రోమీయులకు లేఖ రాస్తున్న పౌలు

అకయ నుండి మాసిదోనియకు వెళ్తూ, పౌలు కొరింతు నుండి రోమాలోని యూదులకు, యూదేతరులకు తన పత్రిక రాస్తున్నాడు. వారు ఎంతో ప్రశంసించే తత్వశాస్త్రం గానీ, వారి నైతిక సద్గుణం గానీ, మానవ వివేచన వెలుగు గానీ దేవుని ఎదుట వారిని నీతిమంతులుగా తీర్చలేవని యూదేతరులకు నిరూపిస్తున్నాడు. మోషే ధర్మశాస్త్రం గురించిన జ్ఞానం గానీ, దానికి వారు చూపే విధేయత గానీ వారిని నీతిమంతులుగా తీర్చలేవని యూదులకు నిరూపిస్తున్నాడు. మానవులందరికీ క్రీస్తుపై విశ్వాసం ఒక్కటే రక్షణ మార్గం; ఎల్లప్పుడూ అదే ఏకైక మార్గంగా ఉంది.

క్రీ.శ. 58

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

పౌలు రోమీయులకు అభివందనాలు తెలుపుతున్నాడు

అపొస్తలుడిగా తనకున్న అధికారాన్ని పౌలు ధృవీకరిస్తున్నాడు. క్రీస్తు దావీదు సంతతిలో జన్మించడం ద్వారా ఆయన మానవ స్వభావాన్ని, పునరుత్థానం ద్వారా ఆయన దైవ స్వభావాన్ని చూపిస్తున్నాడు. రోమాలోని సంఘంలో ఎక్కువమందిగా ఉన్న యూదేతరులకు సువార్త ప్రకటించే బాధ్యతను క్రీస్తు నుండి పొందానని, కాబట్టి వారికి రాయడానికి తనకు అధికారం ఉందని ప్రకటిస్తున్నాడు.

రోమీయులకు రాసిన పత్రిక 1:1–7

1 యేసు క్రీస్తు దాసుడు, అపోస్తలుడుగా పిలుపు పొందినవాడు, దేవుని సువార్త కోసం ప్రభువు ప్రత్యేకించుకున్న 2 పౌలు, రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అంటే పవిత్రులుగా ఉండడానికి పిలుపు పొందిన వారికి శుభాలు చెబుతూ రాస్తున్నది. 3 మన తండ్రి అయిన దేవుని నుండీ, ప్రభు యేసు క్రీస్తు నుండీ కృప, సమాధానం మీకు కలుగు గాక.

4 దేవుడు తన కుమారుడు, మన ప్రభువు అయిన యేసు క్రీస్తు గురించిన ఆ సువార్తను పవిత్ర లేఖనాల్లో తన ప్రవక్తల ద్వారా ముందుగానే వాగ్దానం చేశాడు. 5 యేసు క్రీస్తు, శారీరికంగా చూస్తే దావీదు సంతానం. దేవుని పవిత్రమైన ఆత్మ సంబంధంగా చనిపోయి తిరిగి సజీవుడుగా లేవడం ద్వారా ఆయన దేవుని కుమారుడు అని బల ప్రభావాలతో ప్రకటించబడింది. 6 ఈయన నామం నిమిత్తం అన్ని జాతుల ప్రజలు విశ్వాసానికి విధేయులయ్యేలా ఈయన ద్వారా మేము కృప, అపొస్తలత్వం పొందాము. 7 వారితోబాటు మీరు కూడా యేసు క్రీస్తుకు చెందిన వారుగా ఉండడానికి పిలుపు పొందారు.

