సన్హెరీబు రెండవ దండయాత్ర పూర్తిగా
క్రీ.పూ. 710
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
17 కాని, అష్షూరు రాజు తర్తాను, రబ్సారీసు, రబ్షాకేనులను లాకీషు పట్టణం నుంచి యెరూషలేములో ఉన్న హిజ్కియా రాజుపైకి పెద్ద సైన్యంతో పంపాడు. వారు యెరూషలేముపై దండెత్తి చాకిరేవు మార్గంలో ఉన్న మెరక కొలను కాలవ దగ్గర ప్రవేశించి, అక్కడ ఉండి రాజును పిలిపించాడు. 18 హిల్కీయా కొడుకూ, గృహ నిర్వాహకుడూ అయిన ఎల్యాకీము, శాస్త్రి షెబ్నా, రాజ్య లేఖనాల అధికారి అయిన ఆసాపు కొడుకు యోవాహు వాళ్ళ దగ్గరికి వెళ్ళారు.
19 అప్పుడు రబ్షాకే వాళ్ళతో అష్షూరురాజు హిజ్కియాతో చెప్పమన్నది ఈ విధంగా వినిపించాడు. “నీకున్న ఈ ధైర్యానికి ఆధారం ఏంటి? 20 యుద్ధం విషయంలో నీ ఆలోచన, నీ బలం అన్నీ వట్టి మాటలే. నా మీద తిరుగుబాటు చెయ్యడానికి నీకు ధైర్యం ఇచ్చింది ఎవరు? 21 నలిగిన రెల్లులాంటి ఈ ఐగుప్తును నమ్ముకుంటున్నావు. కాని, ఎవరైనా దాని మీద ఆనుకుంటే అది అతని చేతికి గుచ్చుకుని లోపలికి దిగుతుంది. అతన్ని నమ్ముకున్న వాళ్ళందరికీ ఐగుప్తురాజు ఫరో అలాంటివాడే.
22 మా దేవుడు యెహోవాను మేము నమ్ముకుంటున్నాము, అని ఒకవేళ మీరు నాతో చెప్తారేమో. యెరూషలేములో ఉన్న ఈ బలిపీఠం దగ్గర మాత్రమే మీరు నమస్కారం చెయ్యాలని యూదా వాళ్ళకూ, యెరూషలేము వాళ్ళకూ ఆజ్ఞ ఇచ్చి, హిజ్కియా ఎవరి ఉన్నత స్థలాలూ, బలిపీఠాలూ పడగొట్టాడో ఆయనే గదా యెహోవా? 23 కాబట్టి, నా యజమాని అష్షూరు రాజు పక్షంగా నిన్ను సవాలు చేస్తున్నాను. చాలినంత మంది రౌతులు నీ దగ్గర ఉంటే రెండువేల గుర్రాలు నేను నీకిస్తాను.
24 అలా ఐతే నీవు నా యజమాని సేవకుల్లో అతి తక్కువ వాడైన ఒక్క అధిపతినైనా ఎలా ఎదిరించగలవు? రథాలూ, రౌతులూ పంపుతాడని ఐగుప్తురాజును నీవు ఆశ్రయించావు గదా! 25 యెహోవా ఇష్టం లేకుండానే ఈ దేశంపై యుద్ధం చేసి నాశనం చెయ్యడానికి నేను వచ్చానా? ‘ఆ దేశంపై దాడి చేసి నాశనం చెయ్యి’ అని యెహోవాయే నాకు ఆజ్ఞ ఇచ్చాడు” అన్నాడు.
