యోహాను సందేశం పంపడం, అతణ్ణి యేసు ప్రశంసించడం
బాప్తిసమిచ్చే యోహాను నుండి వచ్చిన సందేశం, అతని గురించి యేసు ప్రశంస.
గలిలయ
క్రీ.శ. 27 నుండి 29 వరకు
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
మత్తయి రాసిన సువార్త 11:2–19
11:2-3 క్రీస్తు చేస్తున్న పనుల గురించి యోహాను చెరసాల్లో విని, “రాబోతున్న వాడివి నీవేనా, లేకపోతే మేము వేరే వాడి కోసం కనిపెట్టాలా?” అని ఆయనను అడగడానికి తన శిష్యులను పంపాడు.
4 యేసు, “మీరు వెళ్ళి, విన్న వాటినీ చూసిన వాటినీ యోహానుకు తెలియజేయండి. 5 గుడ్డివారు చూపు పొందుతున్నారు, కుంటివారు నడుస్తున్నారు, కుష్టరోగులు శుద్ధులవుతున్నారు, చెవిటివారు వింటున్నారు, చనిపోయిన వారు తిరిగి బతుకుతున్నారు, పేదవారికి సువార్త ప్రకటన జరుగుతున్నది.
6 నా విషయం అభ్యంతరపడనివాడు ధన్యుడు” అని జవాబిచ్చాడు.
7 వారు వెళ్ళిపోతుంటే యేసు యోహానును గురించి ప్రజలతో ఇలా చెప్పాడు, “మీరేం చూడ్డానికి అరణ్యంలోకి వెళ్ళారు? గాలికి ఊగే గడ్డి పోచనా?
8 అయితే మరింకేమి చూడడానికి వెళ్ళారు? నాజూకు బట్టలు వేసుకొన్న వ్యక్తినా? నాజూకు బట్టలు వేసికొనే వారు రాజ భవనాల్లో ఉంటారు.
9 మరింకేమి చూడడానికి వెళ్ళారు? ప్రవక్తనా? సరే గాని, ఇతడు ప్రవక్త కంటే గొప్పవాడు అని మీతో చెబుతున్నాను.
10 ‘నేను నా దూతను నీకు ముందుగా పంపుతున్నాను.
అతడు నీ ముందు వెళ్ళి నీ దారి సిద్ధం చేస్తాడు’ అని రాసి ఉన్నది ఇతని గురించే.
11 స్త్రీకి పుట్టిన వారిలో బాప్తిసమిచ్చే యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని మీతో కచ్చితంగా చెబుతున్నాను. అయినా పరలోకరాజ్యంలో అత్యల్పమైన వాడు అతని కంటే గొప్పవాడు.
12 బాప్తిసమిచ్చే యోహాను కాలం నుండి