సన్హెరీబు సైన్యం నాశనం

క్రీ.పూ. 710

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

2 రాజులు 19:8–19

8 అష్షూరురాజు లాకీషు పట్టణాన్ని విడిచి వెళ్లి లిబ్నా మీద యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు, రబ్షాకే వెళ్లి అతన్ని కలుసుకున్నాడు. 9 అప్పుడు, కూషురాజు తిర్హాకా తన మీద యుద్ధం చెయ్యడానికి వచ్చాడని అష్షూరు రాజు విన్నాడు. అతడు ఇంకొకసారి హిజ్కియా దగ్గరికి వార్తాహరులను పంపాడు.

10 “యూదారాజు హిజ్కియాతో ఈ విధంగా చెప్పండి. యెరూషలేము అష్షూరురాజు చేతికి చిక్కదు అని చెప్పి నీవు నమ్ముకొన్న నీ దేవుడి వల్ల మోసపోవద్దు. 11 చూడు, అష్షూరు రాజులు అన్ని దేశాలను పూర్తిగా నాశనం చేసిన సంగతి నీకు వినబడింది గదా, నీవు మాత్రం తప్పించుకోగలవా?

12 నా పూర్వికులు నాశనం చేసిన గోజాను, హారాను, రెజెపు ప్రజలు గానీ, తెలశ్శారులో ఉన్న ఏదెనీయులు గానీ, తమ దేవుళ్ళ సాయం వల్ల తప్పించుకున్నారా? 13 హమాతు రాజు ఏమయ్యాడు? అర్పాదు, సెపర్వియీము, హేన, ఇవ్వా అనే పట్టణాల రాజులు ఏమయ్యారు?” అని వార్త పంపాడు.

14 హిజ్కియా వార్తాహరుల చేతిలోనుంచి ఆ ఉత్తరం తీసుకుని చదివి, యెహోవా మందిరంలోకి వెళ్లి, యెహోవా సన్నిధిలో దాన్ని విప్పి పరిచి, 15 యెహోవా సన్నిధిలో ప్రార్థన చేస్తూ “యెహోవా, కెరూబుల మధ్య నివాసం ఉన్న ఇశ్రాయేలీయుల దేవా, భూమినీ ఆకాశాన్ని సృష్టించిన అద్వితీయ దేవా, నీవు లోకంలో ఉన్న అన్ని రాజ్యాలకూ దేవుడవు.

16 యెహోవా, ఆలకించు. యెహోవా, కళ్ళు తెరచి చూడు. సజీవ దేవుడివైన నిన్ను దూషించడానికి సన్హెరీబు పంపినవాడి మాటలు ఆలకించు. 17 యెహోవా, అష్షూరురాజులు ఆ ప్రజలను, వాళ్ళ దేశాలను పాడు చేసి 18 వాళ్ళ దేవుళ్ళను అగ్నిలో వేసిన మాట నిజమే. ఆ రాజ్యాల దేవుళ్ళు నిజమైన దేవుళ్ళు కాదు. అవి మనుషుల చేసిన కర్రలు, రాళ్లే. కాబట్టి వారు వాటిని నాశనం చేశారు.

19 యెహోవా మా దేవా, లోకంలో ఉన్న మనుషులందరూ నువ్వే నిజంగా అద్వితీయ దేవుడవైన యెహోవావని తెలుసుకునేలా అతని చేతిలోనుంచి మమ్మల్ని రక్షించు” అన్నాడు.

కీర్తనలు 73

ఆసాపు కీర్తన

1 ఇశ్రాయేలు పట్ల, శుద్ధహృదయం గలవారి పట్ల దేవుడు నిజంగా దయ గలవాడు.

2 నా పాదాలు కొద్దిలో జారిపోయేవి. నా అడుగులు దాదాపుగా జారి పోయాయి.

3 భక్తిహీనులు క్షేమంగా ఉండడం చూసి వారి గర్వాన్ని చూసి నేను అసూయపడ్డాను.

4 మరణ సమయంలో కూడా వారికి యాతన అనిపించదు. వారు పుష్టిగా ఉన్నారు.

5 ఇతరులకు కలిగే ఇబ్బందులు వారికి కలగవు. ఇతరులకు వచ్చే విపత్తులు వారికి రావు.

6 కాబట్టి గర్వం వారి మెడ చుట్టూ కంఠహారం లాగా ఉంది. దుర్మార్గతను వారు వస్త్రంలాగా ధరిస్తారు.

7 వారి కళ్ళు కొవ్వు పట్టి ఉబ్బి ఉన్నాయి. దురాలోచనలు వారి హృదయంలోనుండి బయటికి వస్తున్నాయి.

