ప్రజల రెండవ సభ

క్రీ.పూ. 1015

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

1 దినవృత్తాంతాలు 29:1–19

1 తరువాత రాజైన దావీదు సంఘంతో “దేవుడు కోరుకున్న నా కొడుకు సొలొమోను ఇంకా అనుభవం లేని చిన్నవాడే. కట్టే ఈ ఆలయం మనిషి కోసం కాదు. ఇది దేవుడైన యెహోవా కోసం గనుక, ఈ పని చాలా గొప్పది.

2 నేను చాలా ప్రయాసపడి నా దేవుని మందిరానికి కావలసిన బంగారపు పనికి బంగారం, వెండి పనికి వెండి, ఇత్తడి పనికి ఇత్తడి, ఇనుప పనికి ఇనుము, కర్ర పనికి కర్ర, గోమేధికపు రాళ్ళు, చెక్కుడు రాళ్ళు, వింతైన రంగులున్న అనేక రకాల రాళ్ళు, చాలా విలువైన అనేక రకాల రత్నాలు, తెల్ల పాల రాయి విస్తారంగా సంపాదించాను.

3 ఇంకా, నా దేవుని మందిరం మీద నాకున్న మక్కువతో నేను ఆ ప్రతిష్ఠిత మందిరం నిమిత్తం సంపాదించిన వస్తువులు కాకుండా, నా సొంత బంగారం, వెండి, నా దేవుని మందిరం నిమిత్తం నేను ఇస్తున్నాను. 4 గదుల గోడల రేకు అతకడం కోసం బంగారపు పనికి బంగారం, వెండి పనికి వెండి, పనివాళ్ళు చేసే ప్రతి విధమైన పనికి ఆరువేల మణుగుల ఓఫీరు బంగారం, పద్నాలుగు వేల మణుగుల స్వచ్ఛమైన వెండిని ఇస్తున్నాను.

5 ఈ రోజు యెహోవాకు ప్రతిష్టితంగా, మనస్పూర్తిగా ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా?” అన్నాడు. 6 అప్పుడు పూర్వీకుల ఇళ్ళకు అధిపతులూ, ఇశ్రాయేలీయుల గోత్రపు అధిపతులూ, సహస్రాధిపతులూ, శతాధిపతులూ, రాజు పని మీద నియామకం అయిన అధిపతులూ కలసి 7 మనస్పూర్తిగా దేవుని మందిరపు పనికి 188 మణుగుల బంగారం, 10,000 మణుగుల బంగారపు నాణాలు, 375 మణుగుల వెండి, 675 మణుగుల ఇత్తడి, 3, 750 మణుగుల ఇనుము ఇచ్చారు. 8 తమ దగ్గర రత్నాలున్న వాళ్ళు వాటిని తెచ్చి యెహోవా మందిరపు గిడ్డంగులకు అధిపతిగా ఉన్న గెర్షోనీయుడైన యెహీయేలుకు ఇచ్చారు. 9 వాళ్ళు పూర్ణమనస్సుతో యెహోవాకు ఇచ్చారు గనుక ఆ విధంగా మనస్పూర్తిగా ఇచ్చినందుకు ప్రజలు సంతోషపడ్డారు.

10 రాజైన దావీదు కూడా ఎంతో సంతోషపడి, సమావేశం అందరి ఎదుటా యెహోవాకు స్తోత్రాలు చెల్లిస్తూ “మాకు తండ్రిగా ఉన్న ఇశ్రాయేలీయుల దేవా, యెహోవా, నిరంతరం నువ్వు స్తోత్రానికి అర్హుడవు. 11 యెహోవా, భూమ్యాకాశాల్లో ఉన్న సమస్తం నీ వశం. మహాత్యం, పరాక్రమం, ప్రభావం, తేజస్సు, ఘనత నీకే చెందుతాయి. యెహోవా, రాజ్యం నీది. నువ్వు అందరిమీదా నిన్ను అధిపతిగా హెచ్చించుకొన్నావు. 12 ఐశ్వర్యం, గొప్పతనం, నీ వలన కలుగుతాయి. నువ్వు సమస్తం ఏలే వాడవు. బలం, పరాక్రమం నీ దానాలు. హెచ్చించేదీ, అందరికి బలం ఇచ్చేదీ నువ్వే. 13 మా దేవా, మేము నీకు కృతజ్ఞత, స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభావం గల నీ పేరును కొనియాడుతున్నాం.

