అపొస్తలునిగా తన హక్కులను పౌలు సమర్థించుకోవడం
వారు అన్యమతాన్ని విడిచి విశ్వాసంలోకి రావడాన్ని, తాను వారికి ఇచ్చిన ఆత్మీయ వరాలను ఆధారంగా చూపుతూ పౌలు ఇక్కడ తన అపొస్తలత్వాన్ని సమర్థించుకుంటాడు. తన అభిప్రాయాలకు, ప్రవర్తనకు పూర్తిగా విరుద్ధమైన అభిప్రాయాలు, ప్రవర్తన కలిగిన తన శత్రువులు అపొస్తలునిగా తన వ్యక్తిత్వంపై లేవనెత్తిన అభ్యంతరాలకు జవాబిస్తాడు. తాను కొరింతీయుల నుండి పోషణ పొందడానికి నిరాకరించినప్పటికీ, ఇతర అపొస్తలులవలె తనకూ, తన సహోదరికీ లేదా భార్యకూ పోషణ కోరే పూర్తి హక్కు తనకు ఉందని నొక్కిచెబుతాడు. మానవుల సాధారణ ఆచారాన్ని, మోషే ధర్మశాస్త్రాన్ని, క్రీస్తు స్పష్టమైన ఆజ్ఞను ఆధారంగా చూపుతూ పోషణ పొందే తన హక్కును సమర్థించుకుంటాడు.
క్రీ.శ. 57
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
కొరింతీయులకు రాసిన మొదటి పత్రిక 9:1–14
1 నాకు స్వేచ్ఛ లేదా? నేను అపొస్తలుణ్ణి కాదా? మన ప్రభు యేసును నేను చూడలేదా? మీరు ప్రభువులో నా పనితనానికి ఫలితం కారా? 2 నేను ఇతరులకి అపొస్తలుణ్ణి కాకపోయినా కనీసం మీకైనా అపొస్తలుడినే కదా. ప్రభువులో నా అపొస్తలత్వానికి మీరే రుజువు. 3 నాపై నిందారోపణ చేసే వారికి నేనిచ్చే జవాబు ఇదే. 4 తినటానికీ తాగటానికీ మాకు అధికారం లేదా? 5 మిగతా అపొస్తలులు, ప్రభువు సోదరులు, కేఫా, వీరందరిలాగా విశ్వాసురాలైన భార్యను తీసుకుని తిరగడానికి మాకు అధికారం లేదా? 6 బర్నబా, నేను మాత్రమే పని చేస్తూ ఉండాలా?
7 ఎవరైనా సైనికుడు తన ఖర్చులు తానే భరిస్తూ సైన్యంలో పని చేస్తాడా? ద్రాక్షతోట వేసి దాని పండ్లు తినని వాడెవడు? పశువుల మందను పోషిస్తూ వాటి పాలు తాగని వాడెవడు? 8 ఈ మాటలు నేను మానవ అధికారంతో చెబుతున్నానా? ధర్మశాస్త్రం కూడా ఇదే చెబుతున్నది కదా? 9 “ధాన్యపు కళ్ళం తొక్కే ఎద్దు మూతికి చిక్కం పెట్టవద్దు” అని మోషే ధర్మశాస్త్రంలో రాసి ఉంది. దేవుడు కేవలం ఎడ్ల గురించేనా ఇక్కడ రాస్తున్నది? 10 నిజానికి ఆయన కచ్చితంగా మన కోసం దీన్ని చెప్పడం లేదా? అవును, ఈ మాట మన కోసమే రాసి ఉంది. ఎందుకంటే, దున్నేవాడు ఆశతో దున్నాలి. కళ్ళం తొక్కించేవాడు పంటలో భాగం పొందుతాను అనే ఆశతో ఆ పని చేయాలి. 11 మీ కోసం మేము ఆధ్యాత్మిక విషయాలు విత్తనాలుగా చల్లాము. దానికి ప్రతిఫలంగా మీ నుండి శరీర సంబంధమైన పంట కోసుకోవడం గొప్ప విషయమేమీ కాదు.
12 వేరే వారికి మీ మీద ఈ అధికారం ఉందంటే మాకు మరి ఎక్కువ అధికారం ఉంటుంది కదా? అయితే మేము ఈ అధికారాన్ని ఉపయోగించుకోలేదు. క్రీస్తు సువార్తకు ఏ విధమైన ఆటంకమూ కలిగించకుండా ఉండడం కోసం అన్నిటినీ సహిస్తున్నాం. 13 దేవాలయంలో పని చేసేవారు తమ జీవనోపాధిని ఆలయం నుండే పొందుతారు. బలిపీఠం దగ్గర కనిపెట్టుకుని ఉండేవారు ఆ బలిపీఠం మీద అర్పించిన వస్తువుల్లో పాలిభాగస్తులు అని మీకు తెలియదా?
