కొత్త యెరూషలేము, ఒక కొత్త పరమ నివాసం

మానవాళి అంతటి నుండి సమకూర్చబడిన పరలోక సంఘ ఆత్మీయ ఆనందం కొత్త యెరూషలేము, మరొక పరమ నివాసం అనే చిహ్నాల ద్వారా ఇంకా చిత్రించబడింది, ఇవి గత రెండు యుగ వ్యవస్థల కింద పరలోక స్థితికి సుపరిచితమైన సాదృశ్యాలు.

క్రీ.శ. 96

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

యోహాను రాసిన ప్రకటన గ్రంథం 21:9–22:9

9 అప్పుడు ఆ చివరి ఏడు కీడులతో నిండిన ఏడు పాత్రలను పట్టుకుని ఉన్న ఏడుగురు దేవదూతల్లో ఒకడు నా దగ్గరికి వచ్చాడు. “ఇలా రా, పెళ్ళి కూతురిని అంటే గొర్రె పిల్ల భార్యను నీకు చూపిస్తాను” అన్నాడు.

10 ఆత్మ స్వాధీనంలో ఉన్న నన్ను ఎత్తయిన గొప్ప పర్వతం పైకి తీసుకు వెళ్ళాడు. అక్కడ యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణం పరలోకంలోని దేవుని దగ్గర నుండి రావడం నాకు చూపించాడు. 11 యెరూషలేము దేవుని మహిమ కలిగి ఉంది. అది ప్రశస్తమైన సూర్యకాంతం రాయిలా స్ఫటికంలా ధగ ధగా మెరుస్తూ ఉంది. 12 ఆ పట్టణానికి ఎత్తయిన ప్రహరీ గోడా, ఆ ప్రహరీ గోడకు పన్నెండు ద్వారాలూ ఉన్నాయి. ఆ ద్వారాల దగ్గర పన్నెండు మంది దేవదూతలున్నారు. ఇశ్రాయేలు వారి పన్నెండు గోత్రాల పేర్లూ ఆ ద్వారాలపై రాసి ఉన్నాయి. 13 తూర్పున మూడు ద్వారాలూ, ఉత్తరాన మూడు ద్వారాలూ, దక్షిణాన మూడు ద్వారాలూ, పశ్చిమాన మూడు ద్వారాలూ ఉన్నాయి. 14 ఆ పట్టణపు ప్రహరీ గోడకు పన్నెండు పునాదులున్నాయి. ఆ పునాదులపై పన్నెండు మంది గొర్రెపిల్ల అపొస్తలుల పేర్లు కనిపిస్తున్నాయి.

15 నాతో మాట్లాడే దూత దగ్గర ఆ పట్టణాన్నీ, దాని ద్వారాలనూ, ప్రహరీ గోడనూ కొలవడానికి ఒక బంగారు కొలబద్ద ఉంది. 16 ఆ పట్టణం చతురస్రాకారంగా ఉంది. దాని పొడుగు దాని వెడల్పుతో సమానం. అతడు ఆ కొలబద్దతో పట్టణాన్ని కొలిస్తే దాని కొలత సుమారు రెండు వేల రెండు వందల కిలో మీటర్లు ఉంది. దాని పొడుగూ, వెడల్పూ, ఎత్తూ అన్నీ సమానమే. 17 తరువాత అతడు ప్రహరీ గోడను కొలిచాడు. అది మనుషుల లెక్క ప్రకారం నూట నలభై నాలుగు మూరలుంది. ఆ కొలత దూత వేసిన కొలతే.

18 ఆ పట్టణపు ప్రహరీ గోడను సూర్యకాంత మణులతో కట్టారు. పట్టణం చూస్తే నిర్మలమైన స్ఫటికం లాంటి మేలిమి బంగారంతో కట్టి ఉంది. 19 ఆ పట్టణపు ప్రహరీ గోడ పునాదులు ప్రశస్తమైన రకరకాల విలువైన రాళ్ళతో అలంకరించారు. మొదటి పునాది సూర్యకాంతం, రెండవది ఇంద్ర నీలం, మూడోది యమునారాయి, నాలుగోది పచ్చ, 20 అయిదోది వైఢూర్యం, ఆరోది కెంపు, ఏడోది సువర్ణ రత్నం, ఎనిమిదోది గోమేధికం, తొమ్మిదోది పుష్యరాగం, పదోది సువర్ణలశునీయం, పదకొండోది పద్మరాగం, పన్నెండోది పద్మరాగం.

21 దాని పన్నెండు ద్వారాలూ పన్నెండు ముత్యాలు. ఒక్కో ద్వారాన్నీ ఒక్కో ముత్యంతో కట్టారు. పట్టణపు రాజవీధి స్వచ్ఛమైన స్ఫటికం లాంటి మేలిమి బంగారం.

