ధర్మశాస్త్రాన్ని తెలుసుకోవడం యూదుణ్ణి నీతిమంతునిగా తీర్చజాలదు

మతానికి సంబంధించిన జ్ఞానం మాత్రమే యూదుణ్ణి నీతిమంతునిగా తీర్చలేదని పౌలు చూపిస్తున్నాడు. ప్రజలకు బోధకులుగా నియమించబడిన యూదుల శాస్త్రులు, పాలకులు తమ ప్రవర్తనలో బహిరంగంగా మోషే ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించడం, దానికి రక్షించే శక్తి లేదని నిరూపిస్తుంది. వారి సొంత దేవుని వాక్కు నుండే అతడు ఈ నేరారోపణను నిరూపిస్తున్నాడు.

క్రీ.శ. 58

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

రోమీయులకు రాసిన పత్రిక 2:17–24

17 నీవు యూదుడవని పేరు పెట్టుకుని ధర్మశాస్త్రం మీద ఆధారపడుతూ దేవుని విషయంలో అతిశయిస్తున్నావు కదా? 18 ఆయన చిత్తం తెలిసి, ధర్మశాస్త్రంలో ఉపదేశం పొంది ఏది మంచిదో తెలిసి దాన్ని మెచ్చుకొంటావు కదా? 19 జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రం కలిగిఉండి, “నేను గుడ్డివారికి దారి చూపేవాణ్ణి, చీకటిలో ఉండేవారికి వెలుగు చూపేవాణ్ణి, 20 బుద్ధిలేని వారిని సరిదిద్దే వాణ్ణి, చిన్న పిల్లలలకు అధ్యాపకుణ్ణి అని” అని నిశ్చింతగా ఉన్నావు కదా? 21 ఎదుటి మనిషికి ఉపదేశించే వాడివి, నీకు నీవు బోధించుకోవా? దొంగతనం చేయకూడదని చెప్పే నీవే దొంగతనం చేస్తావా? 22 వ్యభిచారం చేయవద్దని చెప్పే నీవే వ్యభిచారం చేస్తావా? విగ్రహాలను అసహ్యించుకుంటూ నీవే గుడులను దోచుకుంటావా? 23 ధర్మశాస్త్రంలో గొప్పలు చెప్పుకునే నీవు ధర్మశాస్త్రం మీరి, దేవునికి అవమానం తెస్తావా? 24 “మిమ్మల్ని బట్టే గదా దేవుని పేరు యూదేతరుల మధ్య దూషణ పాలవుతున్నది?” అని రాసి ఉంది కదా.

విధేయత లేకపోతే సున్నతి వ్యర్థం

తాము అబ్రాహాము సంతతివారమని, దేవుడు ఎన్నుకున్న ప్రజలుగా తమకు ప్రత్యేక హక్కులు ఉన్నాయని సూచించే గుర్తుగా యూదులు సున్నతిని బట్టి గర్వించారు. అయితే వారు ధర్మశాస్త్రాన్ని పాటించకపోతే సున్నతి వారికి ఏ ప్రయోజనమూ కలిగించదని పౌలు ఇంకా చూపిస్తున్నాడు. ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించడం ద్వారా యూదుడు తన ప్రత్యేక హక్కులను కోల్పోయి, సున్నతి లేని యూదేతరుని కంటే ఏ విధంగానూ మెరుగైన స్థితిలో లేకుండాపోయాడు. ధర్మశాస్త్రం విధించిన కర్తవ్యాలను చేసే యూదేతరులను దేవుడు అంగీకరించి, తాను ఎన్నుకున్న ప్రజల్లో చేర్చుకుంటాడు. మతాన్ని బాహ్యంగా మాత్రమే అంగీకరిస్తున్నానని చెప్పుకునేవాడు అబ్రాహాము కుమారుడు కాదు; ఆత్మీయంగా పవిత్రంగా ఉన్నవాడే నిజమైన కుమారుడు.

