దేవాలయ నిర్మాణానికి సొలొమోను సన్నాహాలు

దేవాలయ నిర్మాణానికి సన్నాహాలు. షిమీ మరణం. సొలొమోను వివాహం.

క్రీ.పూ. 1015

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

1 రాజులు 4:1–25

1 సొలొమోను రాజు ఇశ్రాయేలీయులందరి మీదా రాజయ్యాడు. 2 అతని దగ్గర ఉన్న అధికారులు ఎవరంటే, సాదోకు కొడుకు అజర్యా యాజకుడు, 3 షీషా కొడుకులు ఎలీహోరెపు, అహీయా ప్రధాన మంత్రులు, అహీలూదు కొడుకు యెహోషాపాతు లేఖికుడు. 4 యెహోయాదా కొడుకు బెనాయా సైన్యాధిపతి, సాదోకు, అబ్యాతారు యాజకులు. 5 నాతాను కొడుకు అజర్యా అధికారుల పైఅధికారిగా ఉన్నాడు. నాతాను మరో కొడుకు జాబూదు యాజకుడు, రాజు చెలికాడు. 6 అహీషారు గృహ నిర్వాహకుడు, అబ్దా కొడుకు అదోనీరాము వెట్టి చాకిరీ పనివాళ్ళపై అధికారి. 7 ఇశ్రాయేలీయులందరి మీదా సొలొమోను 12 మంది అధికారులను నియమించాడు. వీరు రాజుకు, అతని ఇంటివారికి ఆహారం ఏర్పాటు చేసేవారు. సంవత్సరంలో ఒక్కొక్క నెలకు వారిలో ఒక్కొక్కడు ఆహారం సరఫరా చేసే బాధ్యత వహించాడు.

8 వారెవరంటే, ఎఫ్రాయిము మన్యంలో ఉండే హూరు కొడుకు, 9 మాకస్సులో, షయల్బీములో, బేత్షెమెషులో, ఏలోన్ బేత్ హనాన్లో దెకెరు కొడుకు, 10 అరుబ్బోతులో హెసెదు కొడుకు, ఇతనికి శోకో, హెపెరు దేశాలు అప్పగించారు.

11 అబీనాదాబు కొడుక్కి దోరు మన్య ప్రదేశమంతా అప్పగించారు. సొలొమోను కూతురు టాపాతు ఇతని భార్య.

12 అహీలూదు కొడుకు బయనాకు తానాకు, మెగిద్దో, బేత్షెయాను ప్రదేశమంతా అప్పగించారు. ఇది యెజ్రెయేలు దగ్గర ఉన్న సారెతా నుండి బేత్షెయాను మొదలు ఆబేల్మెహోలా వరకూ యొక్నెయాము అవతలి స్థలం వరకూ వ్యాపించింది.

13 గెబెరు కొడుకు రామోత్గిలాదులో కాపురమున్నాడు. ఇతనికి గిలాదులో ఉన్న మనష్షే కుమారుడు యాయీరు గ్రామాలు, బాషానులో ఉన్న అర్గోబు దేశం అప్పగించారు. అది ప్రాకారాలు, ఇత్తడి అడ్డగడియలు ఉన్న 60 గొప్ప పట్టణాలున్న ప్రాంతం.

14 ఇద్దో కొడుకు అహీనాదాబు మహనయీములో ఉండగా 15 నఫ్తాలీము దేశంలో అహిమయస్సు ఉన్నాడు. ఇతడు సొలొమోను కూతురు బాశెమతును పెళ్ళి చేసుకున్నాడు.

16 ఆషేరులో, ఆలోతులో హూషై కొడుకైన బయనా ఉండేవాడు.

17 ఇశ్శాఖారు దేశంలో పరూయహు కొడుకు యెహోషాపాతు ఉండేవాడు.

18 బెన్యామీను దేశంలో ఏలా కొడుకు షిమీ ఉండేవాడు.

19 గిలాదు దేశంలో, అమోరీయుల రాజు సీహోను దేశంలో, బాషాను రాజు ఓగు దేశంలో, ఊరీ కొడుకైన గెబెరు ఉన్నాడు. అతడు ఒక్కడే ఆ దేశంలో అధికారి.

