భాగం 7: సొలొమోను పాపం
క్రీ.పూ. 980 నుండి 975 వరకు
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
1 సొలొమోను రాజు చాలామంది విదేశీ స్త్రీలను అంటే ఫరో కూతుర్నిమాత్రమే గాక మోయాబు, ఎదోము, అమ్మోను, సీదోను, హిత్తీ మొదలైన జాతి స్త్రీలను మోహించి పెళ్ళిచేసుకున్నాడు. 2 “ఈ ప్రజలు మీ హృదయాలను కచ్చితంగా తమ దేవుళ్ళవైపు తిప్పుతారు కాబట్టి వారితో పెళ్లి సంబంధం పెట్టుకోవద్దని యెహోవా ఇశ్రాయేలీయులకు ముందే చెప్పాడు.” అయితే సొలోమోను ఈ స్త్రీలను మోహించాడు. 3 అతనికి 700 మంది రాకుమార్తెలైన భార్యలూ 300 మంది ఉపపత్నులూ ఉన్నారు. అతని భార్యలు అతని హృదయాన్ని తిప్పివేశారు. 4 సొలొమోను వృద్ధాప్యంలో అతని భార్యలు అతని హృదయాన్ని ఇతర దేవుళ్ళవైపు తిప్పినందువల్ల అతని తండ్రి దావీదు హృదయంలాగా అతని హృదయం యెహోవా దేవుని పట్ల యథార్ధంగా లేదు.
5 సొలొమోను అష్తారోతు అనే సీదోనీయుల దేవతను, మిల్కోము అనే అమ్మోనీయుల అసహ్యమైన విగ్రహాన్నీ అనుసరించి నడిచాడు. 6 ఈ విధంగా సొలొమోను యెహోవా దృష్టికి చెడ్డగా ప్రవర్తించి తన తండ్రి దావీదు అనుసరించినట్టు యథార్థహృదయంతో యెహోవాను అనుసరించలేదు. 7 సొలొమోను కెమోషు అనే మోయాబీయుల హేయమైన విగ్రహానికి, మొలెకు అనే అమ్మోనీయుల హేయమైన విగ్రహానికి యెరూషలేము ముందున్న కొండమీద బలిపీఠాలు కట్టించాడు. 8 తన విదేశీ భార్యలు వారి విగ్రహాలకు ధూపం వేస్తూ బలులు అర్పించడం కోసం అతడు ఇలా చేశాడు.
9 ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవా అతనికి రెండు సార్లు ప్రత్యక్షమై, 10 నీవు ఇతర దేవుళ్ళను అనుసరించకూడదని అతనికి ఆజ్ఞాపించాడు. అయినా సొలొమోను హృదయం ఆయన నుండి తొలగిపోయింది. యెహోవా అతడికి ఇచ్చిన ఆజ్ఞను అతడు పాటించనందుకు ఆయన అతనిపై కోపగించి ఇలా చెప్పాడు. 11 “నేను నీతో చేసిన నా నిబంధనను, శాసనాలను నీవు ఆచరించడం లేదు. కాబట్టి ఈ రాజ్యం కచ్చితంగా నీకు ఉండకుండాా తీసివేసి నీ సేవకుల్లో ఒకడికి ఇచ్చి తీరుతాను. 12 అయినా నీ తండ్రి దావీదు కోసం నీ రోజుల్లో అలా చెయ్యను. నీ తరువాత నీ కొడుకు చేతిలోనుండి దాన్ని తీసివేస్తాను. 13 రాజ్యమంతా తీసివేయను. నా దాసుడు దావీదు కోసం, నేను కోరుకొన్న యెరూషలేము కోసం ఒక్క గోత్రం నీ కొడుక్కి ఇస్తాను.”
14 యెహోవా ఎదోమువాడు హదదు అనే ఒకణ్ణి సొలొమోనుకు విరోధిగా లేపాడు. అతడు ఎదోము దేశపు రాజవంశస్థుడు.
23 దేవుడు సొలోమోను మీదికి ఎల్యాదా కొడుకు రెజోను అనే ఇంకొక విరోధిని లేపాడు. ఇతడు సోబా రాజు హదదెజరు అనే తన యజమాని దగ్గరనుండి పారిపోయినవాడు. 24 దావీదు సోబా వారిని చంపిన తరువాత రెజోను కొందరిని పోగు చేసుకుని, ఆ గుంపుకు నాయకుడయ్యాడు. వారంతా దమస్కు వచ్చి అక్కడ నివసించారు. రెజోను దమస్కులో రాజయ్యాడు. 25 హదదు చేసిన ఈ కీడే గాక సొలొమోను బతికిన రోజులన్నీ రెజోను ఇశ్రాయేలీయులకు విరోధిగా ఉన్నాడు. ఇతడు ఇశ్రాయేలీయులను ద్వేషించాడు. ఇతడు అరాము దేశాన్ని పాలించాడు.