రోమీయులకు రాసిన పత్రిక 2:25–29

25 నీవు ధర్మశాస్త్రాన్ని అనుసరించేవాడివైతే నీకు సున్నతి ప్రయోజనం వర్తిస్తుంది గాని ధర్మశాస్త్రాన్ని అతిక్రమించేవాడివైతే, నీ సున్నతి సున్నతి కానట్టే. 26 కాబట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్ర నియమాలను పాటిస్తే సున్నతి లేకపోయినా సున్నతి పొందినవాడుగా ఎంచబడతాడు గదా? 27 సున్నతి పొందకపోయినా ధర్మశాస్త్రాన్ని అనుసరించి జీవించేవాడు, లేఖనాలూ, సున్నతి కలిగి ధర్మశాస్త్రాన్ని అతిక్రమించే నీకు తీర్పు తీరుస్తాడు కదా? 28 పైకి యూదుడుగా కనిపించేవాడు యూదుడు కాదు, శరీరంలో పైకి కనిపించే సున్నతి సున్నతి కాదు. 29 అంతరంగంలో యూదుడైన వాడే యూదుడు. సున్నతి హృదయానికి చెందింది. అది ఆత్మలో జరిగేదే గాని అక్షరార్ధమైనది కాదు. అలాటి వాణ్ణి మనుషులు కాదు, దేవుడే మెచ్చుకుంటాడు.

యూదుని ఆధిక్యం, దేవుని నమ్మకత్వం

యూదులు, యూదేతరులు ఒకేలా పాపులని ఒప్పించిన పౌలు ఇప్పుడు యూదుల పక్షపాత అభిప్రాయాలను ఖండిస్తున్నాడు. అలాగైతే అబ్రాహాము సంతానానికి యూదేతరుల కంటే ఏ విధంగా ఎక్కువ అనుగ్రహం లభించిందని అడిగే ఒక వ్యక్తిని అతడు ప్రవేశపెడుతున్నాడు. పౌలు, “దేవుని మాటలే వారికి అప్పగించబడ్డాయి” అని జవాబిస్తున్నాడు. తమ జాతిలో కొందరు ఈ మాటలను నమ్మలేదు కాబట్టి వారి అవిశ్వాసం దేవుని వాగ్దానాలను రద్దు చేస్తుందా అని ఆ యూదుడు అడుగుతున్నాడు. మానవ బలహీనత వల్ల ఆ వాగ్దానాలు ఆధారపడిన షరతులు ఉల్లంఘించబడ్డాయి కాబట్టి, వారి అవిశ్వాసం ద్వారానే దేవుని సత్యం, వాగ్దానాలు ధృవపడ్డాయని పౌలు జవాబిస్తున్నాడు. అప్పుడు ఆ యూదుడు, “వారి అవిశ్వాసం దేవుని నీతిని మరింత స్పష్టంగా చూపిస్తే, వారిని శిక్షించడం దేవునికి అన్యాయం కాదా?” అని అడుగుతున్నాడు. దేవుడు అన్యాయస్థుడు కాలేడని, అలా అయితే ఆయన లోకానికి ఎలా తీర్పు తీర్చగలడని పౌలు చూపిస్తున్నాడు. ఆ యూదుడు అదే వాదనను మళ్లీ చెబుతున్నాడు. అలా ప్రవర్తించడం అంటే మేలు కలగాలని కీడు చేయమని ప్రజలకు బోధించడమేనని చెబుతూ పౌలు దానిని తిరస్కరిస్తున్నాడు. అలాంటి అభిప్రాయం కలిగినవారు న్యాయంగానే శిక్షావిధి పొందుతారు.

రోమీయులకు రాసిన పత్రిక 3:1–8

1 అలాగైతే యూదుల గొప్పతనం ఏమిటి? సున్నతి వలన ప్రయోజనం ఏమిటి? 2 ప్రతి విషయంలో ఎక్కువే. మొదటిది, దేవుని వాక్కులు యూదులకే అప్పగించబడ్డాయి. 3 కొందరు యూదులు నమ్మదగని వాళ్ళు అయినంత మాత్రాన దేవుడు నమ్మదగినవాడు కాకపోతాడా? 4 కానేకాదు. “నీ మాటల్లో నీవు నీతిమంతుడుగా కనిపించడానికి, నీపై విచారణ జరిగినప్పుడు గెలవడానికి” అని రాసి ఉన్న ప్రకారం మనుషులంతా అబద్ధికులైనా సరే, దేవుడు మాత్రం సత్యవంతుడే. 5 మన దుర్నీతి దేవుని న్యాయాన్ని వెల్లడి చేస్తున్నప్పటికీ కోపం చూపే దేవుడు అన్యాయం చేసేవాడని చెప్పాలా? నేను మానవ వ్యవహార రీతిలో మాట్లాడుతున్నాను. 6 అలా కానే కాదు. అలాగైతే దేవుడు లోకానికి ఎలా తీర్పు తీరుస్తాడు?

