మోషే న్యాయ ధర్మశాస్త్రాన్ని మళ్లీ చెప్పడం (continued)
క్రీ.పూ. 1451
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
1 “చితికిన వృషణాలు ఉన్నవాళ్ళు, లేదా పురుషాంగం కోసిన వాళ్ళు యెహోవా సమాజంలో చేరకూడదు. వ్యభిచారం వలన పుట్టినవాడు యెహోవా సమాజంలో చేరకూడదు. 2 అతని పదవ తరం వరకూ ఎవరూ యెహోవా సమాజంలో చేరకూడదు.
3 అమ్మోనీయులు, మోయాబీయులు యెహోవా సమాజంలో చేరకూడదు. వారి పదవ తరం వరకూ ఎవరూ యెహోవా సమాజంలో చేరకూడదు. 4 ఎందుకంటే మీరు ఐగుప్తు నుంచి వస్తున్నప్పుడు ప్రయాణ మార్గంలో వాళ్ళు భోజనాలు తీసుకువచ్చి మిమ్మల్ని కలుసుకోలేదు. ఆరాము నహారాయీములో ఉన్న పెతోరు నుంచి మిమ్మల్ని శపించడానికి మీకు విరోధంగా బెయోరు కొడుకు బిలాముకు బహుమతులు ఇచ్చి పిలిపించారు.
5 అయితే మీ దేవుడైన యెహోవా బిలాము మాట అంగీకరించలేదు. మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ప్రేమించాడు కనుక మీకోసం ఆ శాపాలను ఆశీర్వాదాలుగా మార్చాడు. 6 మీరు జీవించే కాలమంతా వారి క్షేమం గురించి గానీ, వాళ్లకు శాంతి సమకూరాలని గానీ ఎన్నటికీ పట్టించుకోవద్దు.
7 ఎదోమీయులు మీ సోదరులు కనుక వాళ్ళను ద్వేషించవద్దు.
ఐగుప్తు దేశంలో మీరు పరదేశీయులుగా ఉన్నారు, కనుక ఐగుప్తీయులను ద్వేషించవద్దు. 8 వారి సంతానంలో మూడవ తరం వారు యెహోవా సమాజంలో చేరవచ్చు.
9 మీ సేన శత్రువులతో యుద్ధానికి బయలుదేరేటప్పుడు ప్రతి చెడ్డపనికీ దూరంగా ఉండాలి. 10 రాత్రి జరిగినదాని వలన మైలపడినవాడు మీలో ఉంటే వాడు శిబిరం వెలుపలికి వెళ్లిపోవాలి. 11 అతడు శిబిరంలో చేరకూడదు. సాయంత్రం అతడు నీళ్లతో స్నానం చేసి పొద్దుపోయిన తరువాత శిబిరంలో చేరవచ్చు.
12 శిబిరం బయట మల విసర్జనకు మీకు ఒక చోటుండాలి. 13 మీ ఆయుధాలు కాకుండా ఒక పార మీ దగ్గరుండాలి. నువ్వు మల విసర్జనకు వెళ్ళేటప్పుడు దానితో తవ్వి వెనక్కి తిరిగి నీ మలాన్ని కప్పేయాలి. 14 మీ యెహోవా దేవుడు మిమ్మల్ని విడిపించడానికి, మీ శత్రువులను మీకు అప్పగించడానికి మీ శిబిరంలో తిరుగుతూ ఉంటాడు. కాబట్టి మీ శిబిరాన్ని పవిత్రంగా ఉంచాలి. లేకపోతే ఆయన మీలో ఏదైనా అసహ్యమైన దాన్ని చూసి మిమ్మల్ని వదిలేస్తాడేమో.
15 తన యజమాని దగ్గర నుంచి తప్పించుకుని మీ దగ్గరికి వచ్చిన సేవకుణ్ణి వాడి యజమానికి అప్పగించకూడదు. 16 అతడు తన ఇష్టప్రకారం మీ గ్రామాల్లోని ఒకదాన్లో తాను ఏర్పరచుకున్న చోట మీతో కలిసి మీ మధ్య నివసించాలి. మీరు అతణ్ణి అణచివేయకూడదు.
17 ఇశ్రాయేలు కుమార్తెల్లో ఎవరూ వేశ్యలుగా ఉండకూడదు. ఇశ్రాయేలు కుమారుల్లో ఎవరూ పురుష సంపర్కులుగా ఉండకూడదు. 18 పురుష సంపర్కం వల్ల గానీ పడుపు సొమ్ము వల్ల గానీ వచ్చే ధనాన్ని మొక్కుబడిగా మీ దేవుడైన యెహోవా ఇంటికి తీసుకురాకూడదు. ఎందుకంటే ఆ రెండూ మీ దేవుడైన యెహోవాకు అసహ్యం.
