భాగం 3: దేవాలయ ప్రతిష్ఠ

మందసాన్ని లోపలికి తీసుకురావడం మరియు సొలొమోను ప్రార్థన

క్రీ.పూ. 1004

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

2 దినవృత్తాంతాలు 5

1 సొలొమోను యెహోవా మందిరానికి తాను చేయించిన పనంతా పూర్తి చేసి, తన తండ్రి దావీదు ప్రతిష్ఠించిన వెండినీ బంగారాన్నీ వస్తువులన్నిటినీ దేవుని మందిరం ధనాగారాల్లో ఉంచాడు.

2 తరువాత సొలొమోను యెహోవా నిబంధన మందసాన్ని సీయోను అనే దావీదు పట్టణం నుండి తెప్పించడానికి ఇశ్రాయేలీయుల పెద్దలనూ ఇశ్రాయేలీయుల వంశాలకు అధికారులైన గోత్రాల పెద్దలందరినీ యెరూషలేములో సమావేశపరిచాడు.

3 ఏడవ నెలలో పండగ జరిగే సమయానికి ఇశ్రాయేలీయులంతా రాజు దగ్గరికి వచ్చారు. 4 ఆ పెద్దలంతా వచ్చిన తరువాత లేవీయులు మందసాన్ని ఎత్తుకున్నారు. 5 సొలొమోను రాజు, ఇశ్రాయేలీయుల సమాజమంతా సమావేశమై, లెక్కించ లేనన్ని గొర్రెలనూ పశువులనూ బలిగా అర్పించారు.

6 లేవీయులు, యాజకులు కలిసి, మందసాన్ని, సమాజపు గుడారాన్నీ దానిలో ఉండే ప్రతిష్ఠిత వస్తువులన్నిటినీ తీసుకువచ్చారు. 7 యాజకులు యెహోవా నిబంధన మందసాన్ని గర్భాలయమైన అతి పరిశుద్ధస్థలం లో కెరూబుల రెక్కల కింద ఉంచారు. 8 మందసం ఉండే స్థలానికి పైగా కెరూబులు తమ రెండు రెక్కలనూ చాపి మందసాన్నీ దాని మోత కర్రలనూ కప్పాయి.

9 మోతకర్రల కొనలు గర్భాలయం ఎదుట ఉన్న పరిశుద్ధ స్థలం లో కనబడేటంత పొడవుగా ఉన్నాయి గానీ అవి బయటికి కనబడలేదు. ఇప్పటి వరకూ అవి అక్కడే ఉన్నాయి. 10 ఇశ్రాయేలీయులు ఐగుప్తులోనుండి వెళ్లిన తరవాత యెహోవా హోరేబులో వారితో నిబంధన చేసినప్పుడు మోషే ఆ మందసంలో ఉంచిన రెండు రాతిపలకలు తప్ప దానిలో ఇంకేమీ లేవు.

11 యాజకులు పరిశుద్ధస్థలం నుండి బయలుదేరి వచ్చినప్పుడు అక్కడ సమావేశమైన యాజకులంతా తమ వంతులతో నిమిత్తం లేకుండా తమను తాము ప్రతిష్ఠించుకున్నారు. 12 ఆసాపు, హేమాను, యెదూతూను, వారి కుమారులు, సహోదరులు, గాయకులైన లేవీయులంతా, సన్నని నార వస్త్రాలు ధరించి, తాళాలు, తంబురలు, సితారాలు చేత పట్టుకుని బలిపీఠానికి తూర్పు వైపు నిలబడ్డారు.

13 వారితో బాటు 120 మంది బాకాలు ఊదే యాజకులు నిలబడ్డారు. బూరలూదే వారూ గాయకులూ ఒకేసారి యెహోవాకు కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తూ గానం చేసినప్పుడు యాజకులు పరిశుద్ధస్థలం నుండి బయటికి వెళ్ళి ఆ బాకాలతో తాళాలతో ఇతర వాద్యాలతో కలిసి గొంతెత్తి “యెహోవా దయ గలవాడు. ఆయన కృప నిత్యమూ ఉంటుంది” అని స్తోత్రం చేశారు.

