ఏడవ పాత్ర: హర్ మెగిద్దోన్ యుద్ధం
ఏడవ పాత్ర కుమ్మరించబడుతుంది. 1260 సంవత్సరాలు ఇప్పుడు గడిచిపోయాయి. ప్రాచీన ప్రవక్తలు ఎంతో కాలంగా ముందే చెప్పిన దేవుని ఉగ్రత అనే ద్రాక్ష కోత ఇప్పుడు భూమిపై గొప్ప కల్లోలాలతో, దీర్ఘ యుద్ధాలతో ఆరంభమవుతుంది. మంచికీ చెడుకూ మధ్య సాగిన సుదీర్ఘ పోరాటం ఇప్పుడు తేలిపోతుంది. పోపు వ్యవస్థ, అవిశ్వాసం అనే అబద్ధ మతాలు సంఘంలో మిగిలినవారికి వ్యతిరేకంగా, చాలా కాలం క్రితమే తమకు వాగ్దానమైన పునరుద్ధరణ కోసం సమకూడే యూదులకు వ్యతిరేకంగా, గొప్ప సముద్ర తీర దేశానికి, చాలా మటుకు ఇంగ్లాండుకు (యెషయా 17:18) వ్యతిరేకంగా ఏకమవుతాయి, చివరికి హర్ మెగిద్దోన్ యుద్ధం ఇప్పుడు పాలస్తీనాలో జరుగుతుంది. ఈ పాత్ర కాలంలో చాలా సంవత్సరాలు ఇమిడి ఉండే అవకాశం ఉంది.
క్రీ.శ. 96
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
యోహాను రాసిన ప్రకటన గ్రంథం 16:17–21
17 ఏడవ దూత తన పాత్రను గాలిలో కుమ్మరించాడు. అప్పుడు అతి పరిశుద్ధ స్థలం నుండీ సింహాసనం నుండీ, “ఇక అయిపోయింది” అని ఒక పెద్ద శబ్దం వినిపించింది. 18 అప్పుడు వివిధ శబ్దాలూ, మెరుపులూ, భారీ ఉరుములూ కలిగాయి. భయంకరమైన భూకంపం వచ్చింది. మనుషుల సృష్టి జరిగిన దగ్గర్నుండీ అలాంటి భూకంపం కలగలేదు. అంత పెద్ద భూకంపం అది.
19 ప్రసిద్ధమైన ఆ మహా నగరం మూడు భాగాలుగా చీలిపోయింది. దేశాల్లోని నగరాలన్నీ నాశనమయ్యాయి. అప్పుడు దేవుడు మహా బబులోను నగరాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. తన తీవ్ర ఆగ్రహం అనే మద్యంతో నిండిన పాత్రను ఆ నగరానికిచ్చాడు. 20 ప్రతి ద్వీపమూ అదృశ్యమైపోయింది. ప్రతి పర్వతం కనిపించకుండా పోయింది. 21 ఆకాశం నుండి మనుషుల మీద సుమారు నలభై ఐదు కిలోల బరువున్న భీకరమైన వడగళ్ళు పడ్డాయి. ఆ వడగళ్ళ దెబ్బ భయంకరంగా ఉంది కాబట్టి మనుషులు దేవుణ్ణి దూషించారు.
పతనానికి ముందు పోపు వ్యవస్థ
ఈ గొప్ప సంఘటనల గురించి సాధారణ ప్రకటన తరువాత, పోపు వ్యవస్థ అంతిమంగా కూలిపోవడానికి ముందున్న దాని చరిత్ర, స్థితి ప్రవక్తకు చూపించబడతాయి.
1 ఏడు పాత్రలు చేతబట్టుకున్న ఏడుగురు దేవదూతల్లో ఒకడు వచ్చి నాతో, “అనేక జలాలపై కూర్చున్న మహావేశ్యకు శిక్ష విధించడాన్ని నీకు చూపిస్తాను రా. 2 భూమిపై రాజులు ఆమెతో వ్యభిచారం చేశారు. భూమిపై నివసించే వారు ఆమె లైంగిక విశృంఖలత అనే మద్యాన్ని తాగి మత్తులో మునిగారు” అన్నాడు.
