దావీదుకు సిక్లగును ఇచ్చిన ఆకీషు

దావీదు గాతు రాజైన ఆకీషు దగ్గరికి పారిపోతాడు. ఆకీషు అతనికి నివసించడానికి సిక్లగును ఇస్తాడు. సౌలు మరణం.

క్రీ.పూ. 1056

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

1 సమూయేలు 27:1

1 తరువాత దావీదు “నేను ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు. ఏదో ఒకరోజు సౌలు నన్ను నాశనం చేస్తాడు. నేను ఫిలిష్తీయుల దేశంలోకి తప్పించుకుని వెళ్తాను. అప్పుడు సౌలు ఇశ్రాయేలీయుల సరిహద్దుల్లో నన్ను వెతకడం మానివేస్తాడు. నేను అతని చేతిలోనుండి తప్పించుకోవచ్చు” అని మనసులో అనుకుని

కీర్తనలు 141

దావీదు కీర్తన

1 యెహోవా, నేను నీ కోసం ఆక్రోశిస్తున్నాను. వెంటనే నా దగ్గరికి వచ్చి నన్ను ఆదుకో. నేను మొరపెడుతున్నాను, నేను చెప్పేది ఆలకించు.

2 నా ప్రార్థన నీకు ధూపం లాగా నేను చేతులెత్తడం సాయంకాల నైవేద్యం లాగా ఉండు గాక.

3 యెహోవా, నా నోటికి కాపలా ఉంచు. నా పెదాలు అనే ద్వారాన్ని కాపు కాయి.

4 నా మనసును దుష్టత్వం వైపు తిరగనియ్యకు. పాపులతో చేరి దుష్ట కార్యకలాపాల్లో పాలు పొందనీయకు. వాళ్ళు తినే రుచి గల పదార్థాలు నేను తినకుందును గాక.

5 నీతిమంతులు నన్ను కొడితే అది నాకు దయ చూపినట్టే. వాళ్ళు నన్ను మందలిస్తే అది నా తలకి నూనె రాసినట్టే. అలాంటి దాన్ని నేను అంగీకరిస్తాను. నా ప్రార్థనలు మాత్రం దుర్మార్గుల క్రియలకు వ్యతిరేకంగా ఉంటాయి.

6 దుర్మార్గుల నాయకులను కొండల అంచుల నుండి పడదోస్తారు. అప్పుడు ప్రజలు నా ఇంపైన మాటలు వినేందుకు వస్తారు.

7 వారు అంటారు, ఒకడు భూమిని దున్ని చదును చేసినట్టు మా ఎముకలు పాతాళ ద్వారంలో చెల్లాచెదురుగా పడి ఉన్నాయి.

8 యెహోవా, నా ప్రభూ, నా కళ్ళు నీవైపే చూస్తున్నాయి. నిన్నే శరణు వేడుకొంటున్నాను. నా ప్రాణానికి భద్రత కలిగించు.

9 నా కోసం వాళ్ళు పన్నిన వలలో పడకుండా నన్ను తప్పించు. దుష్టులు పెట్టిన బోనుల నుండి నన్ను కాపాడు.

10 నేను తప్పించుకుపోతూ ఉన్నప్పుడు దుష్టులు తాము పన్నిన వలల్లో తామే చిక్కుకుంటారు గాక.

1 సమూయేలు 27:2–7

2 లేచి తన దగ్గర ఉన్న 600 మందితో కలసి ప్రయాణమై మాయోకు కొడుకు, గాతు రాజు అయిన ఆకీషు దగ్గరికి వచ్చాడు.

3 దావీదు గాతులో ఆకీషు దగ్గరికి చేరినప్పుడు అతడూ, అతని వారంతా తమ తమ కుటుంబాల సమేతంగా కాపురాలు పెట్టారు. యెజ్రెయేలీయురాలైన అహీనోయము, ఒకప్పుడు నాబాలు భార్యయైన కర్మెలీయురాలు అబీగయీలు అనే అతని ఇద్దరు భార్యలు దావీదుతో ఉన్నారు.

