భాగం 2: దేవాలయ నిర్మాణం

క్రీ.పూ. 1011 నుండి 1005 వరకు

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

2 దినవృత్తాంతాలు 3:1

1 తరువాత సొలొమోను యెరూషలేములో తన తండ్రి దావీదుకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు అతడు మోరీయా పర్వతంపై సిద్ధం చేసిన స్థలం లో ఒర్నాను అనే యెబూసీయుడికి చెందిన కళ్ళంలో యెహోవా మందిరం కట్టించడం మొదలుపెట్టాడు.

1 రాజులు 6:1

1 ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుండి బయలుదేరి వచ్చిన 480 వ సంవత్సరంలో, అంటే సొలొమోను పాలనలో నాలుగో సంవత్సరం, జీప్‌ అనే రెండో నెలలో అతడు యెహోవా మందిర నిర్మాణం ప్రారంభించాడు.

2 దినవృత్తాంతాలు 3:2–9

2 అతడు తన పాలనలో నాలుగో సంవత్సరం, రెండో నెల, రెండో రోజున దాన్ని ప్రారంభించాడు. 3 దేవుని మందిరానికి పునాదులు వేయించాడు. గతంలో ఉన్న కొలతల ప్రకారం దాని పొడవు అరవై మూరలు, వెడల్పు ఇరవై మూరలు. 4 మందిరం ముఖమంటపం వెడల్పు, పొడవు, ఎత్తు ఇరవై మూరలు. మూరలు. దాని లోపలి భాగాన్ని అతడు మేలిమి బంగారంతో పొదిగించాడు.

5 మందిరం లోపలి పెద్ద గది పై కప్పును దేవదారు పలకలతో కప్పి వాటి పైన మేలిమి బంగారం పొదిగించి పై భాగంలో ఖర్జూరపు చెట్లు, గొలుసుల్లాంటి నగిషీ చెక్కించాడు. 6 ఆ మందిరాన్ని ప్రశస్తమైన రత్నాలతో అలంకరించాడు. దానికి వాడిన బంగారం పర్వాయీము నుండి వచ్చింది. 7 మందిరం దూలాలనూ స్తంభాలనూ గోడలనూ తలుపులనూ బంగారంతో పొదిగించి గోడల మీద కెరూబు ఆకారాలు చెక్కించాడు.

8 దానిలో సొలొమోను అతి పరిశుద్ధ స్థలాన్ని కట్టించాడు. దాని పొడవు మందిరపు వెడల్పును బట్టి ఇరవై మూరలు. దాని వెడల్పు ఇరవై మూరలు. ఇరవై వేల కిలోల మేలిమి బంగారంతో అతడు దాన్ని పొదిగించాడు. 9 ఒక్కొక్క మేకు బరువు ఏభై తులాల బంగారం. గది పై భాగాలను అతడు బంగారంతో పొదిగించాడు.

1 రాజులు 6:4–8

4 అతడు మందిరానికి నగిషీ పని చేసిన అల్లిక కిటికీలు చేయించాడు.

5 మందిరం గోడ చుట్టూ గదులు కట్టించాడు. మందిరం గోడలకు పరిశుద్ధ స్థలం బయటి గోడల వరకూ ఆ గదులు గర్భాలయానికి చుట్టూ నాలుగు వైపులా అతడు కట్టించాడు. 6 కింది అంతస్తు గది 5 మూరల వెడల్పు, మధ్య అంతస్తు గది 6 మూరల వెడల్పు, మూడవ అంతస్తు గది 7 మూరల వెడల్పు. ఎలా అంటే దూలాలు మందిరం గోడ లోపల ఆనకుండా మందిరం గోడ చుట్టూ బయటి వైపున చిమ్ము రాళ్లు ఉంచారు.