3 అప్పుడు నేను ఆత్మ స్వాధీనంలోకి వెళ్ళాను. ఆ దూత నన్ను ఒక అరణ్యంలోకి తీసుకు వెళ్ళాడు. అక్కడ నేను ఒక స్త్రీని చూశాను. ఆమె ఒక ఎర్రని మృగం మీద కూర్చుని ఉంది. ఆ మృగానికి ఏడు తలలూ పది కొమ్ములూ ఉన్నాయి. దాని ఒళ్ళంతా దేవ దూషణ పేర్లు రాసి ఉన్నాయి. 4 ఆ స్త్రీ ఊదారంగు, ఎర్ర రంగు వస్త్రాలు కట్టుకుని ఉంది, బంగారంతో, రత్నాలతో, ముత్యాలతో అలంకరించుకుంది. ఆమె చేతిలో ఒక బంగారు పాత్ర ఉంది. ఆ పాత్రలో తాను చేస్తున్న అతి జుగుప్సాకరమైన పనులూ, లైంగిక అవినీతికి సంబంధించిన అపవిత్రకార్యాలూ ఉన్నాయి. 5 ఆమె నుదుటి మీద ఆమె పేరు ఇలా రాసి ఉంది. దానికో రహస్యమైన అర్థం ఉంది. “ఇది మహా బబులోను. భూమి మీద ఉన్న వేశ్యలందరికీ, ఏహ్యమైన వాటికీ ఇది తల్లి.”
6 ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తాన్నీ, యేసు హతసాక్షుల రక్తాన్నీ తాగి మత్తెక్కి ఉండడం చూశాను. అది చూసి నేను ఆశ్చర్యపోయాను. 7 అప్పుడు ఆ దూత నాతో ఇలా అన్నాడు, “నువ్వెందుకు ఆశ్చర్యపడ్డావు? ఈమెకు సంబంధించిన రహస్యాన్నీ, ఏడు తలలూ పది కొమ్ములూ ఉండి ఈ స్త్రీని మోస్తున్న క్రూరమృగానికి సంబంధించిన రహస్యాన్నీ నీకు తెలుపుతాను.
8 నువ్వు చూసిన ఆ మృగం పూర్వం ఉంది కానీ ఇప్పుడు లేదు. కానీ అది లోతైన అగాధంలో నుండి పైకి రావడానికి సిద్ధంగా ఉంది. తరవాత అది నాశనానికి పోతుంది. ఒకప్పుడు ఉండి, ఇప్పుడు లేని, ముందు రాబోయే మృగాన్ని చూసి భూమిమీద నివసించేవారు, అంటే సృష్టి ప్రారంభం నుండీ దేవుని జీవ గ్రంథంలో తమ పేర్లు లేని వారు ఆశ్చర్యపోతారు. 9 దీనికి జ్ఞానం కలిగిన మనసు అవసరం. ఆ మృగానికున్న ఏడు తలలు ఆ స్త్రీ కూర్చున్న ఏడు కొండలు.
ఇంకా వారు ఏడుగురు రాజులు. 10 వారిలో ఐదుగురు నాశనమయ్యారు. ప్రస్తుతం ఒకడున్నాడు. చివరి వాడు ఇంకా రాలేదు. వాడు వచ్చినప్పుడు కొంత కాలం ఉండాలి. 11 ఒకప్పుడు ఉండి ఇప్పుడు లేనిది అయిన ఈ క్రూరమృగం ఆ ఏడుగురిలో ఒకడు. కానీ ఎనిమిదవ రాజు కూడా వాడే. నాశనానికి పోయేదీ వాడే.
12 నీకు కనిపించిన ఆ పది కొమ్ములూ పదిమంది రాజులు. వారికి ఇంతకు ముందు రాజ్యం లేదు. కానీ క్రూరమృగం ఏలేటప్పుడు వారు ఒక గంటసేపు రాజుల్లా అధికారం చలాయిస్తారు. 13 వీరికి ఒకే ఉద్దేశం ఉంటుంది. వీళ్ళు తమ శక్తినీ అధికారాన్నీ మృగానికి అంకితం చేస్తారు.
14 వీళ్ళు గొర్రెపిల్లతో యుద్ధం చేస్తారు కానీ ఆయన వారిని ఓడిస్తాడు. ఎందుకంటే గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు. ఆయనతో ఉన్నవారు పిలుపునందుకున్న వారు, ఎన్నిక అయినవారు, నమ్మకమైన వారు.”
15 ఆ దూత ఇంకా నాతో ఇలా చెప్పాడు, “ఆ వేశ్య కూర్చున్నచోట నువ్వు చూసిన జలాలు ప్రజలనూ, జన సమూహాలనూ, జాతులనూ, వివిధ భాషలు మాట్లాడే వారినీ సూచిస్తాయి. 16 నువ్వు చూసిన పది కొమ్ములు-వారూ ఆ మృగమూ ఆ వేశ్యను ద్వేషిస్తారు. ఆమె బట్టలూడదీసి దిక్కుమాలిన దాన్నిగా చేస్తారు. ఆమె మాంసాన్ని తింటారు. మంటల్లో ఆమెను కాల్చివేస్తారు.
