సౌలు మరణం (continued)

క్రీ.పూ. 1055

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

1 సమూయేలు 29

1 అప్పుడు ఫిలిష్తీయుల సైన్యం గుంపుగా వెళ్ళి ఆఫెకులో మకాం చేశారు. ఇశ్రాయేలీయులు యెజ్రెయేలులోని నీటి ఊట పక్కన బస చేశారు. 2 ఫిలిష్తీయ పెద్దలు తమ సైన్యాన్ని వందమందిగా, వెయ్యిమందిగా సమకూర్చి పథకం ప్రకారం వస్తుంటే, దావీదు, అతని మనుషులు ఆకీషుతో కలిసి సైన్యం వెనుక వైపున వస్తున్నారు.

3 ఫిలిష్తీయ సేనానులు “ఈ హెబ్రీయులు ఎందుకు వస్తున్నారు?” అని ఆకీషును అడిగారు. అతడు “ఇన్ని రోజులుగా ఇన్నేళ్ళగా నా దగ్గర ఉన్న ఇశ్రాయేలు రాజు అయిన సౌలుకు సేవకుడు దావీదు ఇతడే కదా. ఇతడు నా దగ్గర చేరినప్పటి నుండి ఈనాటి వరకూ ఇతనిలో ఏ తప్పూ నాకు కనిపించలేదు” అని ఫిలిష్తీయుల సేనానులతో అన్నాడు.

4 అందుకు వారు అతని మీద కోపగించి “ఇతణ్ణి నువ్వు కేటాయించిన స్థలానికి తిరిగి పంపించు. అతడు మనతో కలిసి యుద్ధానికి రాకూడదు, యుద్ధ సమయంలో అతడు మనకు విరోధిగా మారతాడేమో. ఏం చేసి అతడు తన యజమానితో సఖ్యత కుదుర్చుకుంటాడు? మనవాళ్ళ తలలు నరికి తీసుకుపోవడం చేతనే కదా.

5 సౌలు వెయ్యిమందిని, దావీదు పదివేలమందిని హతం చేసారని ఇశ్రాయేలీయులు నాట్యం చేస్తూ, పాటలు పాడిన దావీదు ఇతడే కదా” అని అతనితో అన్నారు.

6 ఆకీషు దావీదును పిలిచి “యెహోవా మీద ఒట్టు, నువ్వు నిజంగా నీతిమంతుడివిగా ఉన్నావు. సైన్యంలో నువ్వు నాతో కలసి తిరగడం నాకు ఇష్టమే, నువ్వు నా దగ్గరికి వచ్చినప్పటి నుండి ఇప్పటికీ నీలో ఎలాంటి తప్పూ నాకు కనబడలేదు. అయితే పెద్దలు నువ్వంటే ఇష్టం లేకుండా ఉన్నారు.

7 ఫిలిష్తీయ పెద్దల విషయంలో నువ్వు వ్యతిరేకమైనది చేయకుండా ఉండేలా నువ్వు తిరిగి నీ ఇంటికి తిరిగి సుఖంగా వెళ్ళు” అని చెప్పాడు. 8 దావీదు “నేనేం చేశాను? నా అధికారివైన రాజా, నీ శత్రువులతో యుద్ధం చేయడానికి నేను రాకుండా ఉండేంత తప్పు నీ దగ్గరికి వచ్చినప్పటినుండి ఈ రోజు వరకూ నాలో నీకు ఏమి కనబడింది?” అని ఆకీషును అడిగాడు.

9 అప్పుడు ఆకీషు “నువ్వు నా కళ్ళకు దేవదూతలాగా కనబడుతున్నావని నాకు తెలుసు. అయితే ఫిలిష్తీయ సేనానులు, ఇతడు మనతో కలసి యుద్ధం చేయడానికి రాకూడదని చెబుతున్నారు.

