తన శత్రువుల పతనాన్ని బట్టి సంఘం ఆనందిస్తుంది
విగ్రహారాధకులు, హింసించేవారు అయిన తన శత్రువుల పతనాన్ని బట్టి ఆత్మీయ సంఘం ఆనందిస్తుంది.
క్రీ.శ. 96
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
యోహాను రాసిన ప్రకటన గ్రంథం 19:1–10
1 ఈ విషయాలు జరిగిన తరువాత అనేకమంది మాట్లాడుతున్నట్టు పరలోకంలో నుండి ఒక పెద్ద శబ్దం నేను విన్నాను.
“హల్లెలూయ! రక్షణ, యశస్సు, బల ప్రభావాలు మన దేవునివే.
2 ఆయన తీర్పులు సత్యంగా న్యాయంగా ఉన్నాయి.
తన లైంగిక అవినీతితో భూలోకాన్ని భ్రష్టత్వంలోకి నెట్టిన మహా వేశ్యను ఆయన శిక్షించాడు.
ఆమె ఒలికించిన తన సేవకుల రక్తానికి ఆయన ప్రతీకారం తీర్చాడు.”
3 రెండోసారి వారంతా, “హల్లెలూయ! ఆ నగరం నుండి పొగ కలకాలం పైకి లేస్తూనే ఉంటుంది” అన్నారు.
4 అప్పుడు ఆ ఇరవై నలుగురు పెద్దలూ ఆ నాలుగు ప్రాణులూ సాష్టాంగపడి సింహాసనంపై కూర్చున్న దేవునికి,
“ఆమెన్, హల్లెలూయ!” అని చెబుతూ ఆయనను పూజించారు.
5 అప్పుడు, “దేవుని దాసులు, ఆయనకు భయపడే వారు,
గొప్పవారైనా అనామకులైనా అందరూ మన దేవుణ్ణి స్తుతించండి” అంటూ ఒక స్వరం సింహాసనం నుండి వినిపించింది.
6 తరువాత అనేకమంది మాట్లాడుతున్నట్టు, అనేక జలపాతాల గర్జనలా, బలమైన ఉరుముల ధ్వనిలా ఒక స్వరం ఇలా వినిపించింది.
“హల్లెలూయ! సర్వ శక్తిశాలి, మన ప్రభువు అయిన దేవుడు పరిపాలిస్తున్నాడు.”
7 “గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయం వచ్చింది.
పెండ్లికుమార్తె సిద్ధపడి ఉంది.
కాబట్టి మనం సంతోషించి ఆనందించుదాం.
ఆయనకు మహిమ ఆపాదించుదాం.”
8 ఆమె ధరించుకోడానికి మెరిసిపోయే, పరిశుభ్రమైన శ్రేష్ఠవస్త్రాలు ఇచ్చారు.
ఈ శ్రేష్ఠవస్త్రాలు పరిశుద్ధుల నీతి కార్యాలు.
9 అప్పుడు ఆ దూత నాతో ఇలా అన్నాడు, “గొర్రెపిల్ల పెళ్ళి విందుకు ఆహ్వానం అందినవారు ధన్యులు అని రాయి.” అతడే ఇంకా, “ఇవి నిజంగా దేవుని మాటలు” అన్నాడు. 10 అందుకు నేను అతణ్ణి పూజించడానికి అతని ముందు సాష్టాంగపడబోయాను. కానీ అతడు, “అలా చేయకు! యేసుకు సాక్షులుగా ఉన్న నీకూ నీ సోదరులకూ నేను తోటి దాసుణ్ణి మాత్రమే” అన్నాడు.
దుష్టత్వం కూలిపోయేటప్పుడు దేవుని కుమారుడు చాలా మటుకు ప్రత్యక్షమవుతాడు
దుష్టత్వం చివరికి కూలిపోయేటప్పుడు దేవుని కుమారుని సంభావ్యమైన దృశ్య ప్రత్యక్షత, ఆయన పితరులకూ, తన పునరుత్థానం తరువాత అపొస్తలులకూ ప్రత్యక్షమైనట్టే; ఒక కొత్త యుగ వ్యవస్థ ఆరంభం, ఆత్మీయ సంఘ విజయం.
