మోషే న్యాయ ధర్మశాస్త్రాన్ని మళ్లీ చెప్పడం (continued)

క్రీ.పూ. 1451

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

ద్వితీయోపదేశ కాండము 21–22

1 “మీ యెహోవా దేవుడు మీకిస్తున్న దేశంలోని పొలంలో ఒకడు చచ్చి పడి ఉండడం మీరు చూస్తే, వాణ్ణి చంపిన వాడెవడో తెలియనప్పుడు 2 మీ పెద్దలూ, న్యాయాధిపతులూ వచ్చి, చనిపోయిన వ్యక్తి చుట్టూ ఉన్న గ్రామాల దూరం కొలిపించాలి. 3 ఆ శవానికి ఏ ఊరు దగ్గరగా ఉందో ఆ ఊరి పెద్దలు ఏ పనికీ ఉపయోగించని, మెడపై కాడి పెట్టని పెయ్యను తీసుకోవాలి. 4 దున్నని, సేద్యం చేయని ఏటి లోయ లోకి ఆ పెయ్యను తోలుకుపోయి అక్కడ, అంటే ఆ లోయలో ఆ పెయ్య మెడ విరగదీయాలి.

5 తరువాత యాజకులైన లేవీయులు దగ్గరికి రావాలి. యెహోవాను సేవించి యెహోవా పేరుతో దీవించడానికి ఆయన వారిని ఏర్పరచుకున్నాడు. కనుక వారి నోటి మాటతో ప్రతి వివాదాన్ని, దెబ్బ విషయమైన ప్రతి వ్యాజ్యాన్ని పరిష్కరించాలి. 6 అప్పుడు ఆ శవానికి దగ్గరగా ఉన్న ఆ ఊరి పెద్దలంతా ఆ ఏటి లోయలో మెడ విరగదీసిన ఆ పెయ్య మీద తమ చేతులు కడుక్కుని 7 మా చేతులు ఈ రక్తాన్ని చిందించలేదు, మా కళ్ళు దీన్ని చూడలేదు. 8 యెహోవా, నువ్వు విమోచించిన నీ జనమైన ఇశ్రాయేలు ప్రజలను క్షమించు. నీ ప్రజలు ఇశ్రాయేలు ప్రజల మీద నిర్దోషి ప్రాణం తీసిన దోషాన్ని మోపవద్దు అని చెప్పాలి. అప్పుడు ప్రాణం తీసిన దోషానికి వారికి క్షమాపణ కలుగుతుంది.

9 ఆ విధంగా మీరు యెహోవా దృష్టికి యథార్థమైనది చేసేటప్పుడు మీ మధ్యనుంచి నిర్దోషి ప్రాణం కోసమైన దోషాన్ని తీసివేస్తారు.

10 మీరు మీ శత్రువులతో యుద్ధం చేయబోయేటప్పుడు మీ యెహోవా దేవుడు మీ చేతికి వారిని అప్పగించిన తరువాత 11 వారిని చెరపట్టి ఆ బందీల్లో ఒక అందమైన అమ్మాయిని చూసి ఆమెను మోహించి, ఆమెను పెళ్లి చేసుకోడానికి ఇష్టపడి, 12 నీ ఇంట్లోకి ఆమెను చేర్చుకున్న తరువాత ఆమె తల క్షౌరం చేయించుకుని గోళ్ళు తీయించుకోవాలి. 13 ఆమె తన ఖైదీ బట్టలు తీసేసి మీ ఇంట్లో ఉండే నెలరోజులు తన తల్లిదండ్రులను గురించి ప్రలాపించడానికి ఆమెను అనుమతించాలి. తరువాత నువ్వు ఆమెను పెళ్లిచేసుకోవచ్చు. ఆమె నీకు భార్య అవుతుంది. 14 నువ్వు ఆమె వలన సుఖం పొందలేకపోతే ఆమెకు ఇష్టమున్న చోటికి ఆమెను పంపివేయాలే గాని ఆమెను వెండికి ఎంతమాత్రమూ అమ్మివేయకూడదు. మీరు ఆమెను అవమాన పరిచారు కాబట్టి ఆమెను బానిసగా చూడకూడదు.