14 అప్పుడు ఒక మేఘం యెహోవా మందిరాన్ని నింపింది. యెహోవా తేజస్సుతో ఆ మందిరం నిండిపోవడం వలన సేవ చేయడానికి యాజకులు ఆ మేఘం దగ్గర నిలబడలేక పోయారు.

2 దినవృత్తాంతాలు 7:4–7

4 రాజూ, ప్రజలూ కలిసి యెహోవా ముందు బలులు అర్పించారు. 5 సొలొమోను రాజు 22,000 పశువులనూ 1, 20,000 గొర్రెలనూ బలులుగా అర్పించాడు. రాజు, ప్రజలు, అందరూ కలిసి దేవుని మందిరాన్ని ప్రతిష్టించారు. 6 యాజకులు తమ తమ సేవా స్థలాల్లో నిలిచారు. లేవీయులు “యెహోవా కృప నిత్యమూ నిలుస్తుంది” అంటూ దేవుణ్ణి స్తుతించడానికి దావీదు ఏర్పాటు చేసిన యెహోవా గీతాలు పాడుతూ, వాయిద్యాలు వాయిస్తూ ఉన్నారు. యాజకులు వారికి ఎదురుగా నిలబడి బూరలు ఊదుతూ ఉంటే, ఇశ్రాయేలు ప్రజలంతా నిలబడి ఉన్నారు.

7 సొలొమోను తాను చేయించిన ఇత్తడి బలిపీఠం దహనబలులకూ నైవేద్యాలకూ కొవ్వుకూ సరిపోక పోవడం వలన యెహోవా మందిరం ముందు ఉన్న మధ్య ఆవరణాన్ని ప్రతిష్ఠించి, అక్కడ దహనబలులనూ శాంతి బలిపశువుల కొవ్వునూ అర్పించాడు.

2 దినవృత్తాంతాలు 6:1–39

1 అప్పుడు సొలొమోను “గాఢాంధకారంలో నేను నివసిస్తున్నాను అని యెహోవా సెలవిచ్చాడు. 2 అయితే నువ్వు ఎల్లకాలం నివసించడానికి నిత్యమైన స్థలంగా నేనొక గొప్ప మందిరాన్ని నీ కోసం కట్టించాను” అన్నాడు. 3 తరువాత రాజు ప్రజల వైపు తిరిగి, ఇశ్రాయేలీయుల సమాజం అంతా నిలబడి ఉండగా వారిని దీవించాడు.

4 అతడు వారితో “నా తండ్రి దావీదుకు ప్రమాణం చేసి, దాన్ని స్వయంగా నెరవేర్చిన ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవాకు స్తోత్రం కలుగు గాక. 5 ఆయన ‘నేను నా ప్రజలను ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన రోజు మొదలు నా నామం నిలిచి ఉండడానికి ఒక మందిరం కట్టించాలని నేను ఇశ్రాయేలు గోత్రాల్లో ఏ పట్టణాన్నీ ఏర్పాటు చేసుకోలేదు, ఇశ్రాయేలీయులనే నా ప్రజల మీద అధిపతిగా ఉండడానికి ఏ మనిషినీ నియమించ లేదు. 6 ఇప్పుడు నా నామం నిలిచి ఉండడానికి యెరూషలేమునూ, నా ప్రజలు ఇశ్రాయేలీయుల మీద అధిపతిగా ఉండడానికి దావీదునూ ఎన్నుకున్నాను’ అని చెప్పాడు.

7 ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవా నామ ఘనత కోసం ఒక మందిరాన్ని కట్టించాలన్నది నా తండ్రి దావీదు హృదయ వాంఛ. 8 అయితే యెహోవా నా తండ్రితో ‘నా నామ ఘనత కోసం మందిరం కట్టాలన్న నీ ఉద్దేశం మంచిది. 9 కానీ నువ్వు ఆ మందిరాన్ని కట్టడానికి వీలు లేదు. నీకు పుట్టబోయే కుమారుడు నా నామానికి ఆ మందిరం కడతాడు’ అని చెప్పాడు.