యోహాను రాసిన ప్రకటన గ్రంథం 19:11–21
11 తరువాత పరలోకం తెరుచుకుని ఉండడం చూశాను. అప్పుడు చూడండి! తెల్లని గుర్రం ఒకటి నాకు కనిపించింది. దానిమీద కూర్చున్న వ్యక్తి పేరు ‘నమ్మకమైన వాడు, సత్యవంతుడు.’ ఆయన న్యాయంగా తీర్పు చెబుతూ యుద్ధం చేస్తాడు. 12 ఆయన నేత్రాలు అగ్నిజ్వాలల్లా ఉన్నాయి. ఆయన తలపై అనేక కిరీటాలున్నాయి. ఆయనపై ఒక పేరు రాసి ఉంది. అది ఆయనకు తప్ప వేరెవరికీ తెలియదు. 13 ఆయన ధరించిన దుస్తులు రక్తంలో ముంచి తీసినవి. ‘దేవుని వాక్కు’ అనే పేరు ఆయనకుంది.
14 ఆయన వెనకే పరలోక సేనలు తెల్లని నార బట్టలు వేసుకుని తెల్ల గుర్రాలపై ఎక్కి వెళ్తున్నారు. 15 వివిధ జాతి ప్రజలను కొట్టడానికి ఆయన నోటి నుండి పదునైన కత్తి బయటకు వస్తూ ఉంది. ఆయన ఇనుప లాఠీతో వారిని పరిపాలిస్తాడు. సర్వాధికారి అయిన దేవుని తీక్షణమైన ఆగ్రహపు ద్రాక్ష గానుగ తొట్టిని ఆయనే తొక్కుతాడు. 16 ఆయన బట్టల మీదా, తొడ మీదా ‘రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు’ అనే పేరు రాసి ఉంది.
17 అప్పుడు ఒక దూత సూర్యబింబంలో నిలబడి ఉండడం నేను చూశాను. అతడు బిగ్గరగా కేక వేసి పైన ఎగిరే పక్షులను పిలిచాడు, “రండి, దేవుడు ఏర్పాటు చేసిన మహా విందును ఆరగించండి. 18 రాజుల మాంసం, సైన్యాధిపతుల మాంసం, బలవంతుల మాంసం, గుర్రాల మాంసం, వాటిపై స్వారీ చేసేవారి మాంసం, స్వతంత్రులూ, బానిసలూ, పలుకుబడి లేనివారూ, గొప్పవారూ అయిన మనుషులందరి మాంసం, వచ్చి తినండి” అన్నాడు.
19 క్రూరమృగం, భూమి మీదనున్న రాజులందరూ తమ సైన్యాలతో వ్యూహం తీరి ఉండడం నేను చూశాను. వారు ఆ గుర్రం మీద కూర్చున్న వ్యక్తితోనూ ఆయన సైన్యంతోనూ యుద్ధం చేయడానికి సిద్ధం అవుతున్నారు.
20 అప్పుడా మృగమూ, వాడి ముందు అద్భుతాలు చేసిన అబద్ధ ప్రవక్తా పట్టుబడ్డారు. ఈ అద్భుతాలతోనే వీడు మృగం ముద్ర వేయించుకున్న వారిని, ఆ విగ్రహాన్ని పూజించిన వారిని మోసం చేశాడు. ఈ ఇద్దరినీ గంధకంతో మండుతున్న అగ్ని సరస్సులో ప్రాణాలతోనే పడవేశారు.
21 మిగిలిన వారు గుర్రం మీద కూర్చున్న వ్యక్తి నోటి నుండి వస్తున్న కత్తివాత పడి చచ్చిపోయారు. వారి మాంసాన్ని పక్షులు కడుపారా ఆరగించాయి.
సహస్రాబ్ది కోసం సాతాను బంధించబడడం
చెడు కూలిపోయినప్పుడు జరిగిన సుదీర్ఘ కల్లోలాలు, యుద్ధాలు, విప్లవాల తరువాత, వెయ్యి సంవత్సరాల సుదీర్ఘ విశ్రాంతి కాలం మొదలవుతుంది. ఇది సాతాను బంధించబడడం ద్వారా చిత్రించబడింది. క్రీస్తు పునరుత్థాన సమయంలో ఆయనతోపాటు అనేకుల ఆత్మలు లేచినట్లే, ఈ సమయంలో ఆయన దృశ్యరూపంలో ప్రత్యక్షమైనప్పుడు హతసాక్షుల ఆత్మలు, విశ్వాసపాత్రమైన సంఘంలోని వారి ఆత్మలు క్రీస్తుతో మళ్లీ జీవిస్తాయని చెప్పబడింది (2000–3000).