7 అయితే మందిరం కట్టే సమయంలో ముందుగా సిద్ధపరచి తెచ్చిన రాళ్లతో కట్టారు. మందిరం కట్టే స్థలం లో సుత్తె, గొడ్డలి మొదలైన ఇనప పనిముట్ల శబ్దం ఎంత మాత్రం వినబడలేదు. 8 మందిరం కుడి పక్కన మధ్య అంతస్తుకు తలుపు ఉంది. మధ్య అంతస్తు గదికీ మధ్య అంతస్తు గదిలో నుండి మూడవ అంతస్తు గదికీ ఎక్కి వెళ్ళడానికి చుట్టూ మెట్ల చట్రాలున్నాయి.

1 రాజులు 6:15–28

15 అతడు మందిరం లోపలి గోడలను దేవదారు పలకలతో కట్టించాడు. అడుగు నుండి పైకప్పు వరకూ గోడలను దేవదారు పలకలతో కప్పించాడు. మందిరం నేలను సరళ మాను పలకలతో కప్పించాడు. 16 మందిరం పక్కలను కింది నుండి గోడల పై భాగం వరకూ దేవదారు పలకలతో 20 మూరల ఎత్తు కట్టించాడు. అతడు దాన్ని గర్భాలయం కోసం, అంటే అతి పరిశుద్ధ స్థలం కోసం కట్టించాడు. 17 అయితే దాని ఎదుట ఉన్న పరిశుద్ధ స్థలం పొడవు 40 మూరలు.

18 మందిరం లోపల ఉన్న దేవదారు పలకల మీద గుబ్బలు, వికసించిన పువ్వులు చెక్కి ఉన్నాయి. అంతా దేవదారు కర్ర పనే, రాయి ఒక్కటి కూడా కనిపించ లేదు. 19 యెహోవా నిబంధన మందసాన్ని ఉంచడానికి మందిరం లోపల అతి పరిశుద్ధ స్థలాన్ని సిద్ధపరిచాడు. 20 అతి పరిశుద్ధ స్థలం లోపల 20 మూరల పొడవు, 20 మూరల వెడల్పు, 20 మూరల ఎత్తు ఉంది. దీన్ని మేలిమి బంగారంతో పొదిగించాడు. దేవదారు చెక్కతో చేసిన బలిపీఠాన్ని కూడా ఇదే విధంగా పొదిగించాడు.

21 ఈ విధంగా సొలొమోను మందిరం లోపల అంతా మేలిమి బంగారంతో పొదిగించి అతి పరిశుద్ధ స్థలం ఎదుట బంగారు గొలుసులు ఉన్న తెర చేయించి బంగారంతో దాన్ని పొదిగించాడు. 22 ఏ భాగాన్నీ విడిచి పెట్టకుండా మందిరమంతా బంగారంతో పొదిగించాడు. అతి పరిశుద్ధ స్థలం దగ్గర ఉన్న బలిపీఠాన్ని బంగారంతో పొదిగించాడు.

23 అతడు అతి పరిశుద్ధ స్థలం లో 10 మూరల ఎత్తున్న రెండు కెరూబులను ఒలీవ కర్రతో చేయించాడు. 24 ఒక్కొక్క కెరూబుకు 5 మూరల పొడవైన రెక్కలున్నాయి. ఒక రెక్క చివరి నుండి రెండవ రెక్క చివరి వరకూ 10 మూరలు పొడవు. 25 రెండవ కెరూబు రెక్కలు కూడా 10 మూరలు ఉంది. కెరూబులు రెండింటికీ ఒకే కొలతలు, ఒకే ఆకారం ఉన్నాయి. 26 ఒక కెరూబు 10 మూరల ఎత్తు, రెండవ కెరూబు కూడా అంతే ఎత్తు.

27 అతడు ఈ కెరూబులను గర్భాలయంలో ఉంచాడు. ఆ కెరూబుల రెక్కలు పూర్తిగా విప్పుకుని ఒకదాని రెక్క ఇవతలి గోడకీ, రెండవదాని రెక్క అవతలి గోడకీ అంటుకుని ఉన్నాయి. అతి పరిశుద్ధ స్థలం లో వీటి రెక్కలు ఒకదానితో ఒకటి అంటుకుని ఉన్నాయి. 28 ఈ కెరూబులను అతడు బంగారంతో పొదిగించాడు.