22 అక్కడ ఎలాంటి దేవాలయమూ నాకు కనిపించలేదు. ఎందుకంటే సర్వశక్తిశాలి, ప్రభువు అయిన దేవుడూ, గొర్రెపిల్లా దానికి దేవాలయంగా ఉన్నారు.

23 ఆ పట్టణంలో వెలుగివ్వడానికి సూర్యుడూ చంద్రుడూ అక్కరలేదు. దేవుని యశస్సు అక్కడ ప్రకాశిస్తూ ఉంటుంది. గొర్రెపిల్ల దాని దీపం. 24 వివిధ జాతి ప్రజలు ఆ వెలుగులో తిరుగుతారు. భూరాజులు తమ వైభవాన్ని దానిలోకి తెస్తారు.

25 రోజంతా దాని ద్వారాలు మూయరు. ఎందుకంటే అక్కడ రాత్రి లేదు. 26 వివిధ జాతి ప్రజలు తమ వైభవాన్నీ గౌరవాన్నీ దానిలోకి తెస్తారు. 27 పవిత్రం కానిదేదీ దానిలో ప్రవేశించదు. అవమానకరమైన దానినీ, మోసకరమైన దానినీ చేసినవారు దానిలో కచ్చితంగా ప్రవేశించరు. గొర్రెపిల్ల జీవ గ్రంథంలో పేర్లున్నవారు మాత్రమే దానిలో ప్రవేశిస్తారు.

22:1 అప్పుడు జీవజలనదిని ఆ దూత నాకు చూపించాడు. అది స్ఫటికంలా నిర్మలంగా మెరుస్తూ ఉంది. అది దేవునిదీ గొర్రెపిల్లదీ అయిన సింహాసనం నుండీ, 2 ఆ పట్టణం ప్రధాన వీధి మధ్యలో నుండి ప్రవహిస్తుంది. ఆ నదికి రెండు పక్కలా జీవ వృక్షం ఉంది. అది నెల నెలా ఫలిస్తూ, పన్నెండు రకాల పండ్లు కాస్తుంది. ఆ చెట్టు ఆకులు జనాల స్వస్థత కోసం ఉపయోగపడతాయి.

3 అక్కడ ఇక శాపం అనేది ఉండదు. దేవునిదీ గొర్రెపిల్లదీ అయిన సింహాసనం అక్కడ ఉంటుంది. ఆయన సేవకులు ఆయనకు సేవ చేస్తారు. 4 ఆయన ముఖాన్ని చూస్తారు. ఆయన పేరు వారి నొసళ్ళపై ఉంటుంది. 5 రాత్రి ఇక ఎప్పటికీ కలగదు. దీపాల కాంతీ, సూర్యుడి వెలుగూ వారికి అక్కర లేదు. దేవుడైన ప్రభువే వెలుగై వారిమీద ప్రకాశిస్తూ ఉంటాడు. వారు కలకాలం పరిపాలిస్తారు.

6 ఆ దూత నాతో ఇలా చెప్పాడు, “ఈ మాటలు నమ్మదగ్గవి, సత్యమైనవి. ప్రవక్తల ఆత్మలకు దేవుడైన ప్రభువు త్వరలో జరగాల్సిన వాటిని తన దాసులకు చూపించడానికి తన దూతను పంపాడు.” 7 “చూడండి! నేను త్వరగా వస్తున్నాను. ఈ పుస్తకంలోని ప్రవచనవాక్కులను స్వీకరించేవాడు ధన్యుడు.”

8 యోహాను అనే నేను ఈ సంగతులన్నీ విన్నాను, చూశాను. అలా నేను వింటూ చూస్తూ ఉన్నప్పుడు వాటిని నాకు చూపిస్తున్న దూతను పూజించడానికి అతని ఎదుట సాష్టాంగపడ్డాను. 9 అప్పుడు అతడు, “అలా చెయ్యకు. నేను నీకూ, నీ సోదరులకూ, ప్రవక్తలకూ, ఈ పుస్తకంలో మాటలను పాటించే వారందరికీ తోటి సేవకుణ్ణి. దేవుణ్ణి పూజించు” అని చెప్పాడు.

ప్రవచనాలకు ముద్ర వేయకూడదు

ప్రకటన గ్రంథంలోని ప్రవచనాలు మానవజాతి అంతటికీ జ్ఞానాన్ని, అభివృద్ధిని కలిగించడానికి ఉద్దేశించబడ్డాయి కాబట్టి వాటికి ముద్ర వేయకూడదని క్రీస్తు ప్రకటిస్తాడు.

