సిరియాకు చెందిన ఫెనికయా స్త్రీ కుమార్తెను యేసు స్వస్థపరచడం
రెండవసారి ఏకాంతానికి వెళ్లడం: తూరు, సీదోను ప్రాంతానికి వెళ్లడం, సిరియాకు చెందిన ఫెనికయా స్త్రీ కుమార్తెను స్వస్థపరచడం.
క్రీ.శ. 29 లేదా 28
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
మత్తయి రాసిన సువార్త 15:21–28
15:21 యేసు బయలుదేరి తూరు, సీదోను ప్రాంతాలకు వెళ్ళాడు. 22 అప్పుడు అక్కడ నివసించే కనాను జాతి స్త్రీ ఒకామె వచ్చి, “ప్రభూ, దావీదు కుమారా, నన్ను కరుణించు. నా కూతురికి దయ్యం పట్టి విపరీతంగా బాధ పెడుతున్నది” అని పెద్దగా అరిచి చెప్పింది.
23 కానీ ఆయన ఏమీ బదులు పలకలేదు. అప్పుడు ఆయన శిష్యులు, “ఈమె కేకలు వేస్తూ మన వెంటే వస్తున్నది, ఈమెని పంపించెయ్యి” అని ఆయనను వేడుకున్నారు. 24 దానికి ఆయన, “దేవుడు ఇశ్రాయేలు వంశంలో తప్పిపోయిన గొర్రెల దగ్గరకే నన్ను పంపించాడు, ఇంకెవరి దగ్గరకూ కాదు” అని జవాబిచ్చాడు. 25 అయినా ఆమె వచ్చి ఆయనకు మొక్కి, “ప్రభూ, నాకు సహాయం చెయ్యి” అంది.
26 ఆయన, “పిల్లలు తినే రొట్టెను కుక్కపిల్లలకి పెట్టడం సరి కాదు” అని ఆమెతో అన్నాడు.
27 ఆమె, “ప్రభూ, నిజమే! కాని కుక్కపిల్లలు సైతం తమ యజమాని భోజనం బల్లపై నుండి కింద పడే ముక్కలు తింటాయి కదా” అంది.
28 అందుకు యేసు, “నీ నమ్మకం గొప్పదమ్మా. నీవు కోరుకున్నట్టే నీకు జరుగుతుంది” అని ఆమెతో చెప్పాడు. సరిగ్గా ఆ గంటలోనే ఆమె కుమార్తె బాగుపడింది.
మార్కు రాసిన సువార్త 7:24–30
7:24 యేసు ఆ ప్రాంతం విడిచి తూరు, సీదోను ప్రాంతంలోని ఒక ఇంటికి వెళ్ళాడు. తాను అక్కడ ఉన్నట్టు ఎవరికీ తెలియకూడదని ఆయన ఉద్దేశం. కాని, ఆయన వారికి కనిపించకుండా ఉండలేకపోయాడు. 25 ఒక స్త్రీ యేసు గురించి విని వచ్చి ఆయన కాళ్ళపై పడింది. ఆమె కూతురుకు దయ్యం పట్టి ఉంది.
26 ఈ స్త్రీ సిరియాకు చెందిన ఫెనికయా ప్రాంతంలో పుట్టిన గ్రీసు దేశస్తురాలు. తన కూతురులో నుండి ఆ దయ్యాన్ని వదిలించమని యేసును బతిమలాడింది.
27 అందుకు యేసు ఆమెతో, “మొదట పిల్లలు తృప్తిగా తినాలి. చిన్నపిల్లల ఆహారం తీసి కుక్కలకు వేయడం తగదు” అని అన్నాడు.
28 అందుకామె, “ఔను ప్రభూ! అది నిజమే గాని, బల్లకింద ఉన్న కుక్కలు కూడా పిల్లలు పడేసిన ముక్కలు తింటాయి కదా!” అని జవాబు ఇచ్చింది.
