హిజ్కియాకు బబులోను రాజు అభినందనలు

హిజ్కియా కోలుకున్నందుకు బబులోను రాజు అతణ్ణి అభినందిస్తాడు.

క్రీ.పూ. 713

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

2 రాజులు 20:12–19

12 ఆ కాలంలో బబులోనురాజు, బలదాను కొడుకు అయిన బెరోదక్ బలదాను హిజ్కియా జబ్బుగా ఉన్నాడన్న విషయం తెలిసి, ఉత్తరం రాసి కానుకలు ఇచ్చి రాయబారులను అతని దగ్గరికి పంపాడు. 13 వర్తమానికులు వచ్చారన్న మాట హిజ్కియా విని వాళ్ళను లోపలికి రప్పించి, తన రాజనగరంలోనూ, రాజ్యంలోనూ ఉన్న అన్ని వస్తువుల్లో, దేనినీ దాచకుండా, తన వస్తువులు ఉన్న కొట్టూ, వెండి బంగారాలూ, సుగంధ ద్రవ్యాలూ, సువాసన తైలం, ఆయుధశాల, తన వస్తువుల్లో ఉన్నవన్నీ వాళ్లకు చూపించాడు.

14 తరువాత ప్రవక్త అయిన యెషయా హిజ్కియా రాజు దగ్గరికి వచ్చి “ఆ మనుషులు ఏమన్నారు? నీ దగ్గరికి ఎక్కడ నుంచి వచ్చారు?” అని అడిగాడు. హిజ్కియా “బబులోను అనే దూరదేశం నుంచి వారు వచ్చారు” అని చెప్పాడు. 15 “నీ ఇంట్లో వారు ఏమేమి చూశారు?” అని అతడు అడిగాడు. హిజ్కియా “నా వస్తువుల్లో దేన్నీ దాచకుండా నా ఇంట్లో ఉన్నవన్నీ నేను వాళ్లకు చూపించాను” అన్నాడు.

16 అప్పుడు యెషయా హిజ్కియాతో “యెహోవా చెప్పే మాట విను. 17 రానున్న రోజుల్లో ఏమీ మిగులకుండా నీ రాజనగరులో ఉన్నవన్నీ, ఈ రోజు వరకూ నీ పూర్వికులు సమకూర్చి దాచిపెట్టినదంతా, వారు బబులోను పట్టణానికి తీసుకుని వెళ్ళిపోతారని యెహోవా చెప్తున్నాడు. 18 ఇంకా నీ కడుపున పుట్టిన నీ కొడుకుల సంతతిని వారు బబులోను రాజు నగరానికి తీసుకు వెళ్తారు. అక్కడ వారు నపుంసకులు అవుతారు” అన్నాడు.

19 అందుకు హిజ్కియా “నీవు తెలియజేసిన యెహోవా ఆజ్ఞ ప్రకారం జరగడం మంచిదే. నా కాలంలో మాత్రం సమాధానం, స్థిరత్వం ఉంటాయి కదా?” అని యెషయాతో అన్నాడు.

సన్హెరీబు రెండవ దండయాత్ర సంక్షిప్తంగా క్రీ.పూ. 710

సన్హెరీబు రెండవ దండయాత్రకు పరిచయం, లేదా దాని సంక్షిప్త వృత్తాంతం.