యోహాను రాసిన ప్రకటన గ్రంథం 20:1–6
1 తరువాత ఒక దేవదూత పరలోకం నుండి దిగి రావడం నేను చూశాను. అతని చేతిలో ఒక పెద్ద గొలుసూ లోతైన అగాధం తాళం చెవీ ఉన్నాయి. 2 అతడు అపవాది, సాతాను అనే పేర్లున్న ఆది సర్పం అయిన మహా సర్పాన్ని పట్టుకుని వెయ్యి సంవత్సరాల వరకూ అగాధంలో పడవేశాడు. 3 వాణ్ణి అగాధంలో పడవేసి, దాన్ని మూసివేసి దానికి ముద్ర వేశాడు. ఆ వెయ్యి సంవత్సరాలయ్యే వరకూ ప్రజలను మోసం చేయకుండా వాడు అగాధంలోనే బందీగా ఉండాలి. ఆ తరువాత కొద్ది సమయం వాణ్ణి వదిలిపెట్టాలి.
4 అప్పుడు సింహాసనాలు చూశాను. వాటిపై కూర్చున్న వారికి తీర్పు చెప్పే అధికారం ఇచ్చారు. యేసును గురించి తాము చెప్పిన సాక్ష్యం కోసమూ, దేవుని వాక్కును ప్రకటన చేసినందుకూ తల నరికించుకున్న భక్తుల ఆత్మలు చూశాను. వారు క్రూర మృగాన్ని గానీ, వాడి విగ్రహాన్ని గానీ పూజించలేదు. వారి నుదుటి మీద గానీ చేతి మీద గానీ ముద్ర వేయనీయలేదు. వారిప్పుడు సజీవులై క్రీస్తుతో కలిసి వెయ్యేళ్ళు పరిపాలించారు.
5 ఆ వెయ్యి సంవత్సరాలు ముగిసే వరకూ చనిపోయిన మిగిలిన వారు సజీవులు కాలేదు. ఇదే మొదటి పునరుత్థానం. 6 ఈ మొదటి పునరుత్థానంలో పాల్గొన్నవారు పరిశుద్ధులు, దీవెన పొందిన వారు. వీళ్ళపై రెండవ మరణానికి అధికారం లేదు. వీరు దేవునికీ, క్రీస్తుకీ యాజకులై క్రీస్తుతో కూడా వెయ్యి సంవత్సరాలు పరిపాలన చేస్తారు.
చెడు మళ్లీ విజృంభిస్తుంది, తరువాత అంతిమ తీర్పు
సహస్రాబ్ది పరిపాలనా యుగం ముగింపుకు వచ్చేటప్పుడు దుష్ట ఆత్మ మళ్లీ విజృంభించడం మొదలవుతుంది. అయితే సార్వత్రిక పునరుత్థానం, మానవజాతికి జరిగే అంతిమ తీర్పు దాని తదుపరి వ్యాప్తిని ఆపివేస్తాయి.
యోహాను రాసిన ప్రకటన గ్రంథం 20:7–15
7 వెయ్యి సంవత్సరాలు ముగిశాక సాతాను తన చెరలో నుండి విడుదల అవుతాడు. 8 వాడు బయల్దేరి భూమి నాలుగు దిక్కుల్లో ఉన్న గోగు, మాగోగులను మోసం చేసి లెక్కకు సముద్రపు ఇసుకలాగా ఉన్న వారిని యుద్ధానికై సమకూరుస్తాడు. 9 వారు బయలు దేరి పరిశుద్ధుల శిబిరమైన ప్రియ పట్టణాన్ని ముట్టడి వేస్తారు. అప్పుడు పరలోకం నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించి వేస్తుంది.
10 వారిని మోసం చేసిన అపవాదిని మండుతున్న గంధకం సరస్సులో పడవేస్తారు. అక్కడే క్రూర మృగమూ, అబద్ధ ప్రవక్తా ఉన్నారు. వారు రాత్రీ పగలూ కలకాలం బాధల పాలవుతారు.