7 నా అబద్ధం ద్వారా దేవుని సత్యం విస్తరించి ఆయనకు మహిమ కలిగితే నేను పాపినని తీర్పు పొందడం ఎందుకు? 8 మంచి జరగడం కోసం చెడు జరిగిద్దాం అని మేము బోధిస్తున్నామని ఇప్పటికే కొందరు మాపై నిందారోపణ చేసినట్టు మేము నిజంగానే ఆ ప్రకారం చెప్పవచ్చు కదా? వారి మీదికి వచ్చే శిక్ష న్యాయమైనదే.

యూదులు, యూదేతరులు ఒకేలా పాపం కింద ఉన్నారు

యూదేతరుల కంటే యూదులకు మెరుగైన హక్కులు లేవా అని ఆ యూదుడు ఇప్పుడు అడుగుతున్నాడు. యూదులు, యూదేతరులు ఒకేలా పాపం కింద ఉన్నారని తాను ఇదివరకు చెప్పిన దానిని పౌలు మళ్లీ ధృవీకరిస్తున్నాడు. దైవప్రేరణతో ఇవ్వబడిందని వారు అంగీకరించిన వారి సొంత దేవుని వాక్కు నుండే యూదుల పాపం నిరూపించబడుతుంది. మోషే ధర్మశాస్త్రం ద్వారా గానీ, ప్రకృతి నియమం ద్వారా గానీ ఎవరూ నీతిమంతులుగా తీర్చబడలేరు. అవి పాపాన్ని గురించిన జ్ఞానాన్ని, దానికి విధించే శిక్షను మాత్రమే తెలియజేయగలవు.

రోమీయులకు రాసిన పత్రిక 3:9–20

9 అలాగని మేము వారికంటే మంచివారమా? ఎంతమాత్రం కాదు. యూదులైనా, యూదేతరులైనా, అందరూ పాపం కింద ఉన్నారని ఇప్పటికే దోషారోపణ చేశాం కదా. 10 దీని విషయంలో ఏమని రాసి ఉన్నదంటే,

“నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు.

11 గ్రహించేవాడెవడూ లేడు, దేవుణ్ణి వెదికే వాడెవడూ లేడు.

12 అందరూ దారి తప్పిపోయారు, అందరూ ఏకంగా పనికిమాలినవారయ్యారు.

మంచి జరిగించేవాడు లేడు, ఒక్కడు కూడా లేడు.

13 వారి గొంతుక తెరచి ఉన్న సమాధిలాగా ఉంది.

వారు నాలుకతో మోసం చేస్తూ ఉంటారు.

వారి పెదవుల కింద పాము విషం ఉంది.

14 వారి నోటినిండా శాపనార్ధాలు, పగ ఉన్నాయి.

15 రక్తం చిందించడానికి వారి పాదాలు పరిగెడుతూ ఉన్నాయి.

16 వారి మార్గాల్లో నాశనం, కష్టం ఉన్నాయి.

17 వారికి శాంతిమార్గం తెలియదు.

18 వారి దృష్టికి దేవుని భయం అంటే తెలియదు.”

19 ప్రతి నోటికీ మూతపడాలనీ, లోకమంతా దేవుని తీర్పు కిందికి రావాలనీ ధర్మశాస్త్రం చెప్పే మాటలన్నీ దానికి లోబడి ఉన్నవారితోనే చెబుతున్నదని మనకు తెలుసు. 20 ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని పాటించడం ద్వారా ఏ మనిషీ దేవుని దృష్టికి నీతిమంతుడు కాలేడు. ధర్మశాస్త్రం వలన పాపమంటే ఏమిటో తెలుస్తున్నది.

యేసు క్రీస్తుపై విశ్వాసం ద్వారా ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడటం

నీతిమంతులుగా తీర్చడంలో ధర్మశాస్త్రం పూర్తిగా విఫలమైంది కాబట్టి, యేసు క్రీస్తుపై విశ్వాసమే నీతిమంతులుగా తీర్చబడటానికి ఏకైక మార్గమని పౌలు ప్రకటిస్తున్నాడు. ధర్మశాస్త్రంలోనూ ప్రవక్తల గ్రంథాల్లోనూ ఇదే బోధించబడింది. దేవుని దగ్గర పక్షపాతం లేదు కాబట్టి, సమానంగా పాపులని నిరూపించబడిన యూదునికీ యూదేతరునికీ ఇది ఒకేలా అందించబడుతుంది. క్రీస్తు యేసు చేసిన ప్రాయశ్చిత్త బలి, విమోచన మూలంగా, విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడటం అందరికీ దేవుడు ఉచితంగా ఇచ్చే వరం. కాబట్టి గొప్పలు చెప్పుకోవడానికి ఏ తావూ లేదు.

