పరిచారకులను బట్టి కలిగే విభేదాలు ఆత్మీయతను నాశనం చేస్తాయి
తమ పరిచారకుల వివిధ వరాలపై ప్రజలకున్న అభిప్రాయాల వల్ల సంఘంలో తలెత్తే విభేదాలు ఆత్మీయతను నాశనం చేస్తాయని పౌలు చూపిస్తాడు.
క్రీ.శ. 57
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
కొరింతీయులకు రాసిన మొదటి పత్రిక 3:1–10
1 సోదరులారా, ఆత్మసంబంధులైన మనుషులతో మాట్లాడే విధంగా నేను మీతో మాట్లాడ లేకపోయాను. శరీర స్వభావం గలవారితోనూ, క్రీస్తులో పసిబిడ్డలతోనూ మాట్లాడే విధంగా మీతో మాట్లాడవలసి వచ్చింది. 2 మిమ్మల్ని పాలతోనే పెంచాను గాని బలమైన ఆహారం తినిపించలేదు. ఇప్పుడు కూడా మీరు దాన్ని తీసుకునే స్థితిలో లేరు. 3 ఎందుకంటే మీరింకా శరీర స్వభావంతోనే ఉన్నారు. మీ మధ్య అసూయ, కలహం ఉన్నాయి. దాన్ని బట్టి మీరు శరీర స్వభావం కలిగి మానవ రీతిగా నడచుకొనేవారే కదా?
4 మీలో ఒకడేమో “నేను పౌలుకు చెందినవాణ్ణి,” మరొకడు “నేను అపొల్లోకు చెందిన వాణ్ణి,” అని చెబుతూ ఉంటే మీరు శరీర స్వభావులే కదా 5 అపొల్లో ఎవరు? పౌలు ఎవరు? ఇద్దరూ పరిచారకులే గదా. ఇద్దరికీ ప్రభువు ఇచ్చిన బాధ్యతలకు అనుగుణంగా వారి ద్వారా మీరు నమ్మారు. 6 నేను నాటాను, అపొల్లో నీరు పోశాడు. అయితే దాన్ని నీరు పోశాడు చేసింది దేవుడే. 7 కాబట్టి పెరిగేలా చేసిన దేవునిలోనే ఉంది గాని, నాటేవాడిలో గాని, నీరు పోసేవాడిలో గాని ఏమీ లేదు. 8 నాటే వాడూ నీరు పోసేవాడూ ఒక్కటే. ఒక్కొక్కరు కష్టపడిన కొద్దీ ప్రతిఫలం పొందుతారు. 9 మేము దేవునితో కలిసి పని చేసే వాళ్ళం. మీరు దేవుని పొలం, దేవుని కట్టడం.
10 దేవుడు నాకు దయచేసిన కృప వలన నేను నైపుణ్యం గల నిర్మాణకునిగా పునాది వేశాను. మరొకడు దాని మీద నిర్మిస్తున్నాడు. అయితే దాని మీద కడుతున్న ప్రతి ఒక్కరూ తాము ఏ విధంగా కడుతున్నారో జాగ్రత్తగా చూసుకోవాలి.
క్రీస్తే ఏకైక పునాది
క్రైస్తవ విశ్వాసానికి యేసు క్రీస్తే ఏకైక పునాది. ఈ పునాదిపై కట్టేవారు తీవ్రమైన పరీక్షను ఎదుర్కోవలసి ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించబడుతున్నారు. అబద్ధ సిద్ధాంతాలను ప్రవేశపెట్టిన బోధకుడు, అగ్నిలో కట్టెలు, ఎండుగడ్డి, గడ్డిపోచలవలె తన ద్వారా విశ్వాసులైనవారు హింసాకాలంలో పడిపోవడాన్ని చూస్తాడు; తాను కూడా కష్టంతో తప్పించుకుంటాడు. మరోవైపు, ఈ పునాదిపై సరైన, మంచి సిద్ధాంతాన్ని కట్టినవారు తమ ద్వారా విశ్వాసులైనవారు వెండి బంగారాలవలె అగ్నిపరీక్షను దాటి నిలవడాన్ని చూస్తారు; బోధకుడు కూడా తన శ్రమలకు ప్రతిఫలాన్ని పొందుతాడు.
కొరింతీయులకు రాసిన మొదటి పత్రిక 3:11–15
11 పునాది యేసు క్రీస్తే. వేసిన ఈ పునాది కాక, వేరే పునాది ఎవరూ వేయలేరు.