14 ఈ విధంగా మనస్పూర్తిగా ఇచ్చే సామర్ధ్యం మాకు కలగడానికి నేను ఏమాత్రం వాణ్ణి? నా ప్రజలు ఏమాత్రం వాళ్ళు? అన్నీ నీ వలనే కలిగాయి గదా? నీ దానిలో నుంచి కొంత మేము నీకిచ్చాం. 15 మా పూర్వీకులందరిలా మేము కూడా నీ సన్నిధిలో అతిథులంగా, పరదేశులంగా ఉన్నాం. మా భూనివాస కాలం ఒక నీడ లాంటిది. శాశ్వతంగా ఉండేవాడు ఒక్కడూ లేడు.

16 మా దేవా యెహోవా, నీ పవిత్ర నామ ఘనత కోసం మందిరం కట్టించడానికి మేము సమకూర్చిన ఈ వస్తువులన్నీ నీ వల్ల కలిగినవే. ఇదంతా నీదే. 17 నా దేవా, నువ్వు హృదయాన్ని చూస్తూ, నిజాయితీ ఉన్నవాళ్ళను ఇష్టపడుతున్నావని నాకు తెలుసు. నేనైతే నిజాయితీగా ఇవన్నీ మనస్పూర్తిగా ఇచ్చాను. ఇప్పుడు ఇక్కడున్న నీ ప్రజలు కూడా మనస్ఫూర్తిగా నీకు ఇవ్వడం చూసి సంతోషిస్తున్నాను.

18 అబ్రాహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు అనే మా పూర్వీకుల దేవా యెహోవా, నీ ప్రజలు హృదయపూర్వకంగా సంకల్పించిన ఈ ఉద్దేశాన్ని నిత్యం కాపాడు. వాళ్ళ హృదయం నీకు అనుకూలంగా ఉండేలా చెయ్యి. 19 నా కొడుకు సొలొమోను నీ ఆజ్ఞలకు, నీ శాసనాలకు, నీ కట్టడలకు లోబడుతూ, వాటినన్నిటినీ అనుసరించేలా నేను కట్టదలచిన ఈ ఆలయం కట్టించడానికి అతనికి నిర్దోషమైన హృదయం ఇవ్వు” అన్నాడు.

కీర్తనలు 72

సొలొమోను కీర్తన

1 దేవా, రాజుకు నీ న్యాయవిధులను, రాకుమారుడికి నీ నీతిని తెలియజెయ్యి.

2 అతడు నీతిని బట్టి నీ ప్రజలకు, న్యాయవిధులను బట్టి పేదవారికి న్యాయం తీరుస్తాడు గాక.

3 నీతిని బట్టి పర్వతాలు, కొండలు ప్రజలకు క్షేమం కలిగిస్తాయి గాక.

4 ప్రజల్లో పేదవారికి అతడు న్యాయం తీరుస్తాడు గాక. అక్కరలో ఉన్నవారి పిల్లలను రక్షించి, బాధపెట్టే వారిని నలగగొడతాడు గాక.

5 సూర్యచంద్రులు ఉన్నంత కాలం, తరతరాల్లో ప్రజలు నీలో భయభక్తులు చూపుతారు గాక.

6 కోసిన గడ్డిపై కురిసే వానలాగా, భూమిని తడిపే మంచి వర్షంలాగా అతడు దిగి వస్తాడు గాక.

7 అతని కాలంలో నీతిమంతులు వర్ధిల్లుతారు గాక. చంద్రుడు గతించే వరకూ క్షేమాభివృద్ధి ఉండు గాక.

8 సముద్రం నుండి సముద్రం వరకూ, యూఫ్రటీసు నది మొదలుకుని భూదిగంతాల వరకూ అతని ఆధిపత్యం వ్యాపిస్తుంది గాక.

9 ఎడారి ప్రజలు అతనికి లోబడతారు గాక. అతని శత్రువులు నేల మట్టి నాకుతారు గాక.

10 తర్షీషు రాజులు, ద్వీపాల రాజులు కప్పం చెల్లిస్తారు గాక. షేబ రాజులు, సెబా రాజులు కానుకలు తీసుకు వస్తారు గాక.

11 రాజులందరూ అతని ఎదుట సాగిలపడతారు గాక. అన్యజనాలు అతనికి సేవ చేస్తారు గాక.