10 యెహోవా అప్పుడు చెప్పిన తన మాటను ఇప్పుడు నెరవేర్చాడు. యెహోవా సెలవు ప్రకారం నేను నా తండ్రి దావీదు స్థానంలో రాజునై సింహాసనం మీద కూర్చుని ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవాకు మందిరం కట్టించాను. 11 ఇశ్రాయేలీయులతో యెహోవా చేసిన నిబంధనకు గుర్తుగా ఉన్న మందసాన్ని దానిలో ఉంచాను” అని చెప్పాడు.

12 తరవాత ఇశ్రాయేలీయులంతా సమావేశమై చూస్తుండగా యెహోవా బలిపీఠం ముందు నిలబడి తన చేతులు చాపి ప్రార్థన చేశాడు.

13 సొలొమోను తాను చేయించిన ఐదు మూరల పొడవు, ఐదు మూరల వెడల్పు, మూడు మూరల యెత్తు ఉన్న ఇత్తడి వేదికను ఆవరణంలో పెట్టించాడు. దాని మీద నిలబడి, సమావేశమైన ఇశ్రాయేలీయులందరి ఎదుటా మోకరించి, ఆకాశం వైపు చేతులు చాపి ఇలా ప్రార్థించాడు.

14 “యెహోవా, ఇశ్రాయేలీయుల దేవా, హృదయ పూర్వకంగా నిన్ను అనుసరించే నీ భక్తుల పట్ల నీ నిబంధనను నెరవేరుస్తూ కృప చూపే నీలాంటి దేవుడు ఆకాశాల్లో గానీ, భూమి మీద గానీ లేడు. 15 నీ సేవకుడు, నా తండ్రి అయిన దావీదుతో నువ్వు చేసిన వాగ్దానం నిలబెట్టుకున్నావు. నువ్వు ప్రమాణం చేసి దాన్ని నెరవేర్చావు. ఈ రోజు మేము దాన్ని కళ్ళారా చూస్తున్నాము. 16 ‘నువ్వు నడుచుకున్నట్టు నీ కుమారులు కూడా ప్రవర్తించి, నా ధర్మశాస్త్రం ప్రకారం నడుచుకుంటే ఇశ్రాయేలీయుల సింహాసనం మీద కూర్చుని పాలించేవాడు నా సన్నిధిలో నీకుండకుండా పోడు’ అని నీవు నీ సేవకుడు, నా తండ్రి అయిన దావీదుతో సెలవిచ్చిన మాటను ఇశ్రాయేలీయుల దేవా, యెహోవా, దయచేసి నెరవేర్చు.

17 యెహోవా, నువ్వు నీ సేవకుడు దావీదుకిచ్చిన వాగ్దానం ఇప్పుడు స్థిరపడుతుంది గాక. 18 దేవుడు మనుషులతో కలిసి ఈ భూమిపై నివసిస్తాడా? ఆకాశ మహాకాశాలు నీకు సరిపోవే? నేను కట్టిన ఈ మందిరం సరిపోతుందా? 19 దేవా, యెహోవా, నీ సేవకుడు నీ సన్నిధిలో చేసే ఈ ప్రార్థననూ విన్నపాన్నీ మన్నించు. నీ సేవకుడిని, నేను చేసే ప్రార్థననూ, నా మొర్రనూ ఆలకించు. 20 నీ సేవకులు ఈ స్థలం లో చేసే విన్నపాలు వినడానికి, ‘నా నామాన్ని అక్కడ ఉంచుతాను’ అని నువ్వు వాగ్దానం చేసిన స్థలం లో ఉన్న ఈ మందిరం మీద నీ కనుదృష్టి దివారాత్రులు నిలుస్తుంది గాక. 21 నీ సేవకుడు, నీ ఇశ్రాయేలు ప్రజలు ఈ మందిరం వైపుకు తిరిగి చేయబోయే ప్రార్థనలు ఆలకించు, అవును, నువ్వు నివసిస్తున్న పరలోకం నుండి ఆలకించి, వారి పాపాలను క్షమించు.

22 ఎవరైనా తన పొరుగువాడి పట్ల తప్పు చేసినప్పుడు అతని చేత ప్రమాణం చేయించడానికి ఈ మందిరంలోని నీ బలిపీఠం ఎదుటికి వచ్చినప్పుడు, 23 నువ్వు పరలోకం నుండి విని, నీ దాసులకు న్యాయం తీర్చు. హాని చేసినవాడి తలపైకి శిక్ష రప్పించు. నీతిపరుని నీతి చొప్పున వాడికి దయచేసి, అతని నీతిని స్థిరపరచు.