2 దినవృత్తాంతాలు 3:13–14

13 ఈ విధంగా ఈ కెరూబులు చాచిన రెక్కలు ఇరవై మూరలు వ్యాపించాయి. ఆ కెరూబులు తమ పాదాల మీద నిలబెట్టి ఉన్నాయి. వారి ముఖాలు మందిరం ప్రధాన గది వైపుకు తిరిగి ఉన్నాయి.

14 అతడు నీలి, ఊదా, ఎరుపు, సన్నని నార నూలుతో ఒక తెర చేయించి దాని మీద కెరూబు ఆకారాలను కుట్టించాడు.

1 రాజులు 6:29–36

29 మందిరం గోడలన్నిటి మీదా లోపలా బయటా కెరూబు ఆకారాలను, ఖర్జూర చెట్ల ఆకారాలను, వికసించిన పూలను చెక్కించాడు. 30 లోపలి, బయట గదుల్లో మందిరం నేలంతా బంగారంతో పొదిగించాడు.

31 అతి పరిశుద్ధ స్థలం ద్వారానికి ఒలీవకర్రతో తలుపులు చేయించాడు. ద్వారబంధం మీది కమ్మీ, నిలువు కమ్మీల వెడల్పు, గోడ వెడల్పులో ఐదో భాగం ఉన్నాయి. 32 రెండు తలుపులూ ఒలీవ కర్రతో చేసినవి. వాటి మీద కెరూబులు, ఖర్జూర వృక్షాలు, వికసించిన పూవుల ఆకారాలు చెక్కించి వాటిని బంగారంతో పొదిగించాడు. కెరూబుల మీదా ఖర్జూర వృక్షాల మీదా బంగారం పొదిగించాడు. 33 పరిశుద్ధ స్థలం ద్వారానికి ఒలీవ కర్రతో రెండు నిలువు కమ్ములు చేయించాడు. వీటి వెడల్పు గోడ వెడల్పులో నాలుగో వంతు.

34 రెండు తలుపులు దేవదారు కలపతో చేసినవి. ఒక్కొక్క తలుపుకు రెండేసి మడత రెక్కలు ఉన్నాయి. 35 వాటి మీద అతడు కెరూబులనూ ఖర్జూర చెట్లనూ వికసించిన పూవులనూ చెక్కించి వాటి మీద బంగారు రేకు పొదిగించాడు. 36 లోపల ఉన్న పెద్ద గదిని మూడు వరసల చెక్కిన రాళ్లతో, ఒక వరుస దేవదారు దూలాలతో కట్టించాడు.

1 రాజులు 7:13–22

13 సొలొమోను రాజు తూరు పట్టణం నుండి హీరామును పిలిపించాడు. 14 ఇతడు నఫ్తాలి గోత్రానికి చెందిన విధవరాలి కొడుకు. ఇతని తండ్రి తూరు పట్టణానికి చెందిన ఇత్తడి పనివాడు. ఈ హీరాము గొప్ప నైపుణ్యం, జ్ఞానం గలవాడు, ఇత్తడితో చేసే పనులన్నిటిలో బాగా ఆరితేరిన వాడు, అనుభవజ్ఞుడు. అతడు సొలొమోను దగ్గరికి వచ్చి అతని పని అంతా చేశాడు.

15 ఎలాగంటే, అతడు రెండు ఇత్తడి స్తంభాలు పోత పోశాడు. ఒక్కొక్క స్తంభం 18 మూరల పొడవు, 12 మూరల చుట్టు కొలత ఉంది. 16 స్తంభాల మీద ఉంచడానికి ఇత్తడితో రెండు పీటలు పోత పోశాడు. ఒక్కొక్క పీట ఎత్తు 5 మూరలు. 17 స్తంభాల మీద ఉన్న పీటలకి అల్లిన గొలుసులతో వలల వంటి వాటిని చేసారు. గొలుసు పని దండలు పోత పోసి ఉంది. అవి ఒక్కో పీటకి ఏడేసి ఉన్నాయి.

