మోషే న్యాయ ధర్మశాస్త్రాన్ని మళ్లీ చెప్పడం (continued)

క్రీ.పూ. 1451

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

ద్వితీయోపదేశ కాండము 19–20

1 “మీ యెహోవా దేవుడు ఎవరి దేశాన్ని మీకిస్తున్నాడో ఆ ప్రజలను యెహోవా దేవుడు నాశనం చేసిన తరువాత మీరు వారి దేశాన్ని స్వాధీనం చేసుకుని, వారి పట్టణాల్లో వారి ఇళ్ళల్లో నివసించాలి. 2 మీరు స్వాధీనం చేసుకొనేలా యెహోవా దేవుడు మీకిస్తున్న దేశంలో మూడు పట్టణాలను వేరు పరచాలి. 3 మీరు స్వాధీనం చేసుకొనేలా యెహోవా దేవుడు మీకిస్తున్న దేశపు సరిహద్దుల్లో హంతకుడు పారిపోయి తల దాచుకోవడానికి మూడు పట్టణాలకు వెళ్ళే దారులను కొలిచి ఏర్పరచాలి.

4 హంతకుడు పారిపోయి బతకడానికి నియమించిన పద్ధతి ఏమిటంటే, ఒకడు అంతకు ముందు తన పక్కనున్న వాడి మీద పగ ఏమీ లేకుండా 5 పొరపాటున వాణ్ణి చంపితే, అంటే ఒకడు చెట్లు నరకడానికి వేరొక వ్యక్తితో అడవికి వెళ్ళి చెట్లు నరకడానికి తన చేతితో గొడ్డలి దెబ్బ వేసినప్పుడు, గొడ్డలి పిడి ఊడి ఆ వ్యక్తికి తగిలి, వాడు చనిపోతే ఆ హంతకుడు ప్రాణం నిలుపుకునేందుకు వీటిలో ఎదో ఒక పట్టణానికి పారిపోవాలి.

6 చనిపోయిన వాడి బంధువు కోపంతో హంతకుణ్ణి తరిమి, దారి చాలా దూరం గనక వాణ్ణి పట్టుకుని చంపకుండేలా వాడు ఇలా చెయ్యాలి. అతనికి ఆ వ్యక్తిపై గతంలో ఎలాంటి పగ లేదు కనుక అతడు మరణశిక్షకు పాత్రుడు కాక పోయినా ఇలా జరగవచ్చు. 7 అందుచేత మూడు పట్టణాలను మీ కోసం ఏర్పరచుకోవాలని నేను మీకు ఆజ్ఞాపిస్తున్నాను.

8 యెహోవా దేవుడు మీ పూర్వీకులతో ప్రమాణం చేసినట్టు ఆయన మీ సరిహద్దులను విశాలపరచి, మీ పూర్వీకులకు ఇస్తానని చెప్పిన దేశాన్నంతా మీకిచ్చినప్పుడు మీరు యెహోవా దేవుణ్ణి గౌరవించాలి. 9 ఈ రోజు నేను మీకు ఆజ్ఞాపించినట్టు ఎప్పుడూ ఆయన మార్గాల్లో నడవడానికి ఈ ఆజ్ఞలన్నీ పాటిస్తూ ఈ మూడు పట్టణాలు కాక మరో మూడు పట్టణాలను ఏర్పాటు చేసుకోవాలి. 10 ఎవరినైనా హత్య చేశామన్న నేరారోపణ మీ మీదికి రాకుండా ఉండేందుకు యెహోవా దేవుడు మీకు వారసత్వంగా ఇస్తున్న మీ దేశంలో నిర్దోషిని హత్య చేయకూడదు.

11 ఒకడు తన పొరుగువాడి మీద పగ పట్టి, అతని కోసం కాపు కాసి అతని మీద పడి వాడు చనిపోయేలా కొట్టి 12 ఆ పట్టణాల్లో ఒక దానిలోకి పారిపోతే, ఆ ఊరిపెద్దలు మనుషులను పంపి అక్కడనుంచి వాణ్ణి రప్పించాలి. హత్య విషయం ప్రతీకారం చేసేవాడి చేతికి అతన్ని అప్పగించి చంపించాలి. 13 అతడిపై కనికరం చూపించకూడదు. మీకు మేలు కలిగేలా ఇశ్రాయేలు ప్రజల మధ్యనుంచి నిర్దోషి ప్రాణం విషయంలో దోషాన్ని పరిహరించాలి.