29 అప్పుడాయన ఆమెతో, “ఈ మాట చెప్పినందువల్ల ఇక నీవు నిశ్చింతగా వెళ్ళవచ్చు. దయ్యం నీ కూతురిని వదలిపోయింది” అన్నాడు. 30 ఆమె ఇంటికి వెళ్ళి తన కూతురు తన మంచంపై పడుకుని ఉండడం చూసింది. దయ్యం ఆమెను వదలిపోయింది.
యేసు నాలుగు వేలమందికి ఆహారం పెట్టడం
మూడవసారి ఏకాంతానికి వెళ్లడం: ఉత్తరంగా ఫేనీకే గుండా, తూర్పుగా హెర్మోను వైపు, దక్షిణంగా దెకపొలిలోకి (హేరోదు అంతిపా భూభాగంలోకి వెళ్లకుండా) ప్రయాణించడం, చెవిటి మూగవాడిని స్వస్థపరచడం, నాలుగు వేలమందికి ఆహారం పెట్టడం.
మత్తయి రాసిన సువార్త 15:29–38
15:29 యేసు అక్కడ నుండి బయలుదేరి, గలిలయ సముద్రం పక్కగా ఉన్న ఒక కొండ ఎక్కి కూర్చున్నాడు.
30 ప్రజలు గుంపులు గుంపులుగా అనేకమంది కుంటివారిని, గుడ్డివారిని, మూగవారిని, వికలాంగులను, ఇంకా అనేక రోగాలున్న వారిని తీసుకు వచ్చి ఆయన పాదాల దగ్గర ఉంచారు. ఆయన వారిని బాగుచేశాడు. 31 మూగవారు మాట్లాడటం, వికలాంగులు బాగుపడటం, కుంటివారు నడవటం, గుడ్డివారికి చూపు రావడం చూసి ప్రజలు ఆశ్చర్యపడ్డారు. వారంతా ఇశ్రాయేలీయుల దేవునికి స్తుతులు చెల్లించారు.
32 అప్పుడు యేసు తన శిష్యులను పిలిచి, “ఈ ప్రజల మీద నాకు జాలిగా ఉంది. మూడు రోజుల నుండి వీరు నా దగ్గరే ఉన్నారు. వారికి తినడానికి ఏమీ లేదు. వాళ్ళను ఆకలితో పంపటం నాకిష్టం లేదు. అలా పంపివేస్తే వారు దారిలోనే స్పృహ తప్పి పోతారేమో” అన్నాడు.
33 ఆయన శిష్యులు, “ఇంతమందికి సరిపడినన్ని రొట్టెలు ఈ అడవి ప్రాంతంలో ఎక్కడ దొరుకుతాయి?” అన్నారు.
34 యేసు, “మీ దగ్గర ఎన్ని రొట్టెలున్నాయి?” అని వారిని అడిగాడు. వారు, “ఏడు రొట్టెలు, కొన్ని చిన్న చేపలు ఉన్నాయి” అని చెప్పారు.
35 అప్పుడు యేసు “నేల మీద కూర్చోండి” అని ఆ ప్రజలకి ఆజ్ఞాపించి, 36 ఆ ఏడు రొట్టెలు, ఆ చేపలు పట్టుకుని దేవునికి కృతజ్ఞతలు చెల్లించి వాటిని ముక్కలు చేసి తన శిష్యులకిచ్చాడు. శిష్యులు ఆ ప్రజలకు వాటిని పంచిపెట్టారు.
37 వారంతా కడుపారా తిన్న తరువాత అక్కడ ఏడు గంపల నిండుగా ముక్కలు మిగిలిపోయాయి.
38 స్త్రీలు, పిల్లలు కాకుండా కేవలం పురుషులే నాలుగువేల మంది తిన్నారు.
