సౌలు యుద్ధాలు

క్రీ.పూ. 1095

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

1 సమూయేలు 11–13

1 అమ్మోనీయుడైన నాహాషు బయలుదేరి యాబేష్గిలాదుకు ఎదురుగా సైన్యాన్ని మోహరించాడు. అప్పుడు యాబేషువారు “మేము నీకు సేవకులుగా ఉంటాం. మాతో ఒప్పందం చేసుకో” అని నాహాషును అడిగారు. 2 “ఇశ్రాయేలు జాతి ప్రజలందరికీ అవమానం కలిగేలా మీ అందరి కుడి కళ్ళు పెరికివేస్తానని మీతో ఒప్పందం చేసుకుంటాను” అని అమ్మోనీయుడైన నాహాషు యాబేషు పెద్దలతో చెప్పాడు.

3 అందుకు వారు “మేము ఇశ్రాయేలీయుల అన్ని సరిహద్దు ప్రాంతాలకు మా రాయబారులను పంపడానికి మాకు వారం రోజులు సమయం ఇవ్వు. ఈలోపుగా మమ్మల్ని కాపాడేవారు ఎవరూ లేరని తెలిస్తే మమ్మును మేమే నీకు అప్పగించుకుంటాం” అన్నారు.

4 ఆ రాయబారులు సౌలు ఉంటున్న గిబియాకు వచ్చి అక్కడి ప్రజలకు ఆ సమాచారం అందించినప్పుడు ఆ ప్రజలంతా గట్టిగా ఏడ్చారు. 5 సౌలు పొలం నుండి పశువులను తోలుకుని వస్తూ “ప్రజలు అలా ఏడవడానికి కారణం ఏమిటి?” అని అడిగాడు. వారు యాబేషువారు తెచ్చిన సమాచారం అతనికి తెలియజేసారు.

6 సౌలు ఆ మాటలు వినగానే దేవుని ఆత్మ అతన్ని తీవ్రంగా ఆవహించాడు. అతడు ఆగ్రహంతో 7 ఒక కాడి ఎడ్లను ముక్కలుగా నరికి ఇశ్రాయేలీయుల దేశంలోని నాలుగు దిక్కులకు రాయబారుల చేత వాటిని పంపుతూ “సౌలు, సమూయేలులతో చేతులు కలపని వారందరి ఎడ్లను నేను ఈ విధంగా చేస్తాను” అని కబురు పంపాడు. అందువల్ల ప్రజల్లో యెహోవా భయం కలిగింది. కాబట్టి ఒక్కడు కూడా మిగలకుండా అందరూ సౌలు దగ్గరకి వచ్చారు. 8 అతడు బెజెకులో సమావేశమైన వారిని లెక్కపెట్టినప్పుడు ఇశ్రాయేలు వారు మూడు లక్షల మంది, యూదావారు 30 వేల మంది ఉన్నారు.

9 అప్పుడు సౌలు “రేపు మధ్యాహ్నం లోపుగా మీకు రక్షణ కలుగుతుందని యాబేష్గిలాదు వారితో చెప్పండి” అని ఆ రాయబారులకు ఆజ్ఞాపించాడు. వారు వెళ్ళి యాబేషువారికి ఆ వార్త తెలిపినప్పుడు వారు చాలా సంతోషించారు. 10 అప్పుడు యాబేషువారు నాహాషు పంపిన మనుషులతో ఇలా చెప్పారు. “రేపు మేము బయలుదేరి మమ్మల్ని మేము నీకు అప్పగించుకొంటాం. అప్పుడు నీకు ఏది అనుకూలమో దాన్ని మాకు చేయవచ్చు.”

11 తరువాతి రోజు సౌలు ప్రజలను మూడు గుంపులుగా చేసిన తరువాత వారు తెల్లవారేలోగా శిబిరం మధ్యకు చేరుకుని మధ్యాహ్నంలోగా అమ్మోనీయులను సంహరించారు. మిగిలిన వారిలో ఏ ఇద్దరూ కలసి తప్పించుకోలేకుండా చెదరిపోయారు.

