భాగం 6: సౌలు రాజ్యపాలన
సౌలు ఇశ్రాయేలుపై రాజుగా నియమించబడడం
క్రీ.పూ. 1095
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
1 బెన్యామీను గోత్రానికి చెందిన కీషు అనే ధనవంతుడు ఉండేవాడు. కీషు తండ్రి అబీయేలు. అబీయేలు తండ్రి సేరోరు. సేరోరు తండ్రి బెకోరతు. బెకోరతు తండ్రి అఫీయా. 2 కీషుకు సౌలు అనే ఒక కొడుకు ఉన్నాడు. అతడు చాలా అందమైన యువకుడు. ఇశ్రాయేలీయుల్లో అతణ్ణి మించిన అందగాడు లేడు. అతడు భుజాలపై నుండి ఇతరుల కంటే ఎత్తయినవాడు.
3 సౌలు తండ్రి కీషుకు చెందిన గాడిదలు తప్పిపోయినపుడు కీషు తన కొడుకు సౌలును పిలిచి “మన పనివాళ్ళలో ఒకణ్ణి వెంటబెట్టుకుని వెళ్ళి గాడిదలను వెదుకు” అని చెప్పాడు. 4 అతడు వెళ్ళి ఎఫ్రాయిము కొండలన్నీ తిరిగి షాలిషా దేశంలో వెతికినా అవి కనబడలేదు. తరువాత వారు షయలీము దేశం దాటి తిరిగినప్పటికీ అవి కనబడలేదు. బెన్యామీనీయుల దేశంలో వెతికినప్పటికీ అవి కనబడలేదు.
5 అప్పుడు వారు సూపు దేశానికి వచ్చినప్పుడు “మనం వెనక్కు వెళ్ళిపోదాం, గాడిదలను గూర్చి బాధపడ వద్దు. మా నాన్న మనకోసం ఎదురు చూస్తుంటాడు” అని సౌలు తనతో ఉన్న పనివాడితో అన్నప్పుడు, 6 వాడు “ఈ ఊర్లో దేవుని మనిషి ఒకడు ఉన్నాడు, అతడు చాలా గొప్పవాడు, అతడు ఏది చెపితే అది జరుగుతుంది. మనం ఎటు వెళ్ళాలో ఆ దారి అతడు మనకు చెబుతాడేమో, అతని దగ్గరకి వెళ్ళి అడుగుదాం రండి” అని చెప్పాడు.
7 అప్పుడు సౌలు “మనం వెళ్లేటప్పుడు అతనికి ఏమి తీసుకు వెళ్ళాలి? మన దగ్గర ఉన్న భోజన పదార్దాలు అన్నీ అయిపోయాయి. ఆ దేవుని మనిషికి బహుమానంగా ఇవ్వడానికి మన దగ్గర ఏమీ లేదు కదా! మన దగ్గర ఏం ఉన్నాయి?” అని తన పనివాణ్ణి అడిగాడు. 8 వాడు సౌలుతో “అయ్యా, వినండి. నా దగ్గర పావు తులం వెండి ఉంది, మనకు దారి చెప్పినందుకు దాన్ని ఆ దైవజనునికి ఇస్తాను” అన్నాడు.
9 ఇప్పుడు ప్రవక్తగా ఉన్నవాడిని గతంలో దీర్ఘదర్శి అని పిలిచేవాడు. ఇదివరకూ ఇశ్రాయేలీయులు ఎవరైనా దేవుని నుండి ఏదైనా విషయం తెలుసుకోవాలని ఆశించి వెళ్లే సమయంలో “మనం దీర్ఘదర్శి దగ్గరకి వెళ్దాం పదండి” అని చెప్పుకోవడం పరిపాటి. 10 అప్పుడు సౌలు “నువ్వు చెప్పింది బాగుంది. వెళ్దాం పద” అన్నాడు.
11 వారు దైవజనుడు ఉండే ఊరికి బయలుదేరారు. ఊరిలోకి వెళ్తుండగా నీళ్లు తోడుకోవడానికి వచ్చిన యువతులు వారికి ఎదురుపడినప్పుడు “ఇక్కడ దీర్ఘదర్శి ఉన్నాడా?” అని అడిగారు.
12 అందుకు వారు “ఇదిగో అతడు ఈ దగ్గరలోనే ఉన్నాడు. తొందరగా వెళ్ళి కలుసుకోండి. ఈ రోజే అతడు ఊర్లోకి వచ్చాడు. ఈ రోజే ఉన్నత స్థలం లో ప్రజల పక్షంగా బలి అర్పిస్తాడు. 13 మీరు ఊర్లోకి వెళ్ళగానే అతడు భోజనం చేయడానికి కొండ ప్రాంతానికి వెళ్లక ముందే మీరు అతణ్ణి కలుసుకోవచ్చు. అతడు వచ్చేంత వరకూ ప్రజలు భోజనం చేయరు, అతడు బలిని ఆశీర్వదించిన తరువాతే పిలిచిన వారు భోజనం చేస్తారు. మీరు త్వరగా వెళ్ళండి, అతణ్ణి కలుసుకోడానికి ఇదే సరైన సమయం.” అని చెప్పారు.