4 దావీదు గాతుకు పారిపోయిన విషయం సౌలుకు తెలిసిన తరువాత అతడు దావీదును వెతకడం ఆపివేశాడు. 5 దావీదు “రాజ నగరులో నీ దగ్గర నీ దాసుడనైన నేను కాపురం చేయడం ఎందుకు? నాపై నీకు అభిమానం ఉంటే వేరొక పట్టణంలో నేను కాపురం పెట్టడానికి కొంచెం స్థలం ఇప్పించు” అని ఆకీషును అడిగితే, 6 ఆ రోజు ఆకీషురాజు సిక్లగు అనే పట్టణాన్ని దావీదుకు ఇచ్చాడు. కాబట్టి ఇప్పటివరకూ సిక్లగు యూదారాజుల ఆధీనంలో ఉంది.

7 దావీదు ఫిలిష్తీయుల దేశంలో కాపురం ఉన్న కాలం మొత్తం ఒక సంవత్సరం నాలుగు నెలలు.

1 దినవృత్తాంతాలు 12:1–7

1 కీషు కొడుకైన సౌలుకు భయపడి దావీదు ఇంకా దాగి ఉన్నప్పుడు, సౌలు బంధువులైన బెన్యామీనీయుల్లో పరాక్రమవంతులు కొంతమంది దావీదుకు యుద్ధంలో సాయం చెయ్యడానికి అతని దగ్గరికి సిక్లగుకు వచ్చారు. 2 వీళ్ళు బాణాలు ధరించి, కుడి ఎడమ చేతులతో, వడిసెలతో రాళ్లు రువ్వడంలో, బాణాలు వేయడంలో సామర్ధ్యం ఉన్నవాళ్ళు.

3 వాళ్లెవరంటే, గిబియావాడు షెమాయా కొడుకులైన అహీయెజెరు, ఇతడు అధిపతి. ఇతని తరువాతి వాడు యోవాషు, అజ్మావెతు కొడుకులైన యెజీయేలు, పెలెటు, బెరాకా, అనెతోతీయుడైన యెహూ, 4 ముప్ఫైమందిలో పరాక్రమశాలి, ముప్ఫైమందికి పెద్ద ఇష్మయా అనే గిబియోనీయుడు, యిర్మీయా, యహజీయేలు, యోహానాను, గెదేరాతీయుడైన యోజాబాదు, 5 ఎలూజై, యెరీమోతు, బెయల్యా, షెమర్యా, హరీపీయుడైన షెఫటయా, 6 కోరహీయులు ఎల్కానా, యెష్షీయా, అజరేలు, యోహెజెరు, యాషాబాము, 7 గెదోరు ఊరివాడు యెరోహాము కొడుకులు యోహేలా, జెబద్యా అనేవాళ్ళు.

1 సమూయేలు 27:8–12

8 తరువాత దావీదు, అతనివారు బయలుదేరి గెషూరీయుల మీదా, గెజెరీయుల మీదా అమాలేకీయుల మీదా దాడి చేశారు. ఇంతకుముందు ఈ జాతులు ప్రయాణికులు నడిచే మార్గంలో షూరు నుండి ఐగుప్తు వరకూ ఉన్న దేశంలో నివసించారు. 9 దావీదు ఆ దేశాల వారిని చంపి, పురుషులు, స్త్రీలు ఎవ్వరినీ బతకనీయకుండా చంపి వారి గొర్రెలనూ ఎద్దులనూ గాడిదలనూ ఒంటెలనూ బట్టలనూ దోచుకుని తిరిగి ఆకీషు దగ్గరికి వచ్చేవాడు.

10 అప్పుడు ఆకీషు “ఇప్పుడు మీరు ఏ దేశంపై దండెత్తి వచ్చారు?” అని దావీదును అడిగితే, దావీదు “యూదా దేశానికి, యెరహ్మెయేలు దేశానికి, కేనీయ దేశానికి దక్షిణంగా ఉన్న ఒక ప్రదేశంపై దండెత్తాము” అన్నాడు.

11 ఆ విధంగా దావీదు చేస్తూ వచ్చాడు. దావీదు ఫిలిష్తీయ దేశంలో ఉన్నంతకాలం అతడు ఈ విధంగా చేస్తాడని తమను గురించి గాతుకు సమాచారం అందించగల పురుషులనైనా, స్రీలనైనా దావీదు బతకనివ్వలేదు. 12 ఆకీషు దావీదును నమ్మాడు. “దావీదు తన ప్రజలైన ఇశ్రాయేలీయులు తనను పూర్తిగా అసహ్యించుకునేలా చేశాడు కాబట్టి అతడు అన్నివేళలా నాకు దాసుడుగా ఉంటాడు” అనుకున్నాడు.

