కాలం 5: సొలొమోను పాలన

భాగం 1: దేవాలయ ప్రతిష్ఠకు ముందు సొలొమోను పాలన

గిబియోనులో సొలొమోను అర్పణ, అతని తీర్పు

గిబియోనులో సొలొమోను అర్పణ. సొలొమోను తీర్పు. అదోనీయా మరణం. హదదు తిరిగిరావడం.

క్రీ.పూ. 1015

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

1 రాజులు 2:12

12 అప్పుడు సొలొమోను తన తండ్రి అయిన దావీదు సింహాసనం మీద కూర్చున్నాడు. అతని రాజ్యం సుస్థిరం అయింది.

2 దినవృత్తాంతాలు 1:1

1 దావీదు కుమారుడు సొలొమోను తన పరిపాలనలో చక్కగా స్థిరపడ్డాడు. అతని దేవుడు యెహోవా అతనికి తోడుగా ఉండి అతణ్ణి చాలా శక్తిశాలిగా చేశాడు.

1 రాజులు 3:3

3 సొలొమోను తన తండ్రి దావీదు నియమించిన శాసనాలు అనుసరిస్తూ యెహోవా దేవుణ్ణి ప్రేమించాడు గాని ఉన్నత స్థలాల్లో మాత్రం ఇంకా బలులు అర్పిస్తూ ధూపం వేస్తూనే ఉన్నాడు.

2 దినవృత్తాంతాలు 1:2–6

2 సొలొమోను దాని గురించి ఇశ్రాయేలీయులందరికీ అంటే సహస్రాధిపతులతో శతాధిపతులతో న్యాయాధిపతులతో ఇశ్రాయేలీయుల పూర్వీకుల కుటుంబాల పెద్దలతో మాట్లాడాడు. 3 అప్పుడు వారంతా సొలొమోనుతో కలసి గిబియోనులో ఉన్న బలిపీఠం దగ్గరికి వెళ్ళారు. యెహోవా సేవకుడు మోషే అరణ్యంలో చేయించిన దేవుని ప్రత్యక్ష గుడారం గిబియోనులో ఉంది.

4 దావీదు రాజుగా ఉన్నప్పుడు అతడు దేవుని మందసాన్ని కిర్యత్యారీము నుండి తెప్పించి యెరూషలేములో తాను సిద్ధం చేసిన చోట గుడారం వేసి అక్కడ ఉంచాడు. 5 అక్కడ యెహోవా నివాసస్థలం ముందు హూరు మనవడు ఊరీ కొడుకు బెసలేలు చేసిన ఇత్తడి బలిపీఠం ఉంది. సొలొమోను, సమాజం వారంతా దాని దగ్గర విచారణ చేశారు. 6 సొలొమోను ప్రత్యక్ష గుడారం దగ్గర యెహోవా సన్నిధి లోని ఇత్తడి బలిపీఠం దగ్గరకి వెళ్లి దాని మీద వెయ్యి దహనబలులు అర్పించాడు.

1 రాజులు 3:5–28

5 గిబియోనులో యెహోవా రాత్రి కలలో సొలొమోనుకు ప్రత్యక్షమై “నేను నీకు ఏమి ఇవ్వాలి?” అని అడిగాడు. 6 సొలొమోను ఈ విధంగా వేడుకున్నాడు “నీ దాసుడు, నా తండ్రి అయిన దావీదు నీ దృష్టికి అనుకూలంగా సత్యాన్ని, నీతిని అనుసరించి యథార్థమైన మనసు కలిగి ప్రవర్తించాడు. కాబట్టి నీవు అతని మీద పరిపూర్ణ కటాక్షం చూపించి, ఈ రోజు ఉన్నట్టుగా అతని సింహాసనం మీద అతని కుమారుణ్ణి కూర్చోబెట్టి అతని పై గొప్ప అనుగ్రహం చూపించావు.

7 నా దేవా, యెహోవా, నీవు నా తండ్రి దావీదుకు బదులుగా నీ సేవకుడైన నన్ను రాజుగా నియమించావు. అయితే నేను బాలుణ్ణి. రాజ్య వ్యవహారాలు జరిపించడానికి నాకు తెలివి చాలదు. 8 నీ దాసుడినైన నేను నీవు ఎన్నుకొన్న ప్రజల మధ్య ఉన్నాను. వారు గొప్ప జనాంగం కాబట్టి వారిని లెక్క పెట్టడం, ఈ విశాలమైన దేశాన్ని అజమాయిషీ చేయడం నాకు అసాధ్యం. 9 నీ ఈ గొప్ప జనాంగానికి ఎవరు న్యాయం తీర్చగలరు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ ప్రజలకు న్యాయం తీర్చగలిగేలా నీ దాసుడినైన నాకు వివేకం గల హృదయం ఇవ్వు.”

