కడుక్కోని చేతుల విషయంలో పరిసయ్యులు యేసును గద్దించడం
చేతుల ఆచారపరమైన అపవిత్రత గురించిన తమ సంప్రదాయాలను శిష్యులు పట్టించుకోకుండా ఉండడానికి అనుమతించినందుకు యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులు యేసును గద్దిస్తారు. యేసు చిక్కుగా ఉన్న ఒక ఉపమానంతో జవాబిస్తాడు.
బహుశా కపెర్నహూములో
క్రీ.శ. 29 లేదా 28
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
మత్తయి రాసిన సువార్త 15:1–3, 7–9, 4–6, 10–20
15:1 ఆ రోజుల్లో యెరూషలేము నుండి ధర్మశాస్త్ర పండితులూ, పరిసయ్యులూ వచ్చి,
2 “నీ శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తూ మన పెద్దలు ఏర్పాటు చేసిన సంప్రదాయాన్ని పాటించడం లేదేంటి?” అని యేసుని అడిగారు.
3 అందుకు ఆయన వారితో ఇలా అన్నాడు, “మీరు మీ సంప్రదాయం కోసం దేవుని ఆజ్ఞనే మీరుతున్నారు.
7-9 వేష ధారులారా, ‘ఈ ప్రజలు తమ పెదాలతో నన్ను గౌరవిస్తున్నారు గాని వారి హృదయం నాకు దూరంగా ఉంది. వారు నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. ఎందుకంటే, మనుషులు ప్రవేశపెట్టిన పద్ధతులనే దేవుని సిద్ధాంతాలుగా వారు బోధిస్తారు’ అని యెషయా ప్రవక్త మిమ్మల్ని గురించి సరిగానే చెప్పాడు.”
4 ఎలాగంటే తల్లిదండ్రులను ఘనపరచమనీ, తండ్రిని గాని తల్లిని గాని దూషించేవాడికి శిక్ష మరణమేననీ దేవుడు చెప్పాడు.
5 కాని మీరు మాత్రం ఎవరైనా తన తండ్రితో, తల్లితో నా నుండి మీకు ఏమైనా లాభం కలుగుతూ ఉంటే దాన్ని దేవునికి ఇచ్చేశాను అని చెబితే అతడు ఇక నుండి తన తల్లిదండ్రులను పట్టించుకోనక్కర లేదని చెబుతారు.
6 ఆ విధంగా మీరు మీ సంప్రదాయాల కోసం దేవుని మాటను పక్కన పెట్టేశారు.
10 ఆయన ప్రజలందరినీ పిలిచి, “మీరు తెలుసుకోవలసింది ఏమంటే,
11 ఒక వ్యక్తి నోటిలోకి వెళ్ళేది అతనినేమీ అపవిత్రపరచదు. నోటి నుండి బయటికి వచ్చేదే మనిషిని అపవిత్రపరుస్తుంది” అని చెప్పాడు.
12 అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, “నీకు తెలుసా? పరిసయ్యులు నీ మాటలు విని చాలా నొచ్చుకున్నారు” అని ఆయనతో అన్నారు. 13 ఆయన, “పరలోకపు తండ్రి నాటని ప్రతి మొక్కనూ పీకివేయడం జరుగుతుంది. 14 వారి జోలికి వెళ్ళవద్దు. వారు గుడ్డివారు. వేరే గుడ్డివారికి దారి చూపించడానికి ప్రయత్నిస్తారు. ఒక గుడ్డివాడు మరో గుడ్డివాడికి దారి చూపిస్తే వారిద్దరూ కలిసి గుంటలో పడతారు కదా” అన్నాడు.
15 అందుకు పేతురు, “ఈ ఉపమానభావం మాకు వివరించు” అని ఆయనను అడిగాడు.
16 అప్పుడాయన, “మీరు ఇంకా అవివేకంగా ఉన్నారా? 17 నోటిలోకి పోయేదంతా కడుపులో పడి బయటకు విసర్జన అయిపోతుంది.
18 కాని నోటి నుండి బయటికి వచ్చేవి హృదయంలో నుండి వస్తాయి. అవే మనుషులను అపవిత్రపరుస్తాయి. ఇది కూడా మీకు తెలియలేదా?
19 హృదయంలో నుండే చెడు ఆలోచనలు, హత్యలు, వ్యభిచారాలు, లైంగిక దుర్నీతి, దొంగతనాలు, అబద్ధ సాక్ష్యాలు, దైవదూషణలు వస్తాయి.
20 మనిషిని అపవిత్రపరచేవి ఇవే గానీ చేతులు కడుక్కోకుండా భోజనం చేయడం కాదు” అని వారితో చెప్పాడు.
మార్కు రాసిన సువార్త 7:1–23
7:1 యెరూషలేము నుండి వచ్చిన కొందరు పరిసయ్యులూ ధర్మశాస్త్ర పండితులూ యేసు చుట్టూ గుమికూడారు. 2 వారు ఆయన శిష్యుల్లో కొందరు అశుద్ధమైన చేతులతో, అంటే ఆచార నియమం ప్రకారం చేతులు కడుక్కోకుండా భోజనం చేయడం గమనించారు. 3 పరిసయ్యులే కాక యూదులందరూ పెద్దల సంప్రదాయం ప్రకారం తమ చేతులను ఆచారరీతిగా కడుక్కోకుండా భోజనం చేయరు.
