సున్నతి పొందకముందే అబ్రాహాము నీతిమంతునిగా తీర్చబడ్డాడు
అబ్రాహాము ధర్మశాస్త్ర క్రియల ద్వారా నీతిమంతునిగా తీర్చబడలేదని పౌలు నిరూపిస్తున్నాడు. అతడు గొప్పలు చెప్పుకోవడానికి ఏమీ లేదు. అతడు విశ్వాసం ద్వారా, కృపానుగ్రహాల వల్ల నీతిమంతునిగా తీర్చబడ్డాడే గానీ, తన క్రియలకు రావలసిన ప్రతిఫలం అనే రుణంగా కాదు. నీతిమంతులుగా తీర్చబడే ఈ మార్గానికే దావీదు సాక్ష్యమిస్తున్నాడు. అబ్రాహాము సున్నతి పొందకముందే నీతిమంతునిగా తీర్చబడి, తరువాత విశ్వాసం ద్వారా తాను నీతిమంతునిగా తీర్చబడ్డాడనడానికి ముద్రగా సున్నతి గుర్తును పొందాడనే వాస్తవం కూడా దీనినే చూపిస్తుంది. విశ్వాసం అనే ఒకే షరతుపై నీతిమంతులుగా తీర్చబడటానికి సమాన హక్కు పొందబోయే యూదునికీ యూదేతరునికీ అతడు ఆత్మీయ తండ్రి కావడానికే ఇలా జరిగింది.
క్రీ.శ. 58
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
1 కాబట్టి శరీరరీతిగా మన పూర్వికుడైన అబ్రాహాముకు ఏం దొరికింది? 2 అబ్రాహాము క్రియల మూలంగా నీతిమంతుడని తీర్పు పొంది ఉంటే అతడు గొప్పలు పోవడానికి కారణం ఉండేది గానీ అది దేవుని ఎదుట కాదు. 3 లేఖనం చెబుతున్నదేమిటి? “అబ్రాహాము దేవునిలో నమ్మకముంచాడు. దాని ద్వారానే అతడు నీతిమంతుడని తీర్పు పొందాడు.” 4 పని చేసే వ్యక్తికి ఇచ్చే జీతం అతనికి హక్కుగా రావలసిన సొమ్మే గాని దానం కాదు.
5 కానీ క్రియలు చేయకుండా దానికి బదులు భక్తిహీనుణ్ణి నీతిమంతునిగా తీర్చే దేవునిలో కేవలం విశ్వాసం ఉంచే వ్యక్తి విశ్వాసాన్నే దేవుడు నీతిగా ఎంచుతాడు. 6 అదే విధంగా క్రియలు లేకుండా దేవుడు నీతిమంతుడుగా ప్రకటించిన మనిషి ధన్యుడని దావీదు కూడా చెబుతున్నాడు. 7 ఎలా అంటే,
“తన అతిక్రమాలకు క్షమాపణ పొందినవాడు,
తన పాపానికి ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు.
8 ప్రభువు ఎవరి అపరాధం లెక్కలోకి తీసుకోడో వాడు ధన్యుడు.”
9 ఈ దీవెన సున్నతి ఆచరించే వారి గురించి చెప్పాడా, ఆచరించని వారి గురించి కూడా చెప్పాడా? అబ్రాహాము విశ్వాసం అతణ్ణి నీతిమంతుడుగా తీర్చింది అన్నాం కదా? 10 అతడు ఏ స్థితిలో ఉన్నప్పుడు అది జరిగింది? సున్నతి చేయించుకున్న తరవాతా లేక సున్నతికి ముందా? ముందే కదా! 11 సున్నతి లేకపోయినా నమ్మిన వారికందరికీ అతడు తండ్రి కావడం కోసం వారికి నీతి ఆపాదించడానికై సున్నతి లేనప్పుడే, తాను కలిగి ఉన్న విశ్వాసం వలన పొందిన నీతికి ముద్రగా సున్నతి అనే గుర్తును పొందాడు. 12 అలాగే సున్నతి గలవారికి కూడా తండ్రి కావడానికి, అంటే కేవలం సున్నతి మాత్రమే పొందిన వారు కాక సున్నతి లేనప్పుడు మన తండ్రి అబ్రాహాము విశ్వాసపు అడుగుజాడల్లో నడచిన వారికి కూడా తండ్రి కావడానికి అతడు ఆ గుర్తు పొందాడు.
