యోసేపు సోదరులు తిరిగి వెళ్ళడం, వారి వెనుక యాకోబు వెళ్ళడం (continued)
కరువు కొనసాగుతుంది. యోసేపు సోదరులు రెండవసారి ఐగుప్తుకు వెళ్తారు, వారి తండ్రి వారి వెనుక వెళ్తాడు.
క్రీ.పూ. 1706
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
1 ఇశ్రాయేలు తనకున్నదంతా తీసుకు ప్రయాణమై బెయేర్షెబా వచ్చి తన తండ్రి అయిన ఇస్సాకు దేవునికి బలులర్పించాడు. 2 అప్పుడు రాత్రి దర్శనంలో దేవుడు “యాకోబూ, యాకోబూ” అని ఇశ్రాయేలును పిలిచాడు. అందుకతడు “చిత్తం ప్రభూ” అన్నాడు. 3 ఆయన “నేనే దేవుణ్ణి, మీ తండ్రి దేవుణ్ణి. ఐగుప్తు వెళ్ళడానికి భయపడవద్దు. అక్కడ నిన్ను గొప్ప జనంగా చేస్తాను. 4 నేను నీతో కూడా ఐగుప్తు వస్తాను. నేను నిన్ను తప్పకుండా ఇక్కడికి తిరిగి తీసుకువస్తాను. నువ్వు చనిపోయేటప్పుడు యోసేపు తన సొంత చేతులతో నీ కళ్ళు మూస్తాడు.”
5 యాకోబు లేచి బెయేర్షెబా నుండి తరలి వెళ్ళాడు. ఫరో అతనినెక్కించి తీసుకు రావడానికి పంపిన బండ్ల మీద ఇశ్రాయేలు కొడుకులు తమ తండ్రి యాకోబునూ తమ పిల్లలనూ తమ భార్యలనూ ఎక్కించారు. 6 యాకోబు అతనితో పాటు అతని సంతానమంతా ఐగుప్తు వచ్చారు. వారు తమ పశువులనూ తాము కనానులో సంపాదించిన సంపదనంతా తీసికెళ్లారు. 7 అతడు తన కొడుకులనూ మనుమలనూ తన కూతుర్లనూ తన కొడుకుల కూతుర్లనూ తన సంతానాన్నంతా తనతో ఐగుప్తు తీసుకు వచ్చాడు.
8 ఐగుప్తుకు వచ్చిన ఇశ్రాయేలు కొడుకుల పేర్లు ఇవే.
9 యాకోబు పెద్ద కొడుకు, రూబేను. రూబేను కొడుకులు, హనోకు, పల్లు, హెస్రోను, కర్మీ.
10 షిమ్యోను కొడుకులు, యెమూయేలు, యామీను, ఓహదు, యాకీను, సోహరు, కనానీయురాలి కొడుకు షావూలు.
11 లేవి కొడుకులు, గెర్షోను, కహాతు, మెరారి.
12 యూదా కొడుకులు ఏరు, ఓనాను, షేలా, పెరెసు, జెరహు. (ఏరు, ఓనాను, కనాను దేశంలో చనిపోయారు). పెరెసు కొడుకులు హెస్రోను, హామూలు.
13 ఇశ్శాఖారు కొడుకులు తోలా, పువ్వా, యోబు, షిమ్రోను.
14 జెబూలూను కొడుకులు సెరెదు, ఏలోను, యహలేలు.
15 వీరు లేయా కొడుకులు. ఆమె పద్దనరాములో యాకోబుకు వారిని అతని కూతురు దీనానూ కన్నది. అతని కొడుకులూ అతని కుమార్తెలూ మొత్తం ముప్ఫై ముగ్గురు.
16 గాదు కొడుకులు సిప్యోను, హగ్గీ, షూనీ, ఎస్బోను, ఏరీ, ఆరోదీ, అరేలీ.
17 ఆషేరు కొడుకులు ఇమ్నా, ఇష్వా, ఇష్వీ, బెరీయా. వారి సోదరి శెరహు. బెరీయా కొడుకులు హెబెరు, మల్కీయేలు. 18 లాబాను తన కూతురు లేయా కిచ్చిన జిల్పా కొడుకులు వీరే. ఆమె ఈ పదహారు మందిని యాకోబుకు కన్నది.
19 యాకోబు భార్య అయిన రాహేలు కొడుకులు యోసేపు, బెన్యామీను.
20 యోసేపుకు మనష్షే, ఎఫ్రాయిములు పుట్టారు. వారిని ఐగుప్తుదేశంలో ఓనుకు యాజకుడైన పోతీఫెర కూతురు ఆసెనతు అతనికి కన్నది.
21 బెన్యామీను కొడుకులు బెల, బేకెరు, అష్బేలు, గెరా, నయమాను, ఏహీరోషు, ముప్పీము, హుప్పీము, ఆర్దు. 22 యాకోబుకు రాహేలు కనిన కొడుకులైన వీరంతా పద్నాలుగురు.
23 దాను కొడుకు హుషీము.