12 తరువాత ప్రజలు “సౌలు మనలను ఏలుతాడా? అని అడిగిన వారెక్కడ ఉన్నారు? మేము వారిని చంపడానికి వారిని తెప్పించు” అని సమూయేలుతో అన్నారు. 13 అందుకు సౌలు “ఈ రోజు యెహోవా మనకు రక్షణ కలిగించాడు కాబట్టి మీరు ఎవరినీ చంపవద్దు” అన్నాడు.

14 “మనం గిల్గాలుకు వెళ్లి రాజ్య పరిపాలన పద్ధతులను తిరిగి స్థిరపరచుకుందాం, రండి” అని సమూయేలు ప్రజలందరినీ పిలిచాడు. 15 ప్రజలంతా గిల్గాలుకు వచ్చి అక్కడ యెహోవా సన్నిధానంలో శాంతి బలులు అర్పించి, యెహోవా సన్నిధి తోడుగా సౌలుకు పట్టాభిషేకం జరిగించారు. సౌలు, అక్కడ చేరిన ప్రజలంతా సంతోషంతో ఉప్పొంగిపోయారు.

12:1 అప్పుడు సమూయేలు ఇశ్రాయేలీయులందరినీ పిలిచి ఇలా చెప్పాడు. “వినండి, మీ కోరిక నేను మన్నించి మిమ్మల్ని ఏలడానికి ఒకరిని రాజుగా నియమించాను. 2 మీకు అవసరమైన పనులు మీ రాజు జరిగిస్తాడు. నా తల నెరిసిపోయింది, నేను ముసలివాణ్ణి అయ్యాను. నా కొడుకులు మీ మధ్యలో ఉన్నారు. చిన్నప్పటి నుండి ఈరోజు వరకూ నేను మీ మధ్య ఉండి మీ పనులు చేస్తూ వచ్చాను.

3 ఇదిగో నన్ను చూడండి, నేను ఎవరి ఎద్దునైనా అక్రమంగా తీసుకొన్నానా? ఎవరి గాడిదనైనా పట్టుకొన్నానా? ఎవరికైనా అన్యాయం చేశానా? ఎవరినైనా బాధపెట్టానా? న్యాయం దాచిపెట్టడానికి ఎవరి దగ్గరైనా ముడుపులు తీసుకున్నానా? అలా చేసి ఉంటే, యెహోవా ముందూ యెహోవా చేత అభిషేకం పొందినవాని ముందూ నామీద సాక్ష్యం చెప్పించండి. అప్పుడు నేను మీ సమక్షంలో వాటన్నిటినీ తిరిగి ఇచ్చివేస్తాను.”

4 అందుకు ప్రజలు “నువ్వు మాకు ఎలాంటి అన్యాయమూ చేయలేదు, ఏ విధంగానూ బాధ కలిగించలేదు, ఎవరి దగ్గరా నువ్వు దేనినీ తీసుకోలేదు” అని అతనితో చెప్పారు. 5 అతడు “అలాంటిది నా దగ్గర ఏదీ మీకు దొరకదని యెహోవా, ఇంకా ఆయన అభిషేకం చేయించినవాడు కూడా ఈనాడు మీ మీద సాక్షులుగా ఉన్నారు” అని చెప్పినప్పుడు “అవును, సాక్షులే” అని వారంతా జవాబిచ్చారు.

6 సమూయేలు ప్రజలతో ఇంకా ఇలా చెప్పాడు. “మోషేను, అహరోనును నాయకులుగా నియమించి మీ పూర్వీకులను ఐగుప్తు దేశం నుండి రప్పించినవాడు యెహోవాయే గదా 7 కాబట్టి యెహోవా మీకు, మీ పూర్వీకులకు చేసిన న్యాయమైన ఉపకారాలను బట్టి యెహోవా సన్నిధానంలో నేను మీతో వాదించడానికి మీరు ఇక్కడే ఉండండి.