12 ఈ పునాది మీద ఎవరైనా బంగారం, వెండి, విలువైన రాళ్ళు, చెక్క, చెత్త పరకలు, ఇలాటి వాటితో కడితే 13 వారి వారి పని బయట పడుతుంది. ఆ రోజు దాన్ని స్పష్టంగా వెల్లడి చేస్తుంది. ఎందుకంటే అది అగ్నివల్ల బయట పడుతుంది. ప్రతి ఒక్కరి పనినీ మంటలే పరీక్షిస్తాయి. 14 పునాది మీద ఎవరి పని నిలబడుతుందో అతనికి ప్రతిఫలం దొరుకుతుంది. 15 ఎవరి పని కాలిపోతుందో అతనికి నష్టం వస్తుంది. అతడు తప్పించుకుంటాడు గానీ మంటల్లో నుండి తప్పించుకొన్నట్టుగా ఉంటాడు.
ఈ లోక జ్ఞానం వెర్రితనం
ఉద్దేశపూర్వకంగా సంఘంలోకి అబద్ధ సిద్ధాంతాన్ని తెచ్చే బోధకుడు ఎంత విజయవంతుడైనా నాశనం అవుతాడని పౌలు ప్రకటిస్తాడు. ఈ లోక జ్ఞానం దేవుని దృష్టిలో వెర్రితనం. కాబట్టి వారు సంఘంలో విభేదాలు కలిగిస్తూ తమ బోధకులను బట్టి గానీ, వారు గొప్పగా చెప్పుకునే తత్వశాస్త్రాన్ని బట్టి గానీ అతిశయించకూడదు. క్రైస్తవుడి నిజమైన మహిమ దేవునికి చెందిన క్రీస్తులోనే ఉంది. సువార్త బోధకులు ఇవ్వలేని రక్షణ వాగ్దానాలను మనం ఆయన ద్వారానే పొందుతాము.
కొరింతీయులకు రాసిన మొదటి పత్రిక 3:16–23
16 మీరు దేవుని ఆలయమనీ దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడనీ మీకు తెలియదా? 17 దేవుని ఆలయాన్ని ఎవరైనా పాడు చేస్తే దేవుడు అతణ్ణి పాడు చేస్తాడు. దేవుని ఆలయం పవిత్రమైనది. ఆ ఆలయం మీరే.
18 ఎవరూ తనను తాను మోసగించుకోవద్దు. మీలో ఎవరైనా ఈ లోకరీతిగా తాను జ్ఞానం గలవాడిని అనుకుంటే, జ్ఞానం పొందడం కోసం అతడు తెలివి తక్కువవాడు కావాలి. 19 ఈ లోక జ్ఞానం దేవుని దృష్టికి తెలివి తక్కువతనమే. “జ్ఞానులను వారి కుయుక్తుల్లోనే ఆయన పట్టుకుంటాడు” అనీ, 20 “జ్ఞానుల ఆలోచనలు వ్యర్థం అని ప్రభువుకు తెలుసు” అనీ రాసి ఉంది కదా.
21 కాబట్టి మనుషులను బట్టి ఎవరూ అతిశయించ కూడదు. ఎందుకంటే అన్నీ మీవే. 22 పౌలైనా, అపొల్లో అయినా, కేఫా అయినా, లోకమైనా, జీవమైనా, మరణమైనా, ఇప్పుడున్నవైనా, రాబోయేవైనా, అన్నీ మీవే. 23 మీరు క్రీస్తుకు చెందినవారు, క్రీస్తు దేవునికి చెందినవాడు.
దేవుడు మాత్రమే తన సేవకులకు తీర్పు తీరుస్తాడు
క్రీస్తు సేవకులైన అపొస్తలులు, ప్రజలు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నకొద్దీ వారికి సువార్త రహస్యాలను అందించవలసి ఉంది. కొరింతీయులకు క్రైస్తవ విశ్వాసంలోని లోతైన సిద్ధాంతాలను బోధించలేదని తనపై అబద్ధ బోధకులు చేసిన విమర్శకు జవాబిస్తూ, మానవ తీర్పు ద్వారా దోషిగా ఎంచబడడం తనకు చాలా చిన్న విషయమని పౌలు ప్రకటిస్తాడు. ఎందుకంటే దేవుడు మాత్రమే సరిగా తీర్పు తీర్చగలడు; హృదయ రహస్యాలు ఆయనకు మాత్రమే తెలుసు. కాబట్టి తమ ఆత్మీయ బోధకులపై తీర్పు తీర్చవద్దని అతడు వారిని కోరుతాడు.