12 ఎందుకంటే అక్కరలో ఉన్నవారు మొర పెట్టినప్పుడు అతడు వారికి సహాయం చేస్తాడు. సహాయం దొరకని పేదలను అతడు విడిపిస్తాడు.

13 నిరుపేదల పట్లా అక్కరలో ఉన్నవారి పట్లా అతడు జాలి చూపుతాడు. పేదల ప్రాణాలను అతడు రక్షిస్తాడు.

14 బలాత్కారం నుండీ హింస నుండీ అతడు వారి ప్రాణాన్ని విమోచిస్తాడు. వారి ప్రాణం అతని దృష్టికి విలువైనది.

15 రాజు చిరంజీవి అవుతాడు గాక. షేబ బంగారం అతనికి ఇస్తారు గాక. అతని క్షేమం కోసం ప్రజలు ఎప్పుడూ ప్రార్థన చేస్తారు గాక. దేవుడు రోజంతా అతణ్ణి దీవిస్తాడు గాక.

16 దేశంలో, పర్వత శిఖరాల మీదా ధాన్యం సమృద్ధిగా పండు గాక. వారి పంటలు గాలికి లెబానోను వృక్షాలలాగా ఊగుతూ ఉంటాయి గాక. పట్టణ ప్రజలు భూమి మీది పచ్చికలాగా వర్ధిల్లుతారు గాక.

17 రాజు నామం శాశ్వతంగా నిలుస్తుంది గాక. అతని పేరు సూర్యుడున్నంత కాలం నిలబడుతుంది గాక. అతనిని బట్టి ప్రజలు దీవెనలు పొందుతారు గాక. అన్యజనాలు అతడు ధన్యుడని చెప్పుకుంటారు గాక.

18 ఇశ్రాయేలు దేవుడైన యెహోవా స్తుతులు పొందుతాడు గాక. ఆయన ఒక్కడే ఆశ్చర్యకార్యాలు చేసేవాడు.

19 ఆయన మహిమగల నామం నిరంతరం స్తుతులు పొందుతుంది గాక. ఈ భూమి అంతా ఆయన మహిమతో నిండి ఉంటుంది గాక. ఆమేన్‌. ఆమేన్‌.

20 యెష్షయి కొడుకు దావీదు ప్రార్థనలు ముగిశాయి.

1 దినవృత్తాంతాలు 29:20–25

20 ఈ విధంగా అన్న తరువాత దావీదు “ఇప్పుడు మీ దేవుడైన యెహోవాను స్తుతించండి” అని ప్రజల సమావేశం అంతటితో చెప్పినప్పుడు వాళ్ళందరూ తమ పూర్వీకుల దేవుడైన యెహోవాను స్తుతించి యెహోవా సన్నిధిలో రాజు ముందు తల వంచి నమస్కారం చేశారు.

21 తరువాత వాళ్ళు యెహోవాకు బలులు అర్పించారు. తరువాత రోజు, దహనబలిగా వెయ్యి ఎద్దులను, వెయ్యి పొట్టేళ్లను, వెయ్యి గొర్రె పిల్లలను, వాటి పానార్పణలతో పాటు ఇశ్రాయేలీయులందరి సంఖ్యకు తగినట్టుగా అర్పించారు.

22 ఆ రోజు వాళ్ళు యెహోవా సన్నిధిలో ఎంతో సంతోషంతో అన్నపానాలు పుచ్చుకున్నారు. దావీదు కొడుకు సొలొమోనుకు రెండో సారి పట్టాభిషేకం చేసి, యెహోవా సన్నిధిలో అతన్ని పరిపాలకుడిగా, సాదోకును యాజకునిగా, అభిషేకించారు.

23 అప్పుడు సొలొమోను తన తండ్రి దావీదుకు బదులుగా యెహోవా సింహాసనం మీద రాజుగా కూర్చుని వర్ధిల్లుతూ ఉన్నాడు. ఇశ్రాయేలీయులందరూ అతని ఆజ్ఞకు లోబడ్డారు. 24 అధిపతులందరూ, యోధులందరూ, రాజైన దావీదు కొడుకులు అందరూ రాజైన సొలొమోనుకు లోబడ్డారు. 25 యెహోవా సొలొమోనును ఇశ్రాయేలీయులందరి ముందు ఎంతో ఘనపరచి, అతనికి ముందుగా ఇశ్రాయేలీయులను ఏలిన ఏ రాజుకైనా దక్కని రాజ్యప్రభావం అతనికి అనుగ్రహించాడు.