అబ్రాహాముకు ఇచ్చిన వాగ్దానంలో యూదేతరులు కూడా చేరి ఉన్నారు
అబ్రాహాముకు ఇవ్వబడిన వాగ్దానమే, అతని విశ్వాసం ద్వారా లోకమంతా అతని వారసులవుతుందని చూపించిందని యూదులకు ప్రకటిస్తూ పౌలు తన వాదనను కొనసాగిస్తున్నాడు. కానీ యూదులు మాత్రమే అతనికి ఇచ్చిన వాగ్దానానికి వారసులైతే, విశ్వాసం వ్యర్థమవుతుంది; విశ్వాసం అనే షరతుపై ఇవ్వబడిన వాగ్దానం రద్దవుతుంది. ఎందుకంటే ధర్మశాస్త్రం కనికరం లేకుండా పాపిని శిక్షకు లోను చేస్తుంది. ధర్మశాస్త్రం లేకపోతే కర్తవ్యాన్ని నిర్దేశించే నియమం ఉండదు, కాబట్టి పాపమూ ఉండదు. అందుకే వాగ్దానం విశ్వాసానికి ఇవ్వబడింది; దేవుని ఉచిత కృప అబ్రాహాము శారీరక సంతానాన్నీ ఆత్మీయ సంతానాన్నీ చేర్చుకుంటుంది. సున్నతి పొందకముందే అబ్రాహాము నీతిమంతునిగా తీర్చబడటం, యూదేతరులు అంగీకరించబడతారని నిరూపిస్తుంది. అనేక జాతులకు తండ్రిగా అబ్రాహాముకు ధృవీకరించబడిన ఆ వాగ్దానమే, విమోచన ఆశీర్వాదాలన్నిటిపై యూదేతరులకు ఉన్న హక్కును స్థిరపరుస్తుంది.
రోమీయులకు రాసిన పత్రిక 4:13–22
13 అబ్రాహాము, అతని సంతానం లోకానికి వారసులవుతారు అనే వాగ్దానం ధర్మశాస్త్ర మూలంగా కలగలేదు. విశ్వాసం వలన ఏర్పడిన నీతి మూలంగానే కలిగింది. 14 ధర్మశాస్త్ర సంబంధులు వారసులైతే విశ్వాసం వ్యర్థమౌతుంది, వాగ్దానం కూడా నిరర్థకమౌతుంది. 15 ఎందుకంటే ధర్మశాస్త్రం ఉగ్రతను పుట్టిస్తుంది. ధర్మశాస్త్రం లేని చోట దాన్ని అతిక్రమించడం కూడా ఉండదు.
16 ఈ కారణం చేత ఆ వాగ్దానం అబ్రాహాము సంతతి వారందరికీ, అంటే ధర్మశాస్త్రం గలవారికి మాత్రమే కాక అబ్రాహాముకున్న విశ్వాసం గలవారికి కూడా కృపను బట్టి వర్తించాలని, అది విశ్వాసమూలమైనది అయ్యింది. ఆ అబ్రాహాము మనందరికీ తండ్రి. 17 దీని గురించే, “నిన్ను అనేక జనాలకు తండ్రిగా నియమించాను” అని రాసి ఉంది. తాను నమ్ముకున్న దేవుని సమక్షంలో, అంటే చనిపోయిన వారిని బతికించేవాడు, లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచేవాడు అయిన దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి. 18 అలాగే, “నీ సంతానం ఇలా ఉంటుంది” అని రాసి ఉన్నట్టుగా తాను అనేక జనాలకు తండ్రి అయ్యేలా ఎలాటి ఆశాభావం లేనప్పడు సైతం అతడు ఆశాభావంతో నమ్మాడు. 19 అతడు విశ్వాసంలో బలహీనుడు కాలేదు, సుమారు నూరు సంవత్సరాల వయస్సు గలవాడు కాబట్టి, తన శరీరాన్ని మృతతుల్యంగా, శారా గర్భం మృతతుల్యంగా భావించాడు. 20 అవిశ్వాసంతో దేవుని వాగ్దానాన్ని గూర్చి సందేహించక విశ్వాసంలో బలపడి దేవుణ్ణి మహిమ పరచాడు. 21 దేవుడు మాట ఇచ్చిన దాన్ని ఆయన నెరవేర్చడానికి సమర్థుడని గట్టిగా నమ్మాడు. 22 అందుచేత దేవుడు దాన్ని అతనికి నీతిగా ఎంచాడు.