24 నీ ప్రజలైన ఇశ్రాయేలీయులు నీ ఎదుట పాపం చేయడం వలన తమ శత్రువులను ఎదిరించి నిలవలేక నీ దగ్గరకి తిరిగి వచ్చి నీ నామాన్ని ఒప్పుకుని, ఈ మందిరంలో నీ సన్నిధిలో ప్రార్థించి వేడుకున్నప్పుడు, 25 పరలోకం నుండి నువ్వు విని, నీ ప్రజలు చేసిన పాపాన్ని క్షమించి, వారికి, వారి పూర్వీకులకు నీవిచ్చిన దేశానికి వారిని మళ్లీ రప్పించు.

26 వారు నీ దృష్టికి పాపం చేయడం వలన ఆకాశం మూసుకు పోయి వర్షం కురవనప్పుడు, వారు ఈ స్థలం లో ప్రార్థన చేసి నీ నామాన్ని ఒప్పుకుని, నువ్వు కలిగించిన బాధలో వారు తమ పాపాలను విడిచిపెట్టి తిరిగితే 27 పరలోకంలో ఉన్న నువ్వు ఆలకించి, నీ సేవకులు, నీ ప్రజలు అయిన ఇశ్రాయేలీయులు చేసిన పాపాన్ని క్షమించి, వారు నడవాల్సిన మంచి మార్గం వారికి బోధించి, నువ్వు నీ ప్రజలకి స్వాస్థ్యంగా ఇచ్చిన నీ దేశంలో వర్షం కురిపించు.

28 దేశంలో కరువు, తెగులు కనబడినప్పుడూ అగ్గి తెగులు, బూజు, తగిలినప్పుడూ మిడతలు, చీడపురుగులు దాడి చేసినప్పుడూ, లేదా శత్రువులు ఇశ్రాయేలు ప్రజల పట్టణాలను ముట్టడించినప్పుడూ అరిష్టం, వ్యాధి సోకినప్పుడూ 29 ఏ ఒక్కడు గానీ, నీ ప్రజలైన ఇశ్రాయేలీయులంతా గానీ హృదయంలో బాధ, కష్టం అనుభవిస్తూ ఉండి, ఈ మందిరం వైపు చేతులు చాపి చేసే విజ్ఞాపనలూ ప్రార్థనలూ నీ నివాస స్థలమైన పరలోకం నుండి నువ్వు ఆలకించి వారిని క్షమించు.

30 మా పూర్వీకులకు నీవిచ్చిన ఈ దేశంలో వారు తమ జీవితకాలమంతా నీపట్ల భయభక్తులు కలిగి 31 నీ మార్గాల్లో నడిచేలా వారి హృదయాలను ఎరిగిన నువ్వు వారి ప్రవర్తనకు తగిన ప్రతిఫలం దయచెయ్యి. ఎందుకంటే నీవొక్కడివే మానవుని హృదయాన్ని ఎరిగిన వాడివి.

32 ఇశ్రాయేలీయులనే నీ ప్రజలకు సంబంధం లేని అన్యులు నీ గొప్ప నామం గూర్చీ నీ బాహుబలం గూర్చీ చాచిన నీ చేతులను గూర్చీ విని, దూరదేశం నుండి ఈ మందిరానికి వచ్చి వేడుకుంటే, 33 నీ నివాసమైన పరలోకం నుండి నువ్వు వారి ప్రార్థన అంగీకరించి, ఆ అన్యులు నిన్ను అడిగిన దాన్ని వారికి అనుగ్రహించు. తద్వారా నీ ప్రజలైన ఇశ్రాయేలీయులు తెలుసుకున్నట్టుగా ఈ భూప్రజలంతా నీ నామాన్ని తెలుసుకుని, నీలో భయభక్తులు కలిగి, నేను కట్టిన ఈ మందిరానికి నీ నామం పెట్టావని గ్రహిస్తారు.