10 సొలొమోను చేసిన ఈ మనవి దేవునికి ఇష్టమైంది. 11 కాబట్టి దేవుడు అతనితో “దీర్ఘాయువునూ ఐశ్వర్యాన్నీ, నీ శత్రువుల ప్రాణాలనూ అడగకుండా, న్యాయాన్ని గ్రహించడానికి వివేకం ఇమ్మని నీవు అడిగావు. 12 నీవు ఈ విధంగా అడిగినందువల్ల నీ మనవి ఆలకించాను. జ్ఞాన వివేకాలు గల హృదయం నీకిస్తున్నాను. పూర్వికుల్లో నీవంటివాడు ఒక్కడూ లేడు, ఇక మీదట ఉండడు. 13 ఇంకో విషయం, నీవు ఐశ్వర్యాన్ని, ఘనతను ఇమ్మని అడక్కపోయినా నేను వాటిని కూడా నీకిస్తున్నాను. కాబట్టి నీ జీవిత కాలం అంతటిలో రాజుల్లో నీలాంటివాడు ఒక్కడైనా ఉండడు. 14 నీ తండ్రి దావీదు నా మార్గాల్లో నడిచి, నా కట్టడలనూ నా ఆజ్ఞలనూ నెరవేర్చినట్టు నీవు కూడా నడుచుకుంటే నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేస్తాను” అన్నాడు.

15 అంతలో సొలొమోను మేలుకుని అది కల అని గ్రహించాడు. తరవాత అతడు యెరూషలేముకు వచ్చి యెహోవా నిబంధన ఉన్న మందసం ఎదుట నిలబడి దహనబలులూ సమాధానబలులూ అర్పించి తన సేవకులందరికి విందు చేయించాడు.

16 ఆ తరవాత ఇద్దరు వేశ్యలు రాజు దగ్గరకి వచ్చి అతని ఎదుట నిలబడ్డారు. 17 వారిలో ఒక స్త్రీ ఇలా వేడుకుంది “నా యజమానీ, నేనూ ఈమె ఒకే ఇంట్లో నివసిస్తున్నాం. ఆమెతో బాటు అదే ఇంట్లో నేనొక కొడుకుని కన్నాను. 18 నేను కనిన తరవాత మూడో రోజు ఈమె కూడా ఒక కొడుకుని కన్నది. మేమిద్దరమూ కలిసే ఉన్నాం. మేము తప్ప ఇంట్లో ఇంకెవరూ లేరు. 19 అయితే రాత్రి ఈమె పడకలో తన పిల్లవాడి మీద పడడం వలన ఆమె కొడుకు చనిపోయాడు. 20 కాబట్టి మధ్య రాత్రిలో ఈమె లేచి నీ దాసినైన నేను నిద్రపోతుండగా నా పక్కలో నుండి నా కొడుకుని తీసుకుని తన పక్కలో పెట్టుకుని, చచ్చిన తన పిల్లవాణ్ణి నా పక్కలో ఉంచింది. 21 ఉదయం నేను లేచి నా పిల్లవాడికి పాలివ్వడానికి చూస్తే వాడు చనిపోయి ఉన్నాడు. తరవాత నేను వాడిని జాగ్రత్తగా పరిశీలించి చూస్తే వాడు నా కడుపున పుట్టినవాడు కాడని గ్రహించాను.”

22 అంతలో రెండో స్త్రీ “అలా కాదు, బతికి ఉన్నవాడు నా కొడుకు. చచ్చినవాడు ఆమె కొడుకు” అని చెప్పింది. అప్పుడా మొదటి స్త్రీ “కాదు, చచ్చిన వాడే నీ కొడుకు, బతికి ఉన్నవాడు నా కొడుకు” అంది. ఈ విధంగా వారు రాజు ఎదుట వాదించుకున్నారు.