14 అదే విధంగా సువార్త ప్రకటించేవారు సువార్త ద్వారానే తమ జీవనోపాధిని పొందాలని ప్రభువు నియమించాడు.
పోషణ పొందే తన హక్కును పౌలు వదులుకోవడం
కొరింతులోని క్రైస్తవ సంఘం ద్వారా పోషణ పొందే తన హక్కును కోరకపోవడానికి పౌలు కారణాలను వివరిస్తాడు: వారికి భారంగా ఉండడం వల్ల సువార్తకు తక్కువ ఫలితం కలుగుతుందేమోనని అతడు భయపడ్డాడు. తన పరిచర్యలో రాణించాలనే గొప్ప కోరికను ప్రకటిస్తాడు. తాను చేయకుండా ఉండలేని కర్తవ్యమైన బోధనతో సంతృప్తి చెంది, అన్నిరకాల ప్రజలను క్రీస్తువైపు గెలుచుకోవడానికి వారి బలహీనతలకు, పూర్వాభిప్రాయాలకు తాను ఎలా దిగివస్తున్నాడో చూపిస్తాడు. 24వ వచనం నుండి, కేవలం క్షయమయ్యే కిరీటాన్ని గెలుచుకోవాలని ఆశించే వారి స్వదేశీయుల ఆచారాన్ని చూపిస్తూ, తాను కష్టాలకు, అనవసర ప్రయాసలకు గురికావడం సరైనదేనని పౌలు చూపిస్తాడు. క్షయంకాని కిరీటం లభిస్తుందనే నిశ్చయమైన నిరీక్షణతో ప్రోత్సాహం పొంది, తన మాదిరిని అనుసరించమని విశ్వాసంలోకి వచ్చిన వారందరినీ ఆహ్వానిస్తాడు. నిరంతర స్వీయ నిరాకరణతో, ఆత్మనిగ్రహంతో జీవించాలని వారిని ప్రోత్సహిస్తాడు.
కొరింతీయులకు రాసిన మొదటి పత్రిక 9:15–27
15 అయితే వీటిలో దేనినీ నా హక్కుగా నేను వినియోగించుకోలేదు. మీరు నా విషయంలో ఈ విధంగా చేయాలని చెప్పడానికి నేను ఈ సంగతులు రాయడం లేదు. ఈ విషయంలో నా అతిశయాన్ని ఎవరైనా తక్కువగా చూస్తే, అంతకంటే నాకు మరణమే మేలు. 16 నేను సువార్త ప్రకటించడంలో గర్వించడానికి నాకు కారణం ఏమీ లేదు. ఎందుకంటే అది నాకు తప్పనిసరి బాధ్యత. అయ్యో, నేను సువార్త ప్రకటించకపోతే నాకు యాతన.
17 దాన్ని నేను ఇష్టపూర్వకంగా చేస్తే నాకు బహుమానం దొరుకుతుంది. ఒకవేళ నాకు ఇష్టం లేకపోయినా ప్రభువు ఆ బాధ్యతను నాకు అప్పగించాడు. 18 అలాటప్పుడు నాకు బహుమానం ఏమిటి? నేను సువార్త ప్రకటిస్తున్నప్పుడు దానిలో నాకున్న హక్కులను పూర్తిగా వాడుకోకుండా సువార్తను ఉచితంగా ప్రకటించడమే నా బహుమానం.
19 నేను స్వేచ్ఛాజీవిని, ఎవరికీ బానిసను కాను. అయితే నేను ఎక్కువమందిని సంపాదించుకోడానికి అందరికీ నన్ను నేనే సేవకునిగా చేసుకున్నాను. 20 యూదులను సంపాదించడానికి యూదునిలాగా ఉన్నాను. ధర్మశాస్త్రాన్ని పాటించే వారిని సంపాదించడానికి నాకై నేను దాని కింద లేకపోయినా, ధర్మశాస్త్రానికి లోబడినట్టుగా ఉన్నాను. 21 దేవుని విషయంలో ధర్మశాస్త్రం లేని వాణ్ణి కాదు, క్రీస్తుకు చెందిన ధర్మశాస్త్రం నాకుంది. అయినా, ధర్మశాస్త్రం లేని వారిని సంపాదించడానికి వారి విషయంలో ధర్మశాస్త్రం లేనట్టుగానే ఉన్నాను. 22 బలహీనులను సంపాదించుకోడానికి వారికి బలహీనుడినయ్యాను. ఏ విధంగా నైనా కొందరిని రక్షించాలని అందరికీ అన్నివిధాలుగా ఉన్నాను. 23 సువార్త కోసం నేను ఏమైనా చేస్తాను. తద్వారా దాని ఫలంలో పాలివాణ్ణి కావాలని నా వాంఛ.