26 రబ్షాకేతో హిల్కీయా కొడుకు ఎల్యాకీము, షెబ్నా, యోవాహు ఇలా అన్నారు. “నీ దాసులమైన మాకు సిరియా భాష తెలుసు గనుక ఆ భాషలో మాట్లాడండి. ప్రాకారాల మీద ఉన్న ప్రజలకు తెలిసిన యూదుల భాషలో దయచేసి మాట్లాడొద్దు” అన్నారు. 27 రబ్షాకే “ఈ మాటలు చెప్పడానికి నీ యజమాని దగ్గరకూ, నీ దగ్గరికి మాత్రమేనా నా యజమాని నన్ను పంపింది? త్వరలో మీతో పాటు తమ మలం తిని తమ మూత్రం తాగాల్సిన ఈ ప్రాకారాల మీద కూర్చున్న వాళ్ళ దగ్గరికి కూడా నన్ను పంపాడు గదా” అని చెప్పాడు.
28 అతడు పెద్ద స్వరంతో యూదుల భాషలో “మహారాజైన అష్షూరురాజు చెప్పిన మాటలు వినండి. రాజు చెప్పదేమంటే, 29 హిజ్కియా వల్ల మోసపోకండి. నా చేతిలోనుంచి మిమ్మల్ని విడిపించడానికి అతనికి శక్తి చాలదు. 30 యెహోవా పేరట మిమ్మల్ని నమ్మించి, ‘యెహోవా మనలను విడిపిస్తాడు, ఈ పట్టణం అష్షూరురాజు చేతికి చిక్కదు’ అని హిజ్కియా చెప్తున్నాడు.
31 హిజ్కియా చెప్పిన మాట మీరు నమ్మవద్దు. అష్షూరురాజు చెప్పేదేమంటే, నాతో సంధి చేసుకుని మీరు బయటికి నా దగ్గరికి వస్తే, మీలో ప్రతి మనిషీ తన సొంత ద్రాక్షచెట్టు ఫలం, తన అంజూరపు చెట్టు ఫలం తింటూ, తన సొంత బావిలో నీళ్లు తాగుతాడు. 32 ఆ తరువాత మీరు చనిపోకుండా బ్రతికేలా మేము వచ్చి మీ దేశం లాంటి దేశానికీ, అంటే గోదుమలు, ద్రాక్షారసం ఉన్న దేశానికీ, ఆహారం, ద్రాక్షచెట్లు ఉన్న దేశానికీ, ఒలీవ నూనె, తేనె ఉన్న దేశానికీ మిమ్మల్ని తీసుకు పోతాము. అక్కడ మీరు సుఖంగా ఉంటారు. కాబట్టి, యెహోవా మిమ్మల్ని విడిపిస్తాడని హిజ్కియా మీకు బోధించే మాటలు వినొద్దు.
33 వివిధ ప్రజల దేవుళ్లలో ఎవరైనా తమ దేశాన్ని అష్షూరురాజు చేతిలోనుంచి విడిపించారా? 34 హమాతు దేవుళ్ళు ఏమయ్యారు? అర్పాదు దేవుళ్ళు ఏమయ్యారు? సెపర్వయీము దేవుళ్ళు ఏమయ్యారు? హేన ఇవ్వా అనే వాళ్ళ దేవుళ్ళు ఏమయ్యారు? (షోమ్రోను దేశపు) దేవుళ్ళు మా చేతిలోనుంచి షోమ్రోనును విడిపించారా? 35 మా చేతిలోనుంచి యెహోవా యెరూషలేమును విడిపిస్తాడు అనడానికి, వివిధ దేశాల దేవుళ్లలో ఎవరైనా తమ దేశాన్ని మా చేతిలోనుంచి విడిపించిన సందర్భం ఉందా?” అన్నాడు.
36 అయితే అతనికి జవాబు ఇవ్వొద్దని రాజు చెప్పిన కారణంగా ప్రజలు ఏమాత్రం మాట్లాడకుండా మౌనంగా ఉన్నారు. 37 గృహ నిర్వాహకుడైన హిల్కీయా కొడుకు ఎల్యాకీము, శాస్త్రి షెబ్నా, రాజ్య లేఖనాల అధిపతి ఆసాపు కొడుకు యోవాహు, బట్టలు చింపుకుని హిజ్కియా దగ్గరికి వచ్చి, రబ్షాకే పలికిన మాటలన్నీ తెలియజేశారు.