18 ఈ విధంగా అతడు స్తంభాలు చేసి వాటి పైని పీటలను కప్పడానికి చుట్టూ అల్లిక పని రెండు వరసలు దానిమ్మ పండ్లతో చేశాడు. రెండు పీటలకీ అతడు అదే విధంగా చేశాడు. 19 స్తంభాల మీది పీటలపై 4 మూరల వరకూ తామర పూవుల్లాంటి ఆకృతులు ఉన్నాయి. 20 ఆ రెండు స్తంభాల మీద ఉన్న పీటలమీది అల్లిక పని దగ్గర ఉన్న ఉబ్బెత్తుకు పైగా దానిమ్మ పండ్లు ఉన్నాయి. రెండు వందల దానిమ్మ పండ్లు ఆ పీట చుట్టూ వరుసలుగా ఉన్నాయి.

21 ఈ స్తంభాలను అతడు పరిశుద్ధ స్థలం మంటపంలో నిలబెట్టాడు. కుడి పక్కన ఉన్న స్తంభానికి “యాకీను” అని పేరు పెట్టాడు. ఎడమ పక్కన ఉన్న స్తంభానికి “బోయజు” అని పేరు పెట్టాడు. 22 ఈ స్తంభాల మీద తామర పూవుల్లాంటి చెక్కడం పని ఉంది. ఈ విధంగా స్తంభాల పని పూర్తి అయ్యింది.

2 దినవృత్తాంతాలు 4:1

1 సొలొమోను ఇరవై మూరలు పొడవు, ఇరవై మూరలు వెడల్పు, పది మూరలు ఎత్తు ఉన్న ఒక ఇత్తడి బలిపీఠం చేయించాడు.

1 రాజులు 7:23–50

23 హీరాము పోత పనితో ఒక గుండ్రని సరస్సు తొట్టిని చేశాడు. అది ఈ చివరి పై అంచు నుండి ఆ చివరి పై అంచు దాకా 10 మూరలు. దాని ఎత్తు 5 మూరలు, చుట్టుకొలత 30 మూరలు. 24 దాని పై అంచుకు కింద, చుట్టూ గుబ్బలున్నాయి. మూరకు 10 గుబ్బల చొప్పున ఆ గుబ్బలు సరస్సు చుట్టూ ఆవరించి ఉన్నాయి. ఆ సరస్సును పోత పోసినప్పుడు ఆ గుబ్బలను రెండు వరసలుగా పోత పోశారు.

25 ఆ సరస్సు 12 ఎద్దుల ఆకారాల మీద నిలబడి ఉంది. వీటిలో మూడు ఉత్తర దిక్కుకూ మూడు పడమర దిక్కుకూ మూడు దక్షిణ దిక్కుకూ మూడు తూర్పు దిక్కుకూ చూస్తున్నాయి. వీటి మీద ఆ సరస్సు నిలబెట్టి ఉంది. ఎద్దుల వెనక భాగాలన్నీ లోపలి వైపుకు ఉన్నాయి. 26 సరస్సు మందం బెత్తెడు. దాని పై అంచుకు పాత్రకు పై అంచులాగా తామర పూవుల్లాంటి పోత పని ఉంది. అందులో సుమారు 2,000 తొట్టెలు నీరు పడుతుంది.

27 హీరాము 10 ఇత్తడి స్తంభాలు చేశాడు. ఒక్కొక్క స్తంభం 4 మూరల పొడవు, 4 మూరల వెడల్పు, 3 మూరల ఎత్తు ఉన్నాయి. 28 ఈ స్తంభాలు ఏ విధంగా చేశారంటే, వాటికి పార్శ్వాల్లో పలకలు ఉన్నాయి. ఆ పక్క పలకలు చట్రాల మధ్య అమర్చారు. 29 చట్రాల మధ్యలో ఉన్న పక్క పలకల మీదా చట్రాల మీదా సింహాల, ఎద్దుల, కెరూబుల రూపాలు ఉన్నాయి. సింహాల కిందా ఎద్దుల కిందా వేలాడుతున్న పూదండలు ఉన్నాయి.

