసుకు పోయి, “ప్రభూ, అది నీకు దూరమవుతుంది, నీకలా ఎప్పటికీ జరగదు” అని గద్దింపుగా అన్నాడు. 23 అయితే యేసు పేతురు వైపు తిరిగి, “సాతానూ, నా వెనక్కి పో! నువ్వు నాకు దారిలో అడ్డుబండగా ఉన్నావు. నీవు దేవుని సంగతులపై కాక మనుషుల సంగతుల పైనే మనసు పెడుతున్నావు” అన్నాడు.
24 అప్పుడు యేసు తన శిష్యులతో, “ఎవరైనా నాతో కలిసి నడవాలనుకుంటే, వాడు తనను తాను తిరస్కరించుకుని, తన సిలువను మోసుకుంటూ రావాలి.
25 తన ప్రాణాన్ని కాపాడుకోవాలని చూసేవాడు దాన్ని పోగొట్టుకుంటాడు. నా కోసం తన ప్రాణాన్ని కోల్పోయేవాడు దాన్ని దక్కించుకుంటాడు.
26 ఒక మనిషి ఈ ప్రపంచమంతా సంపాదించుకుని తన ప్రాణాన్ని కోల్పోతే అతనికేం లాభం? తన ప్రాణానికి బదులుగా మనిషి దేనిని ఇవ్వగలడు?
మార్కు రాసిన సువార్త 8:31–37
8:31 ఆ తరువాత యేసు వారితో ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టాడు, “మనుష్య కుమారుడు ఎన్నో కష్టాలు భరిస్తాడు. పెద్దలు, ముఖ్య యాజకులు, ధర్మశాస్త్ర పండితులచే ఆయన తృణీకారానికి గురై మరణమౌతాడు. ఆయన మూడు రోజుల తరువాత సజీవంగా బ్రతికి వస్తాడు.”
32 యేసు ఈ విషయం చాలా స్పష్టంగానే చెప్పాడు. అయితే పేతురు ఆయన చెయ్యి పట్టుకుని, పక్కకు తీసుకు వెళ్ళి ఆయనను మందలించ సాగాడు. 33 కాని యేసు వెనక్కి తిరిగి తన శిష్యులను చూసి పేతురుతో, “సైతానూ! నా వెనక్కి పో! మనుషుల సంగతుల పైనే గాని దేవుని సంగతుల మీద నీకు మనసు లేదు” అని గద్దించాడు.
34 తరువాత యేసు తన శిష్యులను, ప్రజలను దగ్గరికి పిలిచి వారితో ఇలా అన్నాడు. “ఎవరైనా నా వెంట రావాలనుకుంటే తనను తాను కాదనుకుని, తన సిలువను మోసుకుంటూ నాతో నడవాలి.
35 ఎందుకంటే తన ప్రాణాన్ని దక్కించుకోవాలని చూసేవాడు దాన్ని పోగొట్టుకుంటాడు. కాని నా కోసం, సువార్త కోసం తన ప్రాణాన్ని కోల్పోయేవాడు దాన్ని దక్కించుకుంటాడు.
36 ఒక మనిషి ప్రపంచమంతా సంపాదించి, తన ప్రాణాన్నే పోగొట్టుకుంటే ఆ వ్యక్తికి ఏం లాభం? 37 ఒకడు తన ప్రాణాన్ని తిరిగి పొందడానికి ఏమి ఇవ్వగలడు?
లూకా రాసిన సువార్త 9:22–25
9:22 “మనుష్య కుమారుడు ఎన్నో హింసల పాలవుతాడు. యూదు పెద్దలూ, ప్రధాన యాజకులూ, ధర్మ శాస్త్ర పండితులూ ఆయనను తిరస్కరిస్తారు. ఆయనను చంపుతారు. ఆయన మూడవ రోజున తిరిగి లేస్తాడు. ఇదంతా తప్పనిసరిగా జరుగుతుంది.” అని చెప్పాడు.
23 ఆయన ఇంకా ఇలా అన్నాడు, “ఎవరైనా నన్ను అనుసరించాలంటే తనను తాను నిరాకరించుకోవాలి. ప్రతిదినం తన సిలువను మోసుకుని నా వెనకే రావాలి,
24 తన ప్రాణాన్ని కాపాడుకోవాలి అనుకునేవాడు దాన్ని పోగొట్టుకొంటాడు. నాకోసం తన ప్రాణాన్ని పోగొట్టుకొనే వాడు దాన్ని కాపాడుకుంటాడు.
25 ఒకడు లోకాన్నంతా సంపాదించుకుని తనను తాను పోగొట్టుకొంటే వాడికేం లాభం?
ఆ తరంలో మనుష్య కుమారుని రాక
మత్తయి రాసిన సువార్త 16:27–28
16:27 మనుష్య కుమారుడు తన తండ్రి మహిమతో దూతలను తోడుకుని వస్తాడు. అప్పుడు ఆయన ప్రతి వ్యక్తికీ వాడు చేసిన పనుల ప్రకారం ప్రతిఫలం ఇస్తాడు. 28 నేను మీతో కచ్చితంగా చెబుతున్నదేమంటే, ఇక్కడ నిలబడి ఉన్నవారిలో కొంతమంది మనుష్య కుమారుడు తన రాజ్యంతో రావడం చూసేవరకూ మరణించరు” అని చెప్పాడు.
మార్కు రాసిన సువార్త 8:38–9:1
8:38 వ్యభిచారం, పాపం జరిగించే ఈ తరంలో ఎవరైనా నా గురించీ నా మాటల గురించీ సిగ్గుపడితే మనుష్య కుమారుడు తన తండ్రి మహిమతో, పవిత్ర దేవదూతలతో కలసి వచ్చేటప్పుడు ఆ వ్యక్తి విషయంలో సిగ్గుపడతాడు.”
9:1 ఆయన వారితో, “నేను మీతో కచ్చితంగా చెప్తున్నాను. ఇక్కడ నిలుచున్న వారిలో కొంతమంది దేవుని రాజ్యం శక్తితో రావడం చూస్తారు. దానికంటే ముందు వారు మరణించరు” అని అన్నాడు.
లూకా రాసిన సువార్త 9:26–27
9:26 నన్ను గూర్చీ నా మాటలను గూర్చీ ఇక్కడ ఎవడు సిగ్గుపడతాడో వాణ్ణి గురించి మనుష్య కుమారుడు తన తేజస్సుతోనూ, తన తండ్రి తేజస్సుతోనూ ఆయన దూతల తేజస్సుతోనూ వచ్చినప్పుడు సిగ్గుపడతాడు. 27 అయితే ఇక్కడ ఉన్నవారిలో కొందరు దేవుని రాజ్యాన్ని చూసే వరకూ మరణించరని మీతో కచ్చితంగా చెబుతున్నాను” అన్నాడు.