మన కోసం నమోదు చేయబడిన అబ్రాహాము విశ్వాసం
అబ్రాహాము విశ్వాసం ద్వారా దేవునికి అంగీకారయోగ్యుడయ్యాడని మన కోసమే రాసి ఉంచారు. మన పాపాల కోసం బాధపడి, మనం దేవునితో సమాధానపడడానికి, అంటే నీతిమంతులుగా తీర్చబడడానికి హామీగా తిరిగి లేచిన ఆయన కుమారునిపై విశ్వాసమే దేవుని దగ్గర రక్షణ పొందడానికి ఏకైక మార్గమని అది మనకు చూపిస్తుంది.
రోమీయులకు రాసిన పత్రిక 4:23–25
23 దేవుడు ఆ విశ్వాసాన్ని ఆ విధంగా ఎంచాడని అతని కోసం మాత్రమే రాసి లేదు, 24 మన ప్రభు యేసును చనిపోయిన వారిలో నుండి లేపిన దేవునిలో విశ్వాసం ఉంచిన మనలను కూడా నీతిమంతులుగా ఎంచడానికి మన కోసం కూడా రాసి ఉంది. 25 ఆయనను దేవుడు మన అపరాధాల కోసం అప్పగించి, మనలను నీతిమంతులుగా తీర్చడానికి ఆయనను తిరిగి లేపాడు.
నీతిమంతులుగా తీర్చబడిన తరువాత కలిగే ఆశీర్వాదాలు
విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడిన తరువాత కలిగే గొప్ప ఆశీర్వాదాలను, విశేషాధికారాలను పౌలు కొనసాగించి వివరిస్తాడు. యూదేతరులకు ఇచ్చిన పరిశుద్ధాత్మ వారి పట్ల దేవుని ప్రేమను చూపిస్తున్నాడు. వారు ఇంకా అన్యదేవతలను ఆరాధిస్తూ ఉన్నప్పుడే క్రీస్తు వారి కోసం చనిపోవడం ఆ ప్రేమను ధృవీకరిస్తుంది. కాబట్టి అబ్రాహాము శారీరక సంతతివారికి ఉన్నట్టే యూదేతరులకు కూడా క్రీస్తు ద్వారా రక్షణ పొందుతామనే నిరీక్షణ, దేవునిలో ఆనందించడానికి అదే ఆధారం ఉన్నాయి. ఎందుకంటే అదే ప్రాయశ్చిత్తం ద్వారా వారు దేవునితో సమాధానపడ్డారు.
1 విశ్వాసం ద్వారా దేవుడు మనలను నీతిమంతులుగా తీర్చాడు కాబట్టి మన ప్రభు యేసు క్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉన్నాము. 2 ఆయన ద్వారా మనం విశ్వాసం వలన ఈ కృపలో ప్రవేశించి, అందులో కొనసాగుతూ దేవుని మహిమ గురించిన నిశ్చయతలో ఆనందిస్తున్నాం. 3-4 అంతే కాదు, కష్టాలు ఓర్పునూ, ఓర్పు యోగ్యతనూ, యోగ్యత ఆమోదాన్నీ కలిగిస్తాయని తెలిసి మన కష్టాల్లో ఆనందించుదాం. 5 ఈ నమ్మకం మనలను నిరాశపరచదు. ఎందుకంటే దేవుడు మనకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ ద్వారా ఆయన తన ప్రేమను మన హృదయాల్లో కుమ్మరించాడు.
