సొలొమోనుకు దావీదు ఆదేశం
క్రీ.పూ. 1015
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
1 దావీదు చనిపోయే కాలం సమీపించినపుడు అతడు తన కొడుకు సొలొమోనుకు ఈ విధంగా ఆజ్ఞాపించాడు, 2 “మనుషులందరి లాగా నేనూ ఈ లోకం వదిలి వెళబోతున్నాను. కాబట్టి నీవు ధైర్యం తెచ్చుకుని నిబ్బరంగా ఉండు. 3 నీ దేవుడు యెహోవా నీకు అప్పగించిన దాన్ని కాపాడి, ఆయన మార్గాలను అనుసరించి నడుచుకో. నీవు ఏ పని చేపట్టినా, ఎక్కడికి వెళ్ళినా అన్నిటిలో వర్దిల్లుతావు. మోషే ధర్మశాస్త్రంలో రాసి ఉన్న దేవుని శాసనాలకూ ఆయన నియమించిన ధర్మమంతటికీ ఆయన న్యాయవిధులకూ ఉపదేశాలకూ విధేయుడివై ఉండు. 4 అప్పుడు ‘నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండి నా ఎదుట తమ పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో సత్యాన్ని అనుసరించి నడుచుకున్నంత కాలం నీ సంతానంలో ఇశ్రాయేలు రాజ్య సింహాసనం మీద కూర్చునే వాడు ఒకడు నీకు ఉండకుండాా పోడు’ అని యెహోవా నాకు ప్రమాణం చేసిన మాటను స్థిరపరుస్తాడు.
5 అయితే సెరూయా కొడుకు యోవాబు నాకు చేసిన కీడు నీకు తెలుసు. అతడు ఇశ్రాయేలు సేనాధిపతులైన నేరు కొడుకు అబ్నేరుకీ, యెతెరు కొడుకు అమాశాకీ చేసినదీ నీకు తెలుసు. అతడు వారిని చంపి యుద్ధ సమయంలో చేసినట్టు శాంతి సమయంలో కూడా రక్తం ఒలికించి తన నడికట్టు మీదా తన చెప్పుల మీదా రక్తం మరకలు అయ్యేలా చేసుకున్నాడు. 6 అతని విషయంలో నీకు ఏది తోస్తే అది చేయవచ్చు. అతని నెరసిన తలను సమాధికి ప్రశాంతంగా దిగిపోనియ్యవద్దు. 7 నేను నీ సోదరుడు అబ్షాలోము నుండి పారిపోతున్నప్పుడు, గిలాదు వాడైన బర్జిల్లయి కుమారులు నాకు సహాయం చేశారు. నీవు వారి మీద దయ చూపి, నీ బల్ల దగ్గర భోజనం చేసే వారిలో వారికి స్థానం ఇవ్వు. 8 ఇంకా బెన్యామీనీయుడు, గెరా కొడుకు, బహూరీము ఊరివాడు షిమీ నీ దగ్గర ఉన్నాడు. నేను మహనయీముకు వెళ్తుండగా అతడు నన్ను ఘోరంగా దూషించాడు. నన్ను ఎదుర్కోడానికి అతడు యొర్దాను నది దగ్గరికి దిగి వచ్చినప్పుడు, ‘యెహోవా జీవం తోడు, కత్తితో నేను నిన్ను చంపను’ అని ప్రమాణం చేశాను. 9 అలాగని అతనిని నిర్దోషిగా ఎంచవద్దు. నీవు తెలివైన వాడివి కాబట్టి అతణ్ణి ఏమి చెయ్యాలో అది నీకు తెలుసు. వాడి నెరసిన తలను రక్తంతో సమాధిలోకి వెళ్ళేలా చెయ్యి.”
దావీదు చివరి మాటలు
1 దావీదు చివరి మాటలు ఇవే. యెష్షయి కుమారుడు, యాకోబు దేవుని చేత అభిషిక్తుడైన వాడు, మహా ఘనత పొందినవాడు, ఇశ్రాయేలీయుల మధుర వాగ్గేయకారుడు అయిన దావీదు పలికిన దేవోక్తి ఇదే.
2 “యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుతున్నాడు ఆయన వాక్కు నా నాలుకపై ఉంది.
3 ఇశ్రాయేలీయుల దేవుడు మాటలాడుతున్నాడు. ఇశ్రాయేలీయుల ఆశ్రయదుర్గం పలికాడు. మనుషులను నీతిన్యాయాలతో పరిపాలించేవాడు, దేవునిపట్ల భయభక్తులు కలిగి ఏలేవాడు,
4 అతడు సూర్యోదయాన తొలిసంధ్య కాంతిలాగా మబ్బు లేని ఉదయం లాగా వాన వెలిసిన తరువాత కాంతులీనే కిరణాల్లో మొలకెత్తిన లేత గడ్డిలాగా ఉంటాడు.
5 నా సంతానం దేవుని ఎదుట అలాటి వారు కాకపోయినా ఆయన నాతో నిత్య నిబంధన చేయలేదా? ఆ నిబంధన అన్నివిధాలా సంపూర్ణమైనది, సుస్థిరమైనది కాదా? ఆయన నాకు ధారాళమైన రక్షణ చేకూర్చి, అంతా సఫలమయ్యేలా చేస్తాడు.
6 ముళ్ళను అవతల పారవేసినట్టు దుర్మార్గులను విసిరి వేయడం జరుగుతుంది. ఎందుకంటే వారు చేత్తో పట్టుకోలేని ముళ్ళలాగా ఉన్నారు.
7 ఇనుప పరికరమైనా, ఈటె కోల అయినా లేకుండా మనుషులు ముళ్ళను తాకరు. దేనినీ వదలకుండా వాటన్నిటినీ ఉన్న చోటనే తగలబెడతారు.”
దావీదు మరణం
26 యెష్షయి కొడుకు దావీదు, ఇశ్రాయేలీయులందరి మీద రాజుగా ఉన్నాడు. 27 అతడు ఇశ్రాయేలీయులను ఏలిన కాలం నలభై సంవత్సరాలు. హెబ్రోనులో ఏడు సంవత్సరాలు, యెరూషలేములో ముప్ఫై మూడు సంవత్సరాలు అతడు ఏలాడు. 28 అతడు వృద్ధాప్యం వచ్చినప్పుడు ఐశ్వర్యం, ఘనత కలిగి, మంచి పండు వృద్ధాప్యంలో మరణించాడు. అతని తరువాత అతని కొడుకు సొలొమోను అతనికి బదులుగా రాజయ్యాడు.
29 రాజైన దావీదు సాధించిన విజయాలు ప్రవక్త సమూయేలు రాసిన చరిత్రలోను, ప్రవక్త నాతాను రాసిన చరిత్రలోను, ప్రవక్త గాదు రాసిన చరిత్రలోను ఉన్నాయి. 30 అతని పరిపాలన చర్యలు, అతని విజయాలు, అతనికీ, ఇశ్రాయేలీయులకూ, ఇతర రాజ్యాలన్నిటికీ జరిగిన పరిణామాల గూర్చి వారు రాశారు.
10 ఆ తరవాత దావీదు చనిపోయి తన పూర్వీకులను చేరుకున్నాడు. ప్రజలు అతణ్ణి దావీదు పట్టణంలో సమాధి చేశారు. 11 దావీదు ఇశ్రాయేలీయులను పాలించిన కాలం 40 సంవత్సరాలు. అతడు హెబ్రోనులో 7 సంవత్సరాలు, యెరూషలేములో 33 సంవత్సరాలు పాలించాడు.