రోమీయులను సందర్శించాలని పౌలు ఎంతో ఆశపడుతున్నాడు

వారి విశ్వాసాన్ని బట్టి పౌలు ఆనందిస్తున్నాడు. ఏదైనా ఆత్మీయ వరాన్ని అందించి వారిని బలపరచడానికి వారిని సందర్శించాలని తనకున్న గొప్ప కోరికను తెలియజేస్తున్నాడు. ఈ వరం ఒక రుజువుగా ఉండి, క్రీస్తుపై విశ్వాసంలో అతడూ వారూ పరస్పరం బలపరచుకుని ఆదరణ పొందేలా చేస్తుంది. అన్ని జాతులకు సువార్త ప్రకటించడానికి నియమితుడైన అతడు, మూడు కారణాల వల్ల రోమీయులకు కూడా దానిని ప్రకటించాలని ఇంకా కోరుకుంటున్నాడు. మొదటిగా, యూదునికీ యూదేతరునికీ కూడా రక్షణ కలిగించడానికి అది దేవుని శక్తి అని ధృవీకరిస్తున్నాడు. రెండవదిగా, దేవుని నీతి సువార్తలో మాత్రమే బయలుపరచబడుతుంది; ఆయన చేత నీతిమంతులుగా తీర్చబడి అంగీకరించబడటానికి ఒకే షరతు ఉంది: అది క్రియల ద్వారా కాక విశ్వాసం ద్వారా జరుగుతుంది. మూడవదిగా, సువార్త మోషే ధర్మశాస్త్రం కంటే, మనస్సాక్షి ఇచ్చే వెలుగు లేదా నియమం కంటే గొప్పది. ఆ రెండూ పాపం చేసిన వారందరికీ ఎలాంటి షరతు లేకుండా మరణశిక్ష విధిస్తాయి.

రోమీయులకు రాసిన పత్రిక 1:8–18

8 మీ విశ్వాసం లోకమంతా ప్రచురం కావడం చూసి, మొదట మీ అందరి కోసం యేసు క్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తున్నాను. 9-10 ఏదో ఒక విధంగా చివరికి మీ దగ్గరికి రావడానికి దేవుని చిత్తం వలన నాకు వీలవుతుందేమో అని నా ప్రార్థనల్లో ఎప్పుడూ ఆయనను బతిమాలుకుంటున్నాను. మిమ్మల్ని ఎడతెగక ప్రస్తావిస్తున్నాను. ఆయన కుమారుడి సువార్త కోసం నేను నా ఆత్మలో సేవిస్తున్న దేవుడే ఇందుకు సాక్షి. 11-12 మీరు స్థిరపడాలనీ, మీరూ నేనూ ఒకరి విశ్వాసం చేత ఒకరం ఆదరణ పొందడం కోసం మిమ్మల్ని చూడాలనీ కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆత్మ సంబంధమైన ఏదైనా కృపావరాన్ని మీకు అందించాలని నా ఆశ.

13 సోదరులారా, ఇది మీకు తెలియకుండా ఉండడం నాకు ఇష్టం లేదు. నేను చాలా సార్లు మీ దగ్గరకి రావడానికి ప్రయత్నించాను గాని ప్రతిసారీ ఆటంకం వచ్చింది. యూదేతర ప్రజల మధ్య నేను పొందిన పరిచర్య ఫలాలు మీ మధ్య కూడా పొందాలని నా ఆకాంక్ష. 14 గ్రీకులకూ, ఇతరులకూ, తెలివైన వారికీ, బుద్ధిహీనులకూ నేను రుణపడి ఉన్నాను. 15 కాబట్టి రోమాలోని మీకు కూడా సువార్త ప్రకటించాలన్న ఆశతో నేను సిద్ధంగా ఉన్నాను.

16 సువార్తను గురించి నేను సిగ్గుపడను. ఎందుకంటే మొదట యూదుడికి, తరవాత గ్రీసు జాతి వాడికి నమ్మే ప్రతి ఒక్కరికీ అది దేవుని శక్తి. 17 నీతిమంతుడు విశ్వాసమూలంగా జీవిస్తాడు, అని రాసి ఉన్న ప్రకారం విశ్వాసమూలంగా మరింత విశ్వాసం కలిగేలా దేవుని నీతి దానిలో వెల్లడి అవుతున్నది.

18 ఎవరైతే తమ దుర్నీతి చేత సత్యాన్ని అడ్డగిస్తారో వారి భక్తిహీనత మీదా, దుర్నీతి మీదా దేవుని కోపం పరలోకం నుండి వెల్లడి అయింది.