6 ఎందుకంటే మనం బలహీనులుగా ఉండగానే, సరైన సమయంలో క్రీస్తు భక్తిహీనుల కోసం చనిపోయాడు. 7 నీతిపరుని కోసం సైతం ఎవరైనా చనిపోవడం అరుదు. మంచివాడి కోసం ఎవరైనా చనిపోడానికి ఒకవేళ తెగించవచ్చు. 8 అయితే దేవుడు మన మీద తన ప్రేమను వ్యక్తపరిచాడు. ఎలాగంటే మనమింకా పాపులుగా ఉండగానే క్రీస్తు మన కోసం చనిపోయాడు. 9 కాబట్టి ఇప్పుడు ఆయన రక్తం వలన నీతిమంతులుగా తీర్పు పొంది, మరింత నిశ్చయంగా ఆయన ద్వారా ఉగ్రత నుండి తప్పించుకుంటాం. 10 ఎందుకంటే మనం శత్రువులుగా ఉండి, ఆయన కుమారుని మరణం ద్వారా దేవునితో సమాధానపడితే, ఆయన జీవం చేత ఇంకా నిశ్చయంగా రక్షణ పొందుతాము. 11 అంతేకాదు, మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా ఇప్పుడు సమాధాన స్థితి పొందాము కాబట్టి ఆయన ద్వారా మనం దేవునిలో ఆనందిస్తున్నాం.
ఆదాము ద్వారా జన్మపాపం, క్రీస్తు ద్వారా జీవం
పౌలు ఇప్పుడు జన్మపాపం గురించిన సిద్ధాంతాన్ని వివరిస్తాడు. ఒక మనిషి అతిక్రమం ద్వారా పాపం లోకంలోకి ప్రవేశించిందనీ, ఆ తరువాత అందరూ పాపస్వభావంతో పుట్టినందున మరణశిక్ష అందరికీ సంక్రమించిందనీ అతడు చూపిస్తాడు. మోషే ధర్మశాస్త్రం తెలియక ముందే మన స్వభావంలోని చెడుతనం ద్వారా మరణం ఏలింది. మానవజాతికి సాదృశ్యరూపంగా, భూసంబంధమైన శిరస్సుగా ఉన్న ఆదాము పాపాన్ని సంక్రమింపజేశాడు. ఆ సాదృశ్యం సూచించే అసలు వ్యక్తిగా, ఆధ్యాత్మిక శిరస్సుగా ఉన్న క్రీస్తు అందరికీ జీవాన్ని, నీతిమంతులుగా తీర్చబడడాన్ని ప్రసాదించాడు. ఆదాము అవిధేయత ఫలితాల కంటే క్రీస్తు విధేయత ఫలితాలు గొప్పవి. ఒక అపరాధం ద్వారా ఆదాము అతిక్రమాన్ని, మరణాన్ని లోకంలోకి తెచ్చాడు. క్రీస్తు తన విధేయత ద్వారా పాపం కలిగించిన కీడును తొలగించి, విశ్వాసం వల్ల కలిగే నీతి ద్వారా మానవజాతి అంతటికీ జీవమనే ఉచిత బహుమానాన్ని, మానవ అపరాధానికి, అంటే జన్మపాపానికీ వ్యక్తులు చేసిన పాపాలకూ క్షమాపణను తిరిగి అందించాడు. పాపపు దోషాన్ని తెలియజేయడానికి ధర్మశాస్త్రం వచ్చింది. ధర్మశాస్త్రం విధించే శిక్ష నుండి మనలను విడిపించడానికి దేవుని కృప, బహుమానం సమృద్ధిగా ప్రవహిస్తున్నాయి. పాపం మానవజాతి అంతటినీ ఆధ్యాత్మిక మరణానికీ శారీరక మరణానికీ లోబరచి అందరినీ ఏలినట్టే, దేవుని కృప కూడా ఏలుతూ నిత్యజీవానికి నడిపించే పరిశుద్ధతను కలిగిస్తుంది.