20 అయితే యూదావారూ ఇశ్రాయేలు వారూ సముద్రం ఒడ్డున ఉండే ఇసుక రేణువులంత విస్తారమైన సమూహంగా ఉండి తింటూ, తాగుతూ, సంబరపడుతూ ఉన్నారు. 21 నది (యూఫ్రటీసు) మొదలుకుని ఐగుప్తు సరిహద్దు వరకూ ఆ మధ్యలో ఉన్న రాజ్యాలన్నిటి మీదా ఫిలిష్తీయుల దేశమంతటి మీదా సొలొమోను అధికారం ఉంది. సొలొమోను బతికిన కాలమంతా ఆ ప్రజలు అతనికి పన్ను చెల్లిస్తూ, అణిగిమణిగి ఉన్నారు.

22 రోజుకి సొలొమోను భోజన సామగ్రి 600 తూముల మెత్తని గోదుమ పిండి, 1, 200 తూముల ముతక పిండి, 23 పది కొవ్విన ఎద్దులు, గడ్డి మైదానాల నుండి తెచ్చిన ఎద్దులు 20, గొర్రెలు 100. ఇవిగాక ఎర్ర దుప్పులు, దుప్పులు, జింకలు, కొవ్విన బాతులు. 24 యూఫ్రటీసు నది ఇవతల తిప్సహు నుండి గాజా వరకూ నది ఇవతల ఉన్న రాజులందరి మీదా సొలోమోనుకు అధికారముంది. అతని కాలంలో నాలుగు దిక్కులా శాంతి నెలకొంది. 25 సొలొమోను కాలమంతా ఇశ్రాయేలు వారూ యూదా వారూ దాను నుండి బెయేర్షెబా వరకూ తమ తమ ద్రాక్షచెట్ల కిందా అంజూరపు చెట్ల కిందా నిర్భయంగా నివసించారు.

2 దినవృత్తాంతాలు 2:1–2

1 సొలొమోను యెహోవా ఘనత కోసం ఒక దేవాలయాన్నీ తన రాజ్య ఘనత కోసం ఒక అంతఃపురాన్నీ కట్టాలని నిర్ణయించుకున్నాడు. 2 అందుకు బరువులు మోసేవారు 70,000 మందినీ, కొండల మీద చెట్లు కొట్టడానికి 80,000 మందినీ ఏర్పాటు చేసి వారిని అజమాయిషీ చేయడానికి 3, 600 మందిని ఉంచాడు.

1 రాజులు 5:1–12

1 తరవాత, తన తండ్రికి బదులుగా సొలొమోనుకు పట్టాభిషేకం జరిగిందని తూరు రాజు హీరాము విని తన సేవకులను సొలొమోను దగ్గరకి పంపాడు. ఎందుకంటే హీరాము దావీదుకు మంచి స్నేహితుడు. 2 అప్పుడు సొలొమోను హీరాముకు ఈ సందేశం పంపించాడు.

3 “యెహోవా నా తండ్రి అయిన దావీదు శత్రువులను అతని పాదాల కింద అణచివేసే వరకూ అన్ని వైపులా అతనికి యుధ్ధాలు ఉన్నాయి. 4 తన దేవుడు యెహోవా నామ ఘనతకు అతడు ఒక మందిరం కట్టించడానికి వీలు లేకపోయింది. ఈ సంగతి మీకు తెలుసు. ఇప్పుడైతే శత్రువులెవరూ లేకుండా, ఏ అపాయమూ కలగకుండా నా దేవుడు యెహోవా నలుదిక్కులా శాంతి నెలకొల్పాడు. 5 కాబట్టి ‘నీ సింహాసనం మీద నీకు బదులుగా నేను నిలిపే నీ కొడుకు నా నామ ఘనత కోసం ఒక మందిరం కట్టిస్తాడు’ అని యెహోవా నా తండ్రి దావీదుకు మాట ఇచ్చిన విధంగా నేను నా దేవుడు యెహోవా నామ ఘనత కోసం ఒక మందిరం కట్టించడానికి నిర్ణయించాను.

6 లెబానోనులో నా కోసం దేవదారు మానులను నరికించడానికి అనుమతి ఇవ్వండి. నా సేవకులు మీ సేవకులతో కలిసి పని చేస్తారు. ఎందుకంటే మానులు నరకడంలో సీదోనీయులకు సాటి మాలో ఎవరూ లేరు అని మీకు తెలుసు గదా. 7 మీరు నిర్ణయించిన విధంగా నేను మీ సేవకులకు జీతం ఇస్తాను” అన్నాడు.

