భాగం 6: యాకోబు, పితరుల మరణాలు
యాకోబు తన కుమారులను ఆశీర్వదించి మరణించడం
క్రీ.పూ. 1689
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
27 ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలోని గోషెను ప్రాంతంలో నివసించారు. అందులో వారు ఆస్తి సంపాదించుకుని సంతానాభివృద్ధి పొంది చాలా విస్తరించారు. 28 యాకోబు ఐగుప్తుదేశంలో 17 ఏళ్ళు జీవించాడు. యాకోబు మొత్తం 147 ఏళ్ళు బతికాడు. 29 ఇశ్రాయేలు అవసాన కాలం దగ్గర పడినప్పుడు అతడు తన కొడుకు యోసేపును పిలిపించి “నాపట్ల నీకు అభిమానం ఉంటే, నీ చెయ్యి నా తొడ కింద ఉంచి నాకు నమ్మకాన్నీ విశ్వాసాన్నీ కలిగించు. దయచేసి నన్ను ఐగుప్తులో పాతిపెట్టవద్దు. 30 నేను నా పితరులతో నిద్రించినప్పుడు ఐగుప్తులో నుంచి నన్ను తీసుకెళ్ళి, వారి సమాధిలో నన్ను పాతిపెట్టు” అని అతనితో చెప్పాడు. 31 అందుకు యోసేపు “నేను నీ మాట చొప్పున చేస్తాను” అన్నాడు. ఇశ్రాయేలు “నాతో ప్రమాణం చెయ్యి” అంటే, యోసేపు అతనితో ప్రమాణం చేశాడు. అప్పుడు ఇశ్రాయేలు తన పడక తలగడ దగ్గర వంగి నమస్కరించాడు.
48:1 ఈ సంగతులైన తరువాత “ఇదిగో, మీ నాన్నకు ఒంట్లో బాగాలేదు” అని ఒకడు యోసేపుతో చెప్పాడు. అప్పుడతడు మనష్షే, ఎఫ్రాయిము అనే తన ఇద్దరు కొడుకులను వెంటబెట్టుకుని వెళ్ళాడు. 2 “ఇదిగో నీ కొడుకు యోసేపు నీ దగ్గరికి వస్తున్నాడు” అని యాకోబుకు తెలిసింది. అప్పుడు ఇశ్రాయేలు బలం తెచ్చుకుని తన మంచం మీద కూర్చున్నాడు.
3 అతడు యోసేపుతో “కనాను దేశంలో ఉన్న లూజులో సర్వశక్తిగల దేవుడు నాకు కనబడి నన్ను ఆశీర్వదించి 4 ‘ఇదిగో నిన్ను ఫలవంతంగా చేసి, విస్తరింపజేస్తాను. నువ్వు జన సమూహమయ్యేలా చేస్తాను. నీ వారసులకు ఈ దేశాన్ని నిత్య స్వాస్థ్యంగా ఇస్తాను’ అన్నాడు. 5 నేను ఐగుప్తుకు నీ దగ్గరికి రాకముందు ఐగుప్తు దేశంలో నీకు పుట్టిన నీ ఇద్దరు కొడుకులు నా బిడ్డలే. రూబేను షిమ్యోనుల్లాగే ఎఫ్రాయిము, మనష్షే నా కొడుకులే. 6 వారి తరువాత నీకు పుట్టిన సంతానం నీదే. వారి పేర్లు వారి సోదరుల స్వాస్థ్యం జాబితాల ప్రకారం నమోదు అవుతాయి.
7 పద్దనరాము నుండి నేను వస్తున్నపుడు, ఎఫ్రాతాకు ఇంకా కొంత దూరాన ఉన్నపుడు ప్రయాణంలో రాహేలు కనాను దేశంలో చనిపోయింది. అక్కడ బేత్లెహేము అనే ఎఫ్రాతా దారిలో నేను ఆమెను పాతిపెట్టాను” అని యాకోబు చెప్పాడు. 8 ఇశ్రాయేలు, యోసేపు కొడుకులను చూసి “వీరెవరు?” అని అడిగాడు. 9 యోసేపు “వీళ్ళు నా కొడుకులు. వీరిని ఈ దేశంలో దేవుడు నాకిచ్చాడు” అని తన తండ్రితో చెప్పాడు. అందుకతడు “నేను వారిని దీవించడానికి నా దగ్గరికి వారిని తీసుకు రా” అన్నాడు. 10 ఇశ్రాయేలు కళ్ళు వృద్ధాప్యం వలన మసకబారి చూడలేక పోయాడు. కాబట్టి, యోసేపు వారిని అతని దగ్గరికి తీసుకు వచ్చాడు. అతడు వారిని ముద్దు పెట్టుకుని కౌగిలించుకున్నాడు.
