దగ్గరి బంధువుతో లైంగిక సంబంధం పెట్టుకున్న పురుషుణ్ణి వెలివేయండి

వావివరసలు తప్పిన సంబంధం పెట్టుకున్న వ్యక్తిని బహిరంగంగా సంఘం నుండి వెలివేయాలని పౌలు ఆజ్ఞాపిస్తాడు. ఈ దారుణాన్ని సహించిన తమ అబద్ధ బోధకుడి పరిజ్ఞానం గురించి వారు గొప్పలు చెప్పుకోవడాన్ని అతడు ఖండిస్తాడు, పాపం ఎలా సోకుతుందో పులిసిన పిండితో పోల్చి చూపిస్తాడు. బహిరంగంగా భక్తిహీనంగా ప్రవర్తించే క్రైస్తవులతో సహవాసం చేయకూడదని వారికి నిషేధం విధిస్తాడు; అలాంటివారిని సంఘ క్రమశిక్షణకు అప్పగించాలి. అయితే సంఘానికి బయట ఉన్న దుష్టులైన అన్యమతస్థులను దేవుని తీర్పుకు విడిచిపెట్టాలి.

క్రీ.శ. 57

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

కొరింతీయులకు రాసిన మొదటి పత్రిక 5

1 మీ మధ్య వ్యభిచారం ఉన్నదని మేము విన్నాం. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట గదా. ఇలాటి వ్యభిచారం యూదేతరుల్లో సైతం కనిపించదు.

2 ఇలా ఉండి కూడా మీరు విర్రవీగుతున్నారు. నిజానికి ఈ విషయమై మీరు విలపించాలి గదా. ఇలాటి పని చేసిన వాణ్ణి మీలో నుండి తప్పక వెలివేయాలి. 3 నేను శరీరరీతిగా మీకు దూరంగా ఉన్నప్పటికీ ఆత్మరీతిగా మీతో కూడ ఉన్నట్టుగానే ఆ పని చేసినవాడి విషయంలో ఇప్పటికే తీర్పు తీర్చాను. 4 ఎలాగంటే, ప్రభు యేసు నామంలో మీరు సమకూడినప్పుడు ప్రభు యేసు శక్తి ద్వారా నేను నా ఆత్మలో మీతో ఉండగా, 5 ప్రభువు వచ్చే రోజున అతని ఆత్మకు విమోచన కలగడం కోసం అతని భౌతిక శరీరం నశించేలా అలాటి వాణ్ణి సైతానుకు అప్పగించండి.

6 మీరు గర్వంతో మిడిసిపడడం మంచిది కాదు. పులిపిండి కొంచెమే అయినా, అది పిండి ముద్దనంతటినీ పులిసేలా చేస్తుందని మీకు తెలుసు కదా! 7 మీరు పులిపిండి లేని వారు కాబట్టి తాజా పిండిముద్ద కావడం కోసం పాత పులిపిండిని పారవేయండి. ఎందుకంటే క్రీస్తు అనే మన పస్కా పశువు బలి అర్పణ జరిగింది. 8 కాబట్టి, చెడు నడవడితో, దుష్టత్వంతో కూడిన పాత పులిపిండితో కాక, నిజాయితీ, సత్యం అనే పొంగని రొట్టెతో పండగ జరుపుకుందాం.

9 వ్యభిచారులతో సహవాసం చేయవద్దని నా ఉత్తరంలో మీకు రాశాను. 10 అయితే ఈ లోకానికి చెందిన వ్యభిచారులు, దురాశపరులు, దోచుకునే వారు, విగ్రహాలను పూజించేవారు ఇలాటి వారితో ఏ మాత్రం సహవాసం చేయవద్దని కాదు. అలా ఉండాలంటే మీరు లోకం నుండి వెళ్ళిపోవలసి వస్తుంది.

11 ఇప్పుడు నేను మీకు రాసేదేమంటే, క్రీస్తులో సోదరుడు లేక సోదరి అని పిలిపించుకొనే వారెవరైనా సరే, వ్యభిచారులూ దురాశపరులూ విగ్రహాలను పూజించేవారూ దూషించేవారూ తాగుబోతులూ దోచుకునే వారూ అయి ఉంటే, అలాటి వారితో సహవాసం చేయకూడదు. కనీసం వారితో కలిసి భోజనం చేయకూడదు. 12 సంఘానికి బయట ఉన్నవారికి నేనెందుకు తీర్పు తీర్చాలి? వారికి దేవుడే తీర్పు తీరుస్తాడు. 13 లోపలి వారికి తీర్పరులు మీరే కదా! కాబట్టి ఆ దుష్టుణ్ణి మీలో నుండి తొలగించండి.

