భాగం 7: సొలొమోను పాపం (continued)

క్రీ.పూ. 980 నుండి 975 వరకు

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

ప్రసంగి 2–3

1 “అప్పుడు, నిన్ను సంతోషం చేత పరీక్షిస్తాను, నువ్వు మేలును రుచి చూడు” అని నేను నా హృదయంతో చెప్పుకున్నాను. అయితే అది కూడా వ్యర్థప్రయత్నమే అయ్యింది. 2 నవ్వుతో, నువ్వు వెర్రిదానివి అనీ సంతోషంతో, నీవలన లాభం లేదు అనీ అన్నాను. 3 నా మనస్సు ఇంకా జ్ఞానాన్ని కోరుకుంటుండగా ఆకాశం కింద మానవులు తమ జీవితంలో ఏమి చేస్తే మేలు పొందుతారో చూద్దామని, ద్రాక్షారసంతో నా శరీరాన్ని సంతోషపరచుకొంటాను, బుద్ధిహీనత వలన ఏమైనా ప్రయోజనం ఉంటుందేమో అని ఆలోచించాను.

4 నేను గొప్ప గొప్ప పనులు చేశాను. నా కోసం ఇళ్ళు కట్టించుకున్నాను, ద్రాక్షతోటలు నాటించుకున్నాను. 5 తోటలు, ఉద్యానవనాలను వేయించి వాటిలో పలు రకాల పండ్ల చెట్లు నాటించాను. 6 ఆ చెట్లకు నీటి కోసం నేను చెరువులు తవ్వించాను. 7 ఆడ, మగ పనివారిని నియమించుకున్నాను. దాసులుగానే నా ఇంట్లో పుట్టినవారు నాకు ఉన్నారు. యెరూషలేములో నాకు ముందు ఉన్న వారందరికంటే ఎక్కువగా పశువులు, గొర్రె మేకల మందలు నేను సంపాదించుకున్నాను.

8 నా కోసం వెండి బంగారాలను, వివిధ దేశాల రాజులకు, సంస్థానాల అధిపతులకు ఉండేటంత సంపదను సమకూర్చుకున్నాను. గాయకులనూ గాయకురాళ్ళనీ, మనుషులు కోరేవాటన్నిటినీ సంపాదించుకుని అనేకమంది స్త్రీలనూ ఉంచుకున్నాను. 9 నాకు ముందు యెరూషలేములో ఉన్న వారందరికంటే గొప్పవాణ్ణి, ఆస్తిపరుణ్ణి అయ్యాను. నా జ్ఞానం నన్ను నడిపిస్తూనే ఉంది.

10 నా కళ్ళు చూడాలని ఆశపడిన వాటిని చూడకుండా నేను అడ్డు చెప్పలేదు.

నా హృదయం నా పనులన్నిటిని బట్టి సంతోషించింది.

అందుకే సంతోషాలను అనుభవించకుండా నేను నా హృదయాన్ని నిర్బంధించలేదు.

ఇదే నా పనులన్నిటి వలన నాకు దొరికిన భాగ్యం.

11 అప్పుడు నేను చేసిన పనులన్నిటినీ, వాటి కోసం నేను పడిన బాధ అంతటినీ గమనించి చూస్తే

అవన్నీ నిష్ప్రయోజనంగా, ఒకడు గాలి కోసం ప్రయాసపడినట్టుగా కనిపించింది.

సూర్యుని కింద ప్రయోజనకరమైనది ఏదీ లేనట్టు నాకు కనిపించింది.

12 తరువాత రాబోయే రాజు, ఇప్పటిదాకా జరిగిన దానికంటే ఎక్కువ ఏం చేయగలడు? అనుకుని,

నేను జ్ఞానాన్ని, వెర్రితనాన్ని, బుద్ధిహీనతను గురించి ఆలోచించడం ప్రారంభించాను.

13 అప్పుడు చీకటి కంటే వెలుగెంత ప్రయోజనకరమో బుద్ధిహీనత కంటే జ్ఞానం అంత ప్రయోజనకరం అని నేను తెలుసుకున్నాను.

14 జ్ఞాని కళ్ళు అతని తలలో ఉన్నాయి. బుద్ధిహీనుడు చీకటిలో నడుస్తాడు.

అయినా అందరి గమ్యం ఒక్కటే అని నేను గ్రహించాను.