యూదేతరులు దేవుణ్ణి ఎరిగినా ఆయన నుండి తొలగిపోయారు

సృష్టి కార్యాల్లో దేవుని గురించీ, ఆయన మహిమాన్వితమైన పరిపూర్ణ లక్షణాల గురించీ యూదేతరులకు తగినన్ని ఆధారాలు ఉన్నాయని పౌలు చూపిస్తున్నాడు. ప్రకృతి నియమం ద్వారా ఎవరూ రక్షణ పొందలేరని చూపించడానికి, మానవ జ్ఞానంలోనూ వివేకంలోనూ అత్యున్నత స్థాయికి చేరిన గ్రీకుల దుర్గుణాలను అతడు జాబితాగా పేర్కొంటున్నాడు. వారు దేవుణ్ణి ఎరిగినా, ఆయన గురించిన తమ జ్ఞానాన్ని దాచిపెట్టారని అతడు నొక్కి చెబుతున్నాడు. చివరికి వారి హృదయాలు సత్యాన్ని చూడలేకపోయాయి; సృష్టికర్తకు బదులుగా సృష్టింపబడిన దాని ఆరాధనను వారు స్థాపించారు. దేవుని గురించిన జ్ఞానం వల్ల తమ నేరాలకు శిక్ష తప్పదని వారికి నిశ్చయంగా తెలిసినా, వారు వాటిని కొనసాగిస్తూ ఇతరులను కూడా అలాగే చేయమని ప్రోత్సహించారు.

రోమీయులకు రాసిన పత్రిక 1:19–32

19 ఎందుకంటే దేవుని గురించి తెలుసుకోగలిగినదంతా వారికి కనబడుతూనే ఉంది. దేవుడే దాన్ని వారికి వెల్లడి చేశాడు. 20 ఈ లోకం పుట్టినప్పటి నుండి, అనంతమైన శక్తి, దైవత్వం అనే ఆయన అదృశ్య లక్షణాలు స్పష్టించబడిన వాటిని తేటగా పరిశీలించడం ద్వారా తేటతెల్లం అవుతున్నాయి. కాబట్టి వారు తమను తాము సమర్ధించుకోడానికి ఏ అవకాశమూ లేదు.

21 వారు దేవుణ్ణి ఎరిగి ఉండి కూడా ఆయనను దేవునిగా మహిమ పరచ లేదు, కృతజ్ఞతలు చెప్పలేదు గానీ తమ ఆలోచనల్లో బుద్ధిహీనులయ్యారు. వారి అవివేక హృదయం చీకటిమయం అయింది. 22 తాము తెలివైన వారం అని చెప్పుకున్నారు గాని వారు బుద్ధిహీనులే. 23 వారు ఎన్నటికీ క్షయం కాని వాడైన దేవుని మహిమను, నాశనమైపోయే మనుషులు, పక్షులు, నాలుగు కాళ్ళ జంతువులు, పురుగులు అనే వాటి రూపాలకు ఆపాదించారు.

24 ఇందువలన వారు తమ హృదయాల దురాశల ప్రకారం, తమ శరీరాలను తమలో తాము అవమాన పరచుకొనేలా దేవుడు వారిని లైంగిక అపవిత్రతకు అప్పగించాడు. 25 వారు దేవుని సత్యాన్ని అబద్ధంగా మార్చివేసి, యుగ యుగాలకు స్తోత్రార్హుడైన సృష్టికర్తకు బదులు సృష్టిని పూజించి సేవించారు.

26 ఈ కారణంగా దేవుడు వారిని నీచమైన కోరికలకు అప్పగించాడు. వారి స్త్రీలు సైతం సహజ సంపర్కాలను వదిలివేసి అసహజమైన సంపర్కాలకు అలవాటు పడిపోయారు. 27 అదే విధంగా పురుషులు కూడా తాము సహజంగా స్త్రీలతో జరిగించవలసిన ధర్మాన్ని విడిచిపెట్టి పురుషులతో పురుషులు చేయదగని విధంగా ప్రవర్తించారు. ఆ విధంగా వారు తమ కామాగ్నిలో మాడిపోయి తమ తప్పుకు తగిన ప్రతిఫలాన్ని పొందారు.