24 నఫ్తాలి కొడుకులు యహనేలు, గూనీ, యేసెరు, షిల్లేము. 25 లాబాను తన కూతురు రాహేలుకు ఇచ్చిన బిల్హా కొడుకులు వీరే. ఆమె వారిని యాకోబుకు కన్నది. వారంతా ఏడుగురు. 26 యాకోబు కోడళ్ళను మినహాయించి అతని వారసులు యాకోబుతో ఐగుప్తుకు వచ్చిన వారంతా అరవై ఆరుగురు. 27 ఐగుప్తులో యోసేపుకు పుట్టిన కొడుకులు ఇద్దరు. ఐగుప్తుకు వచ్చిన యాకోబు కుటుంబీకులు మొత్తం డెభ్భై మంది.
28 యాకోబు గోషెనుకు దారి చూపడానికి యోసేపు దగ్గరికి యూదాను తనకు ముందుగా పంపాడు. వారు గోషెను ప్రాంతానికి వచ్చారు. 29 యోసేపు తన రథాన్ని సిద్ధం చేయించి తన తండ్రి ఇశ్రాయేలును కలుసుకోడానికి గోషెనుకు వచ్చాడు. యోసేపు అతన్ని చూసి, అతని మెడను కౌగలించుకుని చాలా సేపు ఏడ్చాడు. 30 అప్పుడు ఇశ్రాయేలు యోసేపుతో “నీవింకా బతికే ఉన్నావు. నీ ముఖం చూశాను. కాబట్టి నేనిక చనిపోగలను” అని చెప్పాడు.
31 యోసేపు తన సోదరులతో తన తండ్రి కుటుంబం వారితో “నేను వెళ్ళి ఇది ఫరోకు తెలియచేసి, ‘కనాను దేశంలో ఉన్న నా సోదరులూ నా తండ్రి కుటుంబం వారూ నా దగ్గరికి వచ్చారు. 32 వారు గొర్రెల కాపరులు. పశువులను మేపేవారు. వారు తమకు కలిగినదంతా తీసుకు వచ్చారు’ అని అతనితో చెబుతాను. 33 కాబట్టి ఫరో మిమ్మల్ని పిలిపించి, ‘మీ వృత్తి ఏంటి?’ అని అడిగితే 34 ‘మా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకూ మేమూ మా పూర్వీకులంతా కాపరులం.’ మీరు గోషెను ప్రాంతంలో నివసించేలా ఇలా చెప్పండి. ఎందుకంటే, గొర్రెల కాపరి వృత్తిలో ఉన్నవారంటే ఐగుప్తీయులకు అసహ్యం.”
47:1 యోసేపు వెళ్ళి ఫరోతో “మా నాన్న, నా అన్నలు వారి గొర్రెల మందలతో వారి పశువులతో వారికి కలిగినదంతటితో కనాను దేశం నుండి వచ్చి గోషెనులో ఉన్నారు” అని తెలియచేసి, 2 తన సోదరుల్లో ఐదు గురిని వెంటబెట్టుకుని వెళ్లి వారిని ఫరో ముందు నిలబెట్టాడు. 3 ఫరో, అతని సోదరులను చూసి “మీ వృత్తి ఏంటి?” అని అడిగితే వారు “నీ దాసులమైన మేమూ మా పూర్వికులు, గొర్రెల కాపరులం” అని ఫరోతో చెప్పారు. 4 వారు “కనాను దేశంలో కరువు తీవ్రంగా ఉంది. నీ దాసుల మందలకు మేత లేదు కాబట్టి ఈ దేశంలో కొంత కాలముండడానికి వచ్చాము. గోషెను ప్రాంతంలో నీ దాసులు నివసించడానికి సెలవు ఇప్పించండి” అని ఫరోతో అన్నారు. 5 ఫరో యోసేపును చూసి “మీ నాన్న, నీ సోదరులు నీ దగ్గరికి వచ్చారు. 6 ఐగుప్తు దేశం నీ ఎదుట ఉంది. ఈ దేశంలోని మంచి ప్రాంతంలో మీ నాన్న, నీ సోదరులూ నివసించేలా చెయ్యి. గోషెను ప్రాంతంలో వారు నివసించవచ్చు. వారిలో ఎవరైనా సమర్ధులని నీకు అనిపిస్తే నా మందల మీద వారిని అధిపతులుగా నియమించు” అని చెప్పాడు.
7 యోసేపు తన తండ్రి యాకోబును లోపలికి తీసుకు వచ్చి ఫరో ముందు నిలబెట్టినప్పుడు, యాకోబు ఫరోను దీవించాడు. 8 ఫరో “నీ వయసెంత?” అని యాకోబును అడిగాడు. 9 యాకోబు “నేను ప్రయాణాలు చేసినవి 130 ఏళ్ళు. నా జీవించిన దినాలు కొద్డిగానూ బాధాకరమైనవిగానూ ఉన్నాయి. అవి నా పూర్వీకులు యాత్ర చేసిన సంవత్సరాలన్ని కాలేదు” అని ఫరోతో చెప్పి, 10 ఫరోను దీవించి వెళ్ళిపోయాడు.