అన్యమత న్యాయస్థానాల ముందు వ్యాజ్యాలు

ప్రస్తుత లోకాన్ని పరిపాలించడానికి నియమాలను ఇచ్చిన తమ దైవప్రేరిత బోధకుల ముందుకు వివాదాలను తీసుకురాకుండా, అన్యమత న్యాయస్థానాలకు తీసుకెళ్లి తమ క్రైస్తవ విశ్వాస ప్రకటనకు అవమానం కలిగిస్తున్నందుకు క్రైస్తవులు గద్దించబడుతున్నారు. తమ క్రైస్తవ సహోదరులకు అన్యాయం చేయడానికి, వారిని మోసగించడానికి ప్రయత్నిస్తున్నందుకు కూడా వారు గద్దించబడుతున్నారు.

కొరింతీయులకు రాసిన మొదటి పత్రిక 6:1–8

1 మీలో ఒకరితో ఒకరికి వివాదం ఏమైనా ఉంటే అతడు పరిశుద్ధుల ఎదుట కాకుండా అవిశ్వాసి అయిన న్యాయాధిపతి ఎదుట వాదించడానికి పూనుకుంటాడా? 2 పరిశుద్ధులు లోకానికి తీర్పు తీరుస్తారని మీకు తెలియదా? మీరు ఈ లోకానికి తీర్పు తీర్చవలసి ఉండగా, చిన్న చిన్న విషయాలను పరిష్కరించుకొనే సామర్ధ్యం మీకు లేదా? 3 మనం దేవదూతలకు తీర్పు తీరుస్తామని మీకు తెలియదా? అలాంటప్పుడు మరి ఈ లోక సంబంధమైన విషయాలను గూర్చి మరి బాగా తీర్పు తీర్చవచ్చు గదా?

4 కాబట్టి ఈ లోక సంబంధమైన వివాదాలు మీకు కలిగినపుడు వాటిని పరిష్కరించడానికి సంఘంలో ఎలాటి స్థానం లేని వారి దగ్గరికి వెళ్తారా? 5 మీరు సిగ్గుపడాలని ఇలా చెబుతున్నాను, తన సోదరీసోదరుల మధ్య వివాదం పరిష్కరించగలిగే బుద్ధిమంతుడు మీలో ఎవరూ లేరా? 6 అయితే ఒక సోదరుడు మరొక సోదరుని మీద వ్యాజ్యెమాడుతున్నాడు. అది కూడా అవిశ్వాసి అయిన న్యాయాధికారి ఎదుట!

7 అసలు క్రైస్తవుల మధ్య ఒకరితో ఒకరికి వివాదం ఉండడమే మీ అపజయం. దాని కంటే మీరు అన్యాయం సహించడం మంచిది కదా? దానికంటే మీ వస్తువులు పోగొట్టుకోవడం మంచిది కదా? 8 అయితే మీరే ఇతరులకు, మీ సోదర సోదరీలకే అన్యాయం చేస్తున్నారు, మోసం చేస్తున్నారు.

అనైతికతను సమర్థించే వాదనను పౌలు ఖండిస్తాడు

విలాసవంతమైన జీవితాన్ని, లైంగిక అనైతికతను ఆమోదించినట్లు కనిపించే అబద్ధ బోధకుడి వాదనలను పౌలు ఇక్కడ ఖండిస్తాడు. అపవిత్రుడెవడూ సువార్త ఆశీర్వాదాలను వారసత్వంగా పొందలేడని ప్రకటిస్తాడు. సృష్టి ద్వారా, విమోచన ద్వారా దేవునికి చెందిన క్రైస్తవులు, స్వతహాగా అనుమతించబడిన విషయాలలో కూడా మితిమీరి మునిగితేలడం పాపమే.

