భాగం 5: పౌలు మూడవ సువార్త ప్రచార యాత్ర
పౌలు గలతీయ, ఫ్రుగియలను మళ్లీ సందర్శిస్తాడు
గలతీయ, ఫ్రుగియలలోని సంఘాలను సందర్శించడానికి పౌలు మళ్లీ అంతియొకయ నుండి బయలుదేరుతాడు.
క్రీ.శ. 55
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
23 అక్కడ కొంతకాలం ఉన్న తరువాత బయలుదేరి వరసగా గలిలయ ప్రాంతంలో, ఫ్రుగియలో సంచరిస్తూ శిష్యులందరినీ స్థిరపరిచాడు.
ఎఫెసులో అపొల్లో ప్రసంగిస్తాడు
పౌలు స్థాపించిన ఎఫెసులోని సంఘానికి ఇప్పుడు ప్రసంగిస్తున్న అపొల్లో కథ.
24 అలెగ్జాండ్రియా వాడైన అపొల్లో అనే ఒక యూదుడు ఎఫెసు వచ్చాడు. అతడు గొప్ప విద్వాంసుడు, లేఖనాల్లో ప్రావీణ్యత కలిగినవాడు. 25 అతడు ప్రభువు మార్గంలో ఉపదేశం పొంది, ఆత్మలో తీవ్రత కలిగి, యేసును గూర్చి అనర్గళంగా, స్పష్టంగా మాట్లాడుతూ, సమాజ మందిరాల్లో ధైర్యంగా బోధించడం మొదలు పెట్టాడు. కానీ అతనికి యోహాను బాప్తిసం గురించి మాత్రమే తెలుసు.
26 ప్రిస్కిల్ల, అకుల అతని గురించి విని, అతనిని చేర్చుకుని దేవుని మార్గం గురించి పూర్తిగా విశదపరిచారు. 27 తరువాత అతడు అకయ వెళ్ళాలని తలంచినప్పుడు అక్కడి విశ్వాసులకు ఉత్తరాలు రాసి అతనిని చేర్చుకోమని అక్కడి సోదరులను ప్రోత్సాహపరిచారు. అతడు అక్కడికి వచ్చి, దైవ కృపచేత విశ్వసించిన వారికి చాలా సహాయం చేశాడు. 28 లేఖనాల ఆధారంతో యేసే క్రీస్తని రుజువు పరుస్తూ, బహిరంగంగా యూదుల వాదాన్ని గట్టిగా ఖండిస్తూ వచ్చాడు.
ఫ్రుగియ నుండి ఎఫెసుకు
పౌలు ఫ్రుగియ నుండి ఎఫెసుకు వెళ్లి, అక్కడి యూదులతో తర్కిస్తాడు.
1 అపొల్లో కొరింథులో ఉన్నప్పుడు జరిగిందేమంటే, పౌలు మన్య ప్రాంతాల్లో సంచరించి ఎఫెసుకు వచ్చినప్పుడు కొందరు శిష్యులు అతనికి కనిపించారు. వారిని, “మీరు నమ్ముకున్నప్పుడు పరిశుద్ధాత్మను పొందారా?” అని అడిగాడు. 2 వారు, “అసలు పరిశుద్ధాత్మను గురించి మేము వినలేదు” అని చెప్పారు. 3 అప్పుడు పౌలు, “అలాగైతే మీరు ఎలాంటి బాప్తిసం పొందారు?” అని అడగ్గా, వారు, “యోహాను బాప్తిసం” అని చెప్పారు.
4 అందుకు పౌలు, “యోహాను తన వెనక వచ్చే వాడిలో, అంటే యేసులో విశ్వాసముంచాలని ప్రజలతో చెబుతూ, పశ్చాత్తాపం విషయమైన బాప్తిసమిచ్చాడు” అని చెప్పాడు. 5 వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామంలో బాప్తిసం పొందారు.
6 తరువాత పౌలు వారి మీద చేతులుంచినపుడు పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చాడు. అప్పుడు వారు భాషలతో మాటలాడటం, ప్రవచించడం మొదలుపెట్టారు. 7 వారందరూ సుమారు పన్నెండు మంది పురుషులు.