15 ఒక వ్యక్తికి ఇద్దరు భార్యలున్నప్పుడు అతడు ఒకరిని ఇష్టపడి, మరొకరిని ఇష్టపడకపోవచ్చు. ఇద్దరికీ పిల్లలు పుడితే, 16 పెద్ద కొడుకు ఇష్టం లేని భార్యకు పుట్టిన వాడైతే తండ్రి తనకున్న ఆస్తిని తన కొడుకులకు వారసత్వంగా ఇచ్చే రోజున ఇష్టం లేని భార్యకు పుట్టిన పెద్ద కొడుక్కి బదులు ఇష్టమైన భార్యకు పుట్టినవాణ్ణి పెద్ద కొడుకుగా పరిగణించకూడదు. 17 ఇష్టం లేని భార్యకు పుట్టిన వాడికి తండ్రి తన ఆస్తి అంతట్లో రెట్టింపు భాగమిచ్చి అతణ్ణి పెద్ద కొడుకుగా ఎంచాలి. ఇతడు అతని బలారంభం కాబట్టి జ్యేష్ఠత్వ అధికారం అతనిదే.

18 ఒక వ్యక్తి కొడుకు మొండివాడై తిరగబడి తండ్రి మాట, తల్లి మాట వినక, వారు అతణ్ణి శిక్షించిన తరువాత కూడా అతడు వారికి విధేయుడు కాకపోతే 19 అతని తలిదండ్రులు అతని పట్టుకుని ఊరి గుమ్మం దగ్గర కూర్చునే పెద్దల దగ్గరికి అతణ్ణి తీసుకురావాలి. 20 మా కొడుకు మొండివాడై తిరగబడ్డాడు. మా మాట వినక తిండిబోతూ తాగుబోతూ అయ్యాడు, అని ఊరి పెద్దలతో చెప్పాలి. 21 అప్పుడు ఊరి ప్రజలంతా రాళ్లతో అతన్ని చావగొట్టాలి. ఆ విధంగా చెడుతనాన్ని మీ మధ్యనుంచి తొలగించిన వాడివౌతావు. ఇశ్రాయేలు ప్రజలందరూ ఈ సంగతి విని భయపడతారు.

22 మరణశిక్ష పొందేటంత పాపం ఎవరైనా చేస్తే అతణ్ణి చంపి మాను మీద వేలాడదీయాలి. 23 అతని శవం రాత్రి వేళ ఆ మాను మీద ఉండనియ్యకూడదు. వేలాడదీసినవాడు దేవుని దృష్టిలో శాపగ్రస్తుడు కనుక మీ దేవుడైన యెహోవా వారసత్వంగా మీకిస్తున్న దేశం అపవిత్రం కాకుండా ఉండేలా అదే రోజు ఆ శవాన్ని తప్పకుండా పాతిపెట్టాలి.”

22:1 మీ సాటి పౌరుడి ఎద్దు, లేదా గొర్రె దారి తప్పిపోయి తిరగడం మీరు చూస్తే దాన్ని చూడనట్టు కళ్ళు మూసుకోకుండా తప్పకుండా దాని యజమాని దగ్గరికి మళ్లించాలి. 2 మీ సహోదరుడు మీకు అందుబాటులో లేకపోయినా, అతడు మీకు తెలియకపోయినా దాన్ని మీ ఇంటికి తోలుకుపోవాలి. అతడు దాన్ని వెతికే వరకూ అది మీ దగ్గర ఉండాలి. అప్పుడు అతనికి దాన్ని తిరిగి అప్పగించాలి. 3 అతని గాడిద, దుస్తుల విషయంలో కూడా మీరు అలాగే చెయ్యాలి. మీ తోటి ప్రజలు పోగొట్టుకున్నది ఏదైనా మీకు దొరకితే దాన్ని గురించి అలాగే చెయ్యాలి. మీరు దాన్ని చూసీ చూడనట్టు ఉండకూడదు. 4 మీ సాటి మనిషి గాడిద, ఎద్దు దారిలో పడి ఉండడం మీరు చూస్తే వాటిని చూడనట్టు కళ్ళు మూసుకోకూడదు. వాటిని లేపడానికి తప్పకుండా సాయం చెయ్యాలి.

