క్రైస్తవం జీవిత సంబంధాలను మార్చదు
క్రైస్తవం జీవితంలోని సాధారణ సంబంధాలను, సహజ బాధ్యతలను మార్చదని పౌలు బోధిస్తాడు.
క్రీ.శ. 57
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
కొరింతీయులకు రాసిన మొదటి పత్రిక 7:18–24
18 ఎవరినైనా దేవుడు విశ్వాసంలోకి పిలిచినప్పుడు అతడు సున్నతి పొంది ఉన్నాడా? అతడు ఆ సున్నతి గుర్తులు పోగొట్టుకోనక్కర లేదు. ఒకవేళ సున్నతి పొందనివాడు విశ్వాసంలోకి వచ్చాడా? అతడు సున్నతి పొందనక్కర లేదు. 19 దేవుని ఆజ్ఞలను పాటించడమే ముఖ్యం గానీ సున్నతి పొందడంలో గానీ, పొందక పోవటంలో గానీ ఏమీ లేదు,
20 ఎవరు ఏ స్థితిలో ఉండగా పిలుపు పొందారో ఆ స్థితిలోనే ఉండాలి. 21 దేవుడు నిన్ను పిలిచినప్పుడు నీవు బానిసగా ఉన్నావా? దాని గురించి చింతించవద్దు. అయితే నీకు స్వేచ్ఛ పొందడానికి శక్తి ఉంటే స్వేచ్ఛ పొందడమే మంచిది. 22 ప్రభువు పిలిచిన బానిస ప్రభువు వలన స్వతంత్రుడు. అదే విధంగా స్వతంత్రుడుగా ఉండి పిలుపు పొందిన వాడు క్రీస్తుకు బానిస. 23 ప్రభువు మిమ్మల్ని వెల చెల్లించి కొన్నాడు కాబట్టి మనుషులకు దాసులు కావద్దు. 24 సోదరులారా, మనలో ప్రతి ఒక్కరినీ ఏ స్థితిలో ఉండగా పిలిచాడో ఆ స్థితిలోనే దేవునితో నిలిచి ఉందాం.
కన్యలు, విధవరాండ్రు వివాహం చేసుకోకుండా ఉండాలని సలహా
హింసాకాలాల్లో కన్యలు, విధవరాండ్రు వివాహం చేసుకోకుండా ఉండాలని పౌలు సలహా ఇస్తాడు. ప్రస్తుత జీవిత చింతలు, సుఖాల గురించి వారి ఆందోళన తగ్గించడానికి, జీవితం ఎంత స్వల్పమైనదో, ఎంత అల్ప ప్రాముఖ్యమైనదో వారికి గుర్తుచేస్తాడు.
కొరింతీయులకు రాసిన మొదటి పత్రిక 7:25–40
25 పెళ్లి కానివారి విషయంలో ప్రభువు నుండి నాకు ఆదేశమేదీ లేదు గానీ ప్రభువు కృప చేత నమ్మదగిన వాడుగా ఉన్న నేను నా భావం చెబుతున్నాను. 26 కాబట్టి ఇప్పుడున్న కష్ట పరిస్థితిని బట్టి పురుషుడు తానున్న స్థితిలోనే ఉండడం మేలని నా ఉద్దేశం. 27 వివాహ వ్యవస్థలో భార్యకు కట్టుబడి ఉన్నావా? వేరు కావాలనుకోవద్దు. భార్య లేకుండా స్వేచ్ఛగా, లేక అవివాహితుడుగా ఉన్నావా? భార్య కావాలని కోరవద్దు. 28 ఒకవేళ నీవు పెళ్ళి చేసుకున్నా పాపమేమీ చేసినట్టు కాదు. అవివాహిత పెళ్ళి చేసుకున్నా ఆమె పాపమేమీ చేసినట్టు కాదు. అయితే అలాటి వారికి దైనందిన కష్టాలు కలుగుతాయి. అవి మీకు కలగకుండా ఉండాలని నా కోరిక.