8 యాకోబు ఐగుప్తుకు వచ్చిన తరువాత మీ పూర్వికులు యెహోవాను వేడుకొన్నప్పుడు ఆయన మోషే అహరోనులను పంపించి వారిని ఐగుప్తు నుండి నడిపించి వారు వచ్చి ఈ ప్రాంతంలో నివసించేలా చేశాడు. 9 అయితే వారు తమ దేవుడైన యెహోవాను నిర్లక్ష్యం చేసినప్పుడు వారిని హాసోరు సేనాధిపతి సీసెరా చేతికీ ఫిలిష్తీయుల చేతికీ మోయాబు రాజు చేతికీ అప్పగించాడు. వారు ఇశ్రాయేలీయులతో యుద్ధం చేసి హింసించారు.

10 అప్పుడు వారు, ‘మేము యెహోవాను నిర్లక్ష్యం చేసి బయలు దేవుళ్ళనూ అష్తారోతు దేవిని పూజించడం ద్వారా పాపం చేశాం. మా శత్రువుల చేతి నుండి నువ్వు మమ్మల్ని విడిపించు. నిన్ను మాత్రమే సేవిస్తాం’ అని యెహోవాను వేడుకున్నారు. 11 యెహోవా యెరుబ్బయలును, బెదానును, యెఫ్తాను, సమూయేలును పంపి, నలుదిక్కులా ఉన్న మీ శత్రువుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించడం వల్ల మీరు భయం లేకుండా నివసిస్తున్నారు.

12 అయితే అమ్మోనీయుల రాజు నాహాషు మీపైకి దండెత్తినప్పుడు మీ దేవుడైన యెహోవా మీ సంరక్షుడుగా ఉన్నప్పటికీ, ‘ఆయన వద్దు, ఒక రాజు మమ్మల్ని ఏలాలి’ అని మీరు నన్ను అడిగారు. 13 మీరు ఇష్టపూర్వకంగా నియమించుకొన్న రాజు ఇతడే. యెహోవా ఇతనిని మీపైన రాజుగా నిర్ణయించాడు.

14 మీరు యెహోవా పట్ల భయభక్తులు కలిగి ఆయనకు విధేయత చూపి ఆయనను సేవించి, ఆయన ఆజ్ఞలకు లోబడి, మీరూ, మిమ్మల్ని పాలించే మీ రాజూ మీ దేవుడైన యెహోవాను అనుసరిస్తే మీకు మేలు, క్షేమం కలుగుతాయి. 15 అలా కాక, యెహోవా మాట వినకుండా ఆయన ఆజ్ఞలకు లోబడకపోతే యెహోవా కృప మీ పూర్వీకులకు వ్యతిరేకంగా ఉన్నట్టు మీ పట్ల కూడా విరోధంగా ఉంటుంది.

16 మీరు నిలబడి చూస్తూ ఉండగానే యెహోవా జరిగించే ఈ గొప్ప పనులను చూడండి. 17 ఇది గోదుమ పంట కోసే కాలం గదా. మీ కోసం రాజును నియమించమని కోరుకోవడం ద్వారా యెహోవా దృష్టిలో మీరు ఘోరమైన తప్పిదం చేశారని మీరు గ్రహించి తెలుసుకొనేలా యెహోవా ఉరుములు, వర్షం పంపాలని నేను ఆయనను వేడుకొంటున్నాను.” 18 సమూయేలు యెహోవాను వేడుకొన్నప్పుడు యెహోవా ఆ రోజే ఉరుములు, వర్షం పంపించగా ప్రజలంతా యెహోవాకు, సమూయేలుకు అమితంగా భయపడ్డారు.

19 వారు సమూయేలుతో ఇలా అన్నారు. “రాజు కావాలని మేము అడగడం ద్వారా మా పాపాలన్నిటి కంటే ఎక్కువ పాపం చేశాం. అందువల్ల మేమంతా చనిపోకుండేలా దీనులమైన మా కోసం నీ దేవుడైన యెహోవాకు ప్రార్థన చెయ్యి.” 20 అప్పుడు సమూయేలు ప్రజలతో “భయపడవద్దు. మీరు ఈ పాపం చేసింది నిజమే, అయినప్పటికీ యెహోవాను విడిచిపెట్టకుండా ఆయన మాట వింటూ, నిండు హృదయంతో ఆయనను సేవించండి. 21 ఆయనను నిర్లక్షం చేయకండి, ఆయన్ను నిర్లక్ష్యపెట్టేవారు పనికిమాలినవైన కాపాడలేని విగ్రహాలను పూజిస్తారు. అవి నిజంగా బొమ్మలే.