8 తరువాత పౌలు సమాజ మందిరంలోకి వెళ్ళి ప్రసంగిస్తూ, దేవుని రాజ్యం గూర్చి తర్కిస్తూ, ఒప్పిస్తూ, ధైర్యంగా మాట్లాడుతూ మూడు నెలలు గడిపాడు. 9 అయితే కొందరు తమ హృదయాలను కఠినం చేసుకుని అతనిని తిరస్కరించి, జనసమూహం ఎదుట క్రీస్తు మార్గాన్ని దూషిస్తూ వచ్చారు. కాబట్టి అతడు వారిని విడిచిపెట్టి, శిష్యులను వారి నుండి వేరు చేసి ప్రతిరోజూ తురన్ను అనే అతని బడిలో చర్చిస్తూ వచ్చాడు.
10 రెండు సంవత్సరాల పాటు ఈ విధంగా జరిగింది. కాబట్టి యూదులు, గ్రీకులు, ఆసియలో నివసించే వారంతా ప్రభువు వాక్కు విన్నారు.
ఎఫెసులో మంత్రవిద్య పుస్తకాల దహనం క్రీ.శ. 56
పౌలు ఎఫెసులో రెండు సంవత్సరాలు ఉంటాడు. ప్రజలు తమ మంత్రవిద్య పుస్తకాలను కాల్చివేస్తారు.
11 అంతేగాక దేవుడు పౌలు చేత కళ్ళు మిరుమిట్లు గొలిపే అద్భుతాలను చేయించాడు. 12 అతని శరీరానికి తాకిన చేతిగుడ్డలయినా, నడికట్లయినా రోగుల దగ్గరికి తెస్తే వారి రోగాలు పోయాయి, దురాత్మలు కూడా వదలిపోయాయి. 13 అప్పుడు దేశసంచారం చేసే యూదు మాంత్రికులు కొందరు తమ స్వలాభం కోసం యేసు నామం ఉపయోగిస్తూ, “పౌలు ప్రకటించే యేసు తోడు, మిమ్మల్ని ఆజ్ఞాపిస్తున్నాను” అని చెప్పి, దురాత్మలు పట్టినవారిపై ప్రభువైన యేసు పేరు ఉచ్ఛరించడానికి పూనుకున్నారు.
14 స్కెవ అనే ఒక యూదు ప్రధాన యాజకుని కొడుకులు ఏడుగురు కూడా ఆ విధంగా చేస్తున్నారు. 15 అందుకు ఆ దురాత్మ, “నాకు యేసు ఎవరో తెలుసు, పౌలు కూడా తెలుసు గాని, మీరెవరు?” అని వారిని అడిగింది. 16 ఆ దురాత్మ పట్టినవాడు ఎగిరి మీద పడి వారిని లొంగదీసుకోవడంతో ఆ దురాత్మ గెలిచింది. అందుచేత ఆ మంత్రగాళ్ళు గాయాలతో బట్టల్లేకుండా పారిపోయారు.
17 ఈ సంగతి ఎఫెసులో నివసించే యూదులకు, గ్రీకువారికి తెలిసినప్పుడు వారందరికీ భయం వేసింది కాబట్టి ప్రభువైన యేసు నామానికి ఘనత కలిగింది. 18 విశ్వసించినవారు చాలా మంది వచ్చి, తమ దుర్మార్గ క్రియలను ఒప్పుకున్నారు.
19 అంతేగాక మాంత్రిక విద్య అభ్యసించినవారు చాలా మంది తమ పుస్తకాలను తెచ్చి, అందరూ చూస్తుండగా వాటిని కాల్చివేశారు. లెక్క చూసినప్పుడు వాటి విలువ యాభై వేల వెండి నాణాలు అయింది. 20 అంత ప్రభావ సహితంగా ప్రభువు వాక్కు వ్యాపించింది.
పౌలు తిమోతిని, ఎరస్తును మాసిదోనియకు, అకయకు పంపుతాడు
21 పౌలు ఎఫెసులో పరిచర్య ముగించిన తరువాత మాసిదోనియ, అకయ దేశాల మార్గంలో యెరూషలేము వెళ్ళాలని ఆత్మలో ఉద్దేశించి ‘నేను అక్కడికి వెళ్ళిన తరువాత రోమ్ నగరాన్ని కూడా చూడాలి’ అని నిర్ణయించుకున్నాడు.
22 అప్పుడు తన పరిచారకుల్లో తిమోతి, ఎరస్తు అనే ఇద్దరిని మాసిదోనియ పంపించి తాను మాత్రం ఆసియలో కొంతకాలం నిలిచిపోయాడు.