11 ఇశ్రాయేలు యోసేపుతో “నీ ముఖాన్ని మళ్ళీ చూస్తానని నేను అనుకోలేదు. అయితే, నీ సంతానాన్ని కూడా దేవుడు నన్ను చూడనిచ్చాడు” అన్నాడు. 12 యోసేపు అతని మోకాళ్ళ మధ్య నుండి వారిని తీసుకు అతనికి సాగిలపడ్డాడు. 13 తరువాత యోసేపు ఇశ్రాయేలు ఎడమచేతి వైపు తన కుడిచేత ఎఫ్రాయిమును, ఇశ్రాయేలు కుడిచేతి వైపు తన ఎడమ చేత మనష్షేను పట్టుకుని, వారిద్దరిని అతని సమీపంగా తీసుకు వచ్చాడు. 14 ఇశ్రాయేలు, చిన్నవాడైన ఎఫ్రాయిము తల మీద తన కుడిచేతిని, మనష్షే తలమీద తన ఎడమచేతిని ఉంచాడు.
15 ఇశ్రాయేలు యోసేపును దీవించి
“నా పూర్వీకులు అబ్రాహాము ఇస్సాకులు ఎవరి సమక్షంలో నడుచుకున్నారో
ఆ దేవుడు, ఇప్పటి వరకూ నన్ను పోషించిన ఆ దేవుడు,
16 సమస్త కీడుల నుంచి నన్ను కాపాడిన దూత, ఈ పిల్లలను దీవించు గాక.
నా పేరు, అబ్రాహాము ఇస్సాకులనే నా పితరుల పేరు వారికి కలుగు గాక.
లోకంలో వారు విస్తార జనసమూహంగా అవుతారు గాక” అన్నాడు.
17 యోసేపు ఎఫ్రాయిము తల మీద తన తండ్రి కుడిచెయ్యి పెట్టడం చూశాడు. అది అతనికి నచ్చలేదు. అతడు మనష్షే తల మీద పెట్టించాలని తన తండ్రి చెయ్యి, ఎఫ్రాయిము తలమీద నుండి ఎత్తి, 18 “నాన్నా, అలా కాదు. ఇతడే పెద్దవాడు. నీ కుడి చెయ్యి ఇతని తలమీద పెట్టు” అని చెప్పాడు. 19 అతని తండ్రి ఒప్పుకోక “నాకు తెలుసు. కచ్చితంగా తెలుసు. ఇతడు కూడా ఒక జన సమూహమై గొప్పవాడవుతాడు. అయితే, ఇతని తమ్ముడు ఇతని కంటే గొప్పవాడవుతాడు. అతని సంతానం జన సమూహాలు అవుతారు” అన్నాడు. 20 ఆ రోజు అతడు వారిని ఇలా దీవించాడు. “ఇశ్రాయేలీయులు ఎవరినైనా దీవించేటపుడు, ‘ఎఫ్రాయిములాగా మనష్షేలాగా దేవుడు మిమ్మల్ని చేస్తాడు గాక’ అని మీ పేరెత్తి దీవిస్తారు” అని చెప్పి మనష్షే కంటే ఎఫ్రాయిమును ముందుగా ఉంచాడు. 21 ఇశ్రాయేలు “ఇదిగో నేను చనిపోతున్నాను, అయినా దేవుడు మీకు తోడై ఉండి మీ పూర్వీకుల దేశానికి మిమ్మల్ని తిరిగి రప్పిస్తాడు. 22 నేను నీ సోదరులకంటే నీకు ఒక భాగం ఎక్కువ ఇచ్చాను. దాన్ని, నా కత్తితో నా వింటితో, అమోరీయుల చేతిలో నుండి తీసుకున్నాను” అని యోసేపుతో చెప్పాడు.