14 వారు ఊళ్లోకి వెళ్ళగానే కొండ ప్రాంతానికి వెళ్తున్న సమూయేలు వారికి ఎదురయ్యాడు.
15 సౌలు అక్కడకు రేపు వస్తాడని యెహోవా సమూయేలుకు చెప్పాడు. 16 ఎందుకంటే “నా ప్రజల విన్నపం నాకు చేరింది. నేను వారిని పట్టించుకొంటున్నాను. కాబట్టి ఫిలిష్తీయుల చేతిలోనుండి నా ప్రజలను విడిపించడానికి నా ప్రజలైన ఇశ్రాయేలీయులపై అతణ్ణి రాజుగా అభిషేకించడానికి రేపు ఇదే సమయానికి నేను బెన్యామీను దేశంలో నుండి ఒక వ్యక్తిని నీ దగ్గరికి రప్పిస్తాను.”
17 సౌలు సమూయేలుకు కనబడినప్పుడు, యెహోవా “ఇతడే నేను నీతో చెప్పిన వ్యక్తి. ఇతడే నా ప్రజలను పరిపాలిస్తాడు” అని అతనితో చెప్పాడు. 18 సౌలు పురద్వారంలో సమూయేలును కలుసుకుని “దీర్ఘదర్శి ఉండేది ఎక్కడ? దయచేసి నాకు చూపించండి” అని అడిగినప్పుడు, 19 సమూయేలు సౌలును చూసి “నేనే దీర్ఘదర్శిని. కొండ ప్రాంతానికి వెళ్ళండి, ఈరోజు మీరు నాతో కలసి భోజనం చెయ్యాలి. రేపు నీ సందేహం తీర్చి నేను నిన్ను పంపిస్తాను.
20 మూడు రోజుల క్రితం తప్పిపోయిన నీ గాడిదలను గూర్చి విచారించవద్దు, అవి దొరికాయి. ఇశ్రాయేలీయుల ఇష్టం ఎవరి పైన ఉంది? నీపైనా, నీ తండ్రి సంతానం పైనే కదా” అన్నాడు. 21 అప్పుడు సౌలు “నేను బెన్యామీను గోత్రానికి చెందినవాణ్ణి కదా. నా గోత్రం ఇశ్రాయేలీయుల గోత్రాల్లో అల్పమైనది కదా. నా కుటుంబం బెన్యామీను గోత్రపు వారందరిలో అల్పులు కదా? నాతో ఈ విధంగా ఎందుకు మాట్లాడుతున్నావు?” అన్నాడు.
22 అయితే సమూయేలు సౌలును, అతని పనివాణ్ణి భోజనపు గదిలోకి వెంటబెట్టుకుని వెళ్ళి తాను పిలిచిన ముప్ఫై మంది ఉన్న మొదటి వరుసలో వారిని కూర్చోబెట్టి 23 వంటవాణ్ణి చూసి “నేను ఉంచమని చెప్పి నీ చేతికి ఇచ్చిన దాన్ని తీసుకురా” అని చెప్పినప్పుడు, 24 అ వంటవాడు తొడ ఎముకను, దానిపైన ఉన్న మాంసాన్ని తీసుకువచ్చి సౌలుకు వడ్డించాడు. సమూయేలు సౌలుతో ఇలా అన్నాడు. “చూడు, మనం కలుసుకొనే సమయం కోసం దాచిపెట్టిన దాన్ని నీకు వడ్డించాను. పిలిచిన వాళ్ళు వచ్చినప్పటినుంచి దీన్ని ఈ సందర్భానికి నీ కోసం ఉంచాలని నేను వంటవాడితో చెప్పాను” అన్నాడు. ఆ రోజు సౌలు సమూయేలుతో కలసి భోజనం చేశాడు.
25 పట్టణ ప్రజలు కొండపై నుండి కిందికి దిగుతున్న సమయంలో సమూయేలు తన ఇంటిపై సౌలుతో మాట్లాడుతున్నాడు. 26 తరువాతి రోజు తెల్లవారుజామున సమూయేలు “నేను నీకు వీడ్కోలు చెప్పడానికి మిద్దెమీదికి రా” అని సౌలును పిలవగా సౌలు లేచాడు. తరువాత వారిద్దరూ బయలుదేరి 27 ఊరి చివరకూ వస్తుండగా సమూయేలు సౌలుతో “నీ పనివాణ్ణి మనకంటే ముందుగా వెళ్ళమని చెప్పు. దేవుడు నీతో చెప్పమన్నది నేను నీకు తెలియజేసేవరకూ నువ్వు ఇక్కడే ఆగిపో” అని చెప్పగా సౌలు పనివాణ్ణి ముందుగా పంపివేశాడు.