22 యెహోవా మిమ్మల్ని తన ప్రజగా చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన గొప్పదైన తన నామం కోసం తన ప్రజలను విడిచిపెట్టడు. 23 నేను మాత్రం ఇంకా ఎక్కువ ఆసక్తితో మీ కోసం ప్రార్థన చేస్తాను. లేకపోతే నేను యెహోవా దృష్టిలో పాపం చేసినవాడనవుతాను. ఆయనశ్రేష్ఠమైన మంచి మార్గం మీకు బోధిస్తాను.

24 ఆయన మీ కోసం ఎన్ని గొప్ప పనులు చేశాడో అది మీరు జ్ఞాపకం ఉంచుకుని యెహోవాపట్ల భయభక్తులు కలిగి, కపటం లేని నిండు మనస్సుతో ఆయనను పూజించడం ఎంతో అవసరం. 25 మీరు చెడ్డ పనులు చేస్తూ ఉన్నట్టయితే మీరూ, మీ రాజూ నశించిపోతారు.”

13:1 సౌలు రాజుగా పాలించడం ఆరంభించినపుడు అతని వయస్సు ముప్ఫై ఏళ్ళు. అతడు రెండేళ్ళు ఇశ్రాయేలీయులను పాలించిన తరువాత 2 ఇశ్రాయేలీయుల్లో మూడు వేలమందిని ఏర్పరచుకున్నాడు. వీరిలో రెండు వేలమంది మిక్మషు ప్రాంతంలోని బేతేలు కొండలో సౌలు దగ్గర ఉండగా, వెయ్యిమంది బెన్యామీనీయుల ఊరు గిబియాలో యోనాతాను దగ్గర ఉన్నారు. మిగిలిన వారిని అతడు తమ తమ గుడారాలకు పంపివేశాడు.

3 యోనాతాను గెబాలో ఉన్న ఫిలిష్తీయుల గుంపును సంహరించినపుడు ఆ విషయం ఫిలిష్తీయులకు తెలిసింది. దేశంలోని హెబ్రీయులంతా ఈ వార్త వినాలని సౌలు ప్రచారం చేయించాడు. 4 సౌలు ఫిలిష్తీయుల గుంపును సంహరించడం వల్ల తమపై ఫిలిష్తీయులు విరోధం పెంచుకొన్నారని ఇశ్రాయేలీయులకు తెలిసినప్పుడు వారంతా గిల్గాలులో సౌలు దగ్గరకి చేరుకున్నారు.

5 ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులతో యుద్దం చేయడానికి ముప్ఫై వేల రథాలు, ఆరు వేలమంది గుర్రపు రౌతులు, సముద్రం ఒడ్డున ఉండే ఇసుక రేణువులంత విస్తారమైన జనసమూహాన్ని సమకూర్చుకుని బయలుదేరారు. వీరంతా బేతావెను తూర్పుదిక్కున మిక్మషులో దిగారు.

6 ఇశ్రాయేలీయులు భయపడుతూ తామంతా ప్రాణాపాయంలో పడిపోయినట్టు గ్రహించి కొండ గుహల్లో, పొదల్లో, బండసందుల్లో, ఉన్నత స్థలాల్లో, సొరంగాల్లో దాక్కున్నారు. 7 కొందరు హెబ్రీయులు యొర్దాను నది దాటి గాదు దేశానికి, గిలాదుకు వెళ్ళిపోయారు. అయితే సౌలు ఇంకా గిల్గాలులోనే ఉన్నాడు. ప్రజలంతా భయపడుతూనే అతణ్ణి అనుసరించారు.

8 సమూయేలు చెప్పినట్టు అతడు వారం రోజులు వేచి ఉండి, సమూయేలు ఇంకా గిల్గాలుకు రాకపోవడం, ప్రజలు తన నుండి చెదరిపోవడం చూసి 9 హోమ బలిని, శాంతి బలిని నా దగ్గరికి తీసుకు రమ్మని చెప్పి హోమబలి అర్పించాడు. 10 అతడు హోమబలి అర్పించడం ముగియగానే సమూయేలు అక్కడికి వచ్చాడు. సౌలు అతణ్ణి చూసి అతనికి వందనాలు చెబుతూ ఎదురు వెళ్ళాడు.

