పౌలు కొరింతీయులకు రాస్తాడు
అపొస్తలుడిగా తన అధికారాన్ని స్థిరపరచడానికి, సంఘంలోని అక్రమాలను, అల్లకల్లోలాన్ని గద్దించడానికి, సిద్ధాంతం, క్రమశిక్షణలకు సంబంధించిన వివిధ అంశాలపై విశ్వాసులుగా మారినవారి ప్రశ్నలకు జవాబివ్వడానికి పౌలు కొరింతీయులకు తన మొదటి పత్రిక రాస్తాడు.
క్రీ.శ. 57
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
పౌలు కొరింతీయులకు అభివందనాలు తెలుపుతాడు
పౌలు తన పరిచయ వాక్యాలలో తన అపొస్తలత్వాన్ని, క్రీస్తు యేసులో విశ్వసించేవారి ఐక్యతను ఉద్ఘాటిస్తాడు.
కొరింతీయులకు రాసిన మొదటి పత్రిక 1:1–3
1 దేవుడు తన సంకల్పం ద్వారా యేసు క్రీస్తు అపొస్తలుడుగా ఉండడానికి పిలిచిన పౌలు, మన సోదరుడు సొస్తెనేసు, 2 కొరింతులో ఉన్న దేవుని సంఘానికి, అంటే క్రీస్తు యేసులో పవిత్రులై పరిశుద్ధులుగా ఉండడానికి పిలుపు పొందిన వారికీ, మనకూ ప్రభువైన యేసు క్రీస్తు నామంలో ప్రతి చోటా ప్రార్థించే వారికందరికీ శుభమని చెప్పి రాస్తున్నది. 3 మన తండ్రి అయిన దేవుని నుండీ ప్రభు యేసు క్రీస్తు నుండీ కృప, శాంతి మీకు కలుగు గాక.
వారి విశ్వాస పరివర్తనను, వరాలను బట్టి పౌలు ఆనందిస్తాడు
వారి విశ్వాస పరివర్తనను బట్టి, క్రీస్తు సత్యానికి సాక్ష్యంగా వారు పొందిన ఆత్మీయ వరాలను బట్టి పౌలు ఆనందిస్తాడు.
కొరింతీయులకు రాసిన మొదటి పత్రిక 1:4–9
4 క్రీస్తు యేసులో మీరు పొందిన దేవుని కృపను చూసి, మీ విషయం నా దేవునికి మానక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. 5 క్రీస్తును గూర్చిన సాక్ష్యం మీలో స్థిరపడింది. 6 అందువల్ల ఆయనలో మీరు ప్రతి విషయంలో, అంటే సమస్త ఉపదేశంలో, సమస్త జ్ఞానంలో, ధనవంతులు అయ్యారు. 7 కాబట్టి ఏ కృపావరంలోనూ లోటు లేకుండా మీరు మన ప్రభు యేసు క్రీస్తు ప్రత్యక్షత కోసం ఎదురు చూస్తున్నారు. 8 మన ప్రభు యేసు క్రీస్తు రోజున మీరు నిష్కపటంగా ఉండేలా అంతం వరకూ ఆయన మిమ్మల్ని స్థిరపరుస్తాడు. 9 మన ప్రభు యేసు క్రీస్తు అనే తన కుమారుని సహవాసానికి మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు.
పక్షాలు కాక, ఐక్యత ఉండాలని పౌలు కోరుతాడు
తాము ఎవరి పేర్ల కింద చేరారో ఆ నాయకులను అనుసరించకుండా, ఎవరిలో విభజన లేదో ఆ యేసు క్రీస్తు నామంలో ఐక్యంగా ఉండాలని పౌలు వారిని కోరుతాడు.
కొరింతీయులకు రాసిన మొదటి పత్రిక 1:10–17
10 సోదరులారా, మన ప్రభు యేసు క్రీస్తు నామంలో నేను మిమ్మల్ని వేడుకునేది ఏమంటే మీరంతా ఏకభావంతో మాట్లాడుతూ, మీలో మీకు విభేదాలు లేకుండా చూసుకోండి. ఒకే మనసుతో, ఒకే ఉద్దేశంతో కలిసి మెలసి ఉండండి.
