మోషే న్యాయ ధర్మశాస్త్రాన్ని మళ్లీ చెప్పడం (continued)
క్రీ.పూ. 1451
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
1 “ప్రజలు తమ వివాదాల పరిష్కారానికి న్యాయస్థానానికి వస్తే న్యాయమూర్తులు వారికి తీర్పు చెప్పాలి. నీతిమంతుణ్ణి విడిపించి నేరస్తులను శిక్షించాలి. 2 ఆ దోషి శిక్షార్హుడైతే, న్యాయమూర్తి అతన్ని పడుకోబెట్టి అతని నేర తీవ్రత బట్టి దెబ్బలు లెక్కపెట్టి తన ఎదుట వాణ్ణి కొట్టించాలి. 3 నలభై దెబ్బలు కొట్టించవచ్చు. అంతకు మించకూడదు. అలా చేస్తే మీ సోదరుడు మీ దృష్టిలో నీచుడుగా కనబడతాడేమో.
4 కళ్ళం నూర్చే ఎద్దు మూతికి చిక్కం కట్టకూడదు.
5 సోదరులు కలిసి నివసిస్తూ ఉన్నప్పుడు వారిలో ఒకడు మగ సంతానం కనకుండా చనిపోతే, చనిపోయిన వాడి భార్య అన్య వంశంలోని వ్యక్తిని పెళ్ళిచేసుకోకూడదు. ఆమె భర్త సోదరుడు ఆమె దగ్గరికి వెళ్లి ఆమెను పెళ్లి చేసుకుని తన సోదరునికి బదులు ఆమె పట్ల భర్త ధర్మం జరిగించాలి. 6 చనిపోయిన సోదరుని పేరు ఇశ్రాయేలు ప్రజల్లో నుంచి రద్దు కాకుండా ఆమె కనే పెద్దకొడుకు, చనిపోయిన సోదరునికి వారసుడుగా ఉండాలి.
7 అతడు తన సోదరుని భార్యను పెళ్లి చేసుకోకపోతే వాడి సోదరుని భార్య, పట్టణ ద్వారం దగ్గరికి, అంటే పెద్దల దగ్గరికి వెళ్లి, నా భర్త సోదరుడు ఇశ్రాయేలు ప్రజల్లో తన సోదరుని పేరు స్థిరపరచడానికి నిరాకరిస్తున్నాడు. భర్త సోదరుని ధర్మం నాపట్ల జరిగించడం లేదు, అని చెప్పాలి. 8 అప్పుడు అతని ఊరి పెద్దలు అతణ్ణి పిలిపించి, అతనితో మాటలాడిన తరువాత అతడు నిలబడి ‘ఆమెను పెళ్ళిచేసుకోవడం నా కిష్టం లేదు’ అంటే, అతని సోదరుని భార్య 9 ఆ పెద్దలు చూస్తూ ఉండగా అతని దగ్గరికి వెళ్ళి అతని చెప్పు ఊడదీసి అతని ముఖం మీద ఉమ్మి, తన సోదరుని వంశం నిలబెట్టని వాడికి ఇలా జరుగుతుంది అని చెప్పాలి. 10 అప్పుడు ఇశ్రాయేలు ప్రజల్లో వాడికి ‘చెప్పు ఊడ దీసినవాడి ఇల్లు’ అని పేరు వస్తుంది.
11 ఇద్దరు పురుషులు ఒకడితో ఒకడు పోట్లాడుకుంటున్న సమయంలో ఒకడి భార్య తన భర్తను కొడుతున్నవాడి చేతి నుంచి తన భర్తను విడిపించడానికి వచ్చి, చెయ్యి చాపి అతడి మర్మాంగాలను పట్టుకుంటే ఆమె చేతిని నరికెయ్యాలి. 12 మీ కళ్ళు జాలి చూపించకూడదు.