19 మీరు వెండిని గానీ, ఆహారపదార్ధాలు గానీ వడ్డీకి ఇచ్చే మరి దేనినైనా తోటి ఇశ్రాయేలు ప్రజలకు వడ్డీకి ఇవ్వకూడదు. 20 పరదేశులకు వడ్డీకి అప్పు ఇవ్వవచ్చు. మీ దేవుడైన యెహోవా మీరు స్వాధీనం చేసుకోబోయే దేశంలో మీ ప్రయత్నాలన్నిటిలో మిమ్మల్ని ఆశీర్వదించేలా నీ తోటి ఇశ్రాయేలు ప్రజలకు దేనినీ వడ్డీకి ఇవ్వకూడదు.
21 మీరు మీ దేవుడైన యెహోవాకు మొక్కుకున్న తరువాత ఆ మొక్కుబడిని చెల్లించే విషయంలో ఆలస్యం చేయకూడదు. మీ దేవుడైన యెహోవా అది చెల్లించడం జరగాలని చూస్తాడు. అలా చేయకపోతే అది మీకు పాపంగా పరిణమిస్తుంది. 22 ఎలాంటి మొక్కులు మొక్కుకోకుండా ఉండడం పాపం అనిపించుకోదు. 23 మీ నోటి వెంబడి వచ్చే మాట నెరవేర్చుకోవాలి. మీ దేవుడైన యెహోవాకు స్వేచ్ఛగా మొక్కుకుంటే మీరు మీ నోటితో పలికినట్టుగా అర్పించాలి.
24 మీరు మీ పొరుగువాడి ద్రాక్షతోటకు వెళ్ళేటప్పుడు మీ కిష్టమైనన్ని ద్రాక్షపండ్లు తినవచ్చు గానీ మీ సంచిలో వేసుకోకూడదు. 25 మీ పొరుగువాడి పంట చేలోకి వెళ్ళేటప్పుడు మీ చేతితో వెన్నులు తుంచుకోవచ్చు గానీ మీ పొరుగువాడి పంటచేలో కొడవలి వెయ్యకూడదు.”
24:1 “ఎవరైనా ఒక స్త్రీని పెళ్ళి చేసుకుని, ఆ తరువాత ఆమె ఇంతకు ముందే పరాయి పురుషునితో లైంగికంగా సంబంధం కలిగి ఉన్నట్టు అనుమానం కలిగితే ఆమెపై అతనికి ఇష్టం తొలగిపోతే అతడు ఆమెకు విడాకులు రాయించి ఆమె చేతికిచ్చి తన ఇంట్లోనుంచి ఆమెను పంపేయాలి. 2 ఆమె అతని దగ్గర నుండి వెళ్లిపోయిన తరువాత వేరొక పురుషుణ్ణి పెళ్లి చేసుకోవచ్చు.
3 ఆ రెండోవాడు కూడా ఆమెను ఇష్టపడకుండా ఆమెకు విడాకులు రాయించి ఆమె చేతికిచ్చి తన ఇంటి నుంచి ఆమెను పంపి వేసినా, లేదా ఆమెను పెళ్ళిచేసుకున్న ఆ వ్యక్తి చనిపోయినా, 4 ఆమెను తిరస్కరించిన ఆమె మొదటి భర్త ఆమెను తిరిగి పెళ్లి చేసుకోకూడదు. ఎందుకంటే ఆమె అపవిత్రురాలు. అది యెహోవాకు అసహ్యం. కాబట్టి మీ యెహోవా దేవుడు మీకు వారసత్వంగా ఇవ్వబోయే దేశానికి పాపం తెచ్చిపెట్టకూడదు.
5 కొత్తగా పెళ్ళిచేసుకున్న వాళ్ళు సైన్యంలో చేరకూడదు. వాళ్లకు ఎలాంటి బాధ్యతలు అప్పగించకూడదు. ఒక సంవత్సరం పాటు అతడు కులాసాగా తన ఇంట్లో ఉంటూ పెళ్లి చేసుకున్న భార్యను సంతోషపెట్టాలి.
6 తిరగలిని, తిరగటి పైరాతిని తాకట్టు పెట్టకూడదు. అలా చేస్తే ఒకడి జీవనాధారాన్ని తాకట్టు పెట్టినట్టే.
7 ఒకడు ఇశ్రాయేలు ప్రజల్లోని తన సోదరుల్లో ఎవరినైనా బలాత్కారంగా ఎత్తుకుపోయి అతణ్ణి తన బానిసగా చేసుకున్నా, లేదా అమ్మివేసినా అతణ్ణి చంపివేయాలి. అలా చేస్తే ఆ చెడుతనాన్ని మీ మధ్యనుంచి రూపుమాపిన వారవుతారు.