34 నీ ప్రజలు నువ్వు పంపిన మార్గంలో తమ శత్రువులతో యుద్ధానికి బయలుదేరి, నువ్వు ఏర్పరచుకున్న ఈ పట్టణం వైపూ నీ నామానికి నేను కట్టించిన ఈ మందిరం వైపూ చూసి వేడుకున్నప్పుడు, 35 పరలోకం నుండి నువ్వు వారి విన్నపాన్నీ, ప్రార్థననూ ఆలకించి వారి పనుల్లో వారికి సహాయం చెయ్యి.

36 పాపం చేయని వాడెవడూ లేడు కాబట్టి వారు నీకు వ్యతిరేకంగా పాపం చేసినప్పుడు నువ్వు వారి మీద ఆగ్రహించి, శత్రువుల చేతికి వారిని అప్పగిస్తే, ఆ శత్రువులు వారిని దూరంగా లేక దగ్గరగా ఉన్న తమ దేశాలకు పట్టుకు పోయినప్పుడు, 37 వారు చెరగా వెళ్ళిన ఆ దేశంలో బుద్ధి తెచ్చుకుని పశ్చాత్తాప పడి ‘మేము పాపం చేసి, దోషులమయ్యాం, మేము భక్తిహీనంగా నడిచాం’ అని ఒప్పుకుని 38 తాము చెరలో ఉన్న దేశంలో తమ పూర్ణహృదయంతో పూర్ణాత్మతో నీవైపు తిరిగి, తమ పూర్వీకులకు నీవిచ్చిన తమ దేశం వైపూ నువ్వు కోరుకున్న ఈ పట్టణం వైపూ నీ నామఘనత కోసం నేను కట్టించిన ఈ మందిరం వైపూ మనస్సు తిప్పి వేడుకుంటే 39 నీ నివాసమైన పరలోకం నుండి నువ్వు వారి విన్నపాన్నీ, ప్రార్థననీ ఆలకించి, వారి పని జరిగించి, నీకు వ్యతిరేకంగా పాపం చేసిన నీ ప్రజలను క్షమించు.

1 రాజులు 8:50–61

50 నీకు వ్యతిరేకంగా పాపం చేసిన నీ ప్రజలు ఏ తప్పుల విషయంలో దోషులయ్యారో ఆ తప్పులు క్షమించి, నీ ప్రజలను చెరగొనిపోయిన వారికి వారి పట్ల కనికరం పుట్టించు. 51 వారు నీవెన్నుకున్న నీ ప్రజలు. ఇనుప కొలిమి నుండి తప్పించినట్టుగా నీవు ఐగుప్తు దేశంలోనుండి తప్పించిన నీ ప్రజలు. 52 కాబట్టి నీ దాసుడినైన నేనూ, నీ ప్రజలైన ఇశ్రాయేలీయులూ చేసే విన్నపం మీద దృష్టి ఉంచి, వారు ఏ విషయాల్లో నిన్ను వేడుకుంటారో వాటిని ఆలకించు. 53 ప్రభూ, యెహోవా, నీవు మా పూర్వీకులను ఐగుప్తులో నుండి రప్పించినప్పుడు నీవు నీ దాసుడైన మోషే ద్వారా ప్రమాణం చేసినట్టు లోకంలోని ప్రజలందరిలో నుండి వారిని నీ స్వాస్థ్యంగా ప్రత్యేకించుకున్నావు కదా.”

54 సొలొమోను ఈ విధంగా ప్రార్థించడం, విన్నపాలు చేయడం ముగించి ఆకాశం వైపు తన చేతులు చాపి, యెహోవా బలిపీఠం ఎదుట మోకాళ్ళపై నుండి లేచి నిలబడ్డాడు. 55 అప్పుడు అతడు పెద్ద స్వరంతో ఇశ్రాయేలీయుల సమాజాన్ని ఈ విధంగా దీవించాడు, 56 “తాను చేసిన వాగ్దానాలన్నిటినీ నెరవేర్చి తన ప్రజలైన ఇశ్రాయేలీయులకు నెమ్మది దయచేసిన యెహోవాకు స్తుతి కలుగు గాక. తన దాసుడైన మోషే ద్వారా ఆయన చేసిన శుభ వాగ్దానాల్లో ఒక్క మాటైనా విఫలం కాలేదు.