26 సొలొమోను సేవకుడు యరొబాము కూడా రాజు మీద తిరుగుబాటు చేశాడు. ఇతడు జెరేదాకు చెందిన ఎఫ్రాయీము గోత్రికుడు నెబాతు కొడుకు. ఇతని తల్లి పేరు జెరూహా. ఆమె విధవరాలు. 27 ఇతడు రాజు మీదికి లేవడానికి కారణం ఇది. సొలొమోను మిల్లోను కట్టించి తన తండ్రి దావీదు పుర ప్రాకారానికి వచ్చిన బీటలు బాగు చేయించాడు. 28 యరొబాము మహా బలశాలి. యువకుడైన ఇతడు పనిలో శ్రద్ధ గలవాడని సొలొమోను గ్రహించి, యోసేపు వంశం వారు చేయవలసిన భారమైన పని మీద అతన్ని అధికారిగా నిర్ణయించాడు. 29 ఆ సమయంలో యరొబాము యెరూషలేములోనుండి బయటికి వెళ్ళగా షిలోనీయుడూ ప్రవక్త అయిన అహీయా అతన్ని దారిలో కలుసుకున్నాడు. అహీయా కొత్తబట్టలు కట్టుకుని ఉన్నాడు. వారిద్దరు తప్ప పొలంలో ఇంకా ఎవరూ లేరు.
30 అప్పుడు అహీయా తాను వేసుకున్న కొత్త బట్ట చించి పన్నెండు ముక్కలు చేసి, యరొబాముతో ఇలా అన్నాడు. “ఈ పది ముక్కలు నీవు తీసుకో. 31 ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవా చెప్పేదేమిటంటే ప్రజలు నన్ను విడిచిపెట్టి అష్తారోతు అనే సీదోనీయుల దేవతకు, కెమోషు అనే మోయాబీయుల దేవుడికి, మిల్కోము అనే అమ్మోనీయుల దేవుడికి మొక్కుతున్నారు. 32 సొలొమోను తండ్రి దావీదు లాగా వాళ్ళు నా విధానాలను అనుసరించి నడవలేదు. నా దృష్టిలో సరిగా ప్రవర్తించలేదు. నా శాసనాలను ఆచరణలో పెట్టలేదు. కాబట్టి సొలొమోను చేతిలోనుండి రాజ్యాన్ని తీసేసి పది గోత్రాలను నీకిస్తాను. 33 అయితే నా సేవకుడైన దావీదు కోసం, నేను ఎన్నుకున్న యెరూషలేము పట్టణం కోసం ఇశ్రాయేలీయుల గోత్రాల్లో నుండి అతనికి ఒక గోత్రం ఉండనిస్తాను.
34 రాజ్యాన్ని సొలోమోను చేతిలోనుండి బొత్తిగా తీసివేయను. నేను కోరుకున్న నా సేవకుడైన దావీదు నా ఆజ్ఞలను, కట్టడలను ఆచరించాడు కాబట్టి దావీదును జ్ఞాపకం చేసుకుని తన జీవితకాలమంతా అతన్ని పరిపాలన చేయనిస్తాను. 35 అయితే అతని కొడుకు చేతిలోనుండి రాజ్యాన్ని తీసివేసి అందులో నీకు పది గోత్రాలు ఇస్తాను. 36 నా పేరు అక్కడ ఉండేలా నేను కోరుకున్న పట్టణమైన యెరూషలేములో నా సమక్షంలో నా సేవకుడైన దావీదు కోసం ఒక దీపం ఎప్పటికీ వెలుగుతూ ఉండాలి. అందువల్ల అతని కొడుక్కి ఒక గోత్రం ఇస్తాను.
37 నేను నిన్ను ఎన్నుకుంటాను. నీవు కోరే దానంతటిమీదా పరిపాలిస్తూ ఇశ్రాయేలు వారి మీద రాజుగా ఉంటావు. 38 నా సేవకుడైన దావీదు నా కట్టడలను నా ఆజ్ఞలను పాటించినట్లు, నేను నీకు ఆజ్ఞాపించినదంతా నీవు విని, నా మార్గాలను అనుసరించి నడుస్తూ నా దృష్టికి అనుకూలమైన దాన్ని జరిగిస్తూ ఉంటే నేను నీకు తోడుగా ఉంటాను. దావీదు కుటుంబాన్ని శాశ్వతంగా నేను స్థిరపరచినట్లు నిన్ను కూడా స్థిరపరచి ఇశ్రాయేలువారిని నీకు ఇస్తాను. 39 నేను దావీదు సంతానాన్ని వారు చేసిన అపరాధం మూలంగా శిక్షిస్తాను గానీ ఎల్లకాలం అలా చేయను.”