11 సోదరులారా, మీలో కలహాలు ఉన్నాయని క్లోయె ఇంటివారి ద్వారా తెలిసింది. 12 మీలో ఒకడు ‘నేను పౌలు వాణ్ణి,’ ఒకడు ‘నేను అపొల్లో వాణ్ణి,’ మరొకడు ‘నేను కేఫా వాణ్ణి,’ ఇంకొకడు ‘నేను క్రీస్తు వాణ్ణి’ అని చెప్పుకుంటున్నారని నేను విన్నాను.
13 క్రీస్తు చీలికలు అయ్యాడా? పౌలు మీ కోసం సిలువ అనుభవించాడా? పౌలు నామంలో మీరు బాప్తిసం పొందారా? 14 నేను క్రిస్పుకు, గాయికి తప్ప వేరెవరికీ బాప్తిసం ఇయ్యలేదు. అందుకు దేవునికి కృతజ్ఞతలు చెబుతున్నాను. 15 ఎందుకంటే నా నామంలోకి మీరు బాప్తిసం పొందారని చెప్పుకోవడం నాకిష్టం లేదు. 16 స్తెఫను ఇంటివారికి కూడా బాప్తిసమిచ్చాను. వీరికి తప్ప మరెవరికైనా ఇచ్చానేమో నాకు తెలియదు. 17 క్రీస్తు నన్ను బాప్తిసమియ్యడానికి పంపలేదు. ఆయన సిలువ వ్యర్ధం కాకుండేలా, జ్ఞానయుక్తమైన మాటలతో కాక కేవలం సువార్త ప్రకటించడానికే ఆయన నన్ను పంపాడు.
సిలువ మానవ జ్ఞానాన్ని మించినది
దేవుని శక్తి మరుగున పడకుండా ఉండేందుకు, పాండిత్యంతో కూడిన నేర్పైన వాక్చాతుర్యంతో కాక సువార్తను ప్రకటించడానికే తాను పంపబడ్డానని పౌలు స్పష్టం చేస్తాడు. సువార్త సత్యాలను మానవ జ్ఞానంతో గానీ విద్యతో గానీ కనుగొనలేమని ప్రకటిస్తాడు. సిలువను గూర్చిన ప్రకటన అవిశ్వాసులకు వెర్రితనంగా కనిపించినా, అది మానవుల జ్ఞానాన్ని మించినది; విశ్వాసంలోకి మారిన యూదుడికీ గ్రీసు దేశస్థుడికీ రక్షణ కలిగించే దేవుని శక్తి. సువార్త జ్ఞానాన్ని ఎదిరించే పండితులైన తత్వవేత్తలను, యూదులలోని గొప్పవారిని సిగ్గుపరచడానికి దేవుడు మానవులలో అత్యంత తృణీకరించబడినవారిని ఎన్నుకున్నాడు. ప్రభువునందు తప్ప మరి దేనిలోనూ ఎవరూ అతిశయించకుండా, మానవ విజయాలన్నీ ఎంత అల్పమైనవో పోలిక ద్వారా అతడు చూపిస్తాడు.
కొరింతీయులకు రాసిన మొదటి పత్రిక 1:18–31
18 సిలువ సందేశం, నశించే వారికి వెర్రితనమే గాని రక్షణ పొందుతున్న మనకు దేవుని శక్తి. 19 దీని గురించే ‘జ్ఞానుల జ్ఞానాన్ని నాశనం చేస్తాను. వివేకుల తెలివిని వ్యర్థం చేస్తాను’ అని రాసి ఉంది. 20 జ్ఞాని ఎక్కడున్నాడు? మేధావి ఎక్కడున్నాడు? సమకాలిక తర్కవాది ఎక్కడున్నాడు? ఈ లోక జ్ఞానాన్ని దేవుడు వెర్రితనంగా చేశాడు గదా? 21 లోకం తన జ్ఞానం ద్వారా దేవుణ్ణి తెలుసుకోలేక పోయింది కాబట్టి, సువార్త ప్రకటన అనే వెర్రితనం ద్వారా నమ్మేవారిని రక్షించడానికి దేవుడు దయతో సంకల్పించాడు.