29 సోదరులారా, నేను చెప్పేదేమంటే, సమయం కొద్దిగానే ఉంది కాబట్టి ఇక ముందు భార్యలు గలవారు భార్యలు లేనట్టుగా ఉండాలి. 30 ఏడ్చేవారు ఏడవనట్టు, సంతోషించేవారు సంతోషించనట్టు ఉండాలి. కొనేవారు తాము కొన్నది తమది కానట్టు ఉండాలి. 31 ఈ లోక వ్యవహారాలు సాగించేవారు లోకంతో తమకేమీ సంబంధం లేనట్టు ఉండాలి. ఎందుకంటే ఈ లోక వ్యవస్థ గతించిపోతూ ఉంది.
32 మీరు చింతలు లేకుండా ఉండాలని నా కోరిక. పెళ్ళి కానివాడు ప్రభువును ఏ విధంగా సంతోషపెట్టాలా అని ఆయన విషయాల్లో శ్రద్ధ కలిగి ఉంటాడు. 33 పెళ్ళయిన వాడు తన భార్యను ఏ విధంగా సంతోషపెట్టాలా అని ఈ లోకవిషయాల గురించి శ్రద్ధ కలిగి ఉంటాడు. 34 అందువల్ల అతని మనస్సు రెండు రకాలుగా పని చేస్తూ ఉంటుంది. అదే విధంగా పెళ్ళయిన స్త్రీకీ, పెళ్ళికాని స్త్రీకీ తేడా ఉంది. కన్య శరీరంలో ఆత్మలో పవిత్రత కలిగి ఉండాలని ప్రభువు కార్యాలను గూర్చి శ్రద్ధ కలిగి ఉంటుంది. పెళ్ళైన స్త్రీ అయితే తన భర్తను ఏ విధంగా సంతోషపెట్టాలా అని ఈ లోక సంబంధమైన విషయాలపై శ్రద్ధ కలిగి ఉంటుంది. 35 మీకు ఆటంకంగా ఉండాలని కాదు, మీ మంచి కోసమే చెబుతున్నాను. మీరు మంచి నడవడితో, ఇతర ధ్యాసలేమీ లేకుండా ప్రభువుపై దృష్టి ఉంచి ఆయన సేవ చేయాలని నా ఆశ.
36 ఒకడు తనతో పెళ్ళి నిశ్చయమైన కన్యను పెళ్ళి చేసుకోకుండా ఉండటం అక్రమమని భావిస్తే, లేక ఆమెకు వయస్సు పెరిగిపోవటం వల్ల పెళ్ళి చేసుకోవటం అవసరమని భావిస్తే, అతడు తన ఇష్ట ప్రకారం చేయవచ్చు. అతడు ఆమెను పెళ్ళి చేసుకోవచ్చు. అది పాపం కాదు. 37 అయితే ఎవరైనా పెళ్ళి చేసుకోనని హృదయంలో నిశ్చయించుకుని, దానికి తగిన మనోబలం ఉండి, తన కోరికలను అదుపులో ఉంచుకునే శక్తి గలవాడయితే అతడు చేసేది మంచి పని. 38 కనుక తనతో పెళ్ళి నిశ్చయమైన కన్యను పెళ్ళి చేసుకొన్నవాడు మంచి పని చేస్తున్నాడు. కాని పెళ్ళి చేసుకోనివాడు ఇంకా మంచి పని చేస్తున్నాడు.
39 భార్య తన భర్త బతికి ఉన్నంత వరకూ అతనికి కట్టుబడి ఉండాలి. భర్త మరణిస్తే తనకు ఇష్టమైన వ్యక్తిని పెళ్ళి చేసుకోడానికి ఆమెకు స్వేచ్ఛ ఉంటుంది. అయితే ఆమె విశ్వాసిని మాత్రమే చేసుకోవాలి. 40 అయితే ఆమె ఉన్న రీతిగా ఉండిపోతే మరింత శ్రేష్ఠమని నా అభిప్రాయం. ఈ విషయంలో దేవుని ఆత్మ నాతో ఉన్నాడని నా నమ్మకం.
విగ్రహాలకు అర్పించిన ఆహారం, బలహీనులు
విశ్వాసంలోకి వచ్చినవారికి జవాబిస్తూ, విగ్రహాలకు అర్పించిన వాటిని తినడం దానికదే మంచీ చెడూ కానప్పటికీ, ఆ అలవాటును మానుకోవాలని పౌలు బోధిస్తాడు. ఎందుకంటే వారి మాదిరి బలహీనులైన సహోదరులను తమ విగ్రహం నిజంగానే ఒక దేవుడని నమ్మేలా ప్రోత్సహించి, పాపంలోకి నడిపించవచ్చు.