10 కాబట్టి పొద్దున్నే నువ్వూ, నీతో ఉన్న నీ సైనికులు త్వరగా లేచి తెల్లవారగానే బయలుదేరి వెళ్ళిపోవాలి” అని దావీదుకు ఆజ్ఞ ఇచ్చాడు. 11 కాబట్టి దావీదు, అతని ప్రజలు పొద్దున్నే తొందరగా లేచి ఫిలిష్తీయుల దేశానికి వెళ్లేందుకు ప్రయాణమయ్యారు. ఫిలిష్తీయులు దండెత్తి యెజ్రెయేలుకు వెళ్లారు.

1 దినవృత్తాంతాలు 12:19–22

19 మనష్షేవాళ్ళు కూడా కొంతమంది వచ్చి దావీదు పక్షాన చేరారు. దావీదు ఫిలిష్తీయులతో కలిసి సౌలుమీద యుద్ధం చెయ్యడానికి వెళ్ళినప్పుడు, వాళ్ళు వచ్చి దావీదుతో కలిశారు. కాని, వాళ్ళు దావీదుతో కలిసి ఫిలిష్తీయులకు సాయం చెయ్యలేదు. ఎందుకంటే దావీదు తన యజమాని అయిన సౌలు పక్షాన చేరిపోయి, వాళ్లకు ప్రాణహాని చేస్తాడని తమలో తాము చర్చించి, ఫిలిష్తీయుల అధికారులు దావీదును పంపివేశారు.

20 అప్పుడు అతడు సిక్లగుకు తిరిగి వెళ్తూ ఉన్నప్పుడు మనష్షే వారు అద్నా యోజాబాదు, యెదీయవేలు, మిఖాయేలు, యోజాబాదు, ఎలీహు, జిల్లెతై అనే వేలమందిమీద అధిపతులు దావీదు పక్షాన చేరారు.

21 వాళ్ళందరూ పరాక్రమశాలులూ, సైన్యాధిపతులు. ఆ తిరుగులాడే దండులను హతం చెయ్యడానికి వాళ్ళు దావీదుకు సాయం చేశారు. 22 దావీదు సైన్యం దేవుని సైన్యంలా మహా సైన్యంగా అవుతూ, ప్రతిరోజూ అతనికి సాయం చేసేవాళ్ళు అతని దగ్గరికి వచ్చి చేరుతూ ఉన్నారు.

1 సమూయేలు 30–31

1 దావీదు, అతనితో ఉన్నవారు మూడవ రోజున సిక్లగు వచ్చారు. అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశం మీదా సిక్లగు మీదా దాడిచేసి, దోచుకుని సిక్లగు ప్రజలను ఓడించి, ఊరు తగలబెట్టి, 2 పెద్దలనూ పిల్లలనూ అందులో ఉన్న స్త్రీలతో సహా చంపకుండా చెరబట్టి తీసుకుపోయారు.

3 దావీదు, అతని మనుషులు అ ఊరికి వచ్చి అది కాలిపోయి ఉండడం, తమ భార్యలూ, కొడుకులూ కూతుర్లూ చెరలోకి పోయి ఉండడం చూసి 4 ఇక ఏడవడానికి ఓపిక లేనంత గట్టిగా ఏడ్చారు.

5 యజ్రెయేలీయురాలు అహీనోయము, కర్మెలు వాడైన నాబాలు భార్యగా ఉన్న అబీగయీలు అనే దావీదు ఇద్దరు భార్యలు కూడా చెరలోకి పోవడం చూసి 6 దావీదు చాలా దుఃఖపడ్డాడు. తమ తమ కొడుకులూ కూతుర్లను బట్టి వారందరికీ ప్రాణం విసికి పోయి దావీదును రాళ్లు రువ్వి చంపాలని చెప్పుకున్నారు. దావీదు తన దేవుడు, యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు.