28 వారి మనసుల్లో దైవిక జ్ఞానానికి చోటు లేదు. కాబట్టి చేయదగని పనులు వారితో చేయించే చెడు మనసుకు దేవుడు వారిని అప్పగించాడు. 29 వారు సమస్తమైన దుర్నీతి, దుష్టత్వం, లోభం, చెడుతనం, ఈర్ష్య, అసూయ, హత్య, కలహం, మోసం, విరోధభావం వీటన్నిటితో నిండిపోయారు.

30 వారు చాడీలు చెప్పేవారు, అపనిందలు మోపేవారు, దేవుణ్ణి ద్వేషించేవారు, అపకారులు, గర్విష్టులు, లేని గొప్పలు చెప్పుకొనేవారు, చెడ్డ పనులు చెయ్యడానికి రకరకాల మార్గాలు కల్పించుకునేవారు, తల్లిదండ్రులను ఎదిరించేవారు, బుద్ధిహీనులు, 31 మాట తప్పేవారు, జాలి లేని వారు, దయ చూపనివారు అయ్యారు. 32 ఇలాటి వారు చావుకు లోనవుతారు అనే దేవుని శాసనం వారికి బాగా తెలిసి ఉన్నా, వాటిని చేస్తూనే ఉన్నారు. తాము చేయడమే కాక వాటిని చేసే ఇతరులతో కలిసి సంతోషిస్తున్నారు.

యూదులు కూడా అవే పాపాలకు దోషులు

యూదేతరుల పాపాలను బట్టి వారిని ఖండించడంలో కలవడానికి యూదులు ఎంత సిద్ధంగా ఉంటారో పౌలుకు బాగా తెలుసు. ఇప్పుడు యూదులు కూడా అవే నేరాలకు దోషులని ప్రకటిస్తూ, వారి పాపాన్ని వారికి ఒప్పించడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇలాంటి నేరాలపై వారి సొంత ధర్మశాస్త్రంలో ఇవ్వబడిన దేవుని తీర్పు సత్యమైనదని వారికి తెలుసు. వాటిని చేసే వారందరూ, యూదులైనా యూదేతరులైనా, దేవుని అంతిమ తీర్పును తప్పించుకోలేరు.

రోమీయులకు రాసిన పత్రిక 2:1–3

1 కాబట్టి ఇతరులకు తీర్పు తీర్చే నీవు ఎవరివైనా సరే, నిన్ను నీవు సమర్ధించుకోలేవు. దేని విషయంలో ఎదుటి వాడికి తీర్పు తీరుస్తున్నావో దాని విషయంలో నీవే దోషివని తీర్పు తీర్చుకుంటున్నావు. ఎందుకంటే నీవు ఏ పనుల విషయంలో తీర్పు తీరుస్తున్నావో వాటినే నీవు కూడా చేస్తున్నావు కదా?

2 ఆ పనులు చేసే వారి మీద దేవుని తీర్పు న్యాయమైనదే అని మనకు తెలుసు. 3 ఆ పనులు చేసే వారికి తీర్పు తీరుస్తూ వాటినే చేస్తున్న ఓ మనిషీ, దేవుని తీర్పు నీవెలా తప్పించుకుంటావు?

దేవుడు యూదునికీ గ్రీసు దేశస్థునికీ ఒకేలా తీర్పు తీరుస్తాడు

యూదులు పశ్చాత్తాపపడకపోతే, వారికున్న ప్రత్యేక హక్కులు వారి శిక్షను మరింత పెంచుతాయని పౌలు హెచ్చరిస్తున్నాడు. దేవుని తీర్పు యూదులకు, యూదేతరులకు మధ్య ఎలాంటి భేదమూ చూపదని అతడు స్పష్టం చేస్తున్నాడు. దేవుడు పక్షపాతం చూపడు కాబట్టి యూదునికీ గ్రీసు దేశస్థునికీ సమానంగా అవే శిక్షలు, అవే ప్రతిఫలాలు ఇవ్వబడతాయని ధృవీకరిస్తున్నాడు.

