సౌలు, యోనాతానుల కోసం విలపించిన దావీదు

క్రీ.పూ. 1055

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

2 సమూయేలు 1

1 దావీదు అమాలేకీయులను చంపి తిరిగి వచ్చాడు. సౌలు చనిపోయిన తరువాత అతడు సిక్లగు ప్రాంతంలో రెండు రోజులు ఉన్నాడు. 2 మూడవ రోజు ఒకడు తన బట్టలు చింపుకుని, తల మీద బూడిద పోసుకుని సౌలు సైన్యం నుండి వచ్చాడు. 3 అతడు దావీదును చూసి నేలపై సాష్టాంగపడి నమస్కారం చేశాడు. అప్పుడు దావీదు “నువ్వు ఎక్కడ నుండి వచ్చావు?” అని అడిగాడు. అందుకు వాడు “ఇశ్రాయేలీయుల సైన్యంలో నుండి నేను తప్పించుకు వచ్చాను” అన్నాడు. 4 “జరిగిన సంగతులు నాతో చెప్పు” అని దావీదు అడిగాడు. అందుకు అతడు “సైనికులు యుద్ధంలో నిలవలేక పారిపోయారు. చాలా మంది గాయాలపాలై పడిపోయారు, చాలా మంది చనిపోయారు. సౌలూ అతని కొడుకు యోనాతానూ చనిపోయారు” అన్నాడు.

5 “సౌలు, అతని కొడుకు యోనాతాను చనిపోయారని నీకెలా తెలిసిందో నాకు వివరంగా చెప్పు” అని దావీదు అతణ్ణి అడిగాడు. ఆ యువకుడు ఇలా అన్నాడు, 6 “నేను అనుకోకుండా గిల్బోవ కొండకు వచ్చినప్పుడు సౌలు తన ఈటె మీద ఆనుకుని ఉన్నాడు. 7 రథాలు, రౌతులు అతనిని తరుముతూ పట్టుకోవడానికి సమీపించినప్పుడు అతడు వెనక్కి తిరిగి చూసి నన్ను పిలిచాడు. అందుకు నేను, ‘చిత్తం నా రాజా’ అన్నాను. 8 అతడు ‘నువ్వు ఎవరివి?’ అని నన్ను అడిగాడు. ‘నేను అమాలేకీయుణ్ణి’ అని చెప్పాను. 9 అతడు ‘నాలో కొన ప్రాణం ఉన్నందువల్ల నేను తీవ్రమైన యాతనలో ఉన్నాను. నా దగ్గరికి వచ్చి నన్ను చంపెయ్యి’ అని ఆజ్ఞాపించాడు.

10 అంత తీవ్రంగా గాయపడిన తరువాత అతడు ఇక బతకడని అనిపించి నేను అతని దగ్గర నిలబడి అతణ్ణి చంపివేశాను. అతని తల మీద ఉన్న కిరీటాన్ని, చేతి కంకణాలను తీసుకుని నా రాజువైన నీ దగ్గరికి వాటిని తెచ్చాను” అన్నాడు. 11 దావీదు ఆ వార్త విని తన బట్టలు చింపుకున్నాడు. అతని దగ్గర ఉన్నవారంతా అలాగే చేసి, 12 సౌలూ, యోనాతానూ యెహోవా ప్రజలూ ఇశ్రాయేలు వంశీకులూ యుద్ధంలో చనిపోయారని వారిని గూర్చి దుఃఖపడుతూ, ప్రలాపిస్తూ సాయంత్రం వరకూ ఉపవాసం ఉన్నారు.

13 తరువాత దావీదు “నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు?” అని ఆ వార్త తెచ్చినవాణ్ణి అడిగాడు. వాడు “నేను ఇశ్రాయేలు దేశంలో నివసించే అమాలేకువాడైన ఒకడి కొడుకును” అన్నాడు. 14 అందుకు దావీదు “భయం లేకుండా యెహోవా అభిషేకించిన వాణ్ణి చంపడానికి అతని మీద నువ్వెందుకు చెయ్యి ఎత్తావు?” అని 15 తన మనిషి ఒకణ్ణి పిలిచి “వెళ్లి వాణ్ణి చంపు” అని చెప్పగా అతడు వాణ్ణి కొట్టి చంపాడు. 16 “యెహోవా అభిషేకించిన వాణ్ణి నేను చంపానని నువ్వు చెప్పావే, నీ నోటి మాటే నీకు సాక్ష్యం. కాబట్టి నీ ప్రాణానికి నువ్వే జవాబుదారివి” అని దావీదు ఆ మృత అమాలేకీయుడితో అన్నాడు.

17 దావీదు సౌలును గూర్చి, అతని కొడుకు యోనాతానును గూర్చి భూస్థాపన విలాప గీతం ఒకటి పాడాడు. 18 యూదా వారంతా ఆ ధనుర్గీతం నేర్చుకోవాలని తన ప్రజలను ఆదేశించాడు. అది యాషారు గ్రంథంలో రాసి ఉంది.

19 ఇశ్రాయేలూ, నీకు మహిమ అంతా

నీ పర్వతాలపై మృతి చెందింది.

బలవంతులు ఎలా పడిపోయారో గదా!

20 ఫిలిష్తీయుల కుమార్తెలు సంతోషించకూడదు.

సున్నతి లేనివారి కుమార్తెలు పండగ చేసుకోకూడదు.

అందుకని ఈ సంగతి గాతులో తెలియనియ్యకండి.

అష్కెలోను వీధుల్లో ప్రకటన చేయకండి.

21 గిల్బోవ పర్వతాల్లారా, మీ మీద మంచైనా వర్షమైనా పడకపోవు గాక.

