యోసేపు సోదరులు తిరిగి వెళ్ళడం, వారి వెనుక యాకోబు వెళ్ళడం (continued)

కరువు కొనసాగుతుంది. యోసేపు సోదరులు రెండవసారి ఐగుప్తుకు వెళ్తారు, వారి తండ్రి వారి వెనుక వెళ్తాడు.

క్రీ.పూ. 1706

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

ఆదికాండం 44–45

1 యోసేపు “వారు మోసికెళ్ళినంత ఆహారాన్ని వారి సంచుల్లో నింపి ఎవరి డబ్బు వారి సంచి మూతిలో పెట్టు, 2 చివరివాడి సంచి మూతిలో నా వెండి గిన్నె, అతని ధాన్యపు డబ్బు పెట్టు” అని తన గృహ నిర్వాహకునికి ఆజ్ఞాపించగా, యోసేపు చెప్పినట్టు అతడు చేశాడు.

3 తెల్లవారినప్పుడు ఆ మనుషులను తమ గాడిదలతో పాటు పంపి వేశారు. 4 వారు ఆ పట్టణం నుండి బయలుదేరి ఎంతో దూరం వెళ్ళక ముందే, యోసేపు తన గృహనిర్వాహకునితో “నువ్వు లేచి ఆ మనుష్యుల వెంబడించి వెళ్ళి వారిని కలుసుకుని, ‘మీరు మేలుకు ప్రతిగా కీడు చేశారేమిటి? 5 నా యజమాని తాగే గిన్నె, శకునాలు చూసే గిన్నె యిదే కదా? మీరు చేసిన ఈ పని చాలా దుర్మార్గం’ అని వారితో చెప్పు” అన్నాడు. 6 అతడు వారిని కలుసుకుని ఆ మాటలు వారితో చెప్పాడు. 7 వారు “మా ప్రభువు ఇలాంటి మాటలు చెప్పడం ఎందుకు? మీ దాసులైన మేము ఇలాంటి పని చేయము.

8 చూడండి, మా సంచుల మూతుల్లో మాకు దొరికిన డబ్బును కనాను దేశంలో నుండి తిరిగి తీసుకు వచ్చాము. నీ ప్రభువు ఇంట్లో నుంచి మేము వెండి గానీ బంగారం గానీ ఎలా దొంగిలిస్తాము? 9 నీ దాసుల్లో ఎవరి దగ్గర అది దొరుకుతుందో వాడు చస్తాడు గాక. మేము మా ప్రభువుకు దాసులమవుతాం” అని అతనితో అన్నారు. 10 గృహ నిర్వాహకుడు “మంచిది, మీరు చెప్పినట్టే చేయండి. ఎవరి దగ్గర ఆ గిన్నె దొరుకుతుందో అతడే నాకు బానిస ఆవుతాడు. మిగతా వారు నిర్దోషులు” అని చెప్పాడు. 11 అప్పుడు ప్రతివాడూ గబగబా తన సంచిని దించి దాన్ని విప్పాడు. 12 ఆ గృహ నిర్వాహకుడు పెద్దవాడి సంచితో మొదలు పెట్టి చిన్నవాడి సంచి వరకూ వెతికాడు. ఆ గిన్నె బెన్యామీను సంచిలో దొరికింది. 13 వారు తమ బట్టలు చింపుకున్నారు. అందరూ గాడిదల మీద సంచులు ఎక్కించుకుని పట్టణానికి తిరిగి వచ్చారు.

14 అప్పుడు యూదా, అతని సోదరులు యోసేపు ఇంటికి వచ్చారు. అతడింకా అక్కడే ఉన్నాడు, వారు అతని ముందు నేలమీద సాగిలపడ్డారు. 15 అప్పుడు యోసేపు “మీరు చేసిన ఈ పని ఏమిటి? నాలాటి మనిషి శకునం చూసి తెలుసుకుంటాడని మీకు తెలియదా” అని వారితో అన్నాడు. 16 యూదా “మా యజమానులైన మీతో ఏమి చెప్పగలం? ఏమనగలం? మేము నిర్దోషులమని ఎలా రుజువు చేయగలం? దేవుడే నీ దాసుల అపరాధం కనుగొన్నాడు. ఇదిగో, మేమూ ఎవని దగ్గర ఆ గిన్నె దొరికిందో వాడూ మా యజమానులైన మీకు దాసులమవుతాం” అన్నాడు. 17 యోసేపు “అలా చేయడం నాకు దూరమౌతుంది గాక. ఎవరి దగ్గర ఆ గిన్నె దొరికిందో వాడే నాకు దాసుడుగా ఉంటాడు. మీరు మీ తండ్రి దగ్గరికి సమాధానంగా వెళ్ళండి” అని చెప్పాడు.