15 కాబట్టి బుద్ధిహీనుడికి జరిగేదే నాకూ జరుగుతుంది, మరి నేను ఇంత జ్ఞానం ఎందుకు సంపాదించాను

అని నా హృదయంలో అనుకున్నాను. కాబట్టి ఇదీ నిష్ప్రయోజనమే.

16 బుద్ధిహీనులకు జరిగినట్టే జ్ఞానులను కూడా ఎవరూ జ్ఞాపకం ఉంచుకోరు. రాబోయే రోజుల్లో వారందరినీ మర్చిపోతారు.

బుద్ధిహీనుడు ఎలా చనిపోతాడో, జ్ఞాని కూడా అలాగే చనిపోతాడు.

17 ఇదంతా చూస్తే సూర్యుని కింద జరిగేదంతా నన్ను కుంగదీసింది. అంతా నిష్ప్రయోజనంగా, ఒకడు గాలిని పట్టుకోడానికి బాధ పడినట్టుగా కనిపించింది. నాకు జీవితం మీద అసహ్యం వేసింది.

18 సూర్యుని కింద నేను ఎంతో బాధపడి సాధించిన వాటన్నిటినీ నా తరవాత వచ్చేవాడికి విడిచిపెట్టాలని గ్రహించి నేను వాటిని అసహ్యించుకున్నాను. 19 వాడు తెలివైనవాడో, బుద్ధిహీనుడో ఎవరికి తెలుసు? అయితే సూర్యుని కింద నేను బాధతో, జ్ఞానంతో సంపాదించినదంతా వాడి అధికారం కిందకు వెళ్తుంది. ఇదీ నిష్ప్రయోజనమే. 20 కాబట్టి సూర్యుని కింద నేను పడిన కష్టమంతటి విషయంలో నేను నిస్పృహ చెందాను.

21 ఒకడు జ్ఞానంతో, తెలివితో, నైపుణ్యంతో కష్టపడి ఒక పని చేస్తాడు. అయితే అతడు దాని కోసం పని చేయని వేరొకడికి దాన్ని విడిచిపెట్టి వెళ్ళాల్సి వస్తున్నది. ఇది కూడా నిష్ప్రయోజనంగా, గొప్ప విషాదంగా ఉంది. 22 సూర్యుని కింద మానవుడు పడే కష్టానికీ చేసే పనులకూ అతడికేం దొరుకుతున్నది? 23 అతడు రోజులో చేసే పనులన్నీ కష్టంతో, వత్తిడితో నిండి ఉన్నాయి. కాబట్టి రాత్రి పూట కూడా అతడి మనస్సుకు నెమ్మది దొరకదు. ఇది కూడా నిష్ప్రయోజనమే.

24 అన్నపానాలు పుచ్చుకోవడం కంటే, తన కష్టంతో సంపాదించిన దానితో తృప్తి చెందడం కంటే మానవునికి శ్రేష్టమైంది లేదు. అది దేవుని వల్లనే కలుగుతుందని నేను గ్రహించాను. 25 ఆయన అనుమతి లేకుండా భోజనం చేయడం, సంతోషించడం ఎవరికి సాధ్యం? 26 ఎందుకంటే ఎవరైతే దేవుణ్ణి సంతోషింప జేస్తారో వాడికి దేవుడు జ్ఞానం, తెలివి, ఆనందం ఇస్తాడు. అయితే తనకిష్టమైన వాడికి ఇవ్వడానికి కష్టపడి పోగుచేసే పనిని ఆయన పాపాత్మునికి అప్పగిస్తాడు. ఇది కూడా నిష్ప్రయోజనం, ఒకడు గాలి కోసం ప్రయాసపడినట్టుగా ఉంది.

3:1 ఆకాశం కింద ప్రతి ప్రయత్నానికీ ప్రతి ఉద్దేశానికీ ఒక సమయం ఉంది.