23 అప్పుడు రాజు “బతికి ఉన్నవాడు నా కొడుకు, చనిపోయిన వాడు నీ కొడుకు అని ఒకామె, కాదు, కాదు చనిపోయిన వాడు నీ కొడుకు, బతికి ఉన్నవాడు నా కొడుకు అని రెండవ ఆమె చెబుతున్నది. 24 కాబట్టి ఒక కత్తి తీసుకు రండి” అని ఆజ్ఞ ఇచ్చాడు. వారు రాజు దగ్గరికి ఒక కత్తి తెచ్చారు. 25 రాజు “బతికి ఉన్న పిల్లవాణ్ణి రెండు ముక్కలు చేసి సగం ఈమెకూ, సగం ఆమెకూ ఇయ్యండి” అని ఆజ్ఞాపించాడు. 26 ఆ మాటలకు ఆ పిల్లవాడి తల్లి తన బిడ్డ విషయం పేగులు తరుక్కుపోయి, రాజుతో “రాజా, పిల్లవాణ్ణి ఎంతమాత్రం చంపవద్దు, వాణ్ణి ఆమెకే ఇప్పించండి” అని వేడుకుంది. ఆ రెండవ స్త్రీ “ఆ పిల్లవాడు నాకైనా ఆమెకైనా కాకుండా చెరి సగం చేయండి” అంది. 27 అందుకు రాజు “బతికి ఉన్న ఆ బిడ్డను చంపవద్దు. వాడిని ఆ మొదటి స్త్రీకి ఇవ్వండి. ఆమే వాడి తల్లి” అని తీర్పు చెప్పాడు. 28 అప్పుడు ఇశ్రాయేలీయులందరూ రాజు తీర్చిన తీర్పును గురించి విని న్యాయం విచారించడంలో రాజు దైవజ్ఞానం పొందిన వాడని గ్రహించి అతనికి భయపడ్డారు.

2 దినవృత్తాంతాలు 1:13

13 తరువాత సొలొమోను గిబియోనులో ఉన్న సమాజపు గుడారం ముందున్న బలిపీఠం దగ్గర నుంచి యెరూషలేముకు వచ్చి ఇశ్రాయేలీయులను పరిపాలించసాగాడు.

1 రాజులు 2:13–38

13 అప్పుడు హగ్గీతు కొడుకు అదోనీయా సొలొమోను తల్లి అయిన బత్షెబ దగ్గరికి వచ్చాడు. ఆమె “శాంతంగా వస్తున్నావా?” అని అతణ్ణి అడిగింది.

అతడు “శాంతంగానే వస్తున్నాను” అని చెప్పి, 14 తరువాత అతడు “నీతో చెప్పాల్సిన మాట ఒకటి ఉంది” అన్నాడు.

ఆమె “ఏమిటో చెప్పు” అంది.

15 అతడు “రాజ్యం నిజానికి నాదే అనీ, నేను వారిని పరిపాలిస్తాననీ ఇశ్రాయేలీయులందరూ నేనే రాజునౌతానని చూశారు. అయితే అలా జరక్కుండా రాజ్యం నా సోదరునికి దక్కింది. అది యెహోవా సంకల్పం వలన అతనిది అయింది. 16 ఇప్పుడు నాదొక మనవి. కాదనవద్దు” అన్నాడు.

17 ఆమె “చెప్పు” అంది.

అతడు “షూనేమీయురాలైన అబీషగును నాకు భార్యగా ఇమ్మని దయచేసి నీవు సొలొమోనుతో చెప్పాలి. నీవు చెబితే అతడు కాదనడు” అన్నాడు.

18 బత్షెబ “మంచిది, నేను రాజుతో మాట్లాడుతాను” అంది.

19 బత్షెబ రాజైన సొలొమోను దగ్గరకి అదోనీయా తరపున మాట్లాడటానికి వెళ్ళింది. రాజు లేచి ఆమెకు ఎదురు వచ్చి నమస్కారం చేశాడు. అతడు తన సింహాసనం మీద కూర్చుని తన తల్లి కోసం ఒక ఆసనం వేయించాడు. ఆమె అతని కుడి పక్కన కూర్చుంది.

20 ఆమె అతనితో “నాదొక చిన్న కోరిక. నా మాట కాదనవద్దు” అంది.

రాజు “అమ్మా, చెప్పు. నీ మాట కాదనను” అన్నాడు.

21 అప్పుడామె “నీ అన్న అదోనీయాకి షూనేమీయురాలైన అబీషగుని పెళ్లాడనీ” అంది.

22 అందుకు సొలొమోను “షూనేమీయురాలైన అబీషగును మాత్రమే అదోనీయా కోసం ఎందుకు అడుగుతున్నావు? అతడు నా అన్న కాబట్టి అతని కోసం, యాజకుడు అబ్యాతారు కోసం, సెరూయా కొడుకు యోవాబు కోసం రాజ్యాన్నే అడగవచ్చు కదా” అని తన తల్లితో అన్నాడు.