30 ప్రతి స్తంభానికీ నాలుగేసి ఇత్తడి చక్రాలు, ఇత్తడి ఇరుసులు ఉన్నాయి. ప్రతిపీఠం నాలుగు మూలల్లో దిమ్మలు ఉన్నాయి. ఈ దిమ్మలను తొట్టి కింద అతికిన ప్రతి స్థలం దగ్గరా పోత పోశారు. 31 పీఠం పైన దాని మూతి ఉంది. దాని వెడల్పు మూరెడు. అయితే మూతి కింద స్తంభం గుండ్రంగా ఉండి మూరన్నర వెడల్పు ఉంది. ఆ మూతి మీద పక్కలు గల చెక్కిన పనులు ఉన్నాయి. ఇవి గుండ్రంగా గాక చదరంగా ఉన్నాయి. 32 పక్క పలకల కింద 4 చక్రాలు ఉన్నాయి. చక్రాల ఇరుసులు స్తంభాలతో అతికించి ఉన్నాయి. ఒక్కొక్క చక్రం మూరన్నర వెడల్పు ఉన్నాయి.

33 ఈ చక్రాల పని రథ చక్రాల పనిలాగా ఉంది. వాటి ఇరుసులూ అంచులూ అడ్డకర్రలూ నడిమి భాగాలూ పోత పనితో చేశారు. 34 ప్రతి స్తంభం నాలుగు మూలల్లో నాలుగు దిమ్మలు ఉన్నాయి. ఈ దిమ్మలూ స్తంభమూ కలిపే పోత పోశారు. 35 పీఠం పైన చుట్టూ జానెడు ఎత్తు ఉన్న గుండ్రని బొద్దు ఉంది. పీఠం పైన ఉన్న మోతలూ పక్క పలకలూ దానితో కలిసిపోయి ఉన్నాయి. 36 దాని మోతల పలకల మీదా దాని పక్క పలకల మీదా, హీరాము కెరూబులనూ సింహాలనూ తమాల వృక్షాలనూ ఒక్కొక్కదాని చోటును బట్టి చుట్టూ దండలతో వాటిని చెక్కాడు. 37 ఈ విధంగా అతడు పదింటిని చేశాడు. అన్నిటి పోత, పరిమాణం, రూపం ఒకేలా ఉన్నాయి.

38 తరువాత అతడు 10 ఇత్తడి తొట్టెలు చేశాడు. ప్రతి తొట్టి 880 లీటర్లు నీరు పడుతుంది. ఒక్కొక్క తొట్టి వైశాల్యం 4 మూరలు. ఒక్కొక్క స్తంభం మీద ఒక్కొక్క తొట్టి ఉంచాడు. 39 మందిరం కుడి పక్కన 5 స్తంభాలు, ఎడమ పక్కన 5 స్థంభాలు ఉంచాడు. సరస్సు దేవాలయానికి కుడి వైపు ఆగ్నేయ దిశగా మందిరం కుడి పక్కన ఉంచాడు. 40 హీరాము తొట్లనూ చేటలనూ గిన్నెలనూ చేశాడు. ఈ విధంగా హీరాము సొలొమోను రాజు ఆజ్ఞ ప్రకారం యెహోవా మందిరం పని అంతా పూర్తి చేశాడు.