హీరాము సొలొమోను చెప్పిన మాటలు విని చాలా సంతోషపడి “ఇంత గొప్ప జాతిగా విస్తరించిన ప్రజానీకాన్ని పాలించడానికి జ్ఞానవంతుడైన కొడుకుని దావీదుకు దయచేసిన యెహోవాకు ఈ రోజున స్తుతి కలుగు గాక” అన్నాడు. 8 అతడు సొలొమోనుకు జవాబు పంపుతూ “నీవు నాకు పంపిన సందేశాన్ని నేను అంగీకరించాను. దేవదారు, సరళ మానులను గురించి నీవు కోరినట్టే చేయిస్తాను. 9 నా సేవకులు వాటిని లెబానోను నుండి సముద్రం దగ్గరకి తెస్తారు. అప్పుడు వాటిని తెప్పలుగా కట్టించి నీవు చెప్పిన చోటికి సముద్రం మీద చేరేలా చేసి, అక్కడ వాటిని నీకు అప్పగించే ఏర్పాటు నేను చేస్తాను. నీవు వాటిని తీసుకోవచ్చు. ఇందుకు బదులుగా నీవు నా సేవకుల పోషణ కోసం ఆహారం పంపించు” అన్నాడు.

10 హీరాము సొలొమోను కోరినన్ని దేవదారు, సరళ మానులను పంపించాడు. 11 సొలొమోను హీరాముకూ అతని పరివారం పోషణకు 2,00,000 తూముల గోదుమలు, 4, 16, 350 లీటర్ల స్వచ్ఛమైన నూనె పంపించాడు. ఈ విధంగా సొలొమోను ప్రతి సంవత్సరం హీరాముకు ఇస్తూ వచ్చాడు.

12 యెహోవా సొలొమోనుకు చేసిన వాగ్దానం ప్రకారం అతనికి జ్ఞానం ప్రసాదించాడు. హీరాము, సొలొమోను సంధి చేసుకున్నారు, వారిద్దరి మధ్య శాంతి నెలకొంది.

2 దినవృత్తాంతాలు 2:3–16

3 అతడు తూరు రాజు హీరాం దగ్గరికి దూతల ద్వారా ఈ సందేశం పంపించాడు. “నా తండ్రి దావీదు తన నివాసం కోసం ఒక భవనం నిర్మించాలని అనుకున్నప్పుడు నువ్వు అతనికి దేవదారు కలపను సిద్ధం చేసి పంపించినట్టు దయచేసి నాకు కూడా ఇప్పుడు పంపించు. 4 నా దేవుడైన యెహోవా ఘనత కోసం ఆయనకు ప్రతిష్టించాలని నేను ఒక దేవాలయాన్ని కట్టించబోతున్నాను. ఆయన సన్నిధిలో సుగంధ ద్రవ్యాలతో ధూపం వేయడానికీ సన్నిధి రొట్టెలను ఎప్పుడూ ఉంచడానికీ ఉదయం, సాయంత్రం, విశ్రాంతి దినాల్లో, అమావాస్య దినాల్లో, మా దేవుడైన యెహోవాకు ఏర్పాటైన ఉత్సవాల్లో, ఇశ్రాయేలీయులు ఎప్పుడూ అర్పించాల్సిన దహనబలులు అర్పించడానికీ ఆలయం కట్టిస్తున్నాను.

5 మా దేవుడు ఇతర దేవుళ్ళందరి కంటే గొప్పవాడు కాబట్టి నేను కట్టించే దేవాలయం చాలా ఘనంగా ఉంటుంది. 6 అయితే ఆకాశాలూ మహాకాశాలూ కూడా ఆయనకు సరిపోవు. ఆయనకి దేవాలయం ఎవరు కట్టించగలరు? ఆయనకి దేవాలయం కట్టించడానికి నా స్థాయి ఎంత? ఆయన ముందు ధూపం వేయడం కోసమే నేను ఆయనకు దేవాలయం కట్టించాలని పూనుకున్నాను.

7 కాబట్టి నా తండ్రి దావీదు నియమించి, యూదా దేశంలో, యెరూషలేములో నా దగ్గర ఉంచిన నిపుణులకు సహాయకుడిగా ఉండి బంగారం, వెండి, ఇత్తడి, ఇనుములతో, ఊదా నూలుతో, ఎర్ర నూలుతో, నీలి నూలుతో చేసే పనులు, అన్ని రకాల చెక్కడపు పనుల్లో నైపుణ్యం గల వ్యక్తిని నా దగ్గరకి పంపించు.