22 యూదులు సూచనలు, అద్భుతాలు కావాలని కోరుతున్నారు. గ్రీకులు జ్ఞానం కావాలని వెదుకుతున్నారు. 23 అయితే మేము సిలువ పాలైన క్రీస్తును ప్రకటిస్తున్నాం. ఆయన యూదులకు ఒక అడ్డుబండగా, గ్రీసు దేశస్తులకు బుద్ధిహీనతగా ఉన్నాడు. 24 అయితే యూదులు గానీ, గ్రీకులు గానీ, ఎవరైతే పిలుపు పొందారో వారికి క్రీస్తు దేవుని శక్తీ దేవుని జ్ఞానమూ అయ్యాడు. 25 ఎందుకంటే దేవుని బుద్ధిహీనత మానవుల కంటే తెలివైనది, దేవుని బలహీనత మానవుల కంటే బలమైనది.
26 సోదర సోదరీలారా, దేవుడు మిమ్మల్ని పిలిచిన పిలుపును గమనించండి. మీలో లోకం దృష్టిలో తెలివైనవారు, ఘనులు, గొప్ప వంశం వారు ఎంతోమంది లేరు కదా. 27 దేవుడు తెలివైన వారిని సిగ్గు పరచడానికి లోకంలో బుద్ధిహీనులను ఏర్పాటు చేసుకున్నాడు, బలవంతులను సిగ్గు పరచడానికి లోకంలో బలహీనులను ఏర్పాటు చేసుకున్నాడు. 28 గొప్పవారిని హీనపరచడానికి లోకంలో నీచులనూ, మనుషులు తిరస్కరించిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఎన్నుకున్నాడు. 29 ఎందుకంటే తన ముందు ఎవరూ గొప్పలు చెప్పుకోకూడదని దేవుని ఉద్దేశం.
30 అయితే దేవుడు చేసిన దానివలన మీరు క్రీస్తు యేసులో ఉన్నారు. 31 “అతిశయించేవాడు ప్రభువును బట్టి మాత్రమే అతిశయించాలి” అని రాసి ఉన్నట్టుగా దేవుని మూలంగా క్రీస్తు మనకు జ్ఞానం, నీతి, పవిత్రత, విమోచనం అయ్యాడు.
పౌలు మానవ వాక్చాతుర్యం లేకుండా బోధించాడు
వారి అబద్ధ బోధకులవలె కాకుండా, తాను వారికి సువార్త ప్రకటించినప్పుడు దానిని మానవ విద్యతో గానీ వాక్చాతుర్యంతో గానీ అలంకరించలేదని పౌలు ప్రకటిస్తాడు. అతని వాదనలు దైవ ప్రత్యక్షత సాక్ష్యం నుండి తీసుకున్నవి; అవి అద్భుతాల శక్తితో నిర్ధారించబడ్డాయి. కాబట్టి వారి విశ్వాసం మానవుల జ్ఞానం మీద గానీ తత్వశాస్త్రం మీద గానీ ఆధారపడకూడదు.
కొరింతీయులకు రాసిన మొదటి పత్రిక 2:1–5
1 సోదరీ సోదరులారా, నేను మీ దగ్గరికి వచ్చి దేవుని మర్మం గూర్చి బోధించినప్పుడు మాటకారితనాన్నీ లేక గొప్ప తెలివినీ ఉపయోగించలేదు. 2 మీతో ఉన్న సమయంలో నేను యేసు క్రీస్తును తప్ప, అంటే సిలువను అనుభవించిన యేసు క్రీస్తును తప్ప, మరేదీ తెలియనివాణ్ణయి ఉండాలని తీర్మానించుకున్నాను. 3 బలహీనుడుగా, భయంతో, వణకుతూ మీ దగ్గర గడిపాను.
4 మీ విశ్వాసం మానవ జ్ఞానంపై కాక, దేవుని శక్తిపై ఆధారపడి ఉండాలని నా ఆశ. 5 అందుకే నేను మాట్లాడినా, సువార్త ప్రకటించినా, జ్ఞానంతో నిండిన తియ్యని మాటలు వాడక, పరిశుద్ధాత్మ శక్తినే ప్రదర్శించాను.