కొరింతీయులకు రాసిన మొదటి పత్రిక 6:9–20

9 అవినీతిపరులు దేవుని రాజ్యానికి వారసులు కాలేరని మీకు తెలియదా? మోసపోవద్దు. లైంగిక దుర్నీతికి పాలుపడే వారూ, విగ్రహాలను పూజించేవారూ, మగ వేశ్యలు, పురుషులతో లైంగిక సంబంధాలు పెట్టుకొనే పురుషులూ, విపరీత సంపర్కం జరిపే వారూ, 10 దొంగలూ, దురాశ పరులూ, తాగుబోతులూ, దుర్భాషలాడే వారూ, దోపిడీదారులూ దేవుని రాజ్యానికి వారసులు కాలేరు.

11 గతంలో మీలో కొంతమంది అలాటివారే. అయితే ప్రభు యేసు క్రీస్తు నామంలో, మన దేవుని ఆత్మ మిమ్మల్ని కడగడం ద్వారా పవిత్రులై దేవుని దృష్టిలో న్యాయవంతులయ్యారు. 12 దేవుని దృష్టిలో న్యాయవంతులయ్యారు గాని అన్ని విషయాలూ ప్రయోజనకరం కాదు. అన్ని విషయాల్లో స్వేచ్ఛ ఉంది గాని దేనినీ నన్ను లోపరచుకోనివ్వను.

13 ఆహార పదార్ధాలు కడుపు కోసమూ, కడుపు ఆహార పదార్ధాల కోసమూ ఉన్నాయి. కానీ దేవుడు రెంటినీ నాశనం చేస్తాడు. శరీరం ఉన్నది లైంగిక దుర్నీతి కోసం కాదు, ప్రభువు కోసమే. ప్రభువే శరీర పోషణ సమకూరుస్తాడు. 14 దేవుడు ప్రభువును సజీవంగా లేపాడు. మనలను కూడా తన శక్తితో లేపుతాడు.

15 మీ శరీరాలు క్రీస్తుకు అవయవాలుగా ఉన్నాయని మీకు తెలియదా? నేను క్రీస్తు అవయవాలను తీసుకుపోయి వేశ్యకు అవయవాలుగా చేయవచ్చా? అలా జరగకూడదు. 16 వేశ్యతో కలిసేవాడు దానితో ఏక శరీరం అవుతాడని మీకు తెలియదా? “వారిద్దరూ ఒకే శరీరం అవుతారు” అని లేఖనాలు చెబుతున్నాయి కదా? 17 అదే విధంగా, ప్రభువుతో కలిసినవాడు ఆయనతో ఒకే ఆత్మగా ఉన్నాడు. 18 లైంగిక దుర్నీతికి దూరంగా పారిపొండి. ఇతర పాపాలన్నీ శరీరానికి బయటే జరుగుతాయి గానీ లైంగిక దుర్నీతి జరిగించేవాడు తన సొంత శరీరానికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నాడు.

19 మీ శరీరం మీలో నివసించే పరిశుద్ధాత్మకు ఆలయమనీ, ఆయనను అనుగ్రహించింది దేవుడే అనీ మీకు తెలియదా? మీరు మీ సొంతం కాదు. 20 దేవుడే మిమ్మల్ని ఖరీదు పెట్టి కొన్నాడు. కాబట్టి మీ శరీరంతో ఆయనను మహిమ పరచండి.

వివాహితులకు, అవివాహితులకు నియమాలు

పౌలు కొరింతీయుల ప్రశ్నలకు జవాబివ్వడం కొనసాగిస్తాడు. వారి వేర్వేరు స్వభావాలకు, హింసాకాలంలో సంఘం ఉన్న ప్రస్తుత స్థితికి అనుగుణంగా వివాహితులకు, అవివాహితులకు ప్రవర్తనా నియమాలను ఇస్తాడు.

కొరింతీయులకు రాసిన మొదటి పత్రిక 7:1–17

1 ఇప్పుడు మీరు నాకు రాసిన వాటి సంగతి. పురుషుడు తన భార్యను ముట్టుకోకుండా ఉండవలసిన సమయాలు కొన్ని ఉన్నాయి. 2 అయితే లైంగిక దుర్నీతి క్రియలు జరుగుతున్న కారణం చేత ప్రతి పురుషుడికీ తనకంటూ భార్య ఉండాలి, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండాలి.