14 మీరు స్వాధీనం చేసుకొనేలా యెహోవా దేవుడు మీకిస్తున్న దేశంలో మీకు వచ్చే మీ వారసత్వంలో పూర్వీకులు నియమించిన మీ పొరుగువాడి సరిహద్దు రాయిని తొలగించ కూడదు.

15 ఒకడు జరిగించే పాపం, అపరాధం విషయంలో దాన్ని నిర్ధారించడానికి కేవలం ఒక్క వ్యక్తి సాక్ష్యాన్ని పరిగణలోకి తీసుకోకూడదు. ఇద్దరు లేదా ముగ్గురు వ్యక్తుల సాక్ష్యం మీద ప్రతి దానినీ నిర్థారణ చేయాలి. 16 ఒక వ్యక్తిపై అబద్ద నేరం మోపి, అన్యాయ సాక్ష్యం చెబుతున్నట్టు అనిపిస్తే 17 ఆ వివాదం ఏర్పడిన ఇద్దరూ యెహోవా ఎదుట, అంటే అప్పుడు విధుల్లో ఉన్న యాజకుల ఎదుట, న్యాయాధిపతుల ఎదుట నిలబడాలి.

18 ఆ న్యాయాధిపతులు బాగా పరీక్షించిన తరువాత వాడి సాక్ష్యం అబద్ధసాక్ష్యమై తన సోదరుని మీద వాడు అబద్ధసాక్ష్యం చెప్పిన సంగతి వెల్లడైతే వాడు తన సోదరునికి చేయాలని కోరినది వాడి పట్ల జరిగించాలి. 19 ఆ విధంగా మీ మధ్యనుంచి చెడుతనాన్ని తొలగిస్తారు. 20 ఇది తెలుసుకున్న మిగిలినవారు భయం వల్ల మీ దేశంలో అలాంటి దుర్మార్గపు పనులు జరిగించరు. 21 దుష్ట కార్యాలు జరిగించే ఎవరిపైనా కనికరం చూపకూడదు. అలాంటివారి విషయంలో ప్రాణానికి ప్రాణం, కంటికి కన్ను, పంటికి పన్ను, చేతికి చెయ్యి, కాలికి కాలు నియమం పాటించాలి.”

20:1 “మీరు యుద్ధానికి వెళ్లినప్పుడు శత్రువు వద్ద గుర్రాలు, రథాలు, సైనికులు మీ దగ్గర కంటే ఎక్కువగా ఉన్నప్పటికీ వారికి భయపడవద్దు. ఐగుప్తు దేశంలోనుంచి మిమ్మల్ని రప్పించిన మీ యెహోవా దేవుడు మీకు తోడుగా ఉంటాడు. 2 మీరు యుద్ధానికి సిద్దమైనప్పుడు యాజకుడు ప్రజల దగ్గరకి వచ్చి వారితో ఇలా చెప్పాలి.

3 ‘ఇశ్రాయేలూ, విను. ఇవ్వాళ మీరు మీ శత్రువులతో యుద్ధం చేయడానికి వెళ్తున్నారు. మీ హృదయాల్లో కుంగిపోవద్దు. భయపడవద్దు. 4 అధైర్యపడవద్దు. వాళ్ళ ముఖాలు చూసి బెదరొద్దు. మీ కోసం మీ శత్రువులతో యుద్ధం చేసి మిమ్మల్ని రక్షించేవాడు మీ యెహోవా దేవుడే.’

5 సేనాధిపతులు ప్రజలతో ఇలా చెప్పాలి. ‘మీలో ఎవరైనా కొత్త ఇల్లు కట్టుకుని దాన్ని ప్రతిష్ట చేయకుండా ఉన్నాడా? యుద్ధంలో అతడు చనిపోతే వేరొకడు దాన్ని ప్రతిష్ట చేస్తాడు. కనుక అలాంటివాడు ఎవరైనా ఉంటే అతడు తన ఇంటికి తిరిగి వెళ్ళొచ్చు. 6 ఎవరైనా ద్రాక్షతోట వేసి ఇంకా దాని పళ్ళు తినకుండా యుద్ధంలో చనిపోతే వేరొకడు దాని పళ్ళు తింటాడు. కాబట్టి అలాంటివాడు తన ఇంటికి తిరిగి వెళ్ళొచ్చు. 7 ఒకడు ఒక స్త్రీని ప్రదానం చేసుకుని ఆమెను ఇంకా పెళ్లి చేసుకోకముందే యుద్ధంలో చనిపోతే వేరొకడు ఆమెను పెళ్లిచేసుకుంటాడు. కాబట్టి అలాంటివాడు తన ఇంటికి తిరిగి వెళ్ళొచ్చు.’