23 అప్పుడు రాజైన సొలొమోను ఇలా శపథం చేశాడు. “యెహోవా తోడు, అదోనీయా పలికిన ఈ మాట వలన అతని ప్రాణం తీయించకపోతే దేవుడు నాకు అంతకంటే ఎక్కువ కీడు చేస్తాడు గాక. 24 నన్ను స్థిరపరచి, నా తండ్రి సింహాసనం మీద నన్ను కూర్చోబెట్టి, తన వాగ్దానం ప్రకారం నాకు ఒక రాజవంశాన్ని కలగజేసిన యెహోవా జీవం తోడు, అదోనీయా ఈ రోజు మరణిస్తాడు” అన్నాడు. 25 అతడు యెహోయాదా కొడుకు బెనాయాను పంపగా అతడు వెళ్ళి అదోనీయాపై దాడి చేసి అతణ్ణి చంపాడు.

26 తరువాత రాజు యాజకుడైన అబ్యాతారుతో “అనాతోతులో ఉన్న నీ పొలాలకు వెళ్ళిపో. నీవు మరణానికి పాత్రుడివయ్యావు గాని, నీవు నా తండ్రి అయిన దావీదు ఎదుట యెహోవా దేవుని మందసాన్ని మోసి, నా తండ్రి పొందిన కష్టాలన్నిటిలో పాలు పొందావు కాబట్టి ఈ రోజు నిన్ను చంపను” అని చెప్పాడు. 27 తరువాత సొలొమోను అబ్యాతారును యెహోవాకు యాజకునిగా ఉండకుండాా తొలగించాడు. ఈ విధంగా యెహోవా ఏలీ కుటుంబికులను గురించి షిలోహులో చెప్పిన మాట నెరవేరింది. 28 యోవాబు అబ్షాలోమును సమర్ధించక పోయినా, అదోనీయాను సమర్ధించడాన్ని బట్టి ఈ వార్తలు అతనికి చేరగానే అతడు భయపడి పారిపోయి యెహోవా గుడారం లోకి వెళ్ళి బలిపీఠం కొమ్ములు పట్టుకున్నాడు.

29 యోవాబు పారిపోయి యెహోవా గుడారంలో బలిపీఠం దగ్గర ఉన్నాడని సొలొమోనురాజుకు తెలిసింది. అతడు యెహోయాదా కొడుకు బెనాయాను పిలిచి “నీవు వెళ్లి అతని మీద పడి చంపు” అని ఆజ్ఞాపించాడు.

30 బెనాయా యెహోవా గుడారానికి వచ్చి “రాజు నిన్ను బయటికి రమ్మంటున్నాడు” అని యోవాబుతో చెప్పాడు.

అతడు “రాను, నేనిక్కడే చనిపోతాను” అని జవాబిచ్చాడు. బెనాయా రాజు దగ్గరకి తిరిగి వచ్చి యోవాబు మాటలు అతనితో చెప్పాడు.

31 అందుకు రాజు ఇలా అన్నాడు. “అతడు నీతో చెప్పినట్టే చెయ్యి. అక్కడే అతణ్ణి చంపి పాతిపెట్టి, అతడు ఒలికించిన నిరపరాధుల రక్తాన్ని నా నుండీ, నా తండ్రి కుటుంబం నుండీ తొలగిపోయేలా చెయ్యి. 32 నేరు కొడుకు, ఇశ్రాయేలు వారి సైన్యాధిపతి అయిన అబ్నేరు, యెతెరు కొడుకు, యూదా వారి సైన్యాధిపతి అయిన అమాశా అనే తనకంటే నీతిపరులు, యోగ్యులు అయిన ఈ ఇద్దరినీ నా తండ్రి అయిన దావీదుకు తెలియకుండా యోవాబు చంపాడు కాబట్టి అతడు ఒలికించిన రక్తం యెహోవా అతని తల మీదికే రప్పిస్తాడు. 33 అంతే గాక వారి ప్రాణ దోషానికి యోవాబు, అతని సంతతివారే ఎన్నటికీ బాధ్యులు గానీ దావీదుకు, అతని సంతతికి, అతని వంశానికి, అతని సింహాసనానికి ఎన్నటెన్నటికీ యెహోవా శాంతి సమాధానాలు ఉంటాయి.”