17 దేవుని మాటలు నెరవేరే వరకూ వారు తమ హృదయాల్లో ఏకీభవించి తమ రాజ్యాన్ని ఆ మృగానికి అప్పగించడం ద్వారా తన సంకల్పం కొనసాగించేలా దేవుడు వారికి ఆ మనసు పుట్టించాడు. 18 ఇక నువ్వు చూసిన ఆ స్త్రీ భూమిపై రాజులను పరిపాలిస్తున్న మహా నగరమే.
పోపు వ్యవస్థ, మతరాహిత్యం యొక్క పతనం
పోపు వ్యవస్థ, మతరాహిత్యం యొక్క పతనం విస్తారంగా వర్ణించబడింది.
1 ఆ తరవాత పరలోకం నుండి మరో దూత దిగి రావడం చూశాను. అతనికి గొప్ప అధికారం ఉంది. అతనికున్న యశస్సు చేత భూమి అంతా ప్రకాశించింది.
2 అతడు గొప్ప స్వరంతో బిగ్గరగా ఇలా అన్నాడు.
“బబులోను నాశనమైంది! బబులోను నాశనమైంది! అది దయ్యాలకు నివాసమైంది.
ప్రతి అపవిత్రాత్మకూ ఉనికిపట్టు అయింది. అపవిత్రమూ అసహ్యమూ అయిన ప్రతి పక్షికీ గూడు అయింది.
3 ఎందుకంటే దేవుని కోపాన్ని తెచ్చే దాని లైంగిక విశృంఖలతా మద్యాన్ని జనమంతా తాగి మత్తెక్కి పడిపోయారు.
భూమి మీద రాజులు ఆమెతో వ్యభిచారం చేశారు. లోకంలో వ్యాపారులు ఆమె అధిక సుఖభోగాల ప్రభావం వల్ల సంపన్నులయ్యారు.”
4 తరువాత మరో స్వరం పరలోకం నుండి వినిపించింది. ఆ స్వరం ఇలా చెప్పింది.
“నా ప్రజలారా, మీరు ఆమె పాపాల్లో భాగం పంచుకోకుండా, ఆమెకు సంభవించబోయే కీడుల్లో ఏదీ మీకు సంభవించకుండా ఆమెను విడిచి వచ్చెయ్యండి.
5 ఆమె పాపాలు ఆకాశాన్నంటుతున్నాయి.
దేవుడు ఆమె నేరాలన్నిటినీ జ్ఞాపకం చేసుకున్నాడు.
6 ఆమె చెల్లించిన ప్రకారం ఆమెకు చెల్లించండి.
ఆమె చేసిన దానికి ఆమెకు రెట్టింపు చేయండి.
ఆమె కలిపిన పాత్రలోనే ఆమె కోసం రెండొంతులు కలపండి.
7 ఆమె తనను తాను హెచ్చించుకుంది. విలాస భోగాల్లో జీవించింది.
అంతే మొత్తంలో ఆమెకు హింసనూ, వేదననూ కలగజేయండి.
ఎందుకంటే ఆమె తన మనసులో, “నేను రాణిగా కూర్చుండేదాన్ని, విధవను కాను.
సంతాపం చూడనే చూడను” అనుకుంది.
8 కాబట్టి ఆమెకి కీడులన్నీ ఒక్క రోజే కలుగుతాయి. మరణమూ, దుఖమూ, కరువూ వస్తాయి.
దేవుడైన ప్రభువు మహా శక్తిశాలి. ఆమెకు తీర్పు చెప్పేది ఆయనే. ఆమె అగ్నికి ఆహుతైపోతుంది.”
9-10 ఆమెతో అక్రమ లైంగిక సంబంధాలు పెట్టుకుని సుఖభోగాలు అనుభవించిన భూరాజులు అందరూ ఆమెకు కలుగుతున్న వేదన చూసి భయంతో దూరంగా నిలబడతారు. ఆమె తగలబడి పోతుంటే వచ్చే పొగను చూస్తూ రోదిస్తారు.
“అయ్యో, అయ్యో, బబులోను మహానగరమా,
శక్తివంతమైన నగరమా, ఒక్క గంటలోనే నీ మీదికి శిక్ష వచ్చి పడిందా” అంటూ ఏడుస్తారు.