రోమీయులకు రాసిన పత్రిక 5:12–21
12 ఇదిలా ఉండగా, ఒక మనిషి ద్వారా పాపం ఎలా ఈ లోకంలోకి ప్రవేశించిందో, అలాగే పాపం ద్వారా మరణం ప్రవేశించింది. మనుషులంతా పాపం చేయడం వలన చావు అందరికీ దాపురించింది. 13 ఎందుకంటే ధర్మశాస్త్రం రాక ముందు కూడా లోకంలో పాపం ఉంది గాని ధర్మశాస్త్రం లేదు కాబట్టి దేవుడు వారిపై పాపం ఆరోపించలేదు. 14 అయినా, ఆదాము కాలం నుండి మోషే కాలం వరకూ మానవులపై మరణం రాజ్యం చేసింది. ఆదాము దేవుని ఆజ్ఞను అతిక్రమించాడు. కాని అతని వలే పాపం చెయ్యని వాళ్ళపై కూడా మరణం రాజ్యం చేసింది. ఆదాము రాబోయే వాడికి ఒక సూచనగా ఉన్నాడు.
15 కాని దేవుడు ఇచ్చిన వరానికి, ఆదాము చేసిన పాపానికి పోలిక లేదు. ఎలాగంటే ఒకడి అపరాధం వలన చాలా మంది చనిపోయారు. అయితే దేవుని అనుగ్రహం, యేసు క్రీస్తు అనే ఒక మనిషి కృప వలన కలిగిన ఉచిత కృపాదానం మరి నిశ్చయంగా అనేకమందికి సమృద్ధిగా కలిగింది. 16 పాపం చేసిన ఒక్కడి వలన శిక్ష కలిగినట్టు ఆ కృపాదానం కలగ లేదు. ఎందుకంటే తీర్పు ఒక్క అపరాధం మూలంగా వచ్చి శిక్షకు కారణమయ్యింది. కృపావరమైతే అనేక అపరాధాల మూలంగా వచ్చి మనుషులను నీతిమంతులుగా తీర్చడానికి కారణమయ్యింది. 17 మరణం ఒక్కడి అపరాధం మూలంగా వచ్చి ఆ ఒక్కడి ద్వారానే ఏలితే విస్తారమైన కృప, నీతి అనే కానుక పొందేవారు జీవం కలిగి మరింత నిశ్చయంగా యేసు క్రీస్తు అనే ఒకడి ద్వారానే ఏలుతారు.
18 కాబట్టి తీర్పు ఒక్క అపరాధం ద్వారా వచ్చి, మనుషులందరిపై శిక్షకు ఏ విధంగా కారణమయ్యిందో, ఆలాగే ఒక్క నీతి కార్యం వలన కృపాదానం మనుషులందరికీ జీవప్రదమైన నీతి కలగడానికి కారణమయ్యింది. 19 ఎందుకంటే ఒకడి అవిధేయత అనేకమందిని పాపులుగా ఎలా చేసిందో, ఆలాగే ఒకడి విధేయత అనేక మందిని నీతిమంతులుగా చేస్తుంది. 20 ధర్మశాస్త్రం ప్రవేశించడం వలన అపరాధం విస్తరించింది. అయినా పాపం మరణాన్ని ఆధారం చేసుకుని ఏవిధంగా ఏలిందో, 21 అదే విధంగా శాశ్వత జీవం కలగడానికి నీతి ద్వారా కృప మన ప్రభు యేసు క్రీస్తు మూలంగా ఏలడానికి పాపం విస్తరించిన చోటెల్లా కృప అపరిమితంగా విస్తరించింది.