24 పరుగు పందెంలో పాల్గొనే వారంతా పరిగెత్తుతారు గాని బహుమానం మాత్రం ఒక్కడికే లభిస్తుంది అని మీకు తెలుసు కదా! కాబట్టి అదేవిధంగా మీరు బహుమానం పొందాలని పరుగెత్తండి. 25 అంతే కాక పందెంలో పరిగెత్తే ప్రతి ఒక్కడూ అన్ని విషయాల్లో ఆత్మనిగ్రహం కలిగి ఉంటాడు. వారు త్వరగా ఎండిపోయి వాడి పోయే ఆకుల కిరీటం కోసం పరిగెత్తితే, మనం అక్షయమైన కిరీటం కోసం ఆత్మ నిగ్రహంతో పరిగెత్తుతాము.
26 కాబట్టి నేను గమ్యం లేని వాడిలా పరుగెత్తను. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడడం లేదు. 27 ఇతరులకు ప్రకటించిన తరువాత ఒక వేళ నేనే అర్హత కొల్పోతానేమోనని నా శరీరాన్ని నలగగొట్టి, దాన్ని నాకు లోబరచుకొంటున్నాను.
ఇశ్రాయేలీయుల ఉదాహరణ కొరింతీయులకు హెచ్చరిక
పూర్వకాలపు ఇశ్రాయేలీయుల ప్రవర్తనను ఆధారంగా చేసుకొని పౌలు కొరింతీయులకు ఒక విషయాన్ని నమ్మించాలనుకుంటాడు: దేవుని అనుగ్రహం పొందిన ప్రజలు తమ అక్రమాలకు, విగ్రహారాధనకు అంత తీవ్రంగా శిక్షించబడినట్లే, సువార్త కింద ఉన్న క్రైస్తవులు కూడా అవే పాపాల్లో, సుఖాల్లో మునిగితే, ధర్మశాస్త్రం కింద ఉన్న ఇశ్రాయేలీయులవలె తప్పక శిక్షించబడతారు. ఈ ఉదాహరణల ద్వారా అవే అపరాధాలను చేయకుండా ఉండాలని వారిని హెచ్చరిస్తాడు. క్రైస్తవ సంఘ సభ్యులమని తమపై తాము అతిగా నమ్మకం పెట్టుకోకుండా, తాము కూడా పాపంలో పడిపోకుండా జాగ్రత్తపడాలని హెచ్చరిస్తాడు.
కొరింతీయులకు రాసిన మొదటి పత్రిక 10:1–12
1 సొదరీ సోదరులారా, మన పితరులు మేఘం కిందుగా ప్రయాణాలు చేశారు. వారంతా సముద్రంలో గుండా నడిచి వెళ్ళారు. 2 అందరూ మోషేను వెంబడించి అతనిని బట్టి మేఘంలో, సముద్రంలో, బాప్తిసం పొందారు. 3 వారంతా ఆధ్యాత్మికమైన ఒకే ఆహారం తిన్నారు. 4 ఆధ్యాత్మికమైన ఒకే పానీయాన్ని తాగారు. ఎలాగంటే వారు తమ వెంటే వచ్చిన ఆత్మసంబంధమైన బండలో నుండి ప్రవహించిన నీటిని తాగారు. ఆ బండ క్రీస్తే. 5 అయితే వారిలో అత్యధికులు తమ జీవితాల్లో దేవుణ్ణి సంతోషపెట్టలేదు. కాబట్టి వారి శవాలు అరణ్యంలోనే రాలిపోయేలా వారంతా చనిపోయారు.
6 వారు చేసినట్టుగా మనం కూడా చెడ్డ సంగతులను ఆశించకుండా ఉండాలని ఈ సంగతులు ఉదాహరణలుగా మన కోసం రాసి ఉన్నాయి. 7 “ప్రజలు తినడానికీ తాగడానికీ కూర్చున్నారు, కామసంబంధమైన నాట్యాలకు లేచారు” అని రాసి ఉన్నట్టు వారిలాగా మీరు విగ్రహారాధకులు కావద్దు. 8 వారిలాగా లైంగిక దుర్నీతిలో మునిగిపోవద్దు. వారిలో కొందరు వ్యభిచారం జరిగించి ఒక్క రోజునే ఇరవై మూడు వేలమంది చనిపోయారు. 9 వారిలో చాలామంది ప్రభువును వ్యతిరేకించి పాము కాటుకు లోనై చనిపోయినట్టు మనమూ చేసి ప్రభువును పరీక్షించవద్దు. 10 అలాగే మీరు సణుక్కోవద్దు. వారిలో చాలామంది దేవునిపై సణిగి సంహార దూత చేతిలో నాశనమయ్యారు.
