మోషే న్యాయ ధర్మశాస్త్రాన్ని మళ్లీ చెప్పడం

క్రీ.పూ. 1451

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

ద్వితీయోపదేశ కాండము 17:2–18:22

2 మీ యెహోవా దేవుని నిబంధన మీరి ఆయన దృష్టిలో దుర్మార్గం చేస్తూ నేనిచ్చిన ఆజ్ఞకు వ్యతిరేకంగా అన్యదేవుళ్ళకు, అంటే సూర్యునికి గానీ చంద్రునికి గానీ ఆకాశ నక్షత్రాల్లో దేనికైనా నమస్కరించి మొక్కే పురుషుడు, స్త్రీ ఎవరైనా మీ యెహోవా దేవుడు మీకిస్తున్న ఏ గ్రామంలోనైనా మీ మధ్య కనబడినప్పుడు, 3 ఆ విషయం మీకు తెలిసిన తరువాత మీరు విచారణ జరిగించాలి. అది నిజమైతే, అంటే అలాంటి అసహ్యమైన పని ఇశ్రాయేలీయుల్లో జరగడం నిజమైతే 4 ఆ చెడ్డ పని చేసిన పురుషుణ్ణి, స్త్రీని మీ ఊరి బయటకు తీసుకువెళ్ళి రాళ్లతో కొట్టి చంపాలి.

5 అలాంటి వాడికి మరణశిక్ష విధించాలంటే ఇద్దరు ముగ్గురు వ్యక్తుల సాక్ష్యం సరిపోతుంది. 6 కేవలం ఒక్క వ్యక్తి సాక్ష్యంపై అతణ్ణి చంపకూడదు. 7 అతన్ని చంపడానికి, మొదట సాక్షులు, తరువాత ప్రజలంతా అతని మీద చేతులు వేయాలి. ఆ విధంగా మీ మధ్య నుంచి ఆ చెడుతనాన్ని రూపుమాపాలి.

8 హత్యకూ, ప్రమాదవశాత్తూ జరిగిన మరణానికీ మధ్య, ఒకడి హక్కూ మరొకడి హక్కూ మధ్య, దెబ్బ తీయడం మరొక రకంగా నష్టపరచడం మధ్య, మీ గ్రామాల్లో భేదాలు వచ్చి, వీటి తేడా తెలుసుకోవడం మీకు కుదరకపోతే 9 మీరు లేచి మీ యెహోవా దేవుడు ఏర్పరచుకొనే స్థలానికి వెళ్లి యాజకులైన లేవీయులనూ, విధుల్లో ఉన్న న్యాయాధిపతినీ విచారించాలి. వారు దానికి తగిన తీర్పు మీకు తెలియచేస్తారు.

10 యెహోవా ఏర్పరచుకొనే చోటులో వాళ్ళు మీకు తెలియచేసే తీర్పు ప్రకారం మీరు జరిగించి వారు మీకు చెప్పే పరిష్కారం ప్రకారం మీరు చెయ్యాలి. 11 వారు మీకు బోధించే చట్టాన్ని పాటించాలి. వారు ఇచ్చిన తీర్పు ప్రకారం జరిగించాలి. వారు మీకు చెప్పే మాట నుంచి కుడికిగాని ఎడమకుగాని తిరగకూడదు.

12 ఆ ప్రదేశంలో ఎవరైనా అహంకారంతో మీ యెహోవా దేవునికి పరిచర్య చేయడానికి నిలిచే యాజకుని మాటగానీ ఆ న్యాయాధిపతి మాటగానీ వినకపోతే అతన్ని చంపివేయాలి. ఆ విధంగా దుర్మార్గాన్ని ఇశ్రాయేలు ప్రజల్లో నుంచి రూపుమాపాలి. 13 అప్పుడు ప్రజలంతా విని, భయపడి అహంకారంతో ప్రవర్తించకుండా ఉంటారు.

