భాగం 7: సొలొమోను పాపం (continued)
క్రీ.పూ. 980 నుండి 975 వరకు
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
1 ఆ తరవాత సూర్యుని కింద జరుగుతున్న వివిధ రకాల అన్యాయాలను గురించి నేను ఆలోచించాను. బాధలు పడేవారు కన్నీరు కారుస్తున్నారు. వారికి ఆదరణ లేదు. వారిని అణచి వేసే వారు బలవంతులు కాబట్టి వారిని ఆదరించేవారెవరూ లేరు. 2 కాబట్టి ఇప్పుడు జీవిస్తున్న వారి కంటే గతించిపోయిన వారే ధన్యులు అనుకున్నాను. 3 ఇంకా పుట్టని వారు సూర్యుని కింద జరుగుతున్న ఈ అక్రమాలను చూడలేదు కాబట్టి ఈ ఇద్దరి కంటే వారు ఇంకా ధన్యులు అనుకున్నాను.
4 కష్టంతో, నైపుణ్యంగా చేసే ప్రతి పనీ వేరొకరి అసూయకి కారణం అవుతున్నదని నేను చూశాను. ఇది కూడా నిష్ప్రయోజనంగా, ఒకడు గాలిని పట్టుకోడానికి చేసే ప్రయత్నంలాగా ఉంది. 5 బుద్ధిహీనుడు పని చేయకుండా చేతులు ముడుచుకుని కూర్చోవడం వల్ల తనను తనే నాశనం చేసుకుంటున్నాడు. 6 రెండు చేతులతో కష్టం, గాలి కోసం ప్రయత్నాలు చేసేకంటే ఒక చేతిలో నెమ్మది కలిగి ఉండడం మంచిది.
7 నేను ఆలోచిస్తున్నపుడు సూర్యుని కింద నిష్ప్రయోజనమైంది ఇంకొకటి కనిపించింది.
8 ఒకడు ఒంటరిగా ఉన్నాడు.
అతనికి జతగాడు గాని, కొడుకు గాని, సోదరుడు గాని లేడు.
అయినా అతడు ఎప్పుడూ కష్టపడుతూనే ఉంటాడు.
ఐశ్వర్యం అతనికి తృప్తి కలిగించదు.
సుఖమనేది లేకుండా ఎవరి కోసం ఇంత కష్టపడుతున్నాను అనుకుంటాడు.
ఇది కూడా ఆవిరిలాగా నిష్ప్రయోజనం, విచారకరం.
9 ఇద్దరు కష్టపడితే ఇద్దరికీ మంచి జరుగుతుంది.
కాబట్టి ఒంటరిగా కంటే ఇద్దరు కలిసి ఉండడం మంచిది.
10 ఒకడు కింద పడినా మరొకడు లేపుతాడు.
అయితే ఒక్కడే ఉంటే అతడు పడినప్పుడు లేపేవాడు లేనందువలన అతనికి కష్టమే మిగులుతుంది.
11 ఇద్దరు కలిసి పండుకొంటే వారికి వెచ్చగా ఉంటుంది. ఒక్కడే ఉంటే వీలు కాదు కదా!
12 ఒంటరిగా ఉన్నవాణ్ణి పడదోయడం తేలిక.
అయితే ఇద్దరు కలిసి ఉంటే తమపై దాడిని ఎదుర్కోగలరు.
మూడు పేటల తాడు త్వరగా తెగిపోదు గదా?
13 మంచి హెచ్చరికలు వినడానికి ఇష్టం లేని మూర్ఖుడైన ముసలి రాజుకంటే జ్ఞానవంతుడైన ఒక చిన్న పిల్లవాడు శ్రేష్ఠుడు. 14 అలాంటివాడు తన దేశంలో బీదవాడుగా పుట్టినా, చెరసాలలో ఉన్నా రాజుగా పట్టాభిషేకం పొందుతాడు. 15 సూర్యుని కింద జీవిస్తూ తిరిగే వారంతా చనిపోయిన రాజుకు బదులు రాజైన ఆ చిన్నవాని పక్షం వహిస్తారని నేను గ్రహించాను. 16 ప్రతి ఒక్కరూ అతనికి విధేయత చూపడానికి వస్తారు. అయితే ఆ తరవాత వారిలో అనేకమంది అతనిపై ఇష్టం చూపరు. నిజానికి ఇది కూడా నిష్ప్రయోజనమే, ఒకడు గాలిని పట్టుకోడానికి ప్రయత్నించినట్టే.
5:1 నీవు దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. తాము చేసే పనులు దుర్మార్గమైనవని తెలుసుకోకుండా బుద్ధిహీనుల్లాగా బలులు అర్పించడం కంటే దానికి దగ్గరగా వెళ్లి మాటలు వినడం మంచిది.
2 దేవుని సన్నిధిలో అనాలోచితంగా మాట్లాడడానికి త్వరపడక నీ నోటిని కాచుకో.