అర్పణకు పనికి వచ్చే ధాన్యం పండే చేలు లేకపోవు గాక.

పరాక్రమవంతుల డాలు అవమానం పాలయింది.

సౌలు డాలు తైలం చేత అభిషేకం పొందనిదైనట్టు అయిపోయింది.

22 హతుల రక్తం ఒలికించకుండా,

బలిష్టుల దేహాలనుండి

యోనాతాను విల్లు మడమ తిప్పలేదు.

ఎవరినీ హతమార్చకుండా సౌలు ఖడ్గం వట్టినే వెనుదిరగ లేదు.

23 సౌలూ యోనాతానూ తమ బతుకులో

ప్రేమ గలవారుగా, దయ గలవారుగా ఉన్నారు.

తమ చావులో సైతం వారు ఒకరికొకరికి వేరై ఉండలేదు.

వారు పక్షిరాజుల కంటే వేగం గలవారు.

సింహాలకంటే బలమైన వారు.

24 ఇశ్రాయేలీయుల కుమార్తెలూ, సౌలును గూర్చి ఏడవండి.

అతడు మీకు ఇష్టమైన ఎర్రని బట్టలు ధరింప జేశాడు.

మీకు బంగారు నగలు ఇచ్చాడు.

25 యుద్ధరంగంలో బలమైన మనుషులు పడిపోయారు.

నీ ఉన్నత స్థలాల్లో యోనాతానును చంపేశారు.

26 నా సోదరుడా, యోనాతానూ,

నువ్వు నాకు చాలా ప్రియమైన వాడివి.

నీ నిమిత్తం నేను తీవ్రంగా శోకిస్తున్నాను.

నాపై నీ ప్రేమ ఎంతో వింతైనది.

స్త్రీలు చూపించే ప్రేమ కంటే అది ఎక్కువైనది.

27 అయ్యయ్యో బలవంతులైన సైనికులు కూలిపోయారు.

యుద్ధ శూరులు నశించిపోయారు.

1 దినవృత్తాంతాలు 10:1–12

1 ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధం చేశారు. ఇశ్రాయేలీయులందరూ పారిపోయారు. ఫిలిష్తీయులు వాళ్ళను గిల్బోవ పర్వతం మీద హతమార్చారు. 2 ఫిలిష్తీయులు సౌలునీ అతని కొడుకులనూ వెంటపడి తరిమారు. వాళ్ళు సౌలు కొడుకులు యోనాతానునీ, అబీనాదాబునీ, మల్కీషూవనీ చంపేశారు.

3 సౌలుకి వ్యతిరేకంగా యుద్ధం తీవ్రమైంది. బాణాలు వేసే వాళ్ళు అతణ్ణి చూశారు. అతనిపై గురిపెట్టి బాణాలు వేసారు. సౌలుకు తీవ్ర గాయాలయ్యాడు.

4 అప్పుడు సౌలు తన ఆయుధాలు మోసేవాడితో “నీ కత్తితో నన్ను పొడిచెయ్యి. లేకుంటే ఈ సున్నతి లేని వాళ్ళు వచ్చి నన్ను అవమానిస్తారు” అన్నాడు. వాడు అలా చేయడానికి ఒప్పుకోలేదు. ఎందుకంటే వాడు చాలా భయపడ్డాడు. దాంతో సౌలు తన కత్తి నేలకు ఆనించి దాని మీద పడ్డాడు.

5 సౌలు చనిపోయాడని ఆయుధాలు మోసేవాడికి అర్థం అయింది. దాంతో వాడు కూడా తన కత్తి పట్టుకుని దానిపైన పడ్డాడు. వాడూ చనిపోయాడు. 6 ఈ విధంగా సౌలూ, అతని ముగ్గురు కొడుకులతో పాటు అతని కుటుంబ సభ్యులందరూ చనిపోయారు. 7 తమ వాళ్ళు యుద్ధంలో నుండి పారిపోయారనీ, సౌలూ అతని కొడుకులూ చనిపోయారనీ లోయలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలకు తెలిసింది. అప్పుడు వాళ్ళంతా తమ పట్టణాలు వదిలి పారిపోయారు.

8 తరువాత రోజు చనిపోయిన వారి బట్టలనూ ఇతర వస్తువులనూ దోచుకోడానికి ఫిలిష్తీయులు వచ్చారు. అప్పుడే వాళ్ళు సౌలు, అతని కుమారులూ గిల్బోవ పర్వతంపై చనిపోయి పడి ఉండటం చూశారు. 9 వాళ్ళు సౌలు కవచాన్నితీసుకున్నారు. అతని తలనూ, ఆయుధాలనూ తీసుకువెళ్ళారు. తమ విగ్రహాల మధ్యా, ప్రజల మధ్యా ఈ వార్తను చాటించడానికి మనుషులను పంపారు. 10 తమ దేవుని గుడిలో అతని ఆయుధాలను ఉంచారు. అతని తలను దాగోను గుడికి వేలాడదీశారు.

11 ఫిలిష్తీయులు సౌలుకి చేసింది యాబేష్గిలాదు నివాసులకు తెలిసింది. 12 అప్పుడు వాళ్ళలో శూరులైన వాళ్ళంతా అక్కడికి వెళ్ళి సౌలు శరీరాన్నీ, అతని కొడుకుల శరీరాలనూ యాబేషుకి తీసుకు వచ్చారు. వాళ్ళ ఎముకలను యాబేషులోనే ఉన్న సింధూరం చెట్టు కింద పాతిపెట్టారు. ఏడు రోజులు వాళ్ళ కోసం ఉపవాసం ఉన్నారు.