14 మీ యెహోవా దేవుడు మీకిస్తున్న దేశంలో మీరు ప్రవేశించి దాన్ని స్వాధీనం చేసుకుని అందులో నివసించి, మా చుట్టూ ఉన్న అందరి ప్రజల్లాగా మా మీద రాజును నియమించుకుంటాం అనుకుంటే, మీ యెహోవా దేవుడు ఎన్నుకునే వ్యక్తిని తప్పకుండా మీ మీద రాజుగా నియమించుకోవాలి. 15 మీ సోదరుల్లోనే ఒకణ్ణి మీ మీద రాజుగా నియమించుకోవాలి. మీ సోదరుడుకాని విదేశీయుణ్ణి మీపై రాజుగా నియమించుకోకూడదు.

16 అతడు గుర్రాలను చాలా ఎక్కువగా సంపాదించుకోకూడదు. గుర్రాలను ఎక్కువగా సంపాదించడానికి ప్రజలను ఐగుప్తుకు తిరిగి వెళ్లనివ్వకూడదు. ఎందుకంటే యెహోవా ఇక మీదట మీరు ఈ దారిలో వెళ్లకూడదని మీతో చెప్పాడు. 17 తన హృదయం తొలగిపోకుండా అతడు ఎక్కువమంది స్త్రీలను పెళ్లి చేసుకోకూడదు. వెండి బంగారాలను అతడు తన కోసం ఎక్కువగా సంపాదించుకోకూడదు.

18 అతడు రాజ్యసింహాసనంపై కూర్చున్న తరువాత లేవీయులైన యాజకుల స్వాధీనంలో ఉన్న గ్రంథాన్ని చూసి ఆ ధర్మశాస్త్రానికి ఒక ప్రతిని తనకోసం రాసుకోవాలి. 19 అది అతని దగ్గర ఉండాలి. అతడు జీవించి ఉన్న కాలమంతా ఆ గ్రంథం చదువుతూ ఉండాలి. 20 అలా చేస్తున్నప్పుడు దేవుడైన యెహోవా పట్ల భయంతో తన సోదరులపై గర్వించకుండా ఈ ఆజ్ఞల విషయంలో కుడికి గాని ఎడమకు గాని తొలగకుండా ఉంటాడు. అప్పుడు రాజ్యంలో అతడూ అతని కొడుకులూ ఇశ్రాయేలులో ఎక్కువ కాలం జీవిస్తారు.”

18:1 “యాజకులుగా నియమితులైన లేవీయులకు, అంటే లేవీగోత్రం వారికి ఇశ్రాయేలు ప్రజలతో భాగం గానీ, వారసత్వపు హక్కు గానీ ఉండవు. వారు యెహోవాకు దహనబలిగా అర్పించే వాటినే తింటారు. 2 వారి సోదరులతో వారికి వారసత్వం ఉండదు. యెహోవా వారితో చెప్పినట్టు ఆయనే వారి వారసత్వం.

3 ఎవరైనా ఎద్దును గానీ, గొర్రెను గానీ, మేకను గానీ బలిగా అర్పించినప్పుడు అర్పించిన వాటి కుడి జబ్బ, రెండు దవడలు, పొట్ట భాగం యాజకులకు ఇవ్వాలి. 4 ధాన్యంలో, ద్రాక్షారసంలో, నూనెలో ప్రథమ ఫలం యాజకునికి ఇవ్వాలి. గొర్రెల బొచ్చు కత్తిరింపులో మొదటి భాగం యాజకునికి ఇవ్వాలి. 5 యెహోవా పేరున నిలబడి ఎప్పుడూ సేవ చేయడానికి మీ గోత్రాలన్నిటిలో అతణ్ణి, అతని సంతానాన్నీ మీ యెహోవా దేవుడు ఎన్నుకున్నాడు.