41 రెండు స్తంభాలు, ఆ రెండు స్తంభాల మీద ఉన్న పైపీటల పళ్ళేలు, వాటిని కప్పిన రెండు అల్లికలు ఉన్నాయి. 42 ఆ స్తంభాల మీద ఉన్న పై పీటల రెండు పళ్ళాలను, కప్పిన అల్లిక ఒకదానికి రెండు వరసలతో రెండు అల్లికలకు 400 దానిమ్మపండ్లనూ 43 10 స్తంభాలనూ స్తంభాల మీద 10 తొట్లనూ 44 ఒక సరస్సును, సరస్సు కింద 12 ఎద్దులూ, 45 బిందెలూ, చేటలూ, గిన్నెలూ వీటినన్నిటినీ సొలొమోను రాజు ఆజ్ఞ ప్రకారం హీరాము యెహోవా మందిరానికి చేశాడు. ఈ వస్తువులన్నీ మెరుగు పెట్టిన ఇత్తడితో చేసారు.

46 యొర్దాను మైదానంలో సుక్కోతు, సారెతానుల మధ్య ఉన్న బంక మట్టి నేలలో రాజు వాటిని పోత పోయించాడు. 47 అయితే ఈ వస్తువులు చాలా ఎక్కువగా ఉండడం వలన సొలొమోను వాటి బరువు తూయడం మానేశాడు. ఇత్తడి బరువు ఎంతో తెలుసుకోడానికి వీల్లేకుండా పోయింది.

48 సొలొమోను యెహోవా మందిరానికి చెందిన ఇతర సామగ్రిని కూడా చేయించాడు. అవేవంటే, బంగారు బలిపీఠం, సముఖపు రొట్టెలను ఉంచే బంగారు బల్లలు, 49 గర్భాలయం ఎదుట కుడి పక్కన 5, ఎడమ పక్కన 5, మొత్తం పది బంగారు దీపస్తంభాలు, బంగారు పుష్పాలు, ప్రమిదెలు, పట్టుకారులు. 50 అలాగే మేలిమి బంగారు పాత్రలు, కత్తెరలు, గిన్నెలు, ధూపకలశాలు, లోపలి మందిరం అనే అతి పరిశుద్ధ స్థలం తలుపులు, ఆలయం హాలు తలుపులు, వాటి బంగారు బందులు, వీటన్నిటినీ చేయించాడు.

2 దినవృత్తాంతాలు 4:8–10

8 అలాగే 10 బల్లలు చేయించి దేవాలయంలో కుడి వైపు ఐదు, ఎడమ వైపు ఐదు ఉంచాడు. అతడు 100 బంగారు తొట్లు చేయించాడు. 9 అతడు యాజకులకు ఒక ఆవరణనూ ఇతరులకి దానికంటే విశాలమైన ఆవరణనూ తలుపులతో సహా చేయించి ఆ తలుపులను ఇత్తడితో పొదిగించాడు. 10 సరస్సు తొట్టిని తూర్పు వైపున కుడి పక్కగా ముఖాన్ని దక్షిణం వైపుకు తిప్పి ఉంచాడు.

1 రాజులు 6:9–14

9 ఈ విధంగా అతడు మందిర నిర్మాణం ముగించి మందిరాన్ని దేవదారు దూలాలతో, పలకలతో కప్పించాడు. 10 మందిరానికి చుట్టూ గదులు కట్టించాడు. ఇవి ఐదు మూరల ఎత్తు కలిగి దేవదారు దూలాల చేత మందిరంతో గట్టిగా సంధించి ఉన్నాయి.

11 అంతలో యెహోవా వాక్కు సొలొమోనుకు ప్రత్యక్షమై ఇలా చెప్పాడు. 12 “ఈ మందిరాన్ని నీవు కట్టిస్తున్నావు కదా, నీవు నా చట్టాలు, న్యాయవిధులు పాటిస్తూ, నా ఆజ్ఞలన్నిటికీ విధేయత చూపితే నీ తండ్రి దావీదుతో నేను చేసిన వాగ్దానాన్ని నీ విషయంలో స్థిరపరుస్తాను. 13 ఇశ్రాయేలీయులనే నా ప్రజలను విడిచి పెట్టక నేను వారి మధ్య నివాసం చేస్తాను.”

14 ఈ విధంగా సొలొమోను మందిర నిర్మాణాన్ని ముగించాడు.