సౌలు మరణం క్రీ.పూ. 1055

1 సమూయేలు 28

1 ఆ రోజుల్లో ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయాలని సైన్యాలను సమకూర్చుకుని యుద్ధానికి సిద్ధమయ్యారు. ఆకీషు దావీదును పిలిచి “నువ్వు, నీ మనుషులు నాతో కలసి యుద్ధానికి బయలుదేరాలని జ్ఞాపకం ఉంచుకో” అన్నాడు. 2 దావీదు “నీ దాసుడనైన నేను నీకు చేయబోయే సహాయం ఏమిటో అది నువ్వు ఇప్పుడు తెలుసుకుంటావు” అన్నాడు. ఆకీషు “ఆలాగైతే నిన్ను ఎప్పటికీ నా సొంత సంరక్షకుడుగా నియమించుకుంటాను” అన్నాడు.

3 సమూయేలు చనిపోయినపుడు ఇశ్రాయేలు ప్రజలంతా అతని కోసం ఏడ్చి, అతని సొంత పట్టణమైన రమాలో అతణ్ణి పాతిపెట్టారు. సౌలు, చచ్చినవాళ్ళతో, ఆత్మలతో మాట్లాడేవారిని తన దేశం నుండి వెళ్లగొట్టాడు. 4 ఫిలిష్తీయులు దండెత్తి వచ్చి షూనేములో శిబిరం వేసుకున్నప్పుడు, సౌలు ఇశ్రాయేలీయులందరినీ సమకూర్చాడు. వారు గిల్బోవ లోయలో మకాం వేసారు.

5 సౌలు ఫిలిష్తీయుల సైన్యాన్ని చూసినపుడు మనస్సులో విపరీతమైన భయం పెంచుకుని 6 యెహోవా దగ్గర విచారణ చేసాడు. యెహోవా కల ద్వారా గానీ, ఊరీం ద్వారా గానీ, ప్రవక్తల ద్వారా గానీ ఏమీ జవాబివ్వలేదు. 7 అప్పుడు సౌలు “నా కోసం మీరు మృతులతో మాట్లాడే ఒక స్త్రీని వెదకండి. నేను వెళ్ళి ఆమె ద్వారా విచారణ చేస్తాను” అని తన సేవకులకు ఆజ్ఞ ఇస్తే, వారు “అలాగే, ఏన్దోరులో మృతులతో మాట్లాడే ఒక స్త్రీ ఉంది” అని అతనితో చెప్పారు.

8 సౌలు మారువేషం వేసుకుని వేరే దుస్తులు ధరించి ఇద్దరు సహాయకులను వెంట తీసుకుని వెళ్ళి, రాత్రి సమయంలో ఆ స్త్రీతో “మృతులతో మాట్లాడి నాకు శకునం చెప్పి, నాతో మాట్లాడడానికి నేను నీతో చెప్పే వ్యక్తిని రప్పించు” అని కోరాడు. 9 ఆ స్త్రీ, అలాగే “సౌలు ఏం చేయించాడో నీకు తెలియదా? అతడు చచ్చినవాళ్ళతో, ఆత్మలతో మాట్లాడే వారిని దేశంలో లేకుండా తరిమివేశాడు కదా. నువ్వు నా ప్రాణం కోసం ఉరివేసి నాకు చావు వచ్చేలా చేస్తావు” అని అతనితో అంది.

10 అప్పుడు సౌలు “దేవుని తోడు, దీన్ని బట్టి నీకు శిక్ష ఎంతమాత్రం రాదు” అని యెహోవా పేరున ఒట్టు పెట్టుకొంటే, 11 ఆ స్త్రీ “నీతో మాట్లాడడం కోసం ఎవరిని రప్పించాలి” అని అడిగింది. అతడు “సమూయేలును రప్పించాలి” అని కోరాడు. 12 ఆ స్త్రీ సమూయేలును చూసి గట్టిగా కేకవేసి “నీవు సౌలువి గదా, నీవు నన్నెందుకు మోసం చేశావు” అని సౌలును అడిగితే, 13 రాజు “నువ్వు భయపడవద్దు. నీకు ఏమి కనబడిందో చెప్పు” అని ఆమెను అడిగితే “దేవుళ్ళలో ఒకడు భూమిలోనుండి పైకి రావడం నేను చూస్తున్నాను” అని చెప్పింది.