మార్కు రాసిన సువార్త 7:31–8:9
7:31 యేసు తూరు, సీదోను ప్రాంతం నుంచి బయలుదేరి దెకపొలి ప్రాంతం గుండా గలిలయ సముద్రం దగ్గరికి వచ్చాడు. 32 అక్కడ కొందరు చెవుడు, నత్తి ఉన్న మనిషిని ఆయన దగ్గరికి తీసుకు వచ్చి అతని మీద చెయ్యి ఉంచమని వేడుకున్నారు. 33 యేసు అతన్ని జనంలో నుండి పక్కకి తీసుకు వెళ్ళి తన వేళ్ళు అతని చెవుల్లో ఉంచాడు. ఉమ్మివేసి అతని నాలుకను ముట్టాడు. 34 అప్పుడు ఆయన ఆకాశం వైపు తల ఎత్తి నిట్టూర్చి, “ఎప్ఫతా” అని అతనితో అన్నాడు. ఆ మాటకు, “తెరుచుకో!” అని అర్థం. 35 వెంటనే అతని చెవులు తెరుచుకున్నాయి. అతని నాలుక సడలి తేటగా మాట్లాడడం మొదలుపెట్టాడు.
36 ఆ సంగతి ఎవ్వరితోనూ చెప్పవద్దని యేసు అతనికి ఆజ్ఞాపించాడు కాని, ఎంత కఠినంగా వారికి ఆజ్ఞాపించాడో అంత ఎక్కువగా వారు దాన్ని చాటించారు. 37 ప్రజలకు అంతులేని ఆశ్చర్యం కలిగింది. వారు, “ఈయన అన్నిటినీ చక్కగా జరిగిస్తున్నాడు. చెవిటివారు వినగలిగేలా, మూగ వారు మాట్లాడేలా చేస్తున్నాడు” అని చెప్పుకున్నారు.
8:1 ఆ రోజుల్లో ఒకసారి పెద్ద జనసమూహం గుమిగూడారు. వారి దగ్గర తినడానికి ఏమీ లేకపోయింది. యేసు తన శిష్యులను పిలిచి, 2 “ఈ ప్రజల మీద నాకు జాలి కలుగుతున్నది. వారు ఇప్పటికే మూడు రోజుల నుండి నా దగ్గర ఉన్నారు. తినడానికి వారి దగ్గర ఏమీ లేదు. 3 వారిని ఇప్పుడు పంపివేస్తే వారిలో కొందరు చాలా దూరం నుండి వచ్చారుగనక దారిలో సొమ్మసిల్లి పోవచ్చు” అని అన్నాడు.
4 ఆయన శిష్యులు, “ఈ నిర్జన ప్రాంతంలో ఇంతమందికి సరిపడినంత ఆహారం ఎక్కడ నుండి తేగలం?” అన్నారు.
5 “మీ దగ్గర ఎన్ని రొట్టెలు ఉన్నాయి?” అని ఆయన వారిని అడిగాడు. వారు, “ఏడు” అన్నారు.
6 యేసు ఆ ప్రజలందరినీ నేల మీద కూర్చోమని ఆజ్ఞాపించాడు. ఆ ఏడు రొట్టెలను చేతపట్టుకుని దేవునికి కృతజ్ఞత చెప్పి వాటిని విరిచి శిష్యులకిచ్చి వారికి పంచమన్నాడు. శిష్యులు అలాగే చేశారు. 7 వారి దగ్గర కొన్ని చిన్న చేపలు కూడా ఉన్నాయి. యేసు వాటి కోసం కూడా దేవునికి కృతజ్ఞతలు చెప్పి, వాటిని కూడా పంచమని శిష్యులకు ఇచ్చాడు.
8 ఆ ప్రజలంతా తృప్తిగా తిన్న తరువాత మిగిలిన ముక్కలను ఏడు పెద్ద గంపల నిండా నింపారు.
9 తిన్నవారు సుమారు నాలుగు వేలమంది పురుషులు. యేసు వారిని పంపివేసి,