11 ఫరో ఆజ్ఞ ఇచ్చినట్లే, యోసేపు తన తండ్రికీ తన సోదరులకూ ఐగుప్తు దేశంలో రామెసేసు అనే మంచి ప్రదేశంలో స్వాస్థ్యం ఇచ్చాడు. 12 యోసేపు తన తండ్రినీ తన సోదరులనూ తన తండ్రి కుటుంబం వారినందరినీ పోషిస్తూ వారి పిల్లల లెక్క ప్రకారం ఆహారమిచ్చి సంరక్షించాడు.
యోసేపు ఐగుప్తును పరిపాలించడం క్రీ.పూ. 1704
13 కరువు చాలా తీవ్రంగా ఉంది కాబట్టి ఆ దేశమంతటా ఆహారం లేదు. కరువుతో ఐగుప్తు దేశం, కనాను దేశం దుర్బలమైన స్థితికి వచ్చాయి. 14 యోసేపు ప్రజలకు ధాన్యం అమ్ముతూ ఐగుప్తు దేశంలోనూ కనాను దేశంలోనూ ఉన్న డబ్బంతా పోగుచేశాడు. ఆ డబ్బంతా, ఫరో భవనంలోకి యోసేపు తెప్పించాడు. 15 ఐగుప్తు దేశంలో కనాను దేశంలో డబ్బు అయిపోయిన తరువాత ఐగుప్తీయులంతా యోసేపు దగ్గరికి వచ్చి “మాకు ఆహారం ఇప్పించు. నీ ముందు మేమెందుకు చావాలి? మా డబ్బంతా అయిపోయింది” అన్నారు.
16 అందుకు యోసేపు “మీ పశువులు ఇవ్వండి, మీ డబ్బులు అయిపోతే మీ పశువులకు బదులు నేను మీకు ధాన్యమిస్తాను” అని చెప్పాడు. 17 కాబట్టి వారు తమ పశువులను యోసేపు దగ్గరికి తెచ్చారు. ఆ సంవత్సరం, వారి మందలన్నిటికి బదులుగా అతడు వారికి ఆహారమిచ్చి వారిని పోషించాడు. 18 ఆ సంవత్సరం గడిచాక, తరువాత సంవత్సరం వారు అతని దగ్గరికి వచ్చి “మా డబ్బంతా అయిపోయింది. ఆ సంగతి మా యజమానులైన మీ దగ్గర దాచలేము. మా పశువుల మందలన్నీ మా యజమానులైన మీ వశమయ్యాయి. మా శరీరాలూ మా భూములూ తప్ప ఇంకేమీ మాకు మిగలలేదు. 19 మీ కళ్ళముందు మేమూ మా పొలాలు ఎందుకు నశించాలి? ఆహారమిచ్చి మమ్మల్నీ మా పొలాలనూ కొనండి. మా పొలాలతో పాటు మేము ఫరోకు దాసులమవుతాం. మేము చావకుండా బతికేలా, పొలాలు పాడైపోకుండా మాకు విత్తనాలివ్వండి” అని అడిగారు.
20 ఆవిధంగా, యోసేపు ఐగుప్తు భూములన్నిటినీ ఫరో కోసం కొన్నాడు. కరువు ఇగుప్తు వారిపాలిట తీవ్రంగా ఉండడం వలన వారంతా తమ పొలాలను అమ్మేశారు కాబట్టి, భూమి ఫరోది అయింది. 21 అతడు ఐగుప్తు పొలిమేరల ఈ చివరనుండి ఆ చివర వరకూ ప్రజలను దాసులుగా చేశాడు. 22 యాజకుల భూమి మాత్రమే అతడు కొనలేదు, యాజకులకు ఫరో భత్యం నియమించాడు. వారు ఫరో ఇచ్చిన ఆహారం తినే వారు కాబట్టి వారు తమ భూములను అమ్మలేదు. 23 యోసేపు “ఇదిగో నేడు మిమ్మల్ని, మీ భూములను ఫరో కోసం కొన్నాను. మీకు విత్తనాలు ఇవిగో. పొలాల్లో చల్లండి. 24 నాలుగు భాగాలు మీవి. పంటలో అయిదవ భాగం మీరు ఫరోకు ఇవ్వాలి. అది పొలాల్లో విత్తడానికీ మీ పిల్లలకూ మీ ఇంట్లోవారి ఆహారానికి” అని ప్రజలతో చెప్పాడు. 25 వారు “నువ్వు మా ప్రాణాలు నిలబెట్టావు. మాపై నీ దయ ఉండుగాక. మేము ఫరోకు బానిసలమవుతాం” అని చెప్పారు. 26 అప్పుడు ఐదవ భాగం ఫరోది అని యోసేపు ఐగుప్తు వారికి చట్టం నియమించాడు. అది ఇప్పటివరకూ నిలిచి వుంది. యాజకుల భూములు మాత్రమే ఫరోవి కాలేదు.