ఆత్మ ద్వారా బయలుపరచబడిన దేవుని గుప్త జ్ఞానం
తాను లోక జ్ఞానాన్ని ఉపయోగించకపోయినా, కొరింతీయులు తమ అబద్ధ బోధకులను బట్టి అతిశయించడానికి కారణమేమీ లేదని పౌలు తరువాత చూపిస్తాడు. ఎందుకంటే ఏ మానవ ప్రయత్నమూ అధ్యయనమూ చేరుకోలేని, ఆత్మ ద్వారా తనకు బయలుపరచబడిన దేవుని గుప్త రహస్యాన్ని అతడు మాట్లాడుతున్నాడు. దేవుని ఆత్మ మాత్రమే బయలుపరచగల దేవుని లోతైన విషయాలను పరిశుద్ధాత్మ బోధన ద్వారా వారికి ప్రకటిస్తాడు. తన మానవ సామర్థ్యాలు తప్ప మరే సహాయమూ లేని సహజమైన, ఆత్మ సంబంధి కాని మనిషి వాటిని స్వీకరించలేడు కూడా.
కొరింతీయులకు రాసిన మొదటి పత్రిక 2:6–16
6 ఆధ్యాత్మిక పరిణతి గలిగిన వారికి జ్ఞానాన్ని బోధిస్తున్నాం. అది ఈ లోకానికి చెందిన జ్ఞానమూ కాదు, వ్యర్ధమైపోయే ఈ లోకాధికారుల జ్ఞానమూ కాదు. 7 అది దేవుని రహస్య జ్ఞానం. ఈ రహస్య జ్ఞానాన్ని దేవుడు ఈ లోకం ఉనికిలోకి రాక మునుపే మన ఘనత కోసం నియమించాడు.
8 దాని గురించి ఈ యుగానికి చెందిన లోకాధికారుల్లో ఎవరికీ తెలియదు. అది వారికి తెలిసి ఉంటే మహిమాస్వరూపి అయిన ప్రభువును సిలువ వేసేవారు కాదు. 9 దీన్ని గూర్చి ‘దేవుడు తనను ప్రేమించే వారికోసం ఏం సిద్ధపరిచాడో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మానవ హృదయం ఊహకు అందలేదు’ అని రాసి ఉంది. 10 మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ ద్వారా వెల్లడి చేశాడు. ఆ ఆత్మ అన్నిటినీ, చివరికి దేవుని లోతైన రహస్యాలను కూడ పరిశోధిస్తాడు.
11 ఒక వ్యక్తి విషయాలు ఆ వ్యక్తిలోని ఆత్మకే తెలుస్తాయి గానీ వేరొక వ్యక్తికెలా తెలుస్తాయి? ఆలాగే దేవుని విషయాలు దేవుని ఆత్మకు తప్ప మరెవరికీ తెలియవు. 12 దేవుడు మనకు ఉచితంగా దయచేసిన వాటిని తెలుసుకోవడం కోసం మనం లౌకికాత్మను కాక దేవుని నుండి వచ్చిన ఆత్మను పొందాము. 13 వాటిని మేము మానవ జ్ఞానం నేర్పగలిగే మాటలతో గాక ఆత్మసంబంధమైన విషయాలను ఆత్మసంబంధమైన వాటితో సరి చూసుకుంటూ, ఆత్మ నేర్పే మాటలతోనే బోధిస్తున్నాం.
14 సహజ సిద్ధమైన మనిషి దేవుని ఆత్మ విషయాలను అంగీకరించడు. ఎందుకంటే అవి అతనికి తెలివితక్కువగా కనిపిస్తాయి. వాటిని ఆధ్యాత్మికంగానే వివేచించగలం. కాబట్టి అతడు వాటిని గ్రహించలేడు. 15 ఆత్మ సంబంధి అన్నిటినీ సరిగా అంచనా వేయగలడు గాని అతణ్ణి ఎవరూ సరిగా అంచనా వేయలేరు. 16 ప్రభువు మనసు గ్రహించి ఆయనకు ఎవరు ఉపదేశించ గలరు? మనకైతే క్రీస్తు మనసు ఉంది.