మగదానులో పరిసయ్యులు, సద్దూకయ్యులు యేసుపై దాడి చేయడం
గలిలయలోని మగదానుకు (దల్మనూతాకు) కొద్దిసేపు వెళ్లడం, పరిసయ్యులు, సద్దూకయ్యులు తీవ్రంగా దాడి చేయడం (ఇప్పుడు వారు యేసుకు వ్యతిరేకంగా ముందుకు రావడం గమనించండి).
క్రీ.శ. 29 లేదా 28
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
మత్తయి రాసిన సువార్త 15:39–16:4
15:39 తరువాత ఆయన ఆ ప్రజలందరినీ పంపివేసి, పడవ మీద మగదాను ప్రాంతానికి వచ్చాడు.
16:1 అప్పుడు పరిసయ్యులు, సద్దూకయ్యులు వచ్చి ఆయనను పరీక్షించడానికి తమ కోసం పరలోకం నుండి ఒక అద్భుతం చెయ్యమని అడిగారు. 2 ఆయన వారితో ఇలా అన్నాడు, “సాయంకాలం ఆకాశం ఎర్రగా ఉంది కాబట్టి వర్షం కురవదనీ, 3 అదే ఆకాశం ఉదయం ఎర్రగా, మబ్బులతో ఉంది కాబట్టి గాలివాన వస్తుందనీ మీరు చెబుతారు కదా. ఆకాశంలోని సూచనలు మీకు తెలుసు గాని ఈ కాలాల సూచనలు మాత్రం గుర్తించలేరు.
4 సూచక క్రియలు అడిగే ఈ తరం దుష్టత్వంతో, వ్యభిచారంతో నిండి ఉంది. యోనా ప్రవక్త గురించినది తప్ప మరే సూచనా ఈ తరానికి ఇవ్వడం జరగదు.” ఆ వెంటనే ఆయన వారిని విడిచి వెళ్ళిపోయాడు.
మార్కు రాసిన సువార్త 8:10–12
8:10 వెంటనే తన శిష్యులతో కలసి, పడవ ఎక్కి దల్మనూతా ప్రాంతానికి వెళ్ళాడు.
11 పరిసయ్యులు వచ్చి యేసుతో వాదించడం మొదలుపెట్టారు. ఆయనను పరీక్షించడం కోసం తమకు ఆకాశం నుండి ఒక సూచన చూపమని అడిగారు. 12 దానికి ఆయన ఆత్మలో పెద్దగా నిట్టూర్చి, “ఈ తరం వారు ఎందుకు సూచక క్రియలను చూపమని అడుగుతున్నారు? మీతో కచ్చితంగా చెప్తున్నాను, ఈ తరానికి ఏ సూచనా చూపడం జరగదు” అని వారితో చెప్పాడు.
బేత్సయిదాలో యేసు ఒక గుడ్డివాడిని స్వస్థపరచడం
నాలుగవసారి ఏకాంతానికి వెళ్లడం: చతుర్థాధిపతి హేరోదు ఫిలిప్పు పాలనలోని బేత్సయిదా జూలియాసుకు వెళ్లడం. అవతలి ఒడ్డుకు వెళ్లే దారిలో, శిష్యుల మందబుద్ధిని బట్టి యేసు వారిని తీవ్రంగా గద్దిస్తాడు; బేత్సయిదాలో ఒక గుడ్డివాడిని స్వస్థపరుస్తాడు.
మత్తయి రాసిన సువార్త 16:5–12
16:5 అవతలి ఒడ్డుకు చేరినప్పుడు ఆయన శిష్యులు రొట్టెలు తెచ్చుకోవడం మర్చిపోయారు.
6 అప్పుడు యేసు, “పరిసయ్యులు, సద్దూకయ్యులు అనే పొంగజేసే పిండిని గురించి జాగ్రత్త పడండి” అని వారితో అన్నాడు.
7 అయితే శిష్యులు “మనం రొట్టెలు తేకపోవడం చేత ఇలా అన్నాడు” అని తమలో తాము చర్చించుకున్నారు.
8 యేసుకు అది తెలిసి, “అల్పవిశ్వాసులారా, మీరు రొట్టెలు తీసుకు రాని విషయం గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు?