8 సేనాధిపతులు ప్రజలతో ఇంకా ఇలా చెప్పాలి. ‘ఎవడైనా భయపడుతూ ఆందోళనలో ఉన్నాడా? అలాంటివాడు తన ఇంటికి తిరిగి వెళ్ళొచ్చు. అతడి భయం, ఆందోళనల వల్ల అతని సోదరుల గుండెలు కూడా అధైర్యానికి లోను కావచ్చు.’ 9 సేనాధిపతులు ప్రజలతో మాట్లాడడం అయిపోయిన తరువాత ప్రజలను నడిపించడానికి నాయకులను నియమించాలి.

10 యుద్ధం చేయడానికి ఏదైనా ఒక పట్టణం సమీపించేటప్పుడు శాంతి కోసం రాయబారం పంపాలి. 11 వాళ్ళు మీ రాయబారం అంగీకరించి వారి ద్వారాలు తెరిస్తే దానిలో ఉన్న ప్రజలంతా మీకు పన్ను చెల్లించి మీకు బానిసలవుతారు. 12 మీ శాంతి రాయబారాన్ని అంగీకరించకుండా యుద్ధానికి తలపడితే దాన్ని ఆక్రమించండి.

13 మీ యెహోవా దేవుడు దాన్ని మీ చేతికి అప్పగించేటప్పుడు అందులోని పురుషులందరినీ కత్తితో హతమార్చాలి. 14 స్త్రీలనూ పిల్లలనూ పశువులనూ ఆ పట్టణంలో ఉన్న సమస్తాన్నీ కొల్లసొమ్ముగా మీరు తీసుకోవచ్చు. మీ యెహోవా దేవుడు మీకిచ్చిన మీ శత్రువుల కొల్లసొమ్మును మీరు వాడుకోవచ్చు. 15 ఈ ప్రజల పట్టణాలు కాకుండా మీకు చాలా దూరంగా ఉన్న పట్టణాలన్నిటి విషయంలో ఇలాగే చేయాలి.

16 అయితే మీ యెహోవా దేవుడు వారసత్వంగా మీకిస్తున్న ఈ ప్రజల పట్టణాల్లో ఊపిరి పీల్చే దేనినీ బతకనివ్వకూడదు. 17 మీ యెహోవా దేవుడు మీ కాజ్ఞాపించినట్టుగా హీత్తీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులు అనే వారిని పూర్తిగా నిర్మూలం చెయ్యాలి. 18 వారు తమ దేవుళ్ళకు జరిగించే అన్ని రకాల నీచమైన పనులు మీరు చేసి మీ యెహోవా దేవునికి విరోధంగా పాపం చేయకుండా ఉండేలా వారిని పూర్తిగా నిర్మూలం చెయ్యాలి.

19 మీరు ఒక పట్టాణాన్ని ఆక్రమించుకోవడానికి, దానిపై యుద్ధం చేయడానికి ముట్టడి వేసిన సమయంలో ఆ ప్రాంతంలోని చెట్లను గొడ్డలితో పాడు చేయకూడదు. వాటి పండ్లు తినవచ్చు గాని వాటిని నరికి వేయకూడదు. మీరు వాటిని ముట్టడించడానికి పొలంలోని చెట్లు మనిషి కాదు కదా! 20 తినదగిన పండ్లు ఫలించని చెట్లు మీరు గుర్తిస్తే వాటిని నాశనం చేసి నరికి వెయ్యవచ్చు. మీతో యుద్ధం చేసే పట్టణం ఓడిపోయే వరకూ వాటితో దానికి ఎదురుగా ముట్టడి దిబ్బలు కట్టవచ్చు.”