2 పుట్టడానికీ, చనిపోడానికీ నాటడానికీ, నాటిన దాన్ని పెరకడానికీ

3 చంపడానికీ, స్వస్థపరచడానికీ కూలదోయడానికీ, కట్టడానికీ

4 ఏడవడానికీ, నవ్వడానికీ, దుఃఖించడానికీ, నాట్యం చేయడానికీ

5 రాళ్లను పారవేయడానికీ, వాటిని పోగు చేయడానికీ ఎదుటి వారిని కౌగలించుకోడానికీ, మానడానికీ

6 వస్తువులను వెదకడానికీ, పోగొట్టుకోడానికీ దాచుకోడానికీ, పారవేయడానికీ

7 వస్త్రాలను చింపడానికీ, కుట్టడానికీ మౌనం వహించడానికీ, మాటలాడడానికీ

8 ప్రేమించడానికీ, ద్వేషించడానికీ యుద్ధం చేయడానికీ, సంధి చేసుకోడానికీ ఇలా ప్రతిదానికీ ఒక సమయం ఉంది.

9 కష్టపడి పని చేసిన వారికి దాని వలన వచ్చిన లాభమేముంది?

10 మానవులు చేయడానికి దేవుడు వారికి ఇచ్చిన పని ఏమిటో నేను చూశాను.

11 దేవుడు ప్రతి దానినీ దాని కాలానికి సరిపడినట్టుగా చేశాడు. ఆయన నిత్యమైన జ్ఞానాన్ని మానవుల హృదయాల్లో ఉంచాడు. దేవుని కార్యాలను మొదటి నుండి చివరి వరకూ పూర్తిగా గ్రహించడానికి అది చాలదు.

12 కాబట్టి మానవులకు బతికినంత కాలం సంతోషంగా, మంచి జరిగిస్తూ ఉండడం కంటే శ్రేష్ఠమైనదేదీ లేదని నేను గ్రహించాను. 13 ప్రతి ఒక్కరూ అన్నపానాలు పుచ్చుకుంటూ తన కష్టార్జితాన్ని అనుభవించడం దేవుడిచ్చే బహుమానమే అని కూడా గ్రహించాను.

14 దేవుడు చేసే పనులన్నీ నిత్యమైనవి అని నాకు తెలుసు. దానికి మరి దేనినీ కలపలేము, దానినుండి దేనినీ తీయలేము. మానవులు తనలో భయభక్తులు కలిగి ఉండాలని దేవుడే ఈ విధంగా నియమించాడు.

15 గతంలో జరిగిందే ఇప్పుడూ జరుగుతుంది. తరవాత జరగబోయేది కూడా ఇంతకు ముందు జరిగిందే.

మానవులు మర్మమైన సంగతులు వెదికేలా దేవుడు చేస్తాడు.

16 అంతేగాక ఈ లోకంలో న్యాయతీర్పు జరిగించే స్థలాల్లో, నీతి ఉండాల్సిన స్థలాల్లో నాకు దుష్టత్వం కనిపించింది. 17 “మంచివారికీ చెడ్డవారికీ వారి ప్రతి ప్రయత్నానికీ, పనికీ తగిన సమయంలో దేవుడే తీర్పు తీరుస్తాడు” అని నా హృదయంలో అనుకున్నాను.

18 తాము జంతువుల్లాటి వారని మానవులు తెలుసుకోవాలని దేవుడు అలా చేస్తున్నాడని నేను అనుకున్నాను.

19 ఎందుకంటే జంతువులకు జరుగుతున్నట్టే మనుషులకీ జరుగుతూ ఉంది. ఇద్దరి గతీ ఒక్కటే. జంతువులు చనిపోతాయి, మనుషులూ చనిపోతారు. జీవులన్నిటికీ ఒక్కటే ప్రాణం. జంతువుల కంటే మనుషులకు ఎక్కువేమీ లేదు. అంతా ఆవిరిలాగా నిష్ప్రయోజనం కదా!

20 అంతా ఒక్క చోటికే వెళతారు. అంతా మట్టిలోనుండి పుట్టింది, ఆ మట్టిలోకే తిరిగి పోతుంది.

21 మనుషుల ఆత్మ పరలోకానికి ఎక్కిపోతుందనీ జంతువుల ప్రాణం భూమిలోకి దిగిపోతుందనీ ఎవరికి తెలుసు? 22 మనిషికి తన తరువాత ఏం జరగబోతున్నదో చూపించడానికి వారిని తిరిగి వెనక్కి తెచ్చేవాడు ఎవరున్నారు? కాబట్టి వారు తమ పనిలో సంతోషించడం కంటే శ్రేష్టమైంది వారికేమీ లేదని నేను తెలుసుకున్నాను. అదే వారు చేయవలసింది.