11 లోకంలోని వ్యాపారులు కూడా ఆ నగరాన్ని చూసి విలపిస్తారు. ఎందుకంటే, ఇక మీదట తమ వస్తువులు కొనేవారు ఎవ్వరూ ఉండరు. 12 వారి సరుకులు ఏవంటే బంగారం, వెండి, రత్నాలు, ముత్యాలు, సన్నని నేత బట్టలు, ఊదారంగు బట్టలు, పట్టు బట్టలు, ఎర్రని బట్టలు, ఇంకా పరిమళాన్నిచ్చే విలువగల ప్రతి రకమైన కలప, దంతం, ఎంతో విలువైన చెక్క, ఇత్తడి, ఇనుము, పాల రాళ్ళూ మొదలైన వాటితో చేసిన ఎన్నో రకాల వస్తువులూ 13 దాల్చిన చెక్క, సుగంధ ద్రవ్యాలు, ధూపం కోసం వాడే వస్తువులూ, అత్తరు, సాంబ్రాణి, ద్రాక్షారసం, నూనె, మెత్తని పిండి, గోదుమలు, పశువులు, గొర్రెలు మొదలైనవి. ఇంకా గుర్రాలూ, రథాలూ, బానిసలూ, మనుషుల ప్రాణాలు.
14 “నీ మనస్సు ఆశించిన ఫలం నిన్ను విడిచి పోయింది. నీ విలాసం, వైభోగం మాయమై పోయాయి. అవి ఇక కనపడవు” అని చెబుతూ ఏడుస్తారు. 15 ఆ నగరంలో ఈ వస్తువులతో వ్యాపారం చేసి సంపన్నులైన వ్యాపారులు ఆమె వేదన చూసి భయంతో దూరంగా నిలిచి ఏడుస్తూ గట్టిగా రోదిస్తారు. 16 “సన్నని నేత బట్టలు, ఊదారంగు, ఎర్రని బట్టలు కట్టుకుని బంగారంతో, రత్నాలతో, వెల గల నగలతో, ముత్యాలతో అలంకరించుకున్న మహా నగరమా, అయ్యో, అయ్యో, ఇంత ఐశ్వర్యమూ ఒక్క గంటలోనే మాయమైపోయిందే!” అంటారు.
17 ప్రతి నౌకాధిపతి, సముద్ర యాత్రికులు, ఓడ నావికులు, ఇలా సముద్రం మీద ఆధారపడి బతికే వారంతా దూరంగా నిలబడి 18 నగరం తగలబడి పోతుంటే రాజుకున్న పొగను చూసి, “ఈ మహా నగరానికి సమానమైనదేది?” అంటూ కేకలు పెడతారు. 19 తమ తలల మీద దుమ్ము చల్లుకుని ఏడుస్తూ రోదిస్తూ, “అయ్యో, అయ్యో, ఆ మహా నగరం. సొంత నౌకలు ఉన్న వారంతా ఈ నగరంలోని సంపద వల్ల ధనవంతులయ్యారు. అలాటిది ఒక్క గంటలోనే ఇలా నాశనమయిందే” అంటారు.
20 “పరలోకమా, పరిశుద్ధులారా, అపొస్తలులారా, ప్రవక్తలారా, ఆమెను గురించి సంతోషించండి. ఎందుకంటే అది మిమ్మల్ని శిక్షించిన దానికి ప్రతిగా దేవుడు ఆమెను శిక్షించాడు.”
21 ఆ తరువాత బలవంతుడైన ఒక దూత పెద్ద తిరగలి రాయి వంటి రాయి ఎత్తి సముద్రంలో పడవేసి ఇలా అన్నాడు, “ఇలాగే మహా నగరమైన బబులోను కూడా హింసల పాలై కూలిపోతుంది. ఇక అది ఎన్నటికీ కనిపించదు. 22 కాబట్టి తీగ వాయిద్యాల శబ్దాలూ, గాయకుల పాటలూ, పిల్లనగ్రోవి, బూరలు ఊదేవారి శబ్దాలూ ఇక ఎన్నటికీ నీ దగ్గర వినిపించవు. ఎలాంటి శిల్పమైనా చెక్కే శిల్పి ఎవరూ నీ దగ్గర ఇక కనపడడు. తిరగలి శబ్దం ఇక ఎప్పటికీ నీ దగ్గర వినపడదు.
23 దీపం వెలుతురు నీలో ఇక కనిపించదు. పెళ్ళి కొడుకు స్వరం, పెళ్ళి కూతురు స్వరం ఇక ఎన్నటికీ నీలో వినపడవు. ఎందుకంటే నీ వర్తకులు ప్రపంచంలో గొప్పవారుగా ఉండేవారు. దేశాలన్నీ నీ మాయలో పడి మోసపోయాయి.” 24 ప్రవక్తల రక్తం, హతసాక్షుల రక్తం, ఇంకా భూమిపై వధ అయిన వారి రక్తం ఆమెలో కనిపిస్తూ ఉంది.