కొరింతీయులకు రాసిన మొదటి పత్రిక 4:1–5
1 కాబట్టి ప్రతి ఒక్కరూ మమ్మల్ని క్రీస్తు సేవకులమనీ, దేవుని మర్మాల విషయంలో నిర్వాహకులమనీ పరిగణించాలి. 2 నిర్వాహకుల్లో ప్రతి ఒక్కడూ నమ్మకంగా ఉండడం చాలా అవసరం. 3 మీరు గానీ, ఇతరులు గానీ నాకు తీర్పు తీర్చడమనేది నాకు చాలా చిన్న విషయం. నన్ను నేనే తీర్పు తీర్చుకోను. 4 నాలో నాకు ఏ దోషమూ కనిపించదు. అంత మాత్రం చేత నేను నీతిమంతుడిని అని కాదు. అయితే, ప్రభువే నాకు తీర్పు తీర్చేవాడు. 5 కాబట్టి ఆ కాలం రాకముందే, అంటే ప్రభువు వచ్చేంత వరకూ, దేనిని గూర్చీ తీర్పు తీర్చవద్దు. ఆయన చీకటిలో ఉన్న రహస్యాలను వెలుగులోకి తెచ్చి మనుషుల అంతరంగంలో ఉన్న ఉద్దేశ్యాలను బట్టబయలు చేస్తాడు. అప్పుడు ప్రతి ఒక్కరికీ తగిన ప్రశంస దేవుని నుండి కలుగుతుంది.
అపొస్తలులకు తృణీకారం, అబద్ధ బోధకులకు గౌరవం
తమ వేర్వేరు నాయకులను మరీ గొప్పగా భావించి, ఒకరిపై మరొకరు కోపంతో, తృణీకారంతో ఉప్పొంగిపోకుండా నేర్చుకోవడానికే తన పేరును, అపొల్లో పేరును ఉపయోగించానని పౌలు ప్రకటిస్తాడు. పౌలు, అపొల్లో కేవలం క్రీస్తు సేవకులు; వారి పరిచర్య ద్వారా క్రైస్తవులు విశ్వసించారు. తమ మాదిరిని చూసి కొరింతీయులు తమ బోధకులను అతడు రాసిన దానికంటే మించి ఎంచకుండా నేర్చుకోవాలని, వారు తమ మధ్య అన్ని బిరుదులను, ప్రత్యేక హోదాలను తిరస్కరించారు. తరువాత పౌలు అబద్ధ బోధకుల విషయం ప్రస్తావిస్తాడు. క్రైస్తవ విశ్వాసపు మొదటి సూత్రాన్ని ప్రకటిస్తున్నందుకు అపొస్తలులను అజ్ఞానులని, మూర్ఖులని పిలుస్తున్నారు; అయితే అబద్ధ బోధకులను వారి ఊహాకల్పనలు, సంప్రదాయాల కారణంగా జ్ఞానులు, తత్వవేత్తలు అని భావిస్తున్నారు. అపొస్తలులు తృణీకరించబడుతున్నారు; అబద్ధ బోధకులు గౌరవించబడుతున్నారు. అపొస్తలులు అన్ని రకాల ప్రమాదాలకు గురవుతున్నారు; అబద్ధ బోధకులు సంపదను, అన్ని సౌకర్యాలను అనుభవిస్తున్నారు.
కొరింతీయులకు రాసిన మొదటి పత్రిక 4:6–13
6 సోదరీ సోదరులారా, “రాసి ఉన్నవాటిని మించి వెళ్లవద్దు” అనే మాట అర్థం మీరు గ్రహించాలని ఈ మాటలు మీ మేలు కోసం నాకూ అపొల్లోకూ ఆపాదించుకుని ఉదాహరణగా చెప్పాను. మీరు ఒకరి మీద ఒకరు విర్రవీగ కూడదని ఈ విధంగా వివరించాను.
7 ఎందుకంటే నీకొక్కడికే ఉన్న గొప్పతనం ఏమిటి? నీకు ఉన్నదానిలో నువ్వు ఉచితంగా పొందనిది ఏమిటి? ఇతరుల నుండి పొంది కూడా అది నీ సొంతమే అన్నట్టు గొప్పలు చెప్పుకోవడమెందుకు? 8 ఇప్పటికే మీకు అవసరమైనవన్నీ మీరు సంపాదించుకున్నారంటనే! ఇప్పటికే ధనవంతులయ్యారంటనే! మా ప్రమేయం లేకుండానే మీరు రాజులైపోయారంటనే! అయినా, మీరు రాజులు కావడం మంచిదేగా, మేము కూడా మీతో కలిసి ఏలవచ్చు!
9 దేవుడు క్రీస్తు అపొస్తలులమైన మమ్మల్ని ఊరేగింపులో చివరి వరసలో ఉంచి మరణశిక్ష పొందిన వారిలా ఉంచాడని నాకనిపిస్తున్నది. మేము లోకమంతటికీ, అంటే దేవదూతలకూ మనుషులకూ ఒక వింత ప్రదర్శనలాగా ఉన్నాం. 10 క్రీస్తు కోసం మేము బుద్ధిహీనులం, మీరు తెలివైనవారు! మేము బలం లేని వాళ్ళం, మీరు బలమైనవారు, ఘనత పొందినవారు! మేమైతే అవమానం పాలైన వాళ్ళం.