34 కాబట్టి యెహోయాదా కొడుకు బెనాయా వెళ్ళి యోవాబు మీద పడి అతణ్ణి చంపాడు. అతణ్ణి అరణ్యంలో ఉన్న తన ఇంట్లోనే పాతిపెట్టారు. 35 రాజు అతని స్థానంలో యెహోయాదా కొడుకు బెనాయాను సేనాధిపతిగా నియమించాడు. రాజు అబ్యాతారుకు బదులు సాదోకును యాజకుడుగా నియమించాడు.

36 తరువాత రాజు షిమీని పిలిపించి అతనితో ఇలా చెప్పాడు. “నీవు యెరూషలేములో ఇల్లు కట్టించుకుని బయటకి ఎక్కడికీ వెళ్లకుండా అందులోనే నివసించు. 37 నీవు ఏ రోజైతే బయటికి వచ్చి, కిద్రోను వాగు దాటుతావో ఆ రోజున నీవు కచ్చితంగా చస్తావని తెలుసుకో. నీ ప్రాణానికి నీవే బాధ్యుడివి.” 38 అప్పుడు షిమీ “మీరు చెప్పింది మంచిదే. నా యజమాని, రాజు అయిన మీరు చెప్పిన ప్రకారమే తమ సేవకుణ్ణి అయిన నేను చేస్తాను” అని రాజుతో చెప్పాడు.

షిమీ యెరూషలేములో చాలా కాలం నివసించాడు.

1 రాజులు 11:21–22

21 దావీదు తన పుర్వికులతో కన్నుమూశాడని, అతని సైన్యాధిపతి యోవాబు చనిపోయాడని ఐగుప్తు దేశంలో హదదు విన్నాడు. అతడు “నేను నా స్వదేశానికి వెళ్లడానికి సెలవివ్వండి” అని ఫరోతో మనవి చేశాడు. 22 ఫరో “నీవు నీ స్వదేశానికి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు? నాదగ్గర నీకేం తక్కువయింది?” అని అడిగాడు. అందుకు హదదు “నాకేమీ తక్కువ కాలేదు, కానీ మీరు నన్ను తప్పక వెళ్లనివ్వండి” అన్నాడు.

1 రాజులు 3:4

4 ఉన్నత స్థలాల్లో గిబియోను ముఖ్యమైనది కాబట్టి రాజు అక్కడికి వెళ్ళి ఆ బలిపీఠం మీద వెయ్యి దహనబలులు అర్పించాడు.

2 దినవృత్తాంతాలు 1:7–12

7 ఆ రాత్రి దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షమయ్యాడు. “నేను నీకు ఏమి ఇవ్వాలో అడుగు” అన్నాడు.

8 సొలొమోను దేవునితో ఇలా మనవి చేశాడు. “నీవు నా తండ్రి దావీదు మీద ఎంతో నిబంధన కృప చూపించి అతని స్థానంలో నన్ను రాజుగా నియమించావు. 9 కాబట్టి యెహోవా దేవా, నీవు నా తండ్రి దావీదుకు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చు. నేల ధూళి వలే ఉన్న విస్తారమైన ప్రజలకు నీవు నన్ను రాజును చేశావు. 10 ఇంత గొప్ప జన సమూహానికి న్యాయం తీర్చే శక్తి ఎవరికుంది? నేను ఈ ప్రజల మధ్య పనులు చక్కపెట్టడానికి సరిపడిన జ్ఞానమూ తెలివీ నాకు దయచెయ్యి.”

11 అందుకు దేవుడు సొలొమోనుతో ఇలా అన్నాడు. “నీవు ఈ విధంగా ఆలోచించి, ఐశ్వర్యాన్నీ ధనాన్నీ ఘనతనీ నీ శత్రువుల ప్రాణాన్నీ దీర్ఘాయుష్షునూ అడగకుండా, నేను ఎవరి మీదైతే నిన్ను రాజుగా నియమించానో ఆ నా ప్రజలకి న్యాయం తీర్చడానికి కావలసిన జ్ఞానాన్నీ తెలివినీ అడిగావు. 12 కాబట్టి జ్ఞానం, తెలివీ రెండూ నీకిస్తాను. అంతేగాక నీకు ముందు గానీ, నీ తరవాత గానీ వచ్చే రాజులకెవరికీ లేనంత ఐశ్వర్యాన్నీ ధనాన్నీ గొప్ప పేరునూ నీకిస్తాను.”