దేవుడు ఆకాశంలో ఉన్నాడు, నీవు భూమి మీద ఉన్నావు,
కాబట్టి నీ మాటలు తక్కువగా ఉండాలి.
3 విస్తారమైన పనులు, చింతల వలన చెడ్డ కలలు వస్తాయి.
ఎక్కువ మాటలు పలికేవాడు ఎక్కువ మూర్ఖంగా పలుకుతాడు.
4 నీవు దేవునికి మొక్కుబడి చేసుకుంటే దాన్ని త్వరగా చెల్లించు. మూర్ఖుల విషయంలో ఆయన సంతోషించడు. 5 నీవు మొక్కుకున్న దాన్ని చెల్లించు. మొక్కుకుని చెల్లించకపోవడం కంటే అసలు మొక్కుకోకపోవడం మంచిది.
6 నీ శరీరం పాపంలో పడేలా చేసేటంతగా నీ నోటిని మాట్లాడనీయకు. “ఆ మొక్కుబడి పొరపాటుగా చేశాను” అని యాజకునితో చెప్పవద్దు. నీ మాటలతో దేవునికి కోపం తెప్పించి ఎందుకు నష్టపోతావు? 7 ఎక్కువ కలలతో, మాటలతో ప్రయోజనం లేదు. నీ వరకూ నువ్వు దేవునిలో భయభక్తులు కలిగి ఉండు.
8 ఒక రాజ్యంలో బీదవారిని బాధించడం, ధర్మాన్ని, న్యాయాన్ని బలవంతంగా అణచివేయడం నీకు కనిపిస్తే ఆశ్చర్యపోవద్దు. అధికారంలో ఉన్నవారికంటే ఎక్కువ అధికారం గలవారున్నారు. వారందరి పైన ఇంకా ఎక్కువ అధికారం గలవాడు ఉన్నాడు. 9 ఏ దేశంలో రాజు భూమి గురించి శ్రద్ధ వహిస్తాడో ఆ దేశానికి అన్ని విషయాల్లో మంచి జరుగుతుంది.
10 డబ్బు కోరుకునే వాడికి ఆ డబ్బుతో తృప్తి కలగదు.
ఐశ్వర్యం కోరుకునేవాడు ఇంకా ఎక్కువ ఆస్తిని కోరుకుంటాడు.
ఇది కూడా నిష్ప్రయోజనమే.
11 ఆస్తి ఎక్కువైతే దాన్ని దోచుకునే వారు కూడా ఎక్కువవుతారు.
కేవలం కళ్ళతో చూడడం తప్ప ఆస్తిపరుడికి తన ఆస్తి వలన ప్రయోజనం ఏముంది?
12 కష్టజీవులు కొంచెమే తినినా హాయిగా నిద్ర పోతారు.
అయితే ఐశ్వర్యవంతులు తమ ధనసమృధ్థి వలన నిద్రపోలేరు.
13 సూర్యుని కింద మనస్సుకు బాధ కలిగించేది ఒకటి చూశాను.
అదేమంటే ఆస్తిపరుడు తన ఆస్తిని దాచుకోవడం అతనికే నష్టం తెచ్చిపెడుతుంది.
14 అతడు దురదృష్టవశాత్తూ తన ఆస్తిని పోగొట్టుకుంటే అతని కొడుకు చేతిలో ఏమీ లేనివాడు అవుతాడు.
15 వాడు ఏ విధంగా తల్లి గర్భం నుండి వచ్చాడో ఆ విధంగానే, దిగంబరిగా వెళ్ళిపోతాడు.
తాను పని చేసి సంపాదించినా దేనినీ చేతపట్టుకుని పోలేడు.
16 ఎలా వచ్చాడో అలాగే వెళ్ళిపోతాడు. గాలిని పట్టుకోడానికి ప్రయత్నించడం వలన లాభమేమిటి?
17 ఇది కూడా మనస్సుకు బాధ కలిగించేదే. తన జీవితమంతా అతడు చీకటిలో భోజనం చేస్తాడు.
అతడు రోగంతో, ఆగ్రహంతో నిస్పృహలో గడుపుతాడు.
18 నేను చూసిన దానిలో కోరదగినది, మంచిది ఏంటంటే, ఒకడు దేవుడు తనకు నియమించిన జీవితమంతా తన కష్టార్జితంతో అన్నపానాలు తీసుకుంటూ, క్షేమంగా బతకడమే. అదే దేవుడు వాడికి నియమించింది.
19 అంతే గాక దేవుడు ఒకడికి ధనధాన్య సమృద్ధి ఇచ్చి దానిలో తన వంతు అనుభవించడానికి, అన్నపానాలు పుచ్చుకోడానికి, తన కష్టార్జితంలో సంతోషించడానికి వీలు కలిగిస్తే అది దేవుని దీవెన అని భావించాలి. 20 అతడు చేసే పనిలో దేవుడు అతనికి సంతోషం కలిగిస్తాడు కాబట్టి అతడు తన జీవితంలోని రోజులను పదే పదే జ్ఞాపకం చేసుకోడు.