3 భర్త తన భార్య పట్లా, భార్య తన భర్త పట్లా వారి వివాహ ధర్మం నెరవేరుస్తూ ఉండాలి. 4 భార్య శరీరం మీద ఆమె భర్తకే గానీ ఆమెకు అధికారం లేదు. అలాగే భర్త శరీరం మీద అతని భార్యకే గానీ అతనికి అధికారం లేదు. 5 ప్రార్థన చేయడానికి వీలు కలిగేలా కొంత కాలం పాటు ఇద్దరి అంగీకారం ఉంటేనే తప్ప వారి మధ్య లైంగిక ఎడబాటు ఉండకూడదు. మీరు ఆత్మ నిగ్రహం కోల్పోయినప్పుడు సాతాను మిమ్మల్ని ప్రేరేపించకుండేలా తిరిగి ఏకం కండి. 6 ఇది నా సలహా మాత్రమే, ఆజ్ఞ కాదు.

7 ఏది ఏమైనా, మనుషులందరూ నాలాగా ఉండాలని కోరుకుంటున్నాను. కానీ ప్రతి ఒక్కడికీ దేవుడు ఒక ప్రత్యేకమైన వరం ఇచ్చాడు. ఒకడికి ఒక వరం, ఇంకొకడికి ఇంకొక వరం ఇచ్చాడు.

8 నాలాగా ఉండడం వారికి మంచిదని అవివాహితులతో, వితంతువులతో చెబుతున్నాను. 9 అయితే కోరికలను నిగ్రహించుకోలేకపోతే పెండ్లి చేసుకోవచ్చు. విరహాగ్నితో వేగి పోవడం కంటే పెండ్లి చేసుకోవడం మంచిది.

10 ఇక పెళ్ళయిన వారికి నేను కాక, ప్రభువే ఇచ్చే ఆజ్ఞ ఏమంటే, భార్య భర్తకు వేరు కాకూడదు. 11 ఒకవేళ వేరైతే మళ్ళీ పెళ్ళి చేసుకోకూడదు. లేదా తన భర్తతో సమాధానపడాలి. అలాగే భర్త తన భార్యను విడిచిపెట్టకూడదు.

12 మిగిలిన వారితో ప్రభువు కాక, నేనే చెప్పేదేమంటే, ఒక సోదరునికి అవిశ్వాసి అయిన భార్య ఉండి ఆమె అతనితో కాపురం చేయడానికి ఇష్టపడితే, అతడు ఆమెను విడిచిపెట్టకూడదు. 13 అలాగే, ఏ స్త్రీకైనా అవిశ్వాసి అయిన భర్త ఉండి, అతడు ఆమెతో కాపురం చేయడానికి తన సమ్మతి తెలిపితే, ఆమె అతణ్ణి విడిచిపెట్టకూడదు. 14 అవిశ్వాసి అయిన భర్త విశ్వాసి అయిన తన భార్యను బట్టి పవిత్రత పొందుతాడు. అవిశ్వాసి అయిన భార్య విశ్వాసి అయిన తన భర్తను బట్టి పవిత్రత పొందుతుంది. లేకపోతే మీ పిల్లలు అపవిత్రులుగా ఉంటారు. కాని ఇప్పుడు వారు పవిత్రులే.

15 అయితే అవిశ్వాసి అయిన భాగస్వామి విడిచి వెళ్ళిపోతానంటే పోనివ్వండి. అప్పుడు సోదరుడైనా సోదరి ఐనా తన పెళ్ళినాటి ప్రమాణాలకు కట్టుబడనవసరం లేదు. శాంతిగా జీవించడానికే దేవుడు మనలను పిలిచాడు. 16 మహిళా, నీ భర్తను రక్షణలోకి నడిపిస్తావో లేదో నీకేమి తెలుసు? పురుషుడా, నీ భార్యను రక్షణలోకి నడిపిస్తావో లేదో నీకేమి తెలుసు?

17 అయితే ప్రభువు ప్రతివాడికీ ఏ స్థితి నియమించాడో, ఏ స్థితిలో పిలిచాడో, ఆ స్థితిలోనే నడుచుకోవాలి. ఇదే నియమం సంఘాలన్నిటిలో ఏర్పాటు చేస్తున్నాను.