యోహాను రాసిన ప్రకటన గ్రంథం 22:10–15

10 అతడు నాతో ఇంకా ఇలా చెప్పాడు, “ఈ పుస్తకంలో ఉన్న ప్రవచన వాక్కులను మూసి ముద్ర వేయవద్దు. ఎందుకంటే సమయం దగ్గర పడింది. 11 అన్యాయం చేసేవాణ్ణి అన్యాయం చేస్తూనే ఉండనియ్యి. అపవిత్రుణ్ణి ఇంకా అపవిత్రుడిగానే ఉండనియ్యి. నీతిమంతుణ్ణి ఇంకా నీతిమంతుడిగానే ఉండనియ్యి. పరిశుద్ధుణ్ణి ఇంకా పరిశుద్ధుడిగా ఉండనియ్యి.

12 “చూడండి, నేను త్వరగా వస్తున్నాను. ప్రతి వ్యక్తికీ తాను చేసిన పనుల ప్రకారం నేనివ్వబోయే ప్రతిఫలం నా దగ్గర ఉంది.

13 ఆల్ఫా, ఓమెగా నేనే. మొదటి వాణ్ణి, చివరి వాణ్ణి నేనే. ప్రారంభాన్నీ ముగింపునీ నేనే.

14 జీవ వృక్ష ఫలాన్ని ఆరగించడానికీ, ఆ పట్టణ ద్వారాల నుండి లోపలికి ప్రవేశించడానికీ యోగ్యులు అయ్యేందుకై తమ వస్త్రాలను ఉతుక్కునే వారు దీవెన పొందిన వారు.

15 పట్టణం బయట కుక్కలూ, మాంత్రికులూ, వ్యభిచారులూ, హంతకులూ, విగ్రహ పూజ చేసేవారూ, అబద్ధాన్ని ప్రేమించి అభ్యాసం చేసేవారూ ఉంటారు.

ప్రపంచానికి క్రీస్తు చివరి విజ్ఞప్తి

క్రీస్తు ఇప్పుడు ప్రవచన ఆత్మ ద్వారా లోకానికి తన చివరి విజ్ఞప్తి చేస్తాడు. తన దైవత్వాన్నీ మానవత్వాన్నీ ఆయన మళ్ళీ ప్రకటిస్తాడు, మానవాళి అంతటినీ క్రైస్తవ సంఘంలోకి ఆహ్వానిస్తాడు, లేఖనాలను తమ మార్గదర్శిగా చేసుకోమని వారికి ఆజ్ఞాపిస్తాడు, తన పునరాగమనాన్ని ప్రకటిస్తాడు.

యోహాను రాసిన ప్రకటన గ్రంథం 22:16–20

16 యేసు అనే నేను సంఘాలకు చెప్పడం కోసం ఈ విషయాలను మీకు తెలియజేయడానికి నా దూతను పంపించాను. నేనే దావీదు వేరునూ సంతానాన్నీ ప్రకాశవంతమైన వేకువ నక్షత్రాన్నీ.

17 “రా” అంటూ ఆత్మా, పెళ్ళికూతురూ చెబుతున్నారు. వింటున్నవాడూ, “రా” అని చెప్పాలి. దాహం వేసిన వాడు రావాలి. ఇష్టమున్న వ్యక్తి జీవ జలాన్ని ఉచితంగా తీసుకోవచ్చు.”

18 ఈ పుస్తకంలోని ప్రవచనవాక్కులను వినే ప్రతి వ్యక్తినీ నేను హెచ్చరించేది ఏమిటంటే ఎవడైనా వీటిలో ఏదైనా కలిపితే దేవుడు ఈ పుస్తకంలో రాసి ఉన్న కీడులన్నీ వాడికి కలగజేస్తాడు. 19 ఎవడైనా దేనినైనా తీసి వేస్తే దేవుడు ఈ పుస్తకంలో వివరించిన జీవ వృక్షంలోనూ, పరిశుద్ధ పట్టణంలోనూ వాడికి భాగం లేకుండా చేస్తాడు.

20 ఈ సంగతులను గురించి సాక్షమిస్తున్న వాడు, “అవును, త్వరగా వస్తున్నాను” అని అంటున్నాడు.

ఆమేన్‌! ప్రభు యేసూ, త్వరగా రా.

క్రీస్తు రాక కోసం యోహాను ఆరాటపడతాడు

క్రీస్తు రాక కోసం తీవ్రమైన ఆరాటంతో, సంఘాలపై ఆశీర్వాదం కోసం ప్రార్థనతో యోహాను ప్రకటన గ్రంథాన్ని ముగిస్తాడు.

యోహాను రాసిన ప్రకటన గ్రంథం 22:21

21 ప్రభు యేసు కృప పరిశుద్ధులందరికీ తోడై ఉండుగాక. ఆమేన్‌.