8 ఇంకా లెబానోనులో చెట్లు నరకడానికి నీ పనివారు నిపుణులు అని నాకు తెలిసింది. 9 కాబట్టి లెబానోను నుండి సరళ మాను కలప, దేవదారు కలప, గంధపు చెక్కలు పంపించు. నేను కట్టించబోయే దేవాలయం చాల గొప్పదిగా, అద్భుతంగా ఉంటుంది కాబట్టి నాకు కలప విస్తారంగా సిద్ధపరచడానికి నా సేవకులు, నీ సేవకులు కలిసి పని చేస్తారు. 10 కలప కోసే నీ పనివారికి ఆహారంగా రెండు లక్షల తూముల గోదుమ పిండి, రెండు లక్షల తూముల బార్లీ, నాలుగు లక్షల నలభై వేల లీటర్ల ద్రాక్షారసమూ నాలుగు లక్షల నలభై వేల లీటర్ల నూనే ఇస్తాను.”

11 దానికి జవాబుగా తూరు రాజు హీరాము సొలొమోనుకు ఉత్తరం రాసి పంపించాడు. “యెహోవా తన ప్రజలను ప్రేమించి నిన్ను వారి మీద రాజుగా నియమించాడు. 12 యెహోవా ఘనత కోసం ఒక దేవాలయాన్నీ నీ రాజ్య ఘనత కోసం ఒక నగరాన్నీ కట్టించడానికి తగిన జ్ఞానమూ తెలివీ గల బుద్ధిమంతుడైన కుమారుణ్ణి దావీదు రాజుకి దయచేసిన, భూమ్యాకాశాల సృష్టికర్తా ఇశ్రాయేలీయుల దేవుడూ అయిన యెహోవాకు స్తుతి కలుగు గాక. 13 తెలివీ వివేచనా గలిగిన హూరామబీ అనే చురుకైన పనివాణ్ణి నీ దగ్గరికి పంపుతున్నాను. 14 అతడు దాను గోత్రానికి చెందిన స్త్రీకి పుట్టినవాడు. అతని తండ్రి తూరు దేశానికి చెందినవాడు. అతడు బంగారంతో, వెండితో, ఇత్తడితో, ఇనుముతో, రాళ్ళతో, కలపతో, నేరేడు రంగు నూలుతో నీలి నూలుతో, సన్నని నూలుతో, ఎర్ర నూలుతో, పని చేసే నైపుణ్యం ఉన్నవాడు. అన్ని రకాల కలప పనిలో, మచ్చులు కల్పించడంలో చెయ్యి తిరిగినవాడు. అతడు నీ పనివారికీ, నీ తండ్రీ నా ప్రభువూ అయిన దావీదు నియమించిన నిపుణులకీ సహాయకుడుగా ఉండడానికి సమర్ధుడు.

15 ఇప్పుడు నా ప్రభువైన నువ్వు చెప్పినట్టే గోదుమలూ యవలూ నూనే ద్రాక్షారసమూ నీ సేవకులతో పంపించు. 16 మేము నీకు కావలసిన కలపను లెబానోనులో కొట్టించి వాటిని తెప్పలుగా కట్టి సముద్రం మీద యొప్పే వరకూ తెస్తాము. తరువాత నువ్వు వాటిని యెరూషలేముకు తెప్పించుకోవచ్చు” అని జవాబిచ్చాడు.

1 రాజులు 5:13–18

13 సొలొమోను రాజు ఇశ్రాయేలీయులందరి చేతా బలవంతంగా వెట్టి పని చేయించాడు. వారిలో 30,000 మంది వెట్టి చాకిరీ చేసే వారయ్యారు. 14 అతడు వంతుల ప్రకారం వీరిని నెలకు 10,000 మందిని లెబానోనుకు పంపించాడు. వారు ఒక నెల లెబానోనులో, రెండు నెలలు ఇంటి దగ్గరా ఉండేవారు. ఆ వెట్టివారి మీద అదోనీరాము అధికారిగా ఉన్నాడు. 15 అంతేగాక, సొలొమోనుకి బరువులు మోసేవారు 70,000 మందీ పర్వతాల్లో మానులు నరికే వారు 80,000 మందీ ఉన్నారు.