40 సొలొమోను యరొబామును చంపడానికి ప్రయత్నం చేశాడు కానీ యరొబాము ఐగుప్తు దేశానికి పారిపోయి, ఐగుప్తు రాజు షీషకు దగ్గర చేరి సొలొమోను చనిపోయే వరకూ ఐగుప్తులోనే ఉన్నాడు.
1 యెరూషలేమును పరిపాలించే రాజు, దావీదు కొడుకూ అయిన ప్రసంగి మాటలు. 2 పొగమంచులో ఆవిరిలాగా, గాలి కదలిక లాగా ప్రతిదీ మాయమైపోతున్నదని ప్రసంగి చెబుతున్నాడు. అది అనేక ప్రశ్నలు రేకెత్తిస్తున్నది.
3 సూర్యుని కింద మానవులు పడే కష్టం వలన వారికేం లాభం? 4 ఒక తరం గతించిపోతుంటే ఇంకో తరం వస్తూ ఉంది. భూమి మాత్రం ఎప్పుడూ స్థిరంగా నిలిచి ఉంది. 5 సూర్యుడు ఉదయిస్తాడు, అస్తమిస్తాడు. మళ్ళీ ఉదయించాల్సిన స్థలం చేరడానికి త్వరపడతాడు.
6 గాలి దక్షిణ దిక్కుకు వీచి మళ్ళీ ఉత్తర దిక్కుకు తిరుగుతుంది. అలా తన దారిలో మళ్ళీ మళ్ళీ వీస్తూ తిరిగి వస్తున్నది. 7 నదులన్నీ సముద్రంలోకే వెళ్తున్నాయి గానీ అది ఎప్పటికీ నిండడం లేదు. నదుల నీరంతా అవి ఎక్కడనుండి పారుతూ వస్తున్నాయో అక్కడికే వెళ్లి తిరిగి సముద్రంలోకి వెళ్తున్నాయి.
8 మధ్యలో విశ్రాంతి లేకుండా అన్నీ అలసటతోనే జరిగిపోతున్నాయి. మానవులు దాన్ని వివరించలేరు. చూసే వాటి విషయంలో కంటికి తృప్తి కలగడం లేదు. వినే వాటి విషయంలో చెవికి తృప్తి కలగడం లేదు. 9 ఇంతవరకూ ఉన్నదే ముందు కూడా ఉంటుంది. ఇంతవరకూ జరిగిందే ఇక ముందూ జరుగుతుంది. ఇది కొత్తది అని చెప్పదగినది సూర్యుని కింద ఏదీ లేదు. 10 ఇది కొత్తది అని దేని గురించైనా ఎవరైనా చెప్పినా అది కూడా చాలా కాలం నుండీ ఉన్నదే. 11 మన పూర్వికులు మన జ్ఞాపకంలో ఉండరు, ఇప్పుడు ఉన్నవారి జ్ఞాపకం తరవాత వచ్చే వారికి కలగదు.
12 బోధకుణ్ణి అయిన నేను యెరూషలేములో ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉన్నాను. 13 ఆకాశం కింద జరుగుతున్న దాన్ని తెలివిగా వెతికి గ్రహించడంపై నా మనస్సు నిలిపాను. మానవులు నేర్చుకోవడం కోసం దేవుడు వారికి ఏర్పాటు చేసిన పని చాలా కష్టంతో నిండి ఉంది.
14 సూర్యుని కింద జరుగుతున్న వాటన్నిటినీ నేను చూశాను. ఒకడు గాలిని పట్టుకోడానికి ప్రయాస పడినట్టు అవన్నీ ప్రయోజనం లేనివే. 15 వంకరగా ఉన్నది చక్కబడదు. కనిపించనిది లెక్కలోకి రాదు. 16 “యెరూషలేములో నాకంటే ముందున్న వారందరి కంటే నేను అధిక జ్ఞానం సంపాదించాను, సంపూర్ణమైన జ్ఞానాన్నీ విద్యనీ నేను నేర్చుకున్నాను” అని నా మనస్సులో అనుకున్నాను. 17 కాబట్టి జ్ఞానం, వెర్రితనం, బుద్ధిహీనత, వీటిని గ్రహించడానికి కష్టపడ్డాను. కానీ ఇది కూడా ఒకడు గాలిని పట్టుకోడానికి ప్రయాసపడడమే అని తెలుసుకున్నాను.
18 విస్తారమైన జ్ఞానార్జనలో విస్తారమైన దుఃఖం ఉంది. ఎక్కువ తెలివి సంపాదించిన వారికి ఎక్కువ బాధ కలుగుతుంది.