19:1 వాళ్ళ నివేదిక హిజ్కియా విన్నప్పుడు, తన బట్టలు చింపుకుని గోనెపట్ట కట్టుకుని యెహోవా మందిరానికి వెళ్ళాడు. 2 గృహ నిర్వాహకుడైన ఎల్యాకీమునూ, శాస్త్రి షెబ్నానూ, యాజకుల్లో పెద్దలనూ, ప్రవక్త అయిన ఆమోజు కొడుకు యెషయా దగ్గరికి పంపాడు.
3 వీళ్ళు గోనెపట్ట కట్టుకుని అతని దగ్గరికి వచ్చి అతనితో “హిజ్కియా చెప్పేదేమంటే, ఇది కష్టం, శిక్ష, దూషణల దినం. పిల్లలు పుట్టే సమయం వచ్చింది, కాని కనడానికి శక్తి లేదు. 4 జీవం కలిగిన దేవుణ్ణి దూషించడానికి అష్షూరు రాజైన తన యజమాని పంపిన రబ్షాకే పలికిన మాటలన్నీ నీ దేవుడైన యెహోవా ఒకవేళ విని, నీ దేవుడైన యెహోవా విన్న ఆ మాటలను బట్టి ఆయన అష్షూరురాజును గద్దించొచ్చు. కాబట్టి ఇక్కడ మిగిలి ఉన్న వాళ్ళ కోసం నీవు ప్రార్థన చెయ్యి.”
5 రాజైన హిజ్కియా సేవకులు యెషయా దగ్గరికి వచ్చినప్పుడు, 6 యెషయా వాళ్ళతో “మీ యజమానికి ఈ మాట తెలియజేయండి. యెహోవా చెప్పేదేమంటే, అష్షూరురాజు పనివారు నన్ను దూషిస్తూ పలికిన ఆ మాటలు నీవు విని భయపడొద్దు. 7 అతనిలో ఒక ఆత్మను నేను పుట్టిస్తాను. అతడు అ వదంతి విని తన దేశానికి వెళ్ళిపోతాడు. అతని దేశంలో అతన్ని కత్తితో చంపుతారు” అన్నాడు.
ప్రధాన సంగీతకారుడి కోసం, కోరహు వారసుల దైవ ధ్యానం.
1 దేవా, మా పూర్వీకుల రోజుల్లో, మా పితరుల కాలంలో నువ్వు చేసిన పనులన్నిటిని గూర్చి మా పితరులు మాకు చెప్పారు. మేము మా చెవులారా విన్నాం.
2 నువ్వు నీ చేత్తో వివిధ జాతులను తోసివేశావు. మా ప్రజలను అక్కడ నాటావు. ప్రజలను బాధపెట్టావు. కానీ దేశంలో మా ప్రజలను విస్తరింపజేశావు.
3 వాళ్ళు తమ చేతనున్న కత్తితో అక్కడి భూమిని తమ కోసం స్వాధీనం చేసుకోలేదు. వారి భుజబలం వారిని రక్షించలేదు. కానీ నీ కుడి చెయ్యి, నీ భుజబలం, నీ ముఖకాంతి వాళ్ళకి విజయం సాధించిపెట్టాయి. నువ్వు వాళ్ళకు అనుకూలంగా ఉన్నావు.
4 దేవా, నువ్వే నాకు రాజువి. యాకోబుకు విజయం కలగాలని ఆజ్ఞాపించు.
5 నీ ద్వారా మేము మా శత్రువులను అణచి వేస్తాం. నీ నామాన్ని బట్టి మేము మాపై లేచే వాళ్ళను తొక్కి వేస్తాం.
6 నేను నా విల్లుపై భరోసా ఉంచను. నా కత్తి నన్ను రక్షించలేదు.
