ఇశ్రాయేలును పరిపాలించే సమూయేలు
క్రీ.పూ. 1116
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
2 మందసాన్ని కిర్యత్యారీములో ఉంచి ఇరవై ఏళ్లు నిండాయి. ఇశ్రాయేలీయులంతా యెహోవాను అనుసరించాలని కోరుతూ చింతిస్తున్నారు.
3 సమూయేలు ఇశ్రాయేలీయులందరినీ సమకూర్చి ఇలా చెప్పాడు. “మీరు మనస్ఫూర్తిగా యెహోవా వైపుకు తిరిగి, ఇతర దేవుళ్ళను, అష్తారోతు దేవుళ్ళను మీ మధ్యనుండి తీసివేసి, పట్టుదల గలిగి యెహోవా వైపు మీ మనస్సులను మళ్ళించి ఆయనను ఆరాధించండి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలోనుండి మిమ్మల్ని విడిపిస్తాడు.” 4 ఆ తరువాత ఇశ్రాయేలీయులు బయలు దేవుళ్ళను, అష్తారోతు దేవుళ్ళను విడిచిపెట్టి యెహోవాను మాత్రమే సేవించడం మొదలుపెట్టారు.
5 అప్పుడు సమూయేలు “ఇశ్రాయేలీయులంతా మిస్పా ప్రదేశానికి చేరుకోండి. నేను మీ తరపున యెహోవాకు ప్రార్థన చేస్తాను” అని చెప్పినప్పుడు 6 వారు మిస్పాలో సమావేశమై నీళ్లు చేది యెహోవా సన్నిధిలో కుమ్మరించి ఆ రోజంతా ఉపవాసం ఉండి “యెహోవా దృష్టిలో మేమంతా పాపం చేశాం” అని ఒప్పుకున్నారు. సమూయేలు మిస్పాలో ఉంటూ ఇశ్రాయేలీయులకు తీర్పు తీరుస్తూ న్యాయం జరిగిస్తున్నాడు.
7 ఇశ్రాయేలీయులు మిస్పాలో సమకూడారని ఫిలిష్తీయులకు తెలిసినప్పుడు ఫిలిష్తీయ దండు వారి మీద దాడికి సిద్ధమయ్యారు. ఈ విషయం ఇశ్రాయేలీయులకు తెలిసినప్పుడు వారు ఫిలిష్తీయులకు భయపడి 8 “మన దేవుడైన యెహోవా ఫిలిష్తీయుల చేతిలోనుండి మనలను రక్షించేలా మా కోసం ప్రార్థన చేయడం మానవద్దు” అని సమూయేలును వేడుకున్నారు.
9 సమూయేలు ఇంకా పాలు తాగడం మానని ఒక గొర్రెపిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ హోమం అర్పించి, ఇశ్రాయేలీయుల తరఫున యెహోవాకు ప్రార్థించినపుడు యెహోవా అతని ప్రార్థన విన్నాడు.
10 సమూయేలు దహనబలి అర్పిస్తున్న సమయంలో ఫిలిష్తీయులు యుద్ధం చేయడానికి ఇశ్రాయేలీయుల పైకి వచ్చారు. అయితే యెహోవా ఆ రోజు ఫిలిష్తీయుల మీదికి విపరీతంగా ఉరుములు ఉరిమేలా చేసి వారిని కల్లోలపరచడంతో వారు ఇశ్రాయేలీయుల చేతిలో ఓడిపోయారు. 11 ఇశ్రాయేలీయులు మిస్పా నుండి మొదలుపెట్టి బేత్కారు వరకూ ఫిలిష్తీయుల వెంటబడి చంపివేశారు.
12 అప్పుడు సమూయేలు ఒక రాయి తీసుకుని మిస్పాకు, షేనుకు మధ్య దాన్ని నిలబెట్టి “ఇప్పటి వరకూ యెహోవా మనకు సహాయం చేశాడు” అని చెప్పి ఆ రాయికి “ఎబెనెజరు” అని పేరు పెట్టాడు.
13 ఈ విధంగా ఫిలిష్తీయులు అణగారిపోయి ఇశ్రాయేలు సరిహద్దుల్లోకి మళ్ళీ రాలేకపోయారు. సమూయేలు జీవించిన కాలమంతటిలో యెహోవా హస్తం ఫిలిష్తీయులకి విరోధంగా ఉంది. 14 ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయుల నుండి ఆక్రమించుకొన్న పట్టణాలన్నీ వారికి తిరిగి వచ్చాయి. ఎక్రోను నుండి గాతు వరకూ ఉన్న గ్రామాలనూ వాటిలోని పొలాలనూ ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల చేతిలో నుండి విడిపించుకున్నారు. ఇశ్రాయేలీయులకు, అమోరీయులకు మధ్య శాంతి ఏర్పడింది.
15 సమూయేలు జీవించిన కాలమంతా ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉన్నాడు. 16 ప్రతి సంవత్సరమూ అతడు బేతేలుకు, గిల్గాలుకు, మిస్పాకు తిరుగుతూ, వివిధ ప్రాంతాల్లో ఇశ్రాయేలీయులకు న్యాయం జరిగిస్తూ వచ్చాడు. 17 అతని నివాసం రమాలో ఉన్నందువల్ల అక్కడికి తిరిగి వచ్చి అక్కడ కూడా న్యాయం జరిగిస్తూ వచ్చాడు. అతడు అక్కడ యెహోవాకు ఒక బలిపీఠం కట్టాడు.