6 ఒక లేవీయుడు ఇశ్రాయేలు దేశంలో తాను నివసిస్తున్న ఒక ఊరిలో నుంచి యెహోవా ఏర్పరచుకునే చోటుకు వచ్చేందుకు ఆసక్తి కనపరిస్తే 7 అక్కడ యెహోవా ఎదుట నిలబడే లేవీయుల్లాగే అతడు తన యెహోవా దేవుని పేరున సేవ చేయవచ్చు. 8 తన పిత్రార్జితాన్ని అమ్మగా వచ్చినది కాక, ఇతరుల్లాగే అతడు వంతు పొందాలి.

9 మీ యెహోవా దేవుడు మీకిస్తున్న దేశంలో మీరు ప్రవేశించిన తరువాత ఆ ప్రజల నీచమైన పనులను మీరు చేయడానికి నేర్చుకోకూడదు. 10 తన కొడుకుని గానీ కూతుర్ని గానీ మంటల్లోనుంచి దాటించేవాణ్ణి, శకునం చెప్పే సోదెగాణ్ణి, మేఘ శకునాలూ సర్ప శకునాలూ చెప్పేవాణ్ణి, చేతబడి చేసేవాణ్ణి, మాంత్రికుణ్ణి, ఇంద్రజాలకుణ్ణి, 11 ఆత్మలను సంప్రదించేవాణ్ణి, దయ్యాలను సంప్రదించే వాణ్ణి మీమధ్య ఉండనివ్వకూడదు. 12 వీటిని చేసే ప్రతివాడూ యెహోవాకు అసహ్యం. ఇలాంటి అసహ్యమైన వాటిని బట్టే మీ యెహోవా దేవుడు మీ ఎదుట నుంచి ఆ ప్రజలను వెళ్లగొట్టేస్తున్నాడు.

13 మీరు మీ యెహోవా దేవుని దృష్టిలో యథార్థంగా ఉండాలి. 14 మీరు స్వాధీనం చేసుకోబోయే ప్రజలు మేఘ శకునాలు చెప్పేవారి మాట, సోదె చెప్పేవారి మాట వింటారు. మీ యెహోవా దేవుడు అలా చేయడానికి మిమ్మల్ని అనుమతించలేదు.

15 మీ యెహోవా దేవుడు మీ మధ్య నా వంటి ప్రవక్తను మీ సోదరుల్లోనుంచి మీ కోసం పుట్టిస్తాడు. ఆయన మాట మీరు వినాలి.

16 హోరేబులో సమావేశమైన రోజున మీరు ‘మా యెహోవా దేవుని స్వరం మళ్ళీ మనం వినొద్దు, ఈ గొప్ప అగ్నిని ఇకనుంచి మనం చూడొద్దు. లేకపోతే మేమంతా చస్తాం’ అన్నారు. 17 అప్పుడు యెహోవా నాతో ఇలా అన్నాడు. ‘వాళ్ళు చెప్పిన మాట బాగానే ఉంది.

18 వాళ్ళ సోదరుల్లోనుంచి నీలాంటి ప్రవక్తను వారికోసం పుట్టిస్తాను. అతని నోట్లో నా మాటలు ఉంచుతాను. నేను అతనికి ఆజ్ఞాపించేదంతా అతడు వారితో చెబుతాడు. 19 అతడు నా పేరుతో చెప్పే నా మాటలను విననివాణ్ణి నేను శిక్షిస్తాను.

20 అయితే, ఏ ప్రవక్త అయినా అహంకారంతో, నేను చెప్పమని తనకాజ్ఞాపించని మాటను నా పేరున చెబితే, లేదా ఇతర దేవుళ్ళ పేరున చెబితే ఆ ప్రవక్త కూడా చావాలి.’

21 ‘ఏదైనా ఒక సందేశం యెహోవా చెప్పింది కాదని మేమెలా తెలుసుకోగలం?’ అని మీరనుకుంటే, 22 ప్రవక్త యెహోవా పేరుతో చెప్పినప్పుడు ఆ మాట జరగకపోతే, ఎన్నటికీ నెరవేరకపోతే అది యెహోవా చెప్పిన మాట కాదు. ఆ ప్రవక్త అహంకారంతోనే దాన్ని చెప్పాడు కాబట్టి దానికి భయపడవద్దు.”