18 యూదా అతని సమీపించి “ప్రభూ, ఒక మనవి. ఒక మాట రహస్యంగా నా యజమానులైన మీతో మీ దాసుడైన నన్ను చెప్పుకోనివ్వండి. తమ కోపం తమ దాసుని మీద రగులుకోనివ్వకండి. తమరు ఫరో అంతవారు గదా. 19 నా యజమానులైన మీరు, ‘మీకు తండ్రి అయినా తమ్ముడైనా ఉన్నాడా?’ అని తమ దాసులను అడిగారు. 20 అందుకు మేము, ‘మాకు ముసలి వాడైన తండ్రి, అతని ముసలితనంలో పుట్టిన ఒక చిన్నవాడు ఉన్నారు. వాని అన్న చనిపోయాడు. వాడి తల్లికి వాడొక్కడే మిగిలాడు. అతని తండ్రి అతన్ని ఎంతో ప్రేమిస్తాడు’ అన్నాము. 21 అప్పుడు తమరు, ‘నేనతన్ని చూడడానికి అతన్ని నా దగ్గరికి తీసుకు రండి’ అని తమ దాసులతో చెప్పారు.

22 అందుకు మేము, ‘ఆ చిన్నవాడు తన తండ్రిని వదిలి ఉండలేడు. వాడు తన తండ్రిని విడిచి పోతే వాడి తండ్రి చనిపోతాడు’ అని నా యజమానులైన మీతో చెప్పాము. 23 అందుకు తమరు, ‘మీ తమ్ముడు మీతో రాకపోతే మీరు మళ్లీ నా ముఖం చూడకూడదు’ అని తమ దాసులతో చెప్పారు. 24 కాబట్టి నా తండ్రి అయిన తమ దాసుని దగ్గరికి మేము వెళ్ళి, నా యజమానులైన మీ మాటలను అతనికి తెలియచేశాము. 25 మా తండ్రి, ‘మీరు తిరిగి వెళ్ళి మన కోసం కొంచెం ఆహారం కొనుక్కుని రండి’ అని చెబితే 26 ‘మేము అక్కడికి వెళ్ళలేము, మా తమ్ముడు మాతో కూడా ఉంటేనే వెళ్తాము. మా తమ్ముడు మాతో ఉంటేనే గాని ఆయన ముఖం చూడలేము’ అని చెప్పాము.

27 అందుకు తమ దాసుడైన నా తండ్రి, ‘నా భార్య నాకిద్దరిని కన్నదని మీకు తెలుసు. 28 వారిలో ఒకడు నాకు దూరమైపోయాడు. అతడు తప్పకుండా క్రూర మృగాల బారిన పడి ఉంటాడు. అప్పటినుంచి అతడు నాకు కనబడలేదు. 29 మీరు నా దగ్గరనుంచి ఇతన్ని కూడా తీసుకుపోతే, ఇతనికి ఏదైనా హాని జరిగితే, తల నెరిసిన నన్ను మృతుల లోకంలోకి దుఃఖంతో దిగిపోయేలా చేస్తారు’ అని మాతో చెప్పాడు.