కొరింతీయులకు రాసిన మొదటి పత్రిక 8
1 ఇప్పుడిక గ్రహాలకు బలి అర్పించిన వాటి విషయం: మనమంతా తెలివైన వారమే అని మనకి తెలుసు. తెలివి మిడిసిపడేలా చేస్తుంది గాని ప్రేమ క్షేమాభివృద్ధిని కలిగిస్తుంది. 2 ఎవరైనా తనకు ఏదైనా తెలుసు అని భావిస్తే, అతడు గ్రహించ వలసిందేమంటే తాను తెలుసుకోవలసినంత ఇంకా తెలుసుకోలేదు అని. 3 ఎవరైనా దేవుణ్ణి ప్రేమిస్తూ ఉంటే దేవునికి అతడు తెలుసన్నమాట.
4 అందుచేత విగ్రహాలకు అర్పించిన వాటిని తినే విషయానికి వస్తే, ఈ లోకంలో విగ్రహం అనేది వట్టిది అని మనకు తెలుసు. ఒకే ఒక దేవుడు తప్ప వేరొక దేవుడు లేడని మనకు తెలుసు. 5 దేవుళ్ళు, ప్రభువులు అని అందరూ పిలిచే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆకాశంలో, భూమి మీదా దేవుళ్ళనే వారు ఎంతమంది ఉన్నప్పటికీ, 6 మనకైతే ఒకే దేవుడున్నాడు. ఆయన తండ్రి అయిన దేవుడు. ఆయన నుండి సమస్తమూ కలిగింది. ఆయన కోసమే మనమున్నాం. అలాగే మనకు ప్రభువు ఒక్కడే ఉన్నాడు. ఆయన యేసు క్రీస్తు. ఆయన ద్వారా అన్నీ కలిగాయి. మనం కూడా ఆయన ద్వారానే ఉనికి కలిగి ఉన్నాం.
7 అయితే ఈ తెలివి అందరికీ లేదు. కొందరు ఇంతకు ముందు విగ్రహాలను ఆరాధించే వారు కాబట్టి తాము తినే పదార్ధాలు విగ్రహార్పితాలని భావించి తింటారు. వారి మనస్సాక్షి బలహీనం కావడం వలన అది వారికి అపరాధం అవుతుంది. 8 భోజనం విషయంలో మనకు దేవుని నుండి ఏమీ మెప్పు కలగదు. మనం దేనినైనా తినకపోవడం వలన మనం తక్కువ వారం కాదు, తినడం వలన ఎక్కువ వారం కాదు.
9 అయితే మీకున్న ఈ స్వేచ్ఛ విశ్వాసంలో బలహీనులైన వారికి అభ్యంతర కారణం కాకుండా చూసుకోండి. 10 ఎలా అంటే, సత్యం గురించిన అవగాహన కలిగిన నీవు విగ్రహాలు నిలిపి ఉన్న స్థలంలో తింటూ ఉండగా బలహీనమైన మనస్సాక్షి గలవాడు చూస్తే, అతడు విగ్రహాలకు అర్పించిన పదార్ధాలను తినడానికి ధైర్యం తెచ్చుకుంటాడు కదా? 11 తద్వారా ఎవరి కోసం క్రీస్తు చనిపోయాడో విశ్వాసంలో బలహీనుడైన ఆ నీ సోదరుడు లేక సోదరి నీ తెలివి వలన పాడైపోతాడు.
12 ఈ విధంగా మీరు మీ సోదరులకు వ్యతిరేకంగా పాపం చేయడం ద్వారా, విశ్వాసంలో బలహీనమైన వారి మనస్సాక్షిని నొప్పించడం ద్వారా, మీరు క్రీస్తుకు వ్యతిరేకంగా పాపం చేస్తున్నారు. 13 కాబట్టి నా భోజనం నా సోదరుడు విశ్వాసంలో జారిపోవడానికి కారణమైతే, నా సోదరునికి అభ్యంతరం కలిగించకుండేలా ఇక నేనెన్నడూ మాంసం తినను.