8:1 సమూయేలు ముసలివాడైనప్పుడు తన కుమారులను ఇశ్రాయేలీయులపై న్యాయాధిపతులుగా నియమించాడు. 2 అతని పెద్ద కొడుకు పేరు యోవేలు. రెండవవాడి పేరు అబీయా, 3 వీరు బెయేర్షెబాలో న్యాయాధిపతులుగా ఉన్నారు. అతని కొడుకులు తమ తండ్రివంటి మంచి ప్రవర్తనను అనుసరించకుండా ధనంపై ఆశ పెంచుకుని, లంచాలు తీసుకొంటూ తీర్పులను తారుమారు చేశారు.
4 ఇశ్రాయేలు పెద్దలంతా కలసి రమాలో ఉన్న సమూయేలు దగ్గరకి వచ్చి, 5 “అయ్యా, విను. నువ్వు ముసలివాడివి. నీ కొడుకులు నీలాగా మంచి ప్రవర్తన గలవారు కారు. కాబట్టి ప్రజలందరి కోరికను మన్నించి మాకు ఒక రాజును నియమించు. అతడు మాకు న్యాయం తీరుస్తాడు” అని అతనితో అన్నారు.
6 “మాకు న్యాయం చేయడానికి ఒక రాజును నియమించు” అని వారు అడిగిన మాట సమూయేలుకు రుచించలేదు. అప్పుడు సమూయేలు యెహోవాకు ప్రార్థన చేశాడు. 7 యెహోవా సమూయేలుకు ఇలా బదులిచ్చాడు. “ప్రజలు నిన్ను కోరినట్టు జరిగించు. వారు తిరస్కరించింది నిన్ను కాదు. తమను పాలించకుండా నన్నే తిరస్కరించారు.
8 వారు నన్ను తిరస్కరించి, ఇతర దేవుళ్ళను పూజించి, నేను ఐగుప్తునుండి వారిని రప్పించినప్పటి నుండి ఇప్పటిదాకా వారు చేస్తూ వస్తున్న పనుల ప్రకారమే వారు నీ పట్ల కూడా జరిగిస్తున్నారు. వారు కోరినట్టు జరిగించు. 9 అయితే వారికి రాబోయే కొత్త రాజు ఎలా పరిపాలిస్తాడో దానికి నువ్వే సాక్ష్యంగా ఉండి వారికి స్పష్టంగా తెలియజెయ్యి.”
10 తమకు రాజు కావాలని కోరిన ప్రజలకి సమూయేలు యెహోవా చెప్పిన మాటలన్నీ వినిపిస్తూ 11 ఇలా చెప్పాడు. “మిమ్మల్ని ఏలబోయే రాజు ఎలా ఉంటాడంటే, అతడు మీ కొడుకులను పట్టుకుని, తన రథాలు నడపడానికి, గుర్రాలను చూసుకోవడానికి వారిని పనికి పెట్టుకుంటాడు. కొందరు అతని రథాల ముందు పరుగెత్తుతారు. 12 అతడు కొందరిని తన సైన్యంలోని వెయ్యిమంది పై అధికారులుగా, యాభైమంది పై అధికారులుగా నియమిస్తాడు. తన పొలాలు దున్నడానికి, పంటలు కోయడానికి, యుద్ధం చేసే ఆయుధాలు, రథాల సామానులు తయారుచేయడానికి వారిని పెట్టుకుంటాడు.
13 మీ ఆడపిల్లలను వంటలు చేయడానికి, అలంకరించడానికి, రొట్టెలు కాల్చడానికి పెట్టుకొంటాడు. 14 మీ పొలాల్లో, ద్రాక్షతోటల్లో, ఒలీవ తోటల్లో శ్రేష్ఠ భాగాన్ని తీసుకు తన సేవకులకు ఇస్తాడు. 15 మీ పంటలో, ద్రాక్షపళ్ళలో పదవ వంతు తీసుకు తన సిబ్బందికి, పనివారికి ఇస్తాడు.
16 మీ స్వంత పనివాళ్ళలో, పనికత్తెల్లో, మీ పశువుల్లో, గాడిదల్లో మంచివాటిని తీసుకు తన కోసం ఉంచుకొంటాడు. 17 మీ మందల్లో పదవ భాగం తీసుకొంటాడు. మీకు మీరుగా అతనికి దాసులైపోతారు. 18 ఇక ఆ రోజుల్లో మీకోసం మీరు కోరుకొన్న రాజు గురించి ఎంతగా వేడుకొన్నా యెహోవా మీ మనవి పట్టించుకోడు.”
19 ఇలా చెప్పినప్పటికీ, ప్రజలు సమూయేలు మాట పెడచెవిన పెట్టి, 20 “అలా కాదు, ఇతర దేశ ప్రజలు చేస్తున్నట్లు మేము కూడా చేసేలా మాకూ రాజు కావాలి, ఆ రాజు మాకు న్యాయం జరిగిస్తాడు, మాకు ముందుగా ఉండి అతడే యుద్ధాలు జరిగిస్తాడు” అన్నారు.
21 సమూయేలు ప్రజలు పలికిన మాటలన్నిటినీ విని యెహోవా సన్నిధిలో వివరించాడు. 22 అప్పుడు యెహోవా “నీవు వారి మాటలు విని వారికి ఒక రాజును నియమించు” అని సమూయేలుకు చెప్పినప్పుడు, సమూయేలు “మీరందరూ మీ మీ గ్రామాలకు వెళ్ళి పొండి” అని ఇశ్రాయేలీయులతో చెప్పాడు.