5 ఏ స్త్రీ పురుష వేషం వేసుకోకూడదు. పురుషుడు స్త్రీ వేషం ధరించకూడదు. అలా చేసేవారంతా మీ దేవుడైన యెహోవాకు అసహ్యులు.

6 చెట్టు మీదగానీ, నేల మీదగానీ, దారిలోగానీ పక్షిగుడ్లు గానీ పిల్లలు గానీ ఉన్న గూడు మీకు కనబడితే తల్లి ఆ పిల్లల మీద గానీ, ఆ గుడ్ల మీద గానీ పొదుగుతూ ఉన్నప్పుడు ఆ పిల్లలతో పాటు తల్లిపక్షిని తీసుకోకూడదు. 7 మీకు మేలు కలిగి దీర్ఘాయుష్మంతులయ్యేలా తప్పకుండా తల్లిని విడిచిపెట్టి పిల్లలను తీసుకోవచ్చు.

8 మీరు కొత్త ఇల్లు కట్టించుకొనేటప్పుడు ఇంటి పైకప్పు చుట్టూ పిట్టగోడ కట్టించాలి. అప్పుడు దాని మీద నుంచి ఎవరైనా పడిపోతే మీ ఇంటి మీద హత్యాదోషం ఉండదు.

9 మీ ద్రాక్షతోటలో రెండు రకాల విత్తనాలను విత్తకూడదు. అలా చేస్తే మీరు వేసిన పంట, ద్రాక్షతోట రాబడి మొత్తం, దేవాలయానికి ప్రతిష్టితమవుతుంది. 10 ఎద్దునూ గాడిదనూ జతచేసి భూమిని దున్నకూడదు. 11 ఉన్ని, జనపనారతో కలిపి నేసిన దుస్తులు ధరించకూడదు. 12 మీరు కప్పుకొనే మీ దుస్తుల నాలుగు అంచులకు అల్లికలు చేసుకోవాలి.

13 ఒకడు స్త్రీని పెళ్లి చేసుకుని ఆమెతో శారీరకంగా ఏకమైన తరువాత ఆమెను అనుమానించి 14 “ఈ స్త్రీని పెళ్ళి చేసుకుని ఈమె దగ్గరికి వస్తే ఈమెలో నాకు కన్యత్వం కనబడలేదు” అని నేరారోపణ చేసాడనుకోండి. 15 ఆ స్త్రీ తల్లిదండ్రులు పట్టణ ద్వారం దగ్గర ఉన్న ఆ ఊరి పెద్దల దగ్గరికి ఆ యువతి కన్యాత్వ నిదర్శనం చూపించాలి.

16 అప్పుడు ఆ స్త్రీ తండ్రి “నా కూతుర్ని ఇతనికిచ్చి పెళ్ళిచేస్తే ఇతడు ‘ఈమెలో కన్యాత్వం కనబడలేదని’ అవమానించి ఆమె మీద నింద మోపాడు. 17 అయితే నా కూతురు కన్య అని రుజువు పరిచే నిదర్శనం ఇదే” అని పెద్దలతో చెప్పి, పట్టణపు పెద్దల ఎదుట ఆ వస్త్రం పరచాలి. 18 అప్పుడు ఆ ఊరి పెద్దలు ఆ వ్యక్తిని పట్టుకుని శిక్షించి, 100 వెండి నాణాలు అపరాధ రుసుం అతడి దగ్గర తీసుకుని ఆ స్త్రీ తండ్రికి చెల్లించాలి.