11 ఈ గంట వరకూ మేము ఆకలిదప్పులతో అలమటిస్తున్నాం, సరైన బట్టలు లేవు. క్రూరంగా దెబ్బలు తింటున్నాం, నిలువ నీడ లేని వాళ్ళం. 12 మా చేతులతో కష్టపడి పని చేసుకుంటున్నాం. ప్రజలు మమ్మల్ని నిందించినా ప్రతిగా దీవిస్తున్నాం. ఎన్ని బాధలు పెట్టినా ఓర్చుకుంటున్నాం. 13 మమ్మల్ని తిట్టిన వారితో దయగానే మాట్లాడుతున్నాం. ఇప్పటికీ మమ్మల్ని అందరూ ఈ లోకంలోని మురికిగా, పారేసిన కసువులాగా ఎంచుతున్నారు.
పౌలు వారి తండ్రిగా వారిని హెచ్చరిస్తాడు
వారిని సిగ్గుపరచడానికి కాక వారికి నేర్పించడానికి, అబద్ధ బోధకుల విషయంలో వారిని హెచ్చరించడానికే తాను ఈ సంగతులు రాస్తున్నానని పౌలు ప్రకటిస్తాడు. తాను వారికి ఆత్మీయ తండ్రిగా ఉన్నట్లు ఆ బోధకులు ఉండరు. కాబట్టి తనను అనుకరించాలని అతడు వారిని కోరుతూ, తన బోధను వారికి గుర్తుచేయడానికి తిమోతిని వారి దగ్గరకు పంపుతాడు.
కొరింతీయులకు రాసిన మొదటి పత్రిక 4:14–17
14 నేను ఈ మాటలు రాస్తున్నది మీరు నా ప్రియమైన పిల్లలని మీకు బుద్ధి చెప్పడానికే గానీ మిమ్మల్ని సిగ్గు పరచాలని కాదు. 15-16 ఎందుకంటే క్రీస్తులో మీకు సంరక్షకులు పదివేల మంది ఉన్నా, అనేకమంది తండ్రులు లేరు. క్రీస్తు యేసులో సువార్త ద్వారా నేను మిమ్మల్ని కన్నాను. కాబట్టి నన్ను పోలి నడుచుకోమని మిమ్మల్ని వేడుకుంటున్నాను. 17 అందుకే ప్రభువులో నాకు ప్రియమైన, నమ్మకమైన నా కుమారుడు తిమోతిని మీ దగ్గరికి పంపాను. అతడు నేను ఏ విధంగా ప్రతి స్థలంలో, ప్రతి సంఘంలో ఏమి బోధిస్తున్నానో, వాటిని క్రీస్తులో ఏ విధంగా అనుసరిస్తున్నానో, మీకు జ్ఞాపకం చేస్తాడు.
పౌలు శిక్షించడానికైనా, ప్రేమతోనైనా వస్తాడు
అంత పాండిత్యం, వాక్చాతుర్యం గల ప్రత్యర్థులను ఎదుర్కోవడానికి పౌలు భయపడుతున్నాడని అబద్ధ బోధకుడు చెప్పాడు. త్వరలోనే వారిని సందర్శించాలని ఉద్దేశిస్తున్నానని పౌలు ప్రకటిస్తాడు. అప్పుడు తన ప్రత్యర్థుల మాటలను కాక వారి అద్భుత శక్తులను పరిశీలిస్తాడు. ఎందుకంటే సువార్త దాని బోధకులు గొప్పగా చెప్పుకునే జ్ఞానం ద్వారా కాక, దానిని నిర్ధారించడానికి వారికి ఇవ్వబడిన అద్భుత శక్తుల ద్వారా స్థాపించబడుతుంది. తరువాత, వారిని శిక్షించడానికి తన అద్భుత శక్తులను వారిపై ఉపయోగించాలా, లేక వారు తమ తప్పులను సరిదిద్దుకున్నందున శాంతి ప్రేమల మనస్సుతో వారి దగ్గరకు రావాలా అని వారిని అడుగుతాడు.
కొరింతీయులకు రాసిన మొదటి పత్రిక 4:18–21
18 నేను మీ దగ్గరికి రాననుకుని కొందరు మిడిసిపడుతున్నారు. 19 ప్రభువు చిత్తమైతే త్వరలోనే మీ దగ్గరికి వచ్చి, అలా మిడిసి పడేవారి మాటలు కాదు, వారి బలమేమిటో తెలుసుకుంటాను. 20 దేవుని రాజ్యం అంటే ఒట్టి మాటలు కాదు, అది బలప్రభావాలతో కూడినది. 21 మీకేం కావాలి? మీ దగ్గరికి నేను బెత్తంతో రావాలా, ప్రేమతో, మృదువైన మనసుతో రావాలా?