11 నాశనమయ్యారు మనకు ఉదాహరణలుగా ఉండడానికే. వాటిని చూసి ఈ చివరి రోజుల్లో మనం బుద్ధి తెచ్చుకోడానికి అవి రాసి ఉన్నాయి. 12 కాబట్టి ఎవరైతే తాను సరిగా నిలబడి ఉన్నానని భావిస్తాడో, అతడు పడిపోకుండా ఉండడానికి జాగ్రత్త తీసుకోవాలి.
కొరింతీయులు విగ్రహారాధనకు దూరంగా ఉండాలి
ఇతరులకు ఎదురయ్యే శోధనలనే ఎదుర్కొంటున్న కొరింతీయులు విగ్రహారాధనకు, విగ్రహాలకు అర్పించిన వాటిని తినడానికి దూరంగా ఉండాలని ప్రోత్సహించబడుతున్నారు. మనం ఆచరించే ప్రభు భోజనాన్ని, ఆచార సంబంధమైన ధర్మశాస్త్రాన్ని ఆధారంగా చూపుతూ, అలాంటి క్రియ దయ్యాలకు బాహ్యమైన ఆరాధన అని పౌలు నిరూపిస్తాడు; ఆ దయ్యాలకు అర్పించిన బలులను వారు విందుగా తిని, వాటితో తమను కలుపుకుంటున్నారు. నిజమైన దేవుని ఆరాధన, విగ్రహారాధన కలిసి ఉండలేవు; అలా చేయడం క్రీస్తును అవమానిస్తుంది.
కొరింతీయులకు రాసిన మొదటి పత్రిక 10:13–22
13 ఇప్పటి వరకూ మీరు ఎదుర్కొన్న పరీక్షలు సాధారణంగా మనుషులందరికీ కలిగేవే. దేవుడు నమ్మదగినవాడు. సహించడానికి మీకున్న సామర్ధ్యం కంటే మించిన పరీక్షలు మీకు రానివ్వడు. అంతేకాదు, సహించడానికి వీలుగా ఆ కష్టంతో బాటు దానినుండి తప్పించుకునే మార్గం కూడా మీకు ఏర్పాటు చేస్తాడు.
14 కాబట్టి నా ప్రియులారా, విగ్రహారాధనకు దూరంగా పారిపొండి. 15 తెలివైన వారితో మాట్లాడినట్టు మీతో మాట్లాడుతున్నాను. నేను చెప్పిన విషయాలను మీకై మీరే ఆలోచించి నిర్ణయించుకోండి.
16 మనం స్తుతులు చెల్లించే పాత్రలో నుండి తాగడం క్రీస్తు రక్తంలో భాగం పంచుకోవడమే. మనం రొట్టె విరిచి తినడం క్రీస్తు శరీరంలో భాగం పంచుకోవడమే. 17 మనమంతా ఒకే రొట్టెలో భాగం పంచుకొంటున్నాం. రొట్టె ఒక్కటే కాబట్టి దాన్ని తీసుకొనే మనం అనేకులమైనప్పటికీ ఒక్కటే శరీరం అయ్యాం.
18 ఇశ్రాయేలీయులను చూడండి. బలిపీఠం మీద అర్పించిన వాటిని తినేవారు బలిపీఠంలో పాలిభాగస్తులే కదా? 19 ఈ విషయంలో అభిప్రాయం ఇది. విగ్రహాల్లో గాని, వాటికి అర్పించిన వాటిలో గానీ ఏమైనా ఉన్నదని నేను చెప్పడం లేదు. 20 యూదేతరులు అర్పించే బలులు దేవునికి కాక దయ్యాలకే అర్పిస్తున్నారు. మీరు దయ్యాలతో పాలి భాగస్తులు కావడం నాకిష్టం లేదు. 21 మీరు ప్రభువు పాత్రలోనిదీ, దయ్యాల పాత్రలోనిదీ ఒకేసారి తాగలేరు. ప్రభువు బల్లమీదా, దయ్యాల బల్ల మీదా, ఈ రెంటి మీదా ఉన్నవాటిలో ఒకేసారి భాగం పొందలేరు. 22 ప్రభువుకు రోషం కలిగిస్తామా? మనం ఆయనకంటే బలవంతులమా?