8 వారు ఎగతాళి చేస్తారు. పొగరుబోతు మాటలు పలుకుతారు. గర్వంగా గొప్పలు చెప్పుకుంటారు.

9 వారి మాటలు దేవునికి వ్యతిరేకంగా ఉంటాయి. వారి నాలుకతో భూమి అంతటినీ చుట్టి వస్తారు.

10 కాబట్టి దేవుని ప్రజలు వారి పక్షం చేరతారు. వారి మాటలను మంచినీళ్ళు తాగినట్టు తాగుతారు.

11 దేవునికి ఎలా తెలుస్తుంది? ఇక్కడ ఏమి జరుగుతూ ఉందో ఆయనకి అవగాహన ఉందా? అని వారనుకుంటారు.

12 గమనించండి. వారు దుర్మార్గులు. మరింత డబ్బు సంపాదిస్తూ విచ్చలవిడిగా ఉంటారు.

13 నా హృదయాన్ని పవిత్రంగా ఉంచుకోవడం వ్యర్థమే. నా చేతులు కడుక్కుని నిర్దోషంగా ఉండడం వ్యర్థమే.

14 రోజంతా నాకు బాధ కలుగుతూ ఉంది. ప్రతి ఉదయం నేను శిక్షకు గురవుతున్నాను.

15 ఇలాటి మాటలు నేను చెబుతాను అని నేను అన్నట్టయితే నేను ఈ తరంలోని నీ పిల్లలను మోసం చేసినట్టే.

16 అయినా దీన్ని గురించి ఆలోచించినప్పుడు అది నాకు చాలా కష్టసాధ్యం అనిపించింది.

17 నేను దేవుని పరిశుద్ధ స్థలంలోకి వెళ్లి ధ్యానించినప్పుడు వారి గతి ఏమిటో గ్రహించ గలిగాను.

18 నువ్వు వారిని కాలుజారే స్థలంలో ఉంచావు. నువ్వు వారిని పడదోసినప్పుడు వారు నశిస్తారు.

19 ఒక్క క్షణంలో వారు అంతమైపోతారు. విపరీతమైన భయంతో నశించిపోతారు.

20 నిద్ర మేలుకుని తన కల మరచిపోయినట్టు ప్రభూ, నువ్వు మేలుకుని వారి ఉనికి లేకుండా చేస్తావు.

21 నా హృదయంలో దుఃఖం ఉంది. నా అంతరంగంలో నేను గాయపడ్డాను.

22 అప్పుడు నేను తెలివి తక్కువగా ఆలోచించాను. నీ సన్నిధిలో మృగం వంటి వాడుగా ఉన్నాను.

23 అయినా నేను నిరంతరం నీతో ఉన్నాను. నువ్వు నా కుడిచెయ్యి పట్టుకుని ఉన్నావు.

24 నీ సలహాలతో నన్ను నడిపిస్తావు. తరువాత నన్ను మహిమలో చేర్చుకుంటావు.

25 పరలోకంలో నువ్వు తప్ప నాకెవరున్నారు? నువ్వు నాకుండగా ఈ లోకంలో నాకింకేమీ అక్కరలేదు.

26 నా శరీరం, నా హృదయం క్షీణించిపోయినా దేవుడు ఎప్పుడూ నా హృదయానికి బలమైన దుర్గంగా ఉన్నాడు.

27 నీకు దూరంగా జరిగేవారు నశించిపోతారు. నీకు అపనమ్మకంగా ఉన్నవారందరినీ నువ్వు నాశనం చేస్తావు.

28 నాకు మాత్రం కావలసింది దేవునికి దగ్గరగా ఉండడమే. యెహోవాను నా ఆశ్రయంగా చేసుకున్నాను. నీ కార్యాలన్నిటినీ నేను ప్రచారం చేస్తాను.