16 వీరంతా కాక సొలొమోను పనివారిపై 3, 300 మంది అధికారులు అజమాయిషీ చేస్తుండేవారు. 17 రాజు ఆజ్ఞ ప్రకారం వారు మందిర పునాదిని చెక్కిన రాళ్లతో వేయడానికి గొప్పవి, చాలా విలువైనవి అయిన రాళ్ళు గనుల్లో నుండి తవ్వి తెప్పించారు. 18 ఈ విధంగా సొలొమోను పంపిన శిల్పకారులు, గిబ్లీయులు, హీరాము శిల్పకారులు మానులు నరికి రాళ్లను మలిచి మందిరం కట్టడానికి వాటిని సిద్ధపరిచారు.

2 దినవృత్తాంతాలు 2:17–18

17 సొలొమోను దేశంలోని అన్యజాతుల వారినందరినీ తన తండ్రి దావీదు వేయించిన అంచనా ప్రకారం వారిని లెక్కించినప్పుడు వారు 1, 53, 600 అయ్యారు. 18 వీరిలో బరువులు మోయడానికి 70,000 మందినీ కొండలపై చెట్లు నరకడానికి 80,000 మందినీ వారి పైన అజమాయిషీ చేయడానికి 3, 600 మందినీ అతడు నియమించాడు.

షిమీ మరణం క్రీ.పూ. 1011

1 రాజులు 2:39–46

39 అయితే మూడు సంవత్సరాల తరవాత షిమీ పనివారిలో ఇద్దరు పారిపోయి మయకా కుమారుడు ఆకీషు అనే గాతు రాజు దగ్గరకి చేరారు. అప్పుడు “నీ మనుషులు గాతులో ఉన్నారు” అని షిమీకి వార్త వచ్చింది. 40 షిమీ లేచి గాడిదకు గంతకట్టి తన పనివారిని వెదకడానికి గాతులోని ఆకీషు దగ్గరకి వెళ్ళి, అక్కడి నుండి తన పనివారిని తీసుకువచ్చాడు.

41 షిమీ యెరూషలేమును విడిచి గాతుకు వెళ్ళి వచ్చాడని సొలొమోనుకు తెలిసింది. 42 రాజు షిమీని పిలిపించి అతనితో “నీవు ఏ రోజున బయలుదేరి బయటికి వెళ్తావో యెహోవా తోడు, ఆ రోజు నీవు కచ్చితంగా చచ్చిపోతావు అని నేను నీకు ఖండితంగా ఆజ్ఞాపించి, నీచేత ప్రమాణం చేయించాను గదా? పైగా, ‘మీరు చెప్పిందే మంచిది’ అని నీవు కూడా ఒప్పుకున్నావు. 43 కాబట్టి యెహోవా తోడని నీవు చేసిన ప్రమాణాన్ని, నేను నీకిచ్చిన ఆజ్ఞను నీవెందుకు పాటించలేదు?” అని అడిగాడు. 44 “నీవు నా తండ్రి దావీదుకు చేసిన కీడంతా నీకు బాగానే తెలుసు. నీవు చేసిన కీడు యెహోవా నీ తల మీదికే రప్పిస్తాడు. 45 అయితే రాజైన సొలొమోను ఆశీర్వాదం పొందుతాడు. దావీదు సింహాసనం యెహోవా సన్నిధిలో చిరకాలం సుస్థిరమౌతుంది” అని షిమీతో చెప్పి 46 రాజు యెహోయాదా కొడుకు బెనాయాకు ఆజ్ఞాపించగానే అతడు షిమీ మీద పడి అతనిని చంపాడు. ఈ విధంగా రాజ్యం సొలొమోను పాలనలో స్థిరపడింది.

సొలొమోను వివాహం

1 రాజులు 3:1–2

1 తరువాత సొలొమోను వివాహం ద్వారా ఐగుప్తు రాజు ఫరోతో సంధి కుదుర్చుకున్నాడు. అతడు తన అంతఃపురాన్నీ యెహోవా మందిరాన్నీ యెరూషలేము చుట్టూ ప్రాకారాన్నీ కట్టించడం అయ్యే దాకా ఫరో కూతురిని దావీదు పురంలో ఉంచాడు. 2 అప్పటి వరకూ యెహోవా పేరట కట్టిన మందిరం లేనందువలన ప్రజలు ఉన్నత స్థలాల్లో మాత్రమే బలులు అర్పిస్తూ వచ్చారు.