11 తరవాత తెల్లని సింహాసనాన్నీ దానిపై కూర్చున్న ఒకాయననూ చూశాను. ఆయన సన్నిధి నుండి భూమీ ఆకాశాలూ పారిపోయాయి. కానీ అవి వెళ్ళడానికి చోటు కనపడలేదు. 12 చనిపోయిన వారు గొప్పవారైనా అల్పులైనా ఆ సింహాసనం ఎదుట నిలబడి ఉండడం చూశాను. అప్పుడు గ్రంథాలు తెరిచారు. మరో గ్రంథాన్ని కూడా తెరిచారు. అది జీవ గ్రంథం. ఆ గ్రంథాల్లో తమ కార్యాలను గురించి రాసి ఉన్న దాన్ని బట్టి వారు తీర్పు పొందారు.
13 సముద్రం తనలో ఉన్న చనిపోయిన వారిని అప్పగించింది. మరణమూ, పాతాళ లోకమూ వాటి వశంలో ఉన్న చనిపోయిన వారిని అప్పగించాయి. వారంతా తమ కార్యాలను బట్టి తీర్పు పొందారు. 14 మరణాన్నీ పాతాళాన్నీ అగ్ని సరస్సులో పడవేయడం జరిగింది. ఈ అగ్ని సరస్సే రెండవ మరణం. 15 జీవ గ్రంథంలో పేరు లేని వాణ్ణి అగ్ని సరస్సులో పడవేశారు.
మరణం, చెడు, దుఃఖం ఇక ఉండవు
మానవజాతిలో మరణం, చెడు, దుఃఖం ఇక ఉండని భవిష్యత్తు నిత్యానందాన్ని గురించిన వర్ణన.
యోహాను రాసిన ప్రకటన గ్రంథం 21:1–4
1 అప్పుడు నేను కొత్త ఆకాశాన్నీ, కొత్త భూమినీ చూశాను. మొదటి ఆకాశం, మొదటి భూమీ గతించి పోయాయి. సముద్రం అనేది ఇక లేదు. 2 అప్పుడు నేను కొత్త యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణం తన భర్త కోసం అలంకరించుకున్న పెళ్ళికూతురిలా తయారై పరలోకంలో ఉన్న దేవుని దగ్గర నుండి దిగి రావడం చూశాను.
3 అప్పుడు పరలోకంలో నుండి ఒక గొప్ప స్వరం, “చూడండి, దేవుని నివాసం మనుషులతో ఉంది. ఆయన వారితో కలసి జీవిస్తాడు. వారు ఆయన ప్రజలై ఉంటారు. దేవుడు తానే వారితో ఉంటాడు. వారికి దేవుడై ఉంటాడు. 4 ఆయన వారి కన్నుల నుండి ప్రతి కన్నీటి బొట్టునూ తుడుస్తాడు. ఇక మరణం గానీ, వేదన పడడం గానీ, ఏడుపు గానీ బాధ గానీ ఉండవు. మొదటి సంగతులు గతించి పోయాయి” అని చెబుతుండగా విన్నాను.
ఈ ఆనందంలో పాలుపొందమని క్రీస్తు అందరినీ ఆహ్వానిస్తాడు
ఈ చిత్రణ నిశ్చయమైనదని, సత్యమైనదని క్రీస్తు ప్రకటించి, ఈ ఆనందంలో పాలుపొందమని ప్రజలందరినీ ఆహ్వానిస్తాడు.
యోహాను రాసిన ప్రకటన గ్రంథం 21:5–8
5 అప్పుడు సింహాసనంపై కూర్చున్న ఆయన, “చూడండి, అన్నిటినీ కొత్తవిగా చేస్తున్నాను” అన్నాడు, “ఈ మాటలు సత్యమైనవీ, నమ్మదగినవీ కాబట్టి రాయి” అని నాతో అన్నాడు. 6 ఆయన ఇంకా నాతో ఇలా అన్నాడు, “ఈ విషయాలన్నీ సమాప్తం అయ్యాయి. ఆల్ఫా, ఒమేగా నేనే. అంటే ఆదీ అంతమూ నేనే. దాహం వేసిన వాడికి జీవ జలాల ఊట నుండి నీరు ఉచితంగా ఇస్తాను. 7 జయించేవాడు వీటిని పొందుతాడు. నేను అతనికి దేవుడిగా ఉంటాను. అతడు నాకు కుమారుడిగా ఉంటాడు.
8 పిరికివారూ, అవిశ్వాసులూ, అసహ్యులూ, నరహంతకులూ, వ్యభిచారులూ, మాంత్రికులూ, విగ్రహారాధకులూ, అబద్ధికులందరూ అగ్ని గంధకాలతో మండే సరస్సులో పడతారు. ఇది రెండవ మరణం.