30 కాబట్టి, తమ దాసుడైన నా తండ్రి దగ్గరికి నేను తిరిగి వెళ్ళినప్పుడు ఈ చిన్నవాడు మాతో బాటు లేకపోతే 31 మా తండ్రి ప్రాణం ఇతని ప్రాణంతో పెనవేసుకుంది కాబట్టి ఈ చిన్నవాడు మాతో లేకపోవడం చూడగానే అతడు చచ్చిపోతాడు. అలా తమ దాసులమైన మేము తల నెరిసిన తమ సేవకుడైన మా తండ్రిని మృతుల లోకంలోకి దుఃఖంతో దిగిపోయేలా చేస్తాము. 32 తమ సేవకుడినైన నేను, ‘ఈ బాలునికి జామీనుగా ఉండి, నీ దగ్గరికి నేనతని తీసుకు రాకపోతే మా నాన్న దృష్టిలో ఆ నింద నా మీద ఎప్పుడూ ఉంటుంది’ అని చెప్పాను. 33 కాబట్టి తమ దాసుడైన నన్ను ఈ అబ్బాయికి ప్రతిగా ఏలినవారికి దాసునిగా ఉండనిచ్చి ఈ చిన్నవాణ్ణి తన సోదరులతో వెళ్ళనివ్వండి. 34 ఈ చిన్నవాడు నాతో కూడ లేకపోతే మా నాన్న దగ్గరికి నేనెలా వెళ్ళగలను? ఒకవేళ వెళితే, మా నాన్నకు వచ్చే అపాయం చూడవలసి వస్తుంది” అని చెప్పాడు.

45:1 అప్పుడు యోసేపు తన దగ్గర నిలబడ్డ పరివారం ఎదుట తమాయించుకోలేక “అందరినీ నా దగ్గరనుంచి బయటికి పంపేయండి” అని బిగ్గరగా చెప్పాడు. యోసేపు తన అన్నలకు తనను తాను తెలియజేసుకున్నప్పుడు అతని దగ్గర ఎవరూ లేరు. 2 అతడు పెద్దగా ఏడవగా ఐగుప్తీయులు విన్నారు. ఫరో ఇంటివారు ఆ ఏడుపు విన్నారు. 3 అప్పుడు యోసేపు “నేను యోసేపును. నా తండ్రి ఇంకా బతికే ఉన్నాడా?” అని అడిగినప్పుడు, అతని సోదరులు అతని సమక్షంలో కంగారుపడి అతనికి జవాబు ఇవ్వలేకపోయారు. 4 అప్పుడు యోసేపు “నా దగ్గరికి రండి” అని తన సోదరులతో చెబితే, వారు అతని దగ్గరికి వచ్చారు. అప్పుడతడు “ఐగుప్తుకు వెళ్లిపోయేలా మీరు అమ్మేసిన మీ తమ్ముడు యోసేపును నేనే. 5 అయినా, నన్నిక్కడకు మీరు అమ్మేసినందుకు దుఃఖపడవద్దు. మిమ్మల్ని మీరు నిందించుకోవద్దు. ప్రాణరక్షణ కోసం దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాడు. 6 రెండేళ్ళ నుంచి దేశంలో కరువు ఉంది. ఇంకా ఐదేళ్ళు దున్నడం గానీ పంటకోత గానీ ఉండదు.

7 మిమ్మల్ని రక్షించి, భూమి మీద మిమ్మల్ని శేషంగా నిలపడానికీ ప్రాణాలతో కాపాడడానికీ దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాడు. 8 కాబట్టి నన్ను దేవుడే పంపాడు. మీరు కాదు. ఆయన నన్ను ఫరోకు తండ్రిగా అతని ఇంటివారందరికి ప్రభువుగా ఐగుప్తు దేశమంతటి మీదా అధికారిగా నియమించాడు. 9 మీరు త్వరగా నా తండ్రి దగ్గరికి వెళ్ళి అతనితో ‘నీ కొడుకు యోసేపు ఇలా చెబుతున్నాడు-దేవుడు నన్ను ఐగుప్తు దేశమంతటి మీదా అధిపతిగా నియమించాడు, నా దగ్గరికి రండి. ఆలస్యం చేయవద్దు. 10 నువ్వు గోషెను ప్రాంతంలో నివసిస్తావు. అప్పుడు నువ్వూ నీ పిల్లలూ నీ పిల్లల పిల్లలూ నీ గొర్రెల మందలూ నీ పశువులూ నీకు కలిగిన సమస్తమూ నాకు దగ్గరగా ఉంటాయి. 11 ఇంకా ఐదేళ్ళు కరువు ఉంటుంది, కాబట్టి నీకూ నీ ఇంటి వారికీ నీకు కలిగినదానంతటికీ పేదరికం రాకుండా అక్కడ నిన్ను పోషిస్తాను’ అన్నాడని చెప్పండి. 12 ఇదిగో మీతో మాట్లాడేది నా నోరే అని మీ కళ్ళూ నా తమ్ముడు బెన్యామీను కళ్ళూ చూస్తున్నాయి.