1 రాజులు 7:51

51 ఈ విధంగా సొలొమోను రాజు యెహోవా మందిరానికి చేసిన పని అంతా పూర్తి అయ్యింది. సొలొమోను తన తండ్రి అయిన దావీదు ప్రతిష్ఠించిన వెండిని, బంగారాన్ని, సామగ్రిని తెప్పించి యెహోవా మందిరం ఖజానాలో ఉంచాడు.

1 రాజులు 6:37–38

37 నాలుగో సంవత్సరం జీప్‌ నెలలో యెహోవా మందిరం పునాది వేశారు. 38 పదకొండవ సంవత్సరం బూలు అనే ఎనిమిదో నెలలో దాని ఏర్పాటు ప్రకారం దాని విభాగాలన్నిటితో మందిరం పూర్తి అయ్యింది. దాన్ని కట్టించడానికి సొలొమోనుకి ఏడు సంవత్సరాలు పట్టింది.

1 రాజులు 6:2–3

2 సొలొమోను రాజు యెహోవాకు కట్టించిన మందిరం పొడవు 60 మూరలు, వెడల్పు 20 మూరలు, ఎత్తు 30 మూరలు. 3 పరిశుద్ధ స్థలం ఎదుట ఉన్న ముఖమంటపం పొడవు మందిరం వెడల్పుతో సమానంగా 20 మూరలు. మందిరం ఎదుట ఆ మంటపం వెడల్పు 10 మూరలు.

2 దినవృత్తాంతాలు 3:10–12

10 అతి పరిశుద్ధ స్థలం లో చెక్కడం పనితో రెండు కెరూబులు చేయించి వాటిని బంగారంతో పొదిగించాడు. 11 ఆ కెరూబుల రెక్కల మొత్తం పొడుగు 20 మూరలు. కెరూబు ఒక రెక్క పొడుగు ఐదు మూరలు. అది మందిరం గోడకి తగులుతూ ఉంది. రెండో రెక్క దానికి జతగా ఉన్న కెరూబు రెక్కకి తగులుతూ ఉంది. 12 రెండో కెరూబు రెక్క పొడుగు కూడా ఐదు మూరలు. అది మందిరం గోడకి తగులుతూ ఉంది. రెండో రెక్క దానికి జతగా ఉన్న కెరూబు రెక్కకి తగులుతూ ఉంది

2 దినవృత్తాంతాలు 3:15–17

15 అంతే గాక ముందు 35 మూరల పొడవున్న రెండు స్తంభాలూ, వాటి మీదకి ఐదు మూరల పొడవున్న పీటలూ చేయించాడు. 16 గర్భాలయంలో చేసినట్టు గొలుసు పని చేయించి, స్తంభాల పైభాగంలో దాన్ని ఉంచి, నూరు దానిమ్మ కాయలు చేయించి ఆ గొలుసు పనికి తగిలించాడు. 17 ఆ రెండు స్తంభాలనూ దేవాలయం ముందు కుడి వైపున ఒకటీ ఎడమ వైపున ఒకటీ నిలబెట్టి, కుడి వైపు దానికి “యాకీను” అనీ, ఎడమ వైపు దానికి “బోయజు” అనీ పేర్లు పెట్టాడు.

2 దినవృత్తాంతాలు 4:2–7

2 పోత పోసిన గుండ్రటి సరస్సు గంగాళం కూడా ఒకటి చేయించాడు. అది ఆ చివరినుండి ఈ చివరి వరకూ 10 మూరల వెడల్పు. దాని ఎత్తు ఐదు మూరలు. దాని చుట్టుకొలత 30 మూరలు. 3 దాని కింద ఎద్దుల రూపాలు ఒక్కొక్క మూరకు 10 చొప్పున ఆ సముద్రపు తొట్టిని ఆవరించి ఉన్నాయి. ఆ ఎద్దులను రెండు వరసల్లో నిలబెట్టి ఆ తొట్టితో సహా పోత పోశారు.