49:1 యాకోబు తన కొడుకులను పిలిపించి ఇలా అన్నాడు. “మీరు కలిసి రండి, రాబోయే రోజుల్లో మీకు ఏం జరుగుతుందో నేను చెబుతాను.
2 యాకోబు కొడుకుల్లారా, కలిసి వచ్చి వినండి.
మీ తండ్రి ఇశ్రాయేలు మాట వినండి.
3 రూబేనూ, నువ్వు నా పెద్ద కొడుకువి. నా బలానివి,
నా శక్తి ప్రథమ ఫలానివి. ఘనతలోనూ బలంలోనూ ఆధిక్యం గలవాడివి.
4 పారే నీళ్ళలా చంచలుడివి. నీది ఉన్నత స్థాయి కాదు.
ఎందుకంటే నువ్వు, నీ తండ్రి మంచం ఎక్కి దాన్ని అపవిత్రం చేశావు.
నువ్వు నా మంచం మీదికి ఎక్కావు.
5 షిమ్యోను, లేవి అన్నదమ్ములే. వారి కత్తులు దౌర్జన్యం చేసే ఆయుధాలు.
6 నా ప్రాణమా, వారి ఆలోచనలో చేరవద్దు, వారి సభలో చేరవద్దు.
నా హృదయం వారితో కలవలేనంత ఉదాత్తమైనది.
కోపంలో వారు మనుషులను చంపారు.
సరదా కోసం ఎద్దుల కాళ్ళ నరాలు తెగ్గొట్టారు.
7 వారి కోపం చాలా తీవ్రమైనది. వారి ఆగ్రహం క్రూరమైంది.
అవి శాపగ్రస్తమైనవి. నేను వారిని యాకోబు ప్రజల్లో విభాగిస్తాను.
ఇశ్రాయేలులో వారిని చెదరగొడతాను.
8 యూదా, నీ సోదరులు నిన్ను స్తుతిస్తారు.
నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉంటుంది.
నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడతారు.
9 యూదా సింహం పిల్ల.
నా కుమారుడా, నువ్వు చీల్చిన దాని దగ్గరనుంచి వచ్చావు.
అతడు కాళ్ళు ముడుచుకుని పడుకున్నాడు.
సింహం లాగా, ఆడ సింహం లాగా గర్జించాడు.
అతన్ని లేపడానికి తెగించేవాడెవడు?
10 షిలోహు వచ్చే వరకూ యూదా దగ్గరనుంచి రాజదండం తొలగదు.
అతని కాళ్ళ మధ్య నుంచి అధికార రాజదండం తొలగదు.
రాజ్యాలు అతనికి లోబడతాయి.
11 ద్రాక్షావల్లికి తన గాడిదనూ,
మేలైన ద్రాక్ష తీగెకు తన గాడిద పిల్లనూ కట్టి,
ద్రాక్షారసంలో తన బట్టలనూ, ద్రాక్షల రక్తంలో తన అంగీనీ ఉతికాడు.
12 అతని కళ్ళు ద్రాక్షారసమంత ఎర్రగా,
అతని పళ్ళు పాలవలే తెల్లగా ఉంటాయి.
13 జెబూలూను సముద్రపు ఒడ్డున నివసిస్తాడు.
అతడు ఓడలకు రేవుగా ఉంటాడు.
అతని పొలిమేర సీదోను వరకూ ఉంటుంది.
14 ఇశ్శాఖారు రెండు దొడ్ల మధ్య పడుకున్న బలమైన గాడిద.
15 అతడు మంచి విశ్రాంతి స్థలాన్నీ రమ్యమైన భూమినీ చూశాడు.
బరువులు మోయడానికి భుజం వంచి చాకిరీ చేసే దాసుడయ్యాడు.
16 దాను ఇశ్రాయేలు గోత్రాల్లో ఒక గోత్రంగా
తన ప్రజలకు న్యాయం తీరుస్తాడు.