2 రాజులు 19:20–35

20 అప్పుడు ఆమోజు కొడుకు యెషయా హిజ్కియా దగ్గరికి వార్త పంపుతూ “ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా చెప్పేదేమంటే, అష్షూరురాజు సన్హెరీబు విషయంలో నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించాను. 21 అతని గురించి యెహోవా చెప్పేదేమంటే, సీయోను కుమారి కన్యక నిన్ను తిరస్కరిస్తున్నది. నిన్ను హేళన చేస్తూ ఉంది. యెరూషలేము కుమారి నిన్ను చూసి తల ఊపుతూ ఉంది. 22 నీవు ఎవర్ని తిరస్కరించావు? ఎవర్ని దూషించావు? నీవు గర్వించి ఎవర్ని భయపెట్టావు? 23 ఇశ్రాయేలీయుల పవిత్ర దేవుణ్ణి కాదా? నీ వర్తమానికుల చేత యెహోవాను తిరస్కరించి పలికించిన మాటలు ఇవే గదా. నా రథాల సమూహంతో నేను పర్వత శిఖరాలకూ, లెబానోను కొండల ఎత్తులకూ, ఎక్కాను. ఎత్తుగల దాని దేవదారు వృక్షాలనూ, శ్రేష్ఠమైన సరళ వృక్షాలనూ నరికాను. దూరపు సరిహద్దుల్లో ఉన్న సత్రాల్లోకీ, ఫలాలకు క్షేత్రమైన అడవిలోకీ ప్రవేశించాను. 24 నేను బావులు తవ్వి, పరుల నీళ్లు పానం చేశాను. నా అరకాలి కింద నేను ఐగుప్తు నదులన్నిటినీ ఎండిపోజేశాను. 25 నేనే పూర్వకాలంలోనే దీన్ని కలగచేశాననీ, పురాతన కాలంలోనే దీన్ని నిర్ణయించాననీ నీకు వినబడలేదా? ప్రాకారాలున్న పట్టణాలను నీవు పాడు దిబ్బలుగా చెయ్యడం నావల్లే జరిగింది. 26 కాబట్టి వాటి కాపురస్థులు బలహీనులై జడిసి, విభ్రాంతి పొంది, పొలంలో ఉన్న గడ్డిలా, కాడలు లేని చేలలా అయ్యారు. 27 నీవు కూర్చోవడం, బయలుదేరడం, లోపలికి రావడం, నా మీద వేసే రంకెలూ అన్నీ నాకు తెలుసు. 28 నా మీద నీవు వేసే రంకెలూ, నీవు చేసిన గొడవ నా చెవుల్లో పడింది గనుక నా గాలాన్ని నీ ముక్కుకు తగిలిస్తాను. నా కళ్ళెం నీ నోట్లో పెట్టి నిన్ను మళ్ళిస్తాను. నీవు వచ్చిన దారిలోనే నిన్ను మళ్ళిస్తాను.

29 హిజ్కియా, నీకిదే సూచన. ఈ సంవత్సరంలో దానంతట అదే పండే ధాన్యం, రెండో సంవత్సరంలో దాని నుంచి వచ్చే ధాన్యం మీరు తింటారు. మూడో సంవత్సరంలో మీరు విత్తనం విత్తి చేలు కోస్తారు. ద్రాక్షతోటలు నాటి వాటి ఫలం అనుభవిస్తారు. 30 యూదా వంశంలో తప్పించుకొన్న శేషం ఇంకా కిందకు వేరు తన్ని పైకి ఎదిగి ఫలిస్తారు. 31 ఆ మిగిలిన వారు యెరూషలేములోనుంచి బయలు దేరుతారు. తప్పించుకొన్నవారు సీయోను కొండలోనుంచి బయలు దేరుతారు. సైన్యాలకు అధిపతి అయిన యెహోవా ఆసక్తి దీన్ని నెరవేరుస్తుంది.

32 కాబట్టి అష్షూరు రాజు గురించి యెహోవా చెప్పేదేమంటే, అతడు ఈ పట్టణంలోకి రాడు. దానిమీద ఒక్క బాణమైనా వెయ్యడు. ఒక్క డాలైనా దానికి చూపించడు. దాని ఎదుట ముట్టడి దిబ్బ కట్టడు. 33 ఈ పట్టణం లోపలికి రాకుండా, తాను వచ్చిన దారిలోనే అతడు తిరిగి వెళ్ళిపోతాడు. ఇదే యెహోవా వాక్కు. 34 నా నిమిత్తమూ, నా సేవకుడైన దావీదు నిమిత్తమూ, నేను ఈ పట్టణాన్ని కాపాడి రక్షిస్తాను.”

35 ఆ రాత్రే యెహోవా దూత బయలుదేరి అష్షూరు వాళ్ళ శిబిరంలోకి వెళ్లి 1, 85,000 మందిని హతం చేశాడు. ఉదయాన ప్రజలు లేచి చూసినప్పుడు వాళ్ళందరూ శవాలై చచ్చి పడి ఉన్నారు.

కీర్తనలు 75–76

ప్రధాన సంగీతకారుని కోసం. అల్ తష్హేత్ అనే రాగంలో పాడేది. ఆసాపు కీర్తన, ఒక పాట.

1 దేవా, మేము నీకు కృతజ్ఞతలు అర్పిస్తున్నాము. నువ్వు నీ సన్నిధిని మాకు వెల్లడించావని నీకు కృతజ్ఞతలు అర్పిస్తున్నాము. మనుషులు నీ ఆశ్చర్యకార్యాలు వివరిస్తారు.

2 నియామక కాలంలో నేను నిష్పక్షపాతంగా తీర్పు తీరుస్తాను.