9 “మీరింకా గ్రహించలేదా? ఐదు రొట్టెలు ఐదు వేలమంది తిన్న తరువాత ఎన్ని పెద్ద గంపలు ఎత్తారో,
10 ఏడు రొట్టెలు నాలుగు వేలమంది తిన్న తరువాత ఎన్ని పెద్ద గంపలు ఎత్తారో అవేమీ మీకు గుర్తు లేదా?
11 నేను మీతో మాట్లాడింది రొట్టెలను గురించి కాదని ఎందుకు గ్రహించరు? పరిసయ్యులు, సద్దూకయ్యులు అనే పొంగజేసేపిండిని గురించి జాగ్రత్త పడండి” అని వారితో చెప్పాడు.
12 అప్పుడు రొట్టెల్లో వాడే పొంగజేసే పదార్థాన్ని గురించి కాక పరిసయ్యులు, సద్దూకయ్యులు చేసే బోధ విషయంలో జాగ్రత్తపడమని ఆయన తమతో చెప్పాడని శిష్యులు గ్రహించారు.
మార్కు రాసిన సువార్త 8:13–26
8:13 తరువాత ఆయన వారిని విడిచిపెట్టి, మళ్ళీ పడవ ఎక్కి అవతలి ఒడ్డు చేరుకున్నాడు.
14 శిష్యులు తమతో రొట్టెలు తెచ్చుకోవడం మర్చిపోయారు. వారి దగ్గర పడవలో ఒక రొట్టె తప్ప ఏమీ లేదు.
15 యేసు వారితో, “పరిసయ్యులకు, హేరోదుకు సంబంధించిన పొంగజేసే పిండిని గురించి జాగ్రత్తగా ఉండండి!” అన్నాడు.
16 శిష్యులు, “మన దగ్గర రొట్టెలు లేవని అలా అంటున్నాడా?” అని ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు.
17 అది కనిపెట్టి యేసు, “రొట్టెలు లేవనే విషయం ఎందుకు చర్చించుకుంటున్నారు? మీకు ఇంకా అర్థం కాలేదా? మీరు గ్రహించలేదా? మీ బుద్ధి మందగించిందా?
18 మీరు కళ్ళుండి కూడా చూడరా? చెవులుండి కూడా వినరా? మీకు గుర్తు లేదా?
19 ఐదు రొట్టెలు విరిచి ఐదు వేల మందికి నేను పంచిపెట్టినప్పుడు మిగిలిన ముక్కలను మీరు ఎన్ని పెద్ద గంపలు నింపారు?” అని అడిగాడు. వారు, “పన్నెండు” అని జవాబు చెప్పారు.
20 “మరి ఏడు రొట్టెలు విరిచి నాలుగు వేల మందికి పంచినప్పుడు మిగిలిన ముక్కలను ఎన్ని పెద్ద గంపలు నింపారు?” అని అడిగినప్పుడు వారు, “ఏడు” అని జవాబు చెప్పారు. 21 ఆయన వారితో, “ఇంకా మీకు అర్థం కాలేదా?” అన్నాడు.
22 యేసు, ఆయన శిష్యులు బేత్సయిదాకు వచ్చారు. కొందరు ఒక గుడ్డివాణ్ణి యేసు దగ్గరికి తీసుకు వచ్చారు. అతని మీద చెయ్యి ఉంచమని వేడుకున్నారు. 23 యేసు ఆ గుడ్డివాడి చెయ్యి పట్టుకుని ఊరి బయటకు తీసుకు వెళ్ళాడు. అతని కళ్ళ మీద ఉమ్మివేసి, అతని మీద చేతులుంచి, “నీకు ఏమైనా కనిపిస్తుందా?” అన్నాడు. 24 ఆ గుడ్డివాడు పైకి చూస్తూ, “మనుషులు నడుస్తున్న చెట్ల లాగా కనిపిస్తున్నారు” అన్నాడు. 25 అప్పుడు ఆయన మళ్ళీ అతని కళ్ళపై తన చేతులుంచాడు. అప్పుడా మనిషి కళ్ళు తెరుచుకుని బాగుపడి అన్నిటినీ స్పష్టంగా చూడగలిగాడు. 26 యేసు అతనిని పంపివేస్తూ, “నీవు ఊరిలోకి వెళ్ళవద్దు” అని అతనితో చెప్పాడు.