రోమీయులకు రాసిన పత్రిక 2:4–11

4 దేవుని కటాక్షం నిన్ను పశ్చాత్తాప పడేందుకు ప్రేరేపిస్తున్నదని తెలియక ఆయన మంచితనం అనే ఐశ్వర్యాన్నీ సహనాన్నీ దీర్ఘశాంతాన్నీ తోసిపుచ్చుతావా?

5 నీ మొండితనాన్ని, మారని నీ హృదయాన్ని బట్టి దేవుని న్యాయమైన తీర్పు జరిగే ఆ ఉగ్రత రోజు కోసం, దేవుని కోపాన్ని పోగు చేసుకుంటున్నావు. 6 ఆయన ప్రతి మనిషికీ అతని పనుల చొప్పున ప్రతిఫలం ఇస్తాడు. 7 మంచి పనులను ఓపికగా చేస్తూ, మహిమ, ఘనత, అక్షయతలను వెదికే వారికి నిత్యజీవమిస్తాడు. 8 అయితే స్వార్ధపరులు, సత్యాన్ని విడిచిపెట్టి దుర్నీతిని జరిగించే వారి మీదికి దేవుని ఉగ్రత, మహా కోపం వస్తాయి. 9 చెడ్డ పని చేసే ప్రతి మనిషి ఆత్మకు, ముందు యూదునికి, తరువాత యూదేతరునికి బాధ, వేదన కలుగుతాయి. 10 అయితే మంచి పని చేసే ప్రతి వ్యక్తికి, ముందు యూదునికి, తరువాత యూదేతరునికి మహిమ, ఘనత, శాంతిసమాధానాలు కలుగుతాయి.

11 ఎందుకంటే దేవునికి పక్షపాతం లేదు.

ప్రతి ఒక్కరూ తాము పొందిన వెలుగును బట్టి తీర్పు పొందుతారు

ప్రజలందరూ తాము పొందిన వెలుగు, జ్ఞానం యొక్క స్థాయిని బట్టి తీర్పు పొందుతారని పౌలు ఇంకా ప్రకటిస్తున్నాడు. ధర్మశాస్త్రాన్ని అంగీకరిస్తున్నామని చెప్పుకుంటూ దానిని ఆచరించని యూదులు కాదు గానీ, దాని గురించి తరువాత బయలుపరచబడిన జ్ఞానాన్ని పొందకుండానే దానికి అనుగుణంగా జీవించే యూదేతరులూ ఇతరులందరూ ఆ గొప్ప రోజున దేవుని అనుగ్రహం పొందుతారు. దేవుని సువార్త ప్రకారం, ఆ రోజున ప్రజలందరూ మనస్సాక్షి నియమాన్ని, విశ్వాస నియమాన్ని బట్టి తీర్పు పొందుతారు.

రోమీయులకు రాసిన పత్రిక 2:12–16

12 ధర్మశాస్త్రం ఉండి పాపం చేసినవారు ధర్మశాస్త్ర ప్రకారం తీర్పు పొందుతారు. ధర్మశాస్త్రం లేకుండా పాపం చేసిన వారు కూడా ధర్మశాస్త్రం లేకపోయినా నాశనం అవుతారు. 13 ధర్మశాస్త్రం వినే వారిని కాదు, దాన్ని అనుసరించి ప్రవర్తించే వారినే దేవుడు నీతిమంతులుగా ఎంచుతాడు. 14 ధర్మశాస్త్రం లేని యూదేతరులు స్వాభావికంగా ధర్మశాస్త్రం చెప్పినట్టు నడుచుకుంటే వారికి ధర్మశాస్త్రం లేకపోయినా, తమకు తామే ధర్మశాస్త్రంలాగా ఉంటారు. 15 అలాటి వారి మనస్సాక్షి కూడా సాక్షమిస్తుంది. వారి ఆలోచనలు వారిపై తప్పు మోపడమో లేక తప్పులేదని చెప్పడమో చేస్తాయి. అలాటివారి హృదయాలపై ధర్మశాస్త్ర సారం రాసినట్టే ఉంటుంది రాసినట్టే ఉంటుంది. 16 నా సువార్త ప్రకారం దేవుడు యేసు క్రీస్తు ద్వారా మానవుల రహస్యాలను విచారించే రోజున ఈ విధంగా జరుగుతుంది.