57 కాబట్టి మన దేవుడు యెహోవా మనలను విడిచి పెట్టకుండా మన పూర్వీకులకు తోడుగా ఉన్నట్టు మనకు కూడా తోడుగా ఉండి 58 తన మార్గాలన్నిటినీ అనుసరించి నడుచుకొనేలా, తాను మన పితరులకు ఇచ్చిన ఆజ్ఞలను, కట్టడలను, విధులను పాటించేలా, మన హృదయాలను తన వైపు తిప్పుకుంటాడు గాక. 59 ఆయన తన దాసుడినైన నా కార్యాన్ని, తన ప్రజలైన ఇశ్రాయేలీయుల కార్యాన్ని అనుదిన అవసరత ప్రకారం, జరిగించేలా నేను యెహోవా ఎదుట వేడుకొన్న ఈ మాటలు రాత్రీ పగలూ మన దేవుడు యెహోవా సన్నిధిలో ఉంటాయి గాక.

60 అప్పుడు లోకం లోని ప్రజలంతా యెహోవాయే దేవుడనీ, ఆయన తప్ప వేరే దేవుడు లేడనీ తెలుసుకుంటారు. 61 కాబట్టి ఆయన నియమించిన కట్టడలను అనుసరించి నడుచుకోడానికి, ఈ రోజున ఉన్నట్టు ఆయన చేసిన నిర్ణయాలను పాటించడానికి, మీ హృదయం మీ దేవుడు యెహోవా విషయంలో యథార్థంగా ఉండుగాక.”

2 దినవృత్తాంతాలు 6:40–7:3

40 నా దేవా, ఈ స్థలం లో చేసే ప్రార్థనలపై నీ దృష్టి ఉంచు. దాన్ని నీ చెవులు ఆలకించనీ. 41 నా దేవా, యెహోవా, శక్తికి ఆధారభూతమైన నీ మందసంతో సహా లేచి రా. నీ విశ్రాంతి స్థలం లో ప్రవేశించు. దేవా యెహోవా, నీ యాజకులు రక్షణ వస్త్రాలు ధరించుకుంటారు గాక. నీ భక్తులు నీ మేలును బట్టి సంతోషిస్తారు గాక. 42 దేవా యెహోవా, నీ చేత అభిషేకం పొందిన వాని నుండి నీ ముఖం తిప్పుకోవద్దు. నీ భక్తుడు దావీదుకు నువ్వు వాగ్దానం చేసిన కృపలను మరచిపోవద్దు.”

7:1 సొలొమోను తన ప్రార్థన ముగించగానే ఆకాశం నుండి అగ్ని దిగి దహనబలులనూ ఇతర బలులనూ దహించివేసింది. యెహోవా తేజస్సు మందిరాన్ని పూర్తిగా నింపింది. 2 యెహోవా తేజస్సుతో మందిరం నిండిపోవడం వలన యాజకులు అందులో ప్రవేశించలేక పోయారు.

3 అగ్నీ యెహోవా తేజస్సూ మందిరం పైకి దిగటం చూసి ఇశ్రాయేలీయులంతా సాష్టాంగ నమస్కారం చేసి “యెహోవా దయ గలవాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది” అంటూ ఆయనను ఆరాధించి స్తుతించారు.

2 దినవృత్తాంతాలు 7:8–10

8 సొలొమోను, అతనితో కూడా హమాతు సరిహద్దు నుండి ఐగుప్తు నది వరకూ ఉన్న దేశం నుండి గొప్ప సమూహంగా వచ్చిన ఇశ్రాయేలీయులందరూ ఏడు రోజులు పండగ ఆచరించారు. 9 ఎనిమిదో రోజు వారు పండగ ముగించారు. ఏడు రోజులూ బలిపీఠాన్ని ప్రతిష్టిస్తూ పండగ ఆచరించారు.

10 ఏడవ నెల ఇరవై మూడో రోజున సొలొమోను దావీదుకు, తనకు, తన ప్రజలు ఇశ్రాయేలీయులకు యెహోవా చేసిన మేలుల విషయంలో సంతోషిస్తూ, మనసులో ఆనందపడుతూ, ఎవరి గుడారాలకు వారిని వెళ్ళమని ప్రజలకి అనుమతినిచ్చి పంపేశాడు.