4 వారు బయట నుండి వచ్చినపుడు స్నానం చేయకుండా భోజనం చేయరు. గిన్నెలు, కుండలు, ఇతర ఇత్తడి పాత్రలు, భోజనపు బల్లలు సహా శుద్ధి చేయడం అనే అనేకమైన ఆచారాలను వారు కచ్చితంగా పాటిస్తారు.
5 పరిసయ్యులు, ధర్మశాస్త్ర పండితులు యేసుతో, “మీ శిష్యులు పెద్దల సంప్రదాయాన్ని పాటించకుండా అశుద్ధమైన చేతులతో ఎందుకు భోజనం చేస్తున్నారు?” అని యేసును అడిగారు.
6 యేసు వారితో,
“‘ఈ ప్రజలు మాటలతో నన్ను గౌరవిస్తారు కాని,
వారి హృదయం నాకు చాలా దూరంగా ఉంది.
7 వారు మానవ కల్పితమైన నియమాలను దేవుని ఉపదేశంగా బోధిస్తారు కాబట్టి వారి ఆరాధన వ్యర్థం,’
అని కపట వేషధారులైన మిమ్మల్ని గురించి యెషయా ప్రవక్త ముందుగా పలికింది సరైనదే! 8 మీరు దేవుని ఆజ్ఞలను తోసిపుచ్చి మనుషుల సంప్రదాయాలకు కట్టుబడుతున్నారు. 9 మీ సంప్రదాయాలను పాటించడం కోసం దేవుని ఆజ్ఞలను మీరడంలో మీరు సిద్ధహస్తులు.
10 మోషే, ‘మీ తల్లిదండ్రులను గౌరవించమనీ, తల్లిని, తండ్రిని దూషించిన వారికి శిక్ష మరణదండన’ అనీ నియమించాడు.
11 కానీ మీరైతే, ఒక వ్యక్తి తన తల్లితో, తండ్రితో ‘నా వల్ల మీరు పొందదగిన సహాయమంతా ‘కొర్బాన్’ (అంటే దైవార్పితం)’ అని చెబితే
12 ఇంక ఆ వ్యక్తి తన తల్లిదండ్రుల కోసం ఏమీ చేయనక్కర లేదని చెబుతారు.
13 మీరు మీ పెద్దల సంప్రదాయాలను పాటించే నెపంతో దేవుని ఆజ్ఞ మీరుతున్నారు. ఇలాంటివి మరెన్నో మీరు చేస్తున్నారు.
14 అప్పుడు యేసు ప్రజలందరినీ తన దగ్గరికి పిలిచి, “నేను చెప్పేది ప్రతి ఒక్కరూ విని అర్థం చేసుకోండి!
15 బయట నుండి మనిషి లోపలికి వెళ్ళేవి ఏవీ అతన్ని అపవిత్రం చేయవు. 16 మనిషి లోనుండి బయటకు వచ్చేదే అతన్ని అపవిత్రం చేస్తుంది” అని అన్నాడు.
17 ఆయన జనసమూహన్ని విడిచి ఇంట్లో ప్రవేశించిన తరువాత ఆయన శిష్యులు ఆ ఉపమానం గురించి ఆయనను అడిగారు.
18 ఆయన వారితో, “మీకు ఇంకా అర్థం కాలేదా? బయట నుండి మనిషిలోకి వచ్చేది అతన్ని అపవిత్రం చేయదని మీరు గ్రహించలేరా?
19 అది మనిషి హృదయంలోకి వెళ్ళదు. కడుపులోకి వెళ్ళి అక్కడ నుండి బయటకు వెళ్ళిపోతుంది” అని చెప్పాడు. (ఈ విధంగా చెప్పడం ద్వారా అన్ని ఆహార పదార్ధాలూ తినడానికి పవిత్రమైనవే అని యేసు సూచించాడు).
20 ఆయన మళ్ళీ ఈ విధంగా అన్నాడు, “మనిషి నుండి బయటకు వచ్చేవే అతన్ని అపవిత్రం చేస్తాయి. 21 ఎందుకంటే మనిషి హృదయంలో నుండి చెడ్డ తలంపులు, దొంగతనాలు, లైంగిక అవినీతి, హత్యలు, 22 వ్యభిచారం, దురాశలు, దుర్మార్గతలు, మోసాలు, కామవికారాలు, అసూయలు, దూషణలు, అహంభావం, మూర్ఖత్వం బయటకు వస్తాయి.
23 ఇవన్నీ లోపలి నుండి బయటకు వచ్చి మనిషిని అపవిత్రం చేస్తాయి.”
యోహాను రాసిన సువార్త 7:1
7:1 ఆ తరువాత యేసు గలిలయకు వెళ్ళి అక్కడే సంచరిస్తూ ఉన్నాడు. ఎందుకంటే యూదయలో యూదులు ఆయనను చంపాలని వెతుకుతూ ఉండటంతో అక్కడ సంచరించడానికి ఆయన ఇష్టపడలేదు.