11 సమూయేలు అతణ్ణి చూసి “నువ్వు చేసిన పని ఏమిటి?” అని అన్నాడు. అందుకు సౌలు “ప్రజలు నానుండి చెదరిపోవడం, అనుకున్న సమయానికి నువ్వు రాకపోవడం, ఫిలిష్తీయులు మిక్మషులో సమకూడడం నేను గమనించి 12 ఇక యెహోవాకు శాంతి బలి అర్పించక ముందే ఫిలిష్తీయులు గిల్గాలుకు వచ్చి నాపై దాడి చేస్తారనుకుని నా అంతట నేనే తెగించి హోమబలి అర్పించాను” అన్నాడు.

13 అప్పుడు సమూయేలు ఇలా చెప్పాడు. “నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞ గైకొనకుండా నీవు అవివేకంగా ప్రవర్తించావు. ఇశ్రాయేలీయులపై నీ రాజ్యాధికారాన్ని కలకాలం స్థిరంగా ఉంచాలని యెహోవా తలచాడు. అయితే నీ అధికారం నిలబడదు. 14 యెహోవా తన హృదయానుసారియైన ఒకణ్ణి కనుగొన్నాడు. నీకు ఆజ్ఞాపించినట్టు నువ్వు చెయ్యలేకపోయావు కాబట్టి యెహోవా తన ప్రజలపై అతణ్ణి రాజుగా నియమిస్తాడు.”

15 సమూయేలు లేచి, ప్రయాణమై గిల్గాలు నుండి బెన్యామీనీయుల గోత్రస్థానం గిబియాకు వచ్చాడు. సౌలు తన దగ్గర సమకూడిన ప్రజలను లెక్కపెట్టినపుడు వారు సుమారు ఆరు వందలమంది ఉన్నారు.

16 సౌలు, అతని కుమారుడు యోనాతాను, తమ దగ్గర ఉన్న వారితో కలసి బెన్యామీనీయుల గిబియాకు చేరుకున్నారు. ఫిలిష్తీయులు మిక్మషులో దిగారు.

17 ఫిలిష్తీయుల దండు నుండి దోచుకొనేవారు మూడు గుంపులుగా బయలుదేరారు. ఒక గుంపు షూయాలు దేశానికి ఒఫ్రావైపుగా వెళ్లే దారిలో కాపు కాశారు. 18 రెండవ గుంపు బేత్‌ హోరోనుకు వెళ్లే దారిలో, మూడవ గుంపు అరణ్యం దగ్గరలోని జెబోయిము లోయ సరిహద్దు దారిలో కాపుకాశారు.

19 హెబ్రీయులు తమ కోసం కత్తులు, ఈటెలు తయారు చేయించుకొంటారేమోనని ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయుల దేశమంతటిలో కమ్మరివాళ్ళు ఎవరూ ఉండకుండాా చేశారు. 20 కాబట్టి ఇశ్రాయేలీయులంతా తమ నాగటి కర్రలు, పారలు, గొడ్డళ్ళు, కొడవళ్ళు పదును పెట్టుకోవడానికి ఫిలిష్తీయుల దగ్గరికి వెళ్ళాల్సి వచ్చేది. 21 నాగటి కర్రలకు, పారలకు, మూడు ముళ్ళు ఉండే కొంకీలకు, గొడ్డళ్ళకు పదును పెట్టడానికి ఆకురాయి మాత్రమే వారి దగ్గర ఉంది.

22 అందువల్ల యుద్ధం జరిగే సమయంలో సౌలు, యోనాతానుల దగ్గరున్న వారిలో ఒక్కరి చేతిలో కూడా ఒక కత్తిగానీ, యీటెగానీ లేకుండా పోయింది. సౌలు దగ్గర, అతని కుమారుడు యోనాతాను దగ్గర మాత్రమే అవి ఉన్నాయి. 23 ఫిలిష్తీయుల సైన్యపు కాపలాదారులు కొందరు మిక్మషు కనుమకు వెళ్ళి అక్కడ ఉన్నారు.