17 దాను, దారిలో పాము లాగా, గుర్రం మడిమె కరచి,
రౌతు వెనక్కి పడిపోయేలా చేసే కట్లపాముగా దారిలో ఉంటాడు.
18 యెహోవా, నీ రక్షణ కోసం కనిపెడుతున్నాను.
19 దోపిడీ గాళ్ళు గాదును కొడతారు.
అయితే, అతడు వాళ్ళ మడిమెను కొడతాడు.
20 ఆషేరు ఆహారం శ్రేష్ఠమైనది.
రాజులకు తగిన మధుర పదార్దాలు అతడు అందిస్తాడు.
21 నఫ్తాలి వదిలిపెట్టిన లేడి.
అతనికి అందమైన పిల్లలుంటారు.
22 యోసేపు ఫలించే కొమ్మ. ఊట దగ్గర పండ్లు కాసే పెద్ద కొమ్మ.
దాని కొమ్మలు గోడ మీదికి ఎక్కి వ్యాపిస్తాయి.
23 విలుకాళ్ళు అతనీపై దాడి చేస్తారు.
అతని మీద బాణాలు వేసి అతన్ని హింసిస్తారు.
24 అయితే, అతని విల్లు స్థిరంగా ఉంటుంది.
అతని చేతులు నైపుణ్యంతో ఉంటాయి.
ఎందుకంటే, ఇది యాకోబు పరాక్రమశాలి చేతుల వలన,
ఇశ్రాయేలు ఆధార శిల, కాపరి పేరున అయింది.
25 నీకు సహాయం చేసే నీ తండ్రి దేవుని వలన,
నిన్ను దీవించే సర్వశక్తుని వలన, నీకు పైనుండి వచ్చే దీవెనలు,
కింది అగాధపు దీవెనలు, స్తనాల, గర్భాల దీవెనలు వస్తాయి.
26 నీ తండ్రి దీవెనలు, పురాతన పర్వతాలంత ఘనంగా,
నిత్య గిరులంత ఉన్నతంగా ఉంటాయి.
అవి యోసేపు తల మీద ఉంటాయి.
తన సోదరుల్లో ఘనుడైన వాని నడినెత్తి మీద ఉంటాయి.
27 బెన్యామీను ఆకలిగొన్న తోడేలు.
అతడు ఉదయాన ఎరను మింగి,
దోచుకున్న దాన్ని, సాయంత్రం వేళ పంచుకుంటాడు.”
28 ఇవన్నీ ఇశ్రాయేలు పన్నెండు గోత్రాలు. వారి తండ్రి వారిని దీవిస్తూ వారితో చెప్పింది యిదే. ఎవరి దీవెన వారికి తగినదే. 29 తరువాత అతడు వారికి ఆజ్ఞాపిస్తూ ఇలా అన్నాడు. “నేను నా పూర్వీకుల దగ్గరికి వెళ్ళబోతున్నాను. 30 హిత్తీయుడైన ఎఫ్రోను పొలంలోని గుహలో నా పూర్వీకుల దగ్గర నన్ను పాతిపెట్టండి. ఆ గుహ కనాను దేశంలోని మమ్రే దగ్గర ఉన్న మక్పేలా మైదానంలో ఉంది. అబ్రాహాము దానినీ ఆ పొలాన్నీ హిత్తీయుడైన ఎఫ్రోను దగ్గర శ్మశాన భూమి కోసం స్వాస్థ్యంగా కొన్నాడు.
31 అక్కడే వారు అబ్రాహామునూ అతని భార్య శారాను పాతిపెట్టారు. అక్కడే ఇస్సాకును అతని భార్య రిబ్కాను పాతి పెట్టారు. అక్కడే నేను లేయాను పాతిపెట్టాను. 32 ఆ పొలాన్నీ అందులోని గుహనూ హేతు కొడుకుల దగ్గర కొన్నారు” అన్నాడు. 33 యాకోబు తన కొడుకులకు ఆజ్ఞాపించడం ముగించి మంచం మీద తన కాళ్ళు ముడుచుకుని ప్రాణం విడిచి తన వారి దగ్గరికి చేరాడు.