10:1 అప్పుడు సమూయేలు నూనె బుడ్డి తీసుకు సౌలు తల మీద నూనె పోసి అతణ్ణి ముద్దు పెట్టుకుని “యెహోవా నిన్ను అభిషేకించి తన సొత్తు అయిన తన ప్రజల మీద నిన్ను రాజుగా నియమించాడు” అని ఇంకా ఇలా చెప్పాడు, 2 “ఈ రోజు నువ్వు నా దగ్గర నుండి వెళ్ళిన తరువాత బెన్యామీను సరిహద్దులో సెల్సహులో ఉన్న రాహేలు సమాధి దగ్గర ఇద్దరు వ్యక్తులు నీకు కనిపిస్తారు. వారు ‘నువ్వు వెదకుతున్న గాడిదలు దొరికాయి. మీ నాన్న గాడిదల విషయం మరచిపోయి, నా కొడుకును వెదకడానికి నేనేం చెయ్యాలి, అని నీ కోసం బాధ పడుతున్నాడు’ అని చెబుతారు.
3 తరువాత నువ్వు అక్కడి నుండి వెళ్లి తాబోరు మైదానానికి రాగానే అక్కడ బేతేలు నుండి దేవుని దగ్గరకి వెళ్లే ముగ్గురు మనుషులు నీకు ఎదురుపడతారు. వారిలో ఒకడు మూడు మేకపిల్లలను, ఒకడు మూడు రొట్టెలను, మరొకడు ద్రాక్షారసపు తిత్తిని మోసుకుంటూ వస్తారు. 4 వారు నీ క్షేమ సమాచారాలు అడిగి నీకు రెండు రొట్టెలు ఇస్తారు. వాటిని వారి నుండి నువ్వు తీసుకోవాలి.
5 ఈ విధంగా వెళ్తూ ఫిలిష్తీయుల దండులో నివాసం ఉండే దేవుని కొండకు చేరతావు. అక్కడ ఊరి దగ్గరకి నువ్వు రాగానే, తంతి వాయిద్యాలు, తంబుర, సన్నాయి, సితారా వాయిస్తున్నవారు, వారి వెనుక ఉన్నత స్థలం నుండి దిగి వస్తున్న ప్రవక్తల గుంపు నీకు కనబడుతుంది. వారు ప్రకటన చేస్తూ వస్తారు. 6 యెహోవా ఆత్మ నీపైకి బలంగా దిగివస్తాడు. నువ్వు కూడా వారితో కలిసి ప్రకటిస్తూ ఉండగా నీకు నూతన మనస్సు వస్తుంది. 7 దేవుడు నీకు తోడుగా ఉంటాడు కనుక ఈ సూచనలు నీకు సంభవించిన తరువాత నీకు ఏది మంచిదనిపిస్తే అది చెయ్యి.
8 నాకంటే ముందు నీవు గిల్గాలుకు వెళ్ళినప్పుడు, దహన బలులు, సమాధాన బలులు అర్పించడానికి నేను నీ దగ్గరికి దిగి వస్తాను. నేను నీ దగ్గరకి వచ్చి నువ్వు ఏమి చేయాలో చెప్పేవరకూ ఏడు రోజులపాటు నువ్వు అక్కడే ఉండిపోవాలి.”
9 సమూయేలు దగ్గర నుండి వెళ్లిపోడానికి బయలుదేరినపుడు దేవుడు సౌలుకు నూతన మనస్సు అనుగ్రహించాడు. ఆ రోజే ఆ ఆనవాళ్ళు కనబడ్డాయి.
10 వారు ఆ కొండ దగ్గరకి వస్తుండగా ప్రవక్తల సమూహం అతనికి ఎదురు వచ్చినప్పుడు దేవుని ఆత్మ బలంగా అతని మీదికి వచ్చాడు. అతడు వారి మధ్య నిలిచి ప్రకటన చేస్తూ ఉన్నాడు.
11 గతంలో అతనిని ఎరిగిన వారంతా అతడు ప్రవక్తలతో కలసి ప్రకటించడం చూసి “కీషు కుమారుడికి ఏమయ్యింది? సౌలు కూడా ప్రవక్త అయ్యాడా?” అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. 12 అక్కడ ఉన్న ఒక వ్యక్తి “అతని తండ్రి ఎవరు?” అని అడిగాడు. అందువల్ల సౌలు కూడా ప్రవక్త అయ్యాడా? అనే సామెత పుట్టింది. 13 తరువాత అతడు ప్రకటించడం ఆపివేసి ఉన్నత స్థలానికి వచ్చాడు.