4 అది 12 ఎద్దుబొమ్మల మీద నిలబడింది. మూడు ఎద్దులు ఉత్తరం వైపు, మూడు పడమర వైపు, మూడు దక్షిణం వైపు, మూడు తూర్పు వైపుకు ఉన్నాయి. ఆ సరస్సు తొట్టిని వాటి పైన నిలబెట్టారు. వాటి వెనక భాగాలు అన్నీ లోపలికి తిరిగి ఉన్నాయి. 5 దాని మందం బెత్తెడు. దాని అంచు ఒక గిన్నె అంచులాగా ఉండి తామరపువ్వును పోలి ఉంది. దానిలో దాదాపు 66,000 లీటర్ల నీరు పడుతుంది.

6 సొలొమోను ఇంకా దహనబలులుగా అర్పించే వాటిని కడగటానికి కుడివైపున ఐదు, ఎడమ వైపున ఐదు మొత్తం పది స్నానపు గంగాళాలు చేయించాడు. అయితే సరస్సు తొట్టిలోని నీళ్ళతో కేవలం యాజకులు మాత్రమే తమను శుద్ధి చేసుకుంటారు.

7 అతడు తనకు అందిన నమూనా సూచనల ప్రకారం పది బంగారు దీపస్తంభాలను చేయించి, దేవాలయంలో కుడివైపు ఐదు, ఎడమవైపు ఐదు నిలబెట్టాడు.

2 దినవృత్తాంతాలు 4:11–22

11 హూరాము పాత్రలనూ బూడిదెనూ ఎత్తడానికి చేటలనూ తొట్లనూ చేశాడు. సొలొమోను రాజు ఆజ్ఞ ప్రకారం దేవుని మందిరానికి చేయాల్సిన పనంతా హూరాము పూర్తి చేశాడు. 12 దాని వివరాలు, రెండు స్తంభాలు, వాటి పళ్ళాలు, వాటి పైన ఉంచడానికి పీటలు, వాటి పళ్ళాలు, ఆ స్తంభాల పైన రెండు పళ్లాలను కప్పడానికి రెండు అల్లికలు, 13 ఆ స్తంభాల పైన రెండు పళ్లాలను కప్పే అల్లిక, దానికి రెండేసి వరసల్లో నాలుగు వందల దానిమ్మ పండ్లు. 14 మట్లు, వాటిపైన తొట్టెలు, 15 సరస్సు తొట్టి, దాని కింద ఉన్న పన్నెండు ఎద్దులు, 16 పాత్రలు, బూడిద ఎత్తడానికి చేటలు, ముండ్ల కొంకులు మొదలైనవి. వీటిని హూరాము సొలొమోను రాజు ఆజ్ఞ ప్రకారం యెహోవా మందిరం కోసం మిలమిల మెరిసే ఇత్తడితో చేశాడు.

17 రాజు వాటిని యొర్దాను మైదానంలో సుక్కోతుకు జెరేదాతాకు మధ్య బంకమట్టి నేలలో పోత పోయించాడు. 18 తన దగ్గర ఉన్న తూయలేనంత ఇత్తడితో సొలొమోను ఈ వస్తువులను పెద్ద సంఖ్యలో చేయించాడు. 19 దేవుని మందిరానికి కావలసిన వస్తువులూ బంగారు పీఠమూ సన్నిధి రొట్టెలు ఉంచే బల్లలూ, 20 వాటి గురించి అతడు పొందిన సూచనల ప్రకారం గర్భగుడి ముందు వెలుగుతూ ఉండడానికి ప్రశస్తమైన బంగారు దీపస్తంభాలూ, 21 పుష్పాలూ, ప్రమిదలూ కత్తెరలూ పట్టుకారులూ తొట్టెలూ గిన్నెలూ ధూపకలశాలూ వీటన్నిటినీ సొలొమోను మేలిమి బంగారంతో చేయించాడు. 22 మందిర ద్వారం లోపలి తలుపులూ అతి పరిశుద్ధ స్థలం లోపలి తలుపులూ దేవాలయపు తలుపులూ అన్నీ బంగారంతో చేయించాడు.