7 మా శత్రువుల నుండి మమ్మల్ని కాపాడింది నువ్వే. మమ్మల్ని ద్వేషించే వాళ్ళను సిగ్గుపరిచిందీ నువ్వే.
8 మా దేవునిలోనే మేము రోజంతా గర్విస్తున్నాం. నీ నామానికి శాశ్వతంగా కృతజ్ఞతలు చెప్పుకుంటాం. సెలా.
9 అయితే ఇప్పుడు నువ్వు మమ్మల్ని తోసివేశావు. మా పైకి అవమానం పంపించావు. మా సైన్యాలతో కలసి నువ్వు బయలుదేరడం లేదు.
10 శత్రువుల ఎదుట నిలబడలేక వెనక్కి తిరిగేలా చేస్తున్నావు. మమ్మల్ని ద్వేషించేవాళ్ళు తమ కోసం మమ్మల్ని దోచుకుంటున్నారు.
11 వాళ్ళ కోసం ఆహారంగా తయారైన గొర్రెల్లాగా మమ్మల్ని చేశావు. అనేక దేశాల్లోకి మమ్మల్ని చెదరగొట్టావు.
12 అతి తక్కువ వెలకు మమ్మల్ని అమ్మివేశావు. అలా చేయడం మూలంగా నీ సంపద ఏమీ అధికం కాలేదు.
13 మా పొరుగు వాళ్ళ దృష్టిలో మమ్మల్ని నిందకూ ఎగతాళికీ పరిహాసానికీ కారణంగా చేశావు.
14 మా చుట్టూ ఉన్న దేశాల్లో మమ్మల్ని ఒక అవమానంగా, ప్రజలు తల ఊపి హేళన చేయడానికి కారణంగా చేశావు.
15 పరిహాసం, అవమానం చేసే వాళ్ళ కారణంగా, పగ తీర్చుకునే శత్రువు కారణంగా
16 ఆ అవమానమే రోజంతా నా ఎదుట ఉంది. నా ముఖంలో కనిపించే అవమానం నన్ను నిలువెల్లా కప్పివేస్తున్నది.
17 ఇదంతా మాకు జరిగినా మేము మాత్రం నిన్ను మర్చిపోలేదు. నీ నిబంధనను అతిక్రమించలేదు.
18 మా హృదయం నిన్ను విడిచి వెనక్కి మళ్ళలేదు. మా అడుగులు నీ మార్గాన్ని విడువలేదు.
19 కానీ నువ్వు నక్కలు తిరిగే చోట మమ్మల్ని తీవ్రంగా విరగ్గొట్టావు. చావునీడ కింద మమ్మల్ని కప్పి ఉంచావు.
20 ఒకవేళ మేము మా దేవుడి నామాన్ని మర్చిపోయి అన్య దేవతల వైపు మా చెయ్యి చాపితే
21 హృదయ రహస్యాలు తెలిసిన దేవుడు ఇది తెలుసుకోకుండా ఉంటాడా?
22 కచ్చితంగా మేము నీ కోసం రోజంతా వధకు గురౌతున్నాం. వధించడం కోసం ప్రత్యేకించిన గొర్రెల్లాగా ఉన్నాము.
23 ప్రభూ, నువ్వు ఎందుకు నిద్రపోతున్నావు? నిద్ర మేలుకో, మమ్మల్ని శాశ్వతంగా విడిచి పెట్టకు.
24 నీ ముఖాన్ని మాకెందుకు చాటు చేసుకుంటున్నావు? మా వేదననూ మాకు కలిగే హింసనూ మర్చిపోయావెందుకు?
25 మా ప్రాణం నేల వరకూ కుంగి పోయింది. మా శరీరం నేలకు కరచుకుని ఉంది.
26 మాకు సహాయం చేయడానికి లే. నీ నిబంధన కృపను బట్టి మమ్మల్ని విమోచించు.