8 కుష్టురోగం విషయంలో యాజకులైన లేవీయులు మీకు బోధించే దాన్నంతా చేసే విషయంలో జాగ్రత్త వహించండి. ఈ విషయంలో నేను వారికి ఆజ్ఞాపించినదంతా జాగ్రత్తగా జరిగించండి. 9 మీరు ఐగుప్తు నుంచి వస్తున్నప్పుడు దారిలో మీ దేవుడైన యెహోవా మిర్యాముకు చేసిన దాన్ని గుర్తుంచుకోండి.
10 మీ పొరుగువాడికి ఏదైనా అప్పు ఇచ్చినప్పుడు అతని దగ్గర తాకట్టు వస్తువు తీసుకొనేందుకు అతని ఇంటి లోపలికి వెళ్లకూడదు. 11 ఇంటి బయటే నిలబడాలి. అప్పు తీసుకునేవాడు బయట నిలబడి ఉన్న నీ దగ్గరికి ఆ తాకట్టు వస్తువు తీసుకు వస్తాడు. 12 అతడు పేదవాడైన పక్షంలో నువ్వు అతని తాకట్టు వస్తువు నీదగ్గరే ఉంచుకుని నిద్రపోకూడదు. అతడు తన దుప్పటి కప్పుకుని నిద్రబోయేముందు నిన్ను దీవించేలా సూర్యాస్తమయంలోగా తప్పకుండా ఆ తాకట్టు వస్తువును అతనికి తిరిగి అప్పగించాలి. 13 అది మీ యెహోవా దేవుని దృష్టిలో మీకు నీతి అవుతుంది.
14 మీ సోదరుల్లో గానీ మీ దేశంలోని గ్రామాల్లో ఉన్న విదేశీయుల్లోగానీ దరిద్రులైన కూలివారిని బాధించకూడదు. ఏ రోజు కూలి ఆ రోజే ఇవ్వాలి. 15 సూర్యుడు అస్తమించేలోగా అతనికి కూలి చెల్లించాలి. అతడు పేదవాడు కాబట్టి అతనికి వచ్చే సొమ్ము మీద ఆశ పెట్టుకుంటాడు. వాడు నిన్ను బట్టి యెహోవాకు మొర్ర పెడతాడేమో. అది నీకు పాపమవుతుంది.
16 కొడుకుల పాపాన్నిబట్టి తండ్రులకు మరణశిక్ష విధించకూడదు, తండ్రుల పాపాన్ని బట్టి కొడుకులకు మరణశిక్ష విధించకూడదు. ఎవరి పాపానికి వారే మరణశిక్ష పొందాలి. 17 పరదేశులకు గానీ తండ్రి లేనివారికి గానీ అన్యాయంగా తీర్పు తీర్చకూడదు. విధవరాలి దుస్తులు తాకట్టుగా తీసుకోకూడదు. 18 మీరు ఐగుప్తులో బానిసలుగా ఉండగా మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని అక్కడనుంచి విమోచించాడని గుర్తుచేసుకోవాలి. అందుకే ఈ పనులు చెయ్యాలని మీకు ఆజ్ఞాపిస్తున్నాను.
19 మీ పొలంలో మీ పంట కోస్తున్నప్పుడు పొలంలో ఒక పన మర్చిపోతే దాన్ని తెచ్చుకోడానికి మీరు తిరిగి వెనక్కి వెళ్ళకూడదు. మీ దేవుడైన యెహోవా మీరు చేసే పనులన్నిటిలో మిమ్మల్ని ఆశీర్వదించేలా అది పరదేశులకు, తండ్రి లేనివారికీ, విధవరాళ్లకూ మిగల్చాలి. 20 మీ ఒలీవ పండ్లను ఏరుకునేటప్పుడు మీ వెనక ఉన్న పరిగెను ఏరుకోకూడదు. అవి పరదేశులకు, తండ్రి లేనివారికీ, విధవరాళ్లకూ మిగల్చాలి. 21 మీ ద్రాక్షపండ్లను కోసుకొనేటప్పుడు మీ వెనకపడిపోయిన గుత్తిని ఏరుకోకూడదు. అది పరదేశులకు, తండ్రి లేనివారికీ, విధవరాళ్లకూ మిగల్చాలి. 22 మీరు ఐగుప్తు దేశంలో బానిసగా ఉన్నారని గుర్తుచేసుకోండి. అందుకే ఈ పని చెయ్యాలని మీకు ఆజ్ఞాపిస్తున్నాను.”