13 ఐగుప్తులో నాకున్న వైభవాన్నీ మీరు చూసిన సమస్తాన్నీ మా నాన్నకు తెలియచేసి త్వరగా మా నాన్నను ఇక్కడికి తీసుకు రండి” అని తన సోదరులతో చెప్పాడు. 14 తన తమ్ముడు బెన్యామీను మెడను కౌగలించుకుని ఏడ్చాడు. బెన్యామీను అతణ్ణి కౌగలించుకుని ఏడ్చాడు. 15 అతడు తన సోదరులందరిని ముద్దు పెట్టుకుని వారిని హత్తుకుని ఏడ్చిన తరువాత అతని సోదరులు అతనితో మాట్లాడారు. 16 “యోసేపు సోదరులు వచ్చారు” అనే సంగతి ఫరో ఇంట్లో వినబడింది. అది ఫరోకు, అతని సేవకులకు చాలా ఇష్టమయింది. 17 అప్పుడు ఫరో యోసేపుతో ఇలా అన్నాడు “నీ సోదరులతో ఇలా చెప్పు, ‘మీరిలా చేయండి. మీ పశువుల మీద బరువులు కట్టి కనాను దేశానికి వెళ్ళి 18 మీ తండ్రినీ మీ ఇంటివారిని వెంట బెట్టుకుని నా దగ్గరికి రండి, ఐగుప్తు దేశంలోని మంచి వస్తువులను మీకిస్తాను. ఈ దేశపు సారాన్ని మీరు అనుభవిస్తారు. 19 మీకు ఆజ్ఞ ఇస్తున్నాను, ఇలా చేయండి. మీ పిల్లల కోసం, మీ భార్యల కోసం ఐగుప్తులో నుండి బండ్లను తీసుకుపోయి మీ తండ్రిని వెంటబెట్టుకుని రండి. 20 ఐగుప్తు దేశమంతటిలో ఉన్న మంచి వస్తువులు మీవే అవుతాయి కాబట్టి మీ సామగ్రిని లక్ష్యపెట్టవద్దు’” అన్నాడు. 21 ఇశ్రాయేలు కుమారులు అలాగే చేశారు. యోసేపు ఫరో మాట ప్రకారం వారికి బండ్లు ఇప్పించాడు. ప్రయాణానికి భోజన పదార్ధాలు ఇప్పించాడు. 22 అతడు వారికి రెండేసి జతల బట్టలు ఇచ్చాడు, బెన్యామీనుకు 300 షెకెల్ ల వెండి, ఐదు జతల బట్టలు ఇచ్చాడు. 23 అతడు తన తండ్రి కోసం వీటిని పంపించాడు, ఐగుప్తులోని శ్రేష్ఠమైన వాటిని మోస్తున్న పది గాడిదలనూ ప్రయాణానికి తన తండ్రి కోసం ఆహారం, ఇతర ధాన్యం, వేర్వేరు తినే సరుకులు మోస్తున్న పది ఆడ గాడిదలనూ పంపించాడు. 24 అప్పుడతడు తన సోదరులను సాగనంపి వారు బయలుదేరుతుంటే “దారిలో పోట్లాడుకోవద్దు” అని వారితో చెప్పాడు.

25 వారు ఐగుప్తునుండి బయలు దేరి కనాను దేశానికి తమ తండ్రి అయిన యాకోబు దగ్గరికి వచ్చి 26 “యోసేపు ఇంకా బతికే ఉన్నాడు. ఐగుప్తు దేశమంతటి మీదా అధిపతిగా ఉన్నాడు” అని అతనికి తెలియచేశారు. అయితే అతడు వారి మాట నమ్మలేక పోయాడు. అతని హృదయం విస్మయం చెందింది. 27 అప్పుడు వారు యోసేపు తమతో చెప్పిన మాటలన్నీ అతనితో చెప్పారు. తనను తీసుకు వెళ్ళడానికి యోసేపు పంపిన బండ్లు చూసి, వారి తండ్రి యాకోబు ప్రాణం తెప్పరిల్లింది. 28 అప్పుడు ఇశ్రాయేలు “ఇంతే చాలు. నా కొడుకు యోసేపు బతికే ఉన్నాడు, నేను చావక ముందు వెళ్ళి అతన్ని చూస్తాను” అన్నాడు.