13 వేరు వేరు తూకం రాళ్లు పెద్దదీ, చిన్నదీ రెండు రకాలు మీ సంచిలో ఉంచుకోకూడదు. 14 వేరు వేరు తూములు పెద్దదీ, చిన్నదీ మీ ఇంట్లో ఉంచుకోకూడదు. 15 మీ దేవుడైన యెహోవా మీకిస్తున్న దేశంలో మీరు శాశ్వతకాలం జీవించి ఉండేలా కచ్చితమైన న్యాయమైన తూనికరాళ్లు ఉంచుకోవాలి. కచ్చితమైన న్యాయమైన కొలత మీకు ఉండాలి. 16 ఆ విధంగా చేయని ప్రతివాడూ అంటే అన్యాయం చేసే ప్రతివాడూ మీ యెహోవా దేవునికి అసహ్యుడు.
17 మీరు ఐగుప్తు నుంచి ప్రయాణిస్తున్న మార్గంలో అమాలేకీయులు మీకు చేసిన దాన్ని గుర్తు చేసుకోండి. వాళ్ళు దేవుని భయం లేకుండా మార్గమధ్యలో మీకు ఎదురు వచ్చి, 18 మీరు బలహీనంగా, అలసిపోయి ఉన్నప్పుడు, మీ ప్రజల్లో వెనక ఉన్న బలహీనులందరినీ చంపివేశారు. 19 కాబట్టి మీరు స్వాధీనం చేసుకోడానికి మీ దేవుడైన యెహోవా వారసత్వంగా మీకిస్తున్న దేశంలో, మీ దేవుడైన యెహోవా మీ చుట్టూ ఉన్న శత్రువులందరి నుంచీ మీకు నెమ్మది ఇచ్చిన తరువాత అమాలేకీయుల పేరు ఆకాశం కింద ఉండకుండాా తుడిచిపెట్టుకు పోయేలా చేయండి. ఈ సంగతి ఎన్నడూ మర్చిపోవద్దు.”
26:1 మీ దేవుడైన యెహోవా మీకు వారసత్వంగా అనుగ్రహించే దేశానికి మీరు చేరుకుని దాన్ని స్వాధీనం చేసుకుని దానిలో నివసిస్తున్నప్పుడు 2 మీ దేవుడైన యెహోవా మీకిస్తున్న మీ భూమిలో నుంచి మీరు కూర్చుకొనే పంటలన్నిట్లో మొదట పండిన పంటలో కొంత భాగాన్ని తీసుకుని ఒక గంపలో ఉంచి, మీ దేవుడైన యెహోవా తనకు మందిరంగా ఏర్పరచుకొనే స్థలానికి తీసుకువెళ్ళాలి.
3 ఆ సమయంలో సేవ జరిగిస్తున్న యాజకుని దగ్గరికి వెళ్లి “యెహోవా మన పితరులకు ఇస్తానని ప్రమాణం చేసిన దేశానికి నేను వచ్చానన్న విషయాన్ని ఈ రోజు మీ దేవుడైన యెహోవా ముందు ఒప్పుకుంటున్నాను” అని అతనితో చెప్పాలి. 4 యాజకుడు ఆ గంపను నీ చేతిలో నుంచి తీసుకుని మీ దేవుడైన యెహోవా బలిపీఠం ఎదుట ఉంచాలి.
5 మీ దేవుడైన యెహోవా ఎదుట నువ్వు ఇలా చెప్పాలి. “నా పూర్వీకుడు సంచారం చేసే అరామీ దేశస్థుడు. అతడు కొద్దిమందితో ఐగుప్తు వెళ్లి అక్కడ పరదేశిగా ఉండిపోయాడు. అతడు అక్కడికి వెళ్లి అసంఖ్యాకంగా వృద్ధి పొంది గొప్పదైన, బలమైన జనసమూహం అయ్యాడు. 6 ఐగుప్తీయులు మనలను హింసించి, బాధించి మన మీద కఠినమైన దాస్యం మోపారు. 7 మనం మన పూర్వీకుల దేవుడైన యెహోవాకు మొరపెట్టాం. యెహోవా మన మొర విని, మన బాధ, ప్రయాస, మనకు కలిగిన హింసను చూశాడు. 8 యెహోవా తన బలిష్టమైన చేతితో, తన బలప్రదర్శనతో, తీవ్రమైన భయం కలిగించే కార్యాలతో, అద్భుతమైన సూచనలతో ఐగుప్తు నుంచి మనలను బయటకు రప్పించాడు. 9 ఈ స్థలానికి మనలను రప్పించి పాలు తేనెలు పారుతూ ఉన్న ఈ దేశాన్ని మనకిచ్చాడు.