14 సౌలు చిన్నాన్న అతణ్ణి, అతని పనివాణ్ణి చూసి “మీరిద్దరూ ఎక్కడికి వెళ్ళారు?” అని అడిగినపుడు అతడు “గాడిదలను వెదకాలని వెళ్ళాం, అవి కనబడనప్పుడు సమూయేలు దగ్గరకి వెళ్ళాం” అని చెప్పాడు. 15 సౌలు చిన్నాన్న “సమూయేలు నీకు ఏమి చెప్పాడో ఆ విషయాలు నాకు కూడా చెప్పు” అని అడిగాడు. 16 సౌలు అతనితో “గాడిదలు దొరికాయి అని అతడు చెప్పాడు” అని చెప్పాడు గానీ రాజ్య పరిపాలనను గురించి సమూయేలు చెప్పిన మాట చిన్నాన్నకు చెప్పలేదు.
17 తరువాత సమూయేలు మిస్పాలో యెహోవా సన్నిధికి ప్రజలను పిలిపించి ఇశ్రాయేలీయులతో ఇలా అన్నాడు, 18 “ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఇలా చెబుతున్నాడు, నేను ఇశ్రాయేలీయులైన మిమ్మల్ని ఐగుప్తు నుండి రప్పించి ఐగుప్తీయుల ఆక్రమణ నుండి, మిమ్మల్ని బాధపెట్టిన ప్రజలనుండి విడిపించాను. 19 అయినప్పటికీ మీ కష్టకాలంలో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడిన మీ దేవుణ్ణి మీరు ఇప్పుడు విడిచిపెట్టారు. ‘మా మీద ఒకరిని రాజుగా నియమించు’ అని కోరుకున్నారు. కాబట్టి ఇప్పుడు మీ గోత్రాలు, మీ కుటుంబాల క్రమం ప్రకారం మీరంతా యెహోవా సన్నిధిలో హాజరు కావాలి.”
20 ఇశ్రాయేలీయుల గోత్రాలన్నిటినీ సమూయేలు సమకూర్చినపుడు బెన్యామీను గోత్రంపై చీటీ పడింది. 21 బెన్యామీను గోత్రంవారి వంశాలు, కూటమి పేరుల ప్రకారం సమకూర్చినపుడు మత్రియుల వంశం ఏర్పడింది. తరువాత కీషు కుమారుడు సౌలు ఎన్నికయ్యాడు. ప్రజలు అతనిని వెదగ్గా అతడు కనబడలేదు.
22 అప్పుడు వారు “ఇక్కడికి రావలసి మనిషి ఇంకెవరైనా ఉన్నారా” అని యెహోవా దగ్గర వాకబు చేసినప్పుడు యెహోవా “అతడు సామానుల్లో దాక్కున్నాడు” అని చెప్పాడు. 23 వారు పరుగెత్తుకుంటూ వెళ్ళి అక్కడి నుండి అతణ్ణి తీసుకువచ్చారు. అతడు సమూహంలో నిలబడినప్పుడు భుజాల నుండి ఇతరులకంటే పైకి ఎత్తయినవాడుగా కనబడ్డాడు.
24 అప్పుడు సమూయేలు “యెహోవా ఏర్పరచుకున్నవాణ్ణి మీరు చూశారా? ప్రజలందరిలో అతని వంటివాడు ఎవరూ లేడు” అని చెప్పినప్పుడు, ఆ ప్రజలంతా ఆనందంతో “రాజు చిరకాలం జీవిస్తాడు గాక” అంటూ బిగ్గరగా కేకలు వేశారు.
25 తరువాత సమూయేలు రాజ్యపాలన పద్ధతిని ప్రజలకి వినిపించి, ఒక గ్రంథంలో రాసి యెహోవా సన్నిధిలో దాన్ని ఉంచాడు. తరువాత సమూయేలు అక్కడ సమావేశమైన వారందరినీ తమ తమ ఇళ్ళకు పంపివేశాడు.
26 సౌలు కూడా గిబియాలో ఉన్న తన ఇంటికి వెళ్లిపోయాడు. దేవుని ఆత్మ ద్వారా హృదయంలో ప్రేరేపణ పొందిన యుద్ధవీరులు అతని వెంట వెళ్లారు. 27 అసూయపరులూ, దుష్టులూ అయిన కొందరు “ఈ మనిషి మనలను ఏలుతాడా?” అని చెప్పుకొంటూ అతడిని పట్టించుకోకుండా, కానుకలు ఇవ్వకుండా ఉన్నప్పుడు సౌలు ఏమీ పట్టించుకోకుండా చెవిటి వాడిలాగా నెమ్మదిగా ఉండిపోయాడు.