3 భూమి, దాని నివాసులంతా భయంతో వణుకుతున్నప్పుడు నేనే ఈ భూమి స్థంభాలను నిలబెడతాను. సెలా.

4 అహంకారంగా ఉండవద్దు అని గర్విష్టులకు ఆజ్ఞాపిస్తున్నాను.

5 విజయం దొరుకుతుందని అంతగా నమ్మకం పెట్టుకోవద్దు. మీ తలలు పైకెత్తి మాట్లాడవద్దు అని దుర్మార్గులతో చెప్పాను.

6 తూర్పునుండి గానీ పడమటి నుండి గానీ అరణ్యం నుండి గానీ విజయం రాదు.

7 దేవుడే తీర్పు తీర్చేవాడు. ఆయన ఒకణ్ణి తగ్గిస్తాడు, ఒకణ్ణి హెచ్చిస్తాడు.

8 యెహోవా చేతిలో ఒక పాత్ర ఉంది. అందులోని ద్రాక్షారసం పొంగుతూ ఉంది. అది సుగంధ ద్రవ్యాలతో నిండి ఉంది. ఆయన దాన్ని పోస్తున్నాడు.

భూమిమీద ఉన్న దుర్మార్గులంతా ఆఖరు బొట్టు వరకు దాన్ని తాగాలి.

9 నేనైతే ఎప్పుడూ నువ్వు చేసిన కార్యాలను ప్రచారం చేస్తాను. యాకోబు దేవుణ్ణి నేను నిత్యమూ కీర్తిస్తాను.

10 నేను భక్తిహీనుల కొమ్ములను విరగగొడతాను. నీతిమంతుల కొమ్ములు పైకెత్తుతాను అని ఆయన అన్నాడు.

ప్రధాన సంగీతకారుని కోసం, తీగ వాయిద్యాలతో పాడేది. ఆసాపు కీర్తన, ఒక పాట.

76:1 యూదాలో దేవుడు తనను తెలియబరచుకున్నాడు. ఇశ్రాయేలులో ఆయన నామం ఘనమైనది.

2 షాలేంలో ఆయన నివాసం ఉంది, సీయోనులో ఆయన గృహం ఉంది.

3 అక్కడ ఆయన విల్లంబులు, డాలు, కత్తి మిగతా యుద్ధాయుధాలను విరిచి వేశాడు. సెలా.

4 నువ్వు నీ శత్రువులను జయించి పర్వతాల నుంచి దిగి వస్తూ మెరిసిపోతున్నావు. నీ మహిమను ప్రదర్శిస్తున్నావు.

5 గుండె ధైర్యం గలవారు దోపిడికి గురి అయ్యారు. నిద్రపోయారు. శూరులంతా నిస్సహాయులయ్యారు.

6 యాకోబు దేవా, యుద్ధంలో నీ గద్దింపుకు గుర్రం, రౌతు కూడా మూర్ఛిల్లారు.

7 నీకు, నీకు మాత్రమే భయపడాలి. నువ్వు కోపపడితే నీ ఎదుట ఎవరు నిలుస్తారు?

8 నీ తీర్పు పరలోకం నుంచి వచ్చింది, భూమికి భయమేసింది, అది మౌనంగా ఉంది.

9 దేవా! నువ్వు తీర్పు ప్రకటించడానికి, దేశమంతటా అణగారిన వాళ్ళను కాపాడడానికి లేచావు. సెలా.

10 కోపంతో వారిపై నీ తీర్పు ప్రజలు కచ్చితంగా నిన్ను స్తుతించేలా చేస్తుంది. నీ ఆగ్రహాన్ని నువ్వు పూర్తిగా వెల్లడిస్తావు.

11 మీ యెహోవా దేవునికి మొక్కుకుని వాటిని చెల్లించండి. ఆయన చుట్టూ ఉన్న వాళ్ళంతా భయభక్తులకు పాత్రుడైన ఆయనకు కానుకలు తీసుకు రండి.

12 అధికారుల పొగరును ఆయన అణచివేస్తాడు, భూరాజులు ఆయనకు భయపడతారు.

2 రాజులు 19:36–37

36 అష్షూరురాజు సన్హెరీబు వెనక్కి తిరిగి, నీనెవె పట్టణానికి వెళ్ళిపోయి అక్కడ నివసించాడు. 37 అతడు నిస్రోకు అనే తన దేవుడు మందిరంలో మొక్కుతూ ఉన్నప్పుడు, అతని కొడుకులు అద్రమ్మెలెకు, షరెజెరు కత్తితో అతన్ని చంపి అరారాతు దేశంలోకి తప్పించుకు పారిపోయారు. అప్పుడు అతని కొడుకు ఏసర్హద్దోను అతని స్థానంలో రాజయ్యాడు.