2 దినవృత్తాంతాలు 32:9–23

9 ఆ తరువాత అష్షూరురాజు సన్హెరీబు తన సైన్యమంతటితో లాకీషు ముట్టడించాడు. యెరూషలేములోని యూదారాజు హిజ్కియా దగ్గరికీ యెరూషలేములో ఉన్న యూదావారందరి దగ్గరికీ తన సేవకులను పంపి ఇలా ప్రకటన చేయించాడు. 10 “అష్షూరురాజు సన్హెరీబు తెలియచేసేది ఏంటంటే, దేనిని నమ్మి మీరు ముట్టిడిలో ఉన్న యెరూషలేములో నిలిచి ఉన్నారు? 11 కరువుతో దాహంతో మిమ్మల్ని చంపడానికి ‘మన దేవుడైన యెహోవా అష్షూరురాజు చేతిలో నుంచి మనలను విడిపిస్తాడు’ అని చెప్పి హిజ్కియా మిమ్మల్ని తప్పుదారి పట్టిస్తున్నాడు గదా? 12 ఆ హిజ్కియా, ‘మీరు ఒక్క బలిపీఠం ముందు నమస్కరించి దాని మీద ధూపం వేయాలి’ అని యూదావారికి యెరూషలేము వారికి ఆజ్ఞ ఇచ్చి, యెహోవా ఉన్నత స్థలాలను బలిపీఠాలను తీసివేశాడు కదా? 13 నేనూ నా పూర్వీకులూ ఇతర దేశాల ప్రజలందరికీ ఏమేమి చేశామో మీకు తెలియదా? ఇతర జాతి ప్రజల దేవుళ్ళు వారి దేశాలను ఎప్పుడైనా నా చేతిలోనుంచి విడిపించగలిగారా? 14 నా పూర్వీకులు బొత్తిగా నిర్మూలం చేసిన ప్రజల దేవుళ్లలో ఏ దేవుడు తన ప్రజలను నా చేతిలోనుంచి విడిపించగలిగాడు? మీ దేవుడు మిమ్మల్ని నా చేతిలోనుంచి ఎలా విడిపిస్తాడు? 15 కాబట్టి ఈ విధంగా ఇప్పుడు మీరు హిజ్కియా చేత మోసపోవద్దు. మీరు అతని మాట నమ్మవద్దు. ఏ ప్రజల దేవుడైనా ఏ రాజ్యపు దేవుడైనా తన ప్రజలను నా చేతిలోనుంచి గాని నా పూర్వీకుల చేతిలోనుంచి గాని విడిపించలేకపోయాడు. అలాంటప్పుడు మీ దేవుడు నా చేతిలోనుంచి మిమ్మల్ని ఏమాత్రం విడిపించలేడు గదా.”

16 సన్హెరీబు సేవకులు దేవుడైన యెహోవా మీదా ఆయన సేవకుడైన హిజ్కియా మీదా వ్యతిరేకంగా ఇంకా మాట్లాడారు. 17 అంతేగాక “ఇతర దేశాల ప్రజల దేవుళ్ళు తమ ప్రజలను నా చేతిలోనుంచి ఎలా విడిపించలేకపోయారో అలాగే హిజ్కియా సేవించే దేవుడు కూడా తన ప్రజలను నా చేతిలోనుంచి విడిపించలేడు” అని ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నిందించడానికి, ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడడానికి సన్హెరీబు ఉత్తరాలు కూడా రాసి పంపాడు.

18 అప్పుడు వారు పట్టణాన్ని పట్టుకోవాలన్న ఉద్దేశంతో, గోడమీదున్న యెరూషలేము ప్రజలను బెదరించడానికీ బాధపెట్టడానికీ యూదా భాషలో బిగ్గరగా వారితో మాట్లాడారు. 19 మిగతా ప్రజల దేవుళ్ళతో వారు (అవి మనుష్యుల చేతులతో చేసినవి) మాట్లాడినట్టు, యెరూషలేము దేవుని మీద కూడా మాట్లాడారు.

20 రాజైన హిజ్కియా, ఆమోజు కొడుకూ, ప్రవక్తా అయిన యెషయా ఈ విషయం గురించి ప్రార్థించి ఆకాశం వైపు మొర్రపెట్టారు. 21 యెహోవా ఒక దూతను పంపాడు. అతడు అష్షూరు రాజు దండులోని పరాక్రమశాలులందరినీ సేనా నాయకులనూ అధికారులనూ చంపేశాడు. అష్షూరు రాజు అవమానంతో తన దేశానికి తిరిగి వెళ్లిపోయాడు. అతడు తన దేవుని గుడిలోకి వెళితే అతని సొంత కొడుకులే అతణ్ణి అక్కడ కత్తితో చంపేశారు.

22 ఈ విధంగా యెహోవా, హిజ్కియానూ యెరూషలేము నివాసులనూ అష్షూరు రాజు సన్హెరీబు చేతిలోనుంచి, మిగతావారందరి చేతిలోనుంచి కాపాడి, అన్ని రకాలుగా వారిని నడిపించాడు. 23 చాలామంది యెరూషలేములో యెహోవాకు అర్పణలను యూదారాజు హిజ్కియాకు విలువైన వస్తువులను తెచ్చారు. అందువలన అతడు అప్పటినుంచి అన్ని రాజ్యాల దృష్టిలో ఘనత పొందాడు.