19 ఎందుకంటే అతడు ఇశ్రాయేలు కన్యను అవమానపరిచాడు. ఇకపై ఆమె అతనికి భార్యగా ఉంటుంది. అతడు తాను జీవించే కాలమంతా ఆమెను విడిచి పెట్టకూడదు. 20 అయితే ఆ వ్యక్తి ఆరోపించిన నింద నిజమైనప్పుడు, అంటే ఆ కన్యలో కన్యాత్వం కనబడని పక్షంలో 21 పెద్దలు ఆమె తండ్రి ఇంటికి ఆమెను తీసుకురావాలి. అప్పుడు ఆమె ఊరి ప్రజలు ఆమెను రాళ్లతో కొట్టి చావగొట్టాలి. ఎందుకంటే ఆమె తన పుట్టింట్లో వ్యభిచరించి ఇశ్రాయేలులో చెడ్డ పని చేసింది. ఆ విధంగా ఆ దుర్మార్గాన్ని మీ మధ్యనుంచి మీరు రూపుమాపుతారు.

22 ఎవడైనా మరొకడి భార్యతో శారీరకంగా కలుస్తూ పట్టుబడితే వారిద్దరినీ, అంటే ఆ స్త్రీతో శారీరకంగా కలిసిన పురుషుడినీ, స్త్రీనీ చంపాలి. ఆ విధంగా ఆ దుర్మార్గాన్ని ఇశ్రాయేలులో నుంచి రూపుమాపుతారు. 23 కన్య అయిన స్త్రీ తనకు ప్రదానం జరిగిన తరువాత ఒకడు ఊరిలో ఆమెను కలుసుకుని ఆమెతో శారీరకంగా కలిస్తే 24 ఆ ఊరి ద్వారం దగ్గరికి వారిద్దరినీ తీసుకువచ్చి, ఆ స్త్రీ ఊరిలోని ప్రజలను పిలవనందుకు ఆమెనూ, తన పొరుగువాడి భార్యను అవమాన పరచినందుకు ఆ వ్యక్తినీ రాళ్లతో చావగొట్టాలి. ఆ విధంగా ఆ దుర్మార్గాన్ని మీలోనుంచి రూపుమాపాలి. 25 ప్రదానం జరిగిన కన్యను పొలంలో ఒకడు కలుసుకున్నప్పుడు అతడు ఆమెను బలవంతం చేసి, ఆమెతో శారీరకంగా కలిస్తే, ఆమెతో శారీరకంగా కలిసిన వాడు మాత్రమే చావాలి. 26 ఆ కన్యను ఏమీ చేయకూడదు, ఎందుకంటే ఆ కన్య మరణానికి గురి అయ్యేంత పాపం చేయలేదు. ఒకడు తన పొరుగు వాడి మీద పడి చంపేసినట్టే ఇది జరిగింది. 27 అతడు ఆమెను పొలంలో కలుసుకుంటే ప్రదానం జరిగిన ఆ కన్య కేకలు వేసినప్పుడు ఆమెను కాపాడడానికి ఎవరూ లేరు.

28 ఒకడు ప్రదానం జరగని కన్యను పట్టుకుని ఆమెతో శారీరకంగా కలిసిన విషయం తెలిసినప్పుడు 29 ఆమెతో శారీరకంగా కలిసినవాడు ఆ కన్య తండ్రికి 50 వెండి నాణాలు చెల్లించి ఆమెను పెళ్లి చేసుకోవాలి. అతడు ఆమెను ఆవమానపరచాడు కాబట్టి అతడు జీవించినంత కాలం ఆమెను విడిచి పెట్టకూడదు. 30 ఎవ్వరూ తన తండ్రి భార్యతో అక్రమ సంబంధం పెట్టుకోకూడదు. తన తండ్రికి అప్రతిష్ట కలిగించకూడదు.