14 రాజు “అతడు ఏ రూపంలో ఉన్నాడు” అని అడిగాడు. ఆమె “దుప్పటి కప్పుకుని ఉన్న ఒక ముసలివాడు పైకి వస్తున్నాడు” అని చెబితే, సౌలు, అతడు సమూయేలు అని గ్రహించి సాగిలపడి నమస్కారం చేశాడు. 15 “నన్ను రమ్మని నువ్వెందుకు తొందరపెట్టావు” అని సమూయేలు సౌలును అడిగాడు. సౌలు “నేను తీవ్రమైన బాధల్లో ఉన్నాను. ఫిలిష్తీయులు నా మీదికి దండెత్తి వస్తే దేవుడు నన్ను పక్కన పెట్టి ప్రవక్తల ద్వారా గానీ, కలల ద్వారా గానీ నాకేమీ జవాబివ్వలేదు. కాబట్టి నేను ఏమి చేయాలో నాకు తెలియజేయడానికి నిన్ను పిలిపించాను” అన్నాడు.

16 అప్పుడు సమూయేలు “యెహోవా నిన్ను పక్కన పెట్టి నీకు విరోధి అయ్యాడు. ఇప్పుడు నన్ను అడగడం వల్ల ప్రయోజనం ఏంటి? 17 యెహోవా తన జవాబును తానే స్వయంగా వెల్లడిస్తున్నాడు. నా ద్వారా ఆయన సెలవిచ్చినట్టు, నీ చేతిలో నుండి రాజ్యాన్ని తీసివేసి నీ సేవకుడు దావీదుకు దాన్ని ఇచ్చివేశాడు.

18 యెహోవా ఆజ్ఞకు నువ్వు లోబడకుండా, అమాలేకీయుల విషయంలో ఆయన తీక్షణమైన ఉగ్రతను అమలు చేయలేదు కాబట్టి దాన్ని బట్టి యెహోవా నీకు ఈ రోజు ఈ విధంగా జరిగిస్తున్నాడు. 19 యెహోవా నిన్నూ, ఇశ్రాయేలీయులనూ ఫిలిష్తీయుల చేతికి అప్పగిస్తాడు. రేపు నువ్వు, నీ కొడుకులు నా దగ్గరికి చేరుకుంటారు. యెహోవా ఇశ్రాయేలీయుల సైన్యాన్ని ఫిలిష్తీయుల చేతికి అప్పగిస్తాడు” అని సౌలుతో చెప్పాడు. 20 సమూయేలు చెప్పిన మాటలకు సౌలు తీవ్రమైన భయంతో వెంటనే నేలపై సాష్టాంగపడి రాత్రి అంతా భోజనం ఏమీ తీసుకోకుండా ఉన్నందువల్ల బలహీనుడయ్యాడు.

21 అప్పుడు ఆ స్త్రీ సౌలు దగ్గరికి వచ్చి, అతడు ఎంతో కలవరపడడం చూసి “నా యజమానీ, నీ దాసినైన నేను నీ ఆజ్ఞకు లోబడి నా ప్రాణాలు అర చేతిలో పెట్టుకుని నువ్వు నాకు చెప్పిన మాటలు విని అలా చేశాను” అని చెప్పింది. 22 ఇప్పుడు “నీ దాసినైన నేను చెప్పే మాటలు విను. నేను నీకు కొంత ఆహారం వడ్డిస్తాను, నువ్వు భోజనం చేసి బలం తెచ్చుకుని ప్రయాణమై వెళ్ళు” అని అతనితో అంది.

23 అతడు భోజనం చేసేందుకు ఒప్పుకోలేదు. అతని సేవకులు ఆ స్త్రీతో కలసి అతనిని బలవంతం చేస్తే అతడు వారు చెప్పిన మాట విని నేలపై నుండి లేచి మంచంపై కూర్చున్నాడు. 24 ఆ స్త్రీ తన ఇంట్లో ఉన్న కొవ్విన దూడ తెచ్చి త్వరగా వధించి, పిండి తెచ్చి పిసికి, పులవని రొట్టెలు కాల్చి 25 తీసుకువచ్చి సౌలుకు, అతని సేవకులకు వడ్డిస్తే వారు భోజనం చేసి అక్కడి నుంచి ఆ రాత్రే వెళ్లిపోయారు.