రోమీయులకు రాసిన పత్రిక 3:21–27

21 ఇదిలా ఉంటే ధర్మశాస్త్రంతో సంబంధం లేకుండా దేవుని న్యాయం వెల్లడైంది. ధర్మశాస్త్రమూ ప్రవక్తలూ రాసింది దానికి సాక్ష్యంగా ఉన్నాయి. 22 అది యేసు క్రీస్తులో విశ్వాసమూలంగా నమ్మే వారందరికీ కలిగే దేవుని నీతి. 23 భేదమేమీ లేదు. అందరూ పాపం చేసి దేవుడు ఇవ్వజూపిన మహిమను అందుకోలేక పోతున్నారు. 24 నమ్మేవారు దేవుని కృప చేతా, క్రీస్తు యేసులోని విమోచన ద్వారా, ఉచితంగా నీతిమంతులని తీర్పు పొందుతున్నారు. 25 క్రీస్తు యేసు రక్తంలో విశ్వాసం ద్వారా పాప పరిహారం పొందేలా దేవుడు తన కోపాగ్నిని తొలగించే పాప పరిహారార్ధ బలిగా ఆయనను కనుపరిచాడు. అందులో దేవుని ఉద్దేశం తన న్యాయాన్ని ప్రదర్శించడమే. ఎందుకంటే, గతంలోని పాపాలను దేవుడు సహనంతో దాటిపోయాడు. 26 ప్రస్తుత కాలంలో తన న్యాయాన్ని కనబరిచే నిమిత్తం తాను న్యాయవంతుడుగా, యేసులో విశ్వాసంగల వాణ్ణి న్యాయవంతుని తీర్చే వాడుగా ఉండడానికి దేవుడు ఇలా చేశాడు.

27 కాబట్టి మనం గొప్పలు చెప్పుకోడానికి కారణమేది? దాన్ని కొట్టివేయడం అయిపోయింది. ఏ నియమాన్ని బట్టి? క్రియలను బట్టా? కాదు, విశ్వాస నియమాన్ని బట్టే.

విశ్వాసం మాత్రమే నీతిమంతులుగా తీర్చి, ధర్మశాస్త్రాన్ని స్థిరపరుస్తుంది

సువార్త ప్రకారం, ధర్మశాస్త్ర క్రియల సహాయం ఏమీ లేకుండా విశ్వాసం ద్వారా మాత్రమే తప్ప, యూదుడైనా యూదేతరుడైనా నీతిమంతునిగా తీర్చబడలేడని ప్రకటిస్తూ పౌలు తన వాదనను ముగిస్తున్నాడు. దేవుడు యూదేతరులను, యూదులను సమానంగా చూస్తాడు కాబట్టి, ఇద్దరికీ నీతిమంతులుగా తీర్చబడే ఒకే మార్గం నియమించబడింది. విశ్వాసం ద్వారా ధర్మశాస్త్రం స్థిరపరచబడుతుంది, లేదా పరిపూర్ణం చేయబడుతుంది.

రోమీయులకు రాసిన పత్రిక 3:28–31

28 కాబట్టి మనుషులు ధర్మశాస్త్ర క్రియలు లేకుండానే విశ్వాసం వలన నీతిమంతులని తీర్పు పొందుతున్నారని నిర్ణయిస్తున్నాము.

29 దేవుడు యూదులకు మాత్రమేనా దేవుడు? యూదేతరులకు కాడా? అవును, వారికి కూడా దేవుడే. 30 దేవుడు ఒక్కడే కాబట్టి, ఆయన సున్నతి గలవారిని విశ్వాసం ద్వారా, సున్నతి లేని వారిని విశ్వాసం మూలంగా నీతిమంతులుగా తీరుస్తాడు.

31 విశ్వాసం ద్వారా ధర్మశాస్త్రాన్ని కొట్టివేస్తున్నామా? కాదు, ధర్మశాస్త్రాన్ని స్థిరపరుస్తున్నాము.