10 కాబట్టి యెహోవా, నువ్వే నాకిచ్చిన భూమి ప్రథమ ఫలాలు నేను తెచ్చి నీ ఎదుట ఉంచాను.” ఇలా చెప్పిదాన్ని మీ దేవుడైన యెహోవా ఎదుట ఉంచి ఆయనను ఆరాధించాలి. 11 నీకూ, నీ ఇంటి వారికీ నీ దేవుడైన యెహోవా అనుగ్రహించిన మేలులన్నిటి గురించి నువ్వూ, లేవీయులూ నీ దేశంలో ఉన్న పరదేశులూ సంతోషించాలి.
12 పదవ భాగమిచ్చే మూడవ సంవత్సరం నీ రాబడిలో పదవ వంతు చెల్లించి, అది లేవీయులకూ పరదేశులకూ, తండ్రి లేనివారికీ, విధవరాళ్లకూ ఇవ్వాలి. వారు నీ ఊరిలో వాటిని తిని తృప్తి పొందిన తరువాత 13 నువ్వు మీ యెహోవా దేవుని ఎదుట నువ్వు నాకాజ్ఞాపించిన నీ ఆజ్ఞలన్నిటి ప్రకారం “నా ఇంటి నుంచి ప్రతిష్ట చేసిన వాటిని విభజించి లేవీయులకూ పరదేశులకు తండ్రి లేనివారికీ విధవరాళ్లకూ ఇచ్చాను. నీ ఆజ్ఞల్లో దేనినీ నేను మీరలేదు, దేనినీ మరచిపోలేదు. 14 నా దుఃఖ సమయంలో దానిలో కొంచెమైనా నేను తినలేదు, అపవిత్రంగా ఉన్న సమయంలో దానిలో నుండి దేనినీ తీసివేయలేదు. చనిపోయిన వారి కోసం దానిలో నుండి ఏదీ ఇవ్వలేదు. నా దేవుడైన యెహోవా మాట విని, నువ్వు నా కాజ్ఞాపించినట్టు అంతా జరిగించాను. 15 నువ్వు నివసించే నీ పరిశుద్ధ స్థలం, పరలోకం నుంచి చూసి, నీ ప్రజలైన ఇశ్రాయేలును దీవించు. పాలు తేనెలు ప్రవహించే దేశం అని నువ్వు మా పితరులతో ప్రమాణం చేసి, మాకిచ్చిన దేశాన్ని దీవించు” అని చెప్పాలి.
16 ఈ కట్టుబాట్లకు, ఆజ్ఞలకూ లోబడి ఉండాలని మీ దేవుడైన యెహోవా ఈనాడు మీకు ఆజ్ఞాపిస్తున్నాడు. కాబట్టి మీరు మీ హృదయ పూర్వకంగా మీ పూర్ణ మనసుతో వాటిని అనుసరించి నడుచుకోవాలి. 17 యెహోవాయే మీకు దేవుడుగా ఉన్నాడనీ మీరు ఆయన మార్గాల్లో నడిచి, ఆయన చట్టాలనూ, ఆజ్ఞలనూ, విధులనూ అనుసరిస్తూ ఆయన మాట వింటామనీ ఈనాడు ఆయనకు మాట ఇచ్చారు. 18 యెహోవా మీతో చెప్పినట్టు మీరే ఆయనకు సొంత ప్రజలుగా ఉంటూ ఆయన ఆజ్ఞలన్నిటినీ గైకొంటారని 19 ఆయన సృజించిన అన్ని జాతుల ప్రజలందరి కంటే మీకు కీర్తి, ఘనత, పేరు కలిగేలా మిమ్మల్ని హెచ్చిస్తానని యెహోవా ఈనాడు ప్రకటించాడు. ఆయన చెప్పినట్టుగా మీరు మీ యెహోవా దేవునికి పవిత్ర ప్రజగా ఉంటారనీ ప్రకటించాడు.