7 అప్పుడు దావీదు ఏఫోదు తెమ్మని యాజకుడైన అహీమెలెకు కుమారుడు అబ్యాతారుతో చెప్పాడు. అబ్యాతారు ఏఫోదును దావీదు దగ్గరికి తీసుకు వచ్చాడు. 8 “నేను ఈ సేనను తరిమితే దాని కలుసుకోగలుగుతానా?” అని యెహోవా దగ్గర దావీదు విచారణ చేశాడు. అందుకు యెహోవా “తరుము, తప్పకుండా నీవు వాళ్ళని కలుసుకుని నీవారినందరినీ విడిపించుకుంటావు” అని చెప్పాడు.

9 కాబట్టి దావీదు, అతనితో ఉన్న 600 మంది బయలుదేరి, బెసోరు వాగు గట్టుకు వస్తే వారిలో 200 మంది ఆగిపోయారు. 10 దావీదు, ఇంకా 400 మంది తరుముతూ పోయారు గానీ ఆ 200 మంది అలిసి పోయి బెసోరు వాగు దాటలేక ఆగిపోయారు. ఆ 400 మంది పోతుంటే 11 ఒక పొలంలో ఒక ఐగుప్తీయుడు తారసపడ్డాడు. వారు దావీదు దగ్గరికి అతణ్ణి తీసుకు వచ్చి భోజనం పెడితే, తిన్నాడు. దాహానికి నీరిస్తే, తాగాడు.

12 వారు అతనికి అంజూరపు ముద్ద తుంచి ఇచ్చారు. రెండు ఎండు ద్రాక్ష ముద్దలు అతనికిచ్చారు. అతడు మూడు రోజులనుండి పస్తులున్నాడు. భోజనం చేసిన తరువాత అతడి ప్రాణం తెప్పరిల్లింది. 13 అప్పుడు దావీదు “నీవు ఏ దేశం వాడివి? ఎక్కడనుండి వచ్చావు?” అని అడిగాడు. అందుకు వాడు “నేను ఐగుప్తు వాణ్ణి. ఒక అమాలేకీయుడికి బానిసనయ్యాను. మూడు రోజుల క్రితం నాకు జబ్బు చేసింది. నా యజమాని నన్ను వదిలి వెళ్ళిపోయాడు.

14 మేము దండెత్తి కెరేతీ జాతి వారుండే దక్షిణ దేశానికి, యూదా దేశానికి, కాలేబు దక్షిణ దేశానికి వచ్చి వాటిని దోచుకుని సిక్లగును కాల్చివేశాం” అని చెప్పాడు. 15 “ఆ దోపిడీ గుంపును కలుసుకొనేందుకు నీవు నాకు దారి చూపుతావా” అని దావీదు అడిగితే అతడు “నేను నిన్ను చంపననీ నీ యజమాని వశం చేయననీ దేవుని పేరున నాకు మాట ఇస్తే ఆ గుంపును కలుసుకోవడానికి నీకు దారి చూపుతాను” అన్నాడు.

16 తరువాత వాడు వారి దగ్గరికి దావీదును తోడుకుని పోయాడు. ఆ దోపిడీ వారు ఫిలిష్తీయుల దేశంలోనుండి, యూదా దేశం లోనుండి తాము దోచి తెచ్చుకొన్న కొల్ల సొమ్ముతో, ఆ ప్రదేశమంతా చెల్లాచెదరుగా తింటూ, తాగుతూ ఆటపాటల్లో ఉన్నారు. 17 దావీదు అదను కనిపెట్టి సంధ్యవేళ మొదలు మరునాటి సాయంత్రం వరకూ వారిని చంపుతూ ఉంటే ఒంటెల మీద ఎక్కి పారిపోయిన 400 మంది యువకులు తప్ప ఒక్కడు కూడా తప్పించుకొన్నవాడు లేకపోయాడు.

18 ఇలా దావీదు అమాలేకీయులు దోచుకు పోయిన దానంతటినీ తిరిగి తెచ్చుకున్నాడు. అంతేకాదు, అతడు తన ఇద్దరు భార్యలను కూడా రక్షించుకున్నాడు. 19 కొడుకులూ కూతుర్లూ దోపుడు సొమ్ము, ఇలా వారు ఎత్తుకుపోయిన దానంతటిలో ఏదీ తక్కువ కాకుండా మొత్తం దావీదు దక్కించుకున్నాడు. 20 దావీదు ఇంకా అమాలేకీయుల గొర్రెలన్నిటినీ గొడ్లన్నిటినీ చేజిక్కించుకున్నాడు. ఇవి దావీదుకు దోపుడు సొమ్ము అని భావించి తక్కిన వారు మిగిలిన తమ సొంత పశువులకు ముందుగా వీటిని తోలారు.

21 అలిసి పోయి దావీదుతో కలిసి రాలేక బెసోరు వాగు దగ్గర నిలిచిపోయిన ఆ 200 మంది దగ్గరకి దావీదు తిరిగి వెళ్ళాడు. వారు దావీదును అతనితో ఉన్నవారిని ఎదుర్కొనడానికి బయలుదేరి వచ్చారు. దావీదు వారి దగ్గరకి వచ్చి వారి యోగక్షేమాలు అడిగాడు.

22 దావీదుతో కూడా వెళ్లిన వారిలో దుష్టులు, పనికిమాలిన వారు కొంతమంది “వీళ్ళు మనతో కూడా రాలేదు గనక వారి భార్యలనూ పిల్లలనూ తప్ప మనకు దక్కిన దోపుడు సొమ్ములో ఏమీ వీరికి ఇవ్వనక్కర లేదు. తమ భార్య పిల్లలను మాత్రం వారు తీసికోవచ్చు” అన్నారు.

23 అందుకు దావీదు వారితో “నా సోదరులారా, యెహోవా మనలను కాపాడి మనమీదికి వచ్చిన ఈ దండును మన వశం చేసి, మనకు దయచేసిన కొల్ల సొమ్ము విషయంలో మీరు ఇలా చేయడం తగదు. 24 మీరంటున్నది ఎవరు ఒప్పుకుంటారు? యుద్దానికి పోయినవాడికీ సామాను దగ్గర కావలి ఉన్న వాడికి ఒకటే భాగం కదా. అందరూ సమానంగానే పాలు పంచుకుంటారు గదా” 25 ఆ విధంగా అప్పటి నుండి ఇప్పటి వరకూ దావీదు ఇశ్రాయేలీయుల్లో అలాటి పంపకం కట్టడగా న్యాయవిధిగా ఏర్పరచి నియమించాడు.

26 దావీదు సిక్లగుకు చేరుకుని దోపుడు సొమ్ములో కొంత తన స్నేహితులైన యూదా పెద్దలకు పంపించాడు. యెహోవా శత్రువులనుండి నేను దోచుకొన్న సొమ్ములో కొంత కానుకగా మీకు ఇస్తున్నానని చెప్పి వారికి పంపించాడు. 27 బేతేలులో, దక్షిణ రామోతులో, యత్తీరులో, 28 అరోయేరులో, షిప్మోతులో, ఎష్టేమోలో, 29 రాకాలులో, యెరహ్మెయేలీయుల గ్రామాల్లో, కేనీయుల గ్రామాల్లో, 30 హోర్మాలో బోరాషానులో, అతాకులో 31 హెబ్రోనులో దావీదూ అతని మనుషులూ తిరుగాడిన స్థలాలన్నిటిలో ఉన్న పెద్దలకు దావీదు ఇలా పంపించాడు.

31:1 ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధం చేసినప్పుడు ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులను ఎదుర్కోలేక పారిపోయారు. ఫిలిష్తీయులు వారిని గిల్బోవ కొండ వరకూ వెంటాడి హతం చేస్తూ, 2 సౌలును అతని కొడుకులనూ తరిమి యోనాతాను, అబీనాదాబు, మెల్కీషూవ అనే సౌలు ముగ్గురు కొడుకులను చంపేశారు.

3 యుద్ధంలో సౌలు ఓడిపోతున్నప్పుడు విలుకాళ్ళు గురి చూసి బాణాలతో అతణ్ణి కొట్టారు. అతడు భయపడి, 4 “సున్నతి లేని వీరు వచ్చి నన్ను చంపి ఎగతాళి చేయకుండా నీ కత్తితో నన్ను పొడువు” అని తన ఆయుధాలు మోసేవాడితో చెబితే, అతడు భయపడి అలా చేయడానికి వెనుకాడాడు. సౌలు తన కత్తి నిలబెట్టి దానిమీద బలంగా ఒరిగాడు. 5 సౌలు చనిపోయాడని అతని ఆయుధాలు మోసేవాడు కూడా తన కత్తి మీద పడి సౌలుతో పాటు చనిపోయాడు.

6 ఈ విధంగా సౌలు, అతని ముగ్గురు కొడుకులు, సౌలు ఆయుధాలు మోసేవాడు, సౌలు మనుషులంతా ఒకే రోజున చనిపోయారు.

7 లోయ అవతల ఉన్న ఇశ్రాయేలీయులు, యొర్దాను అవతల ఉన్నవారు, ఇశ్రాయేలీయులు పారిపోవడం, సౌలు, అతని కొడుకులు చనిపోయి ఉండడం చూసి తాము కాపురం ఉంటున్న ఊళ్ళు విడిచిపెట్టి పారిపోయారు. ఫిలిష్తీయులు వచ్చి వాటిలో నివసించారు.

8 తరువాతి రోజు ఫిలిష్తీయులు చనిపోయిన వారిని దోచుకోవడానికి వచ్చి గిల్బోవ కొండమీద పడి ఉన్న సౌలును, అతని ముగ్గురు కొడుకులను చూసి, 9 అతని తల నరికి అతని ఆయుధాలు తీసుకు తమ విగ్రహాల గుళ్లలో, ప్రజల్లో ఈ విజయ వార్త తెలియజేయడానికి ఫిలిష్తీయ దేశంలో నాలుగు దిక్కులకూ మనుషులను పంపారు.

10 వారు సౌలు ఆయుధాలను అష్తారోతు దేవి గుడిలో ఉంచారు. అతని శవాన్ని బేత్షాను పట్టణపు గోడకు తగిలించారు.

11 ఫిలిష్తీయులు సౌలుకు చేసిన దాని గురించిన వార్త విన్న యాబేష్గిలాదులోని 12 బలిష్టులందరు రాత్రి అంతా నడిచి సౌలు మృతదేహాన్ని, అతని కొడుకుల మృతదేహాలను బేత్షాను పట్టణం గోడ మీద నుంచి దించి యాబేషుకు తీసుకువచ్చి దహనం చేశారు. 13 ఎముకలను వేరుచేసి యాబేషులోని కర్పూర తైల వృక్షం కింద పాతిపెట్టి ఏడు రోజులపాటు ఉపవాసం ఉన్నారు.

1 దినవృత్తాంతాలు 10:13–14

13 సౌలు యెహోవాకు విరోధంగా ద్రోహం చేసాడు కాబట్టి ఈ విధంగా చనిపోయాడు. అతడు యెహోవా ఆజ్ఞలు పాటించలేదు. ఆత్మలతో సంభాషించే మనిషి దగ్గరికి సలహా కోసం వెళ్ళాడు. 14 మార్గనిర్దేశం కోసం అతడు యెహోవా దగ్గరికి వెళ్ళలేదు. అందుకే యెహోవా అతన్ని చంపి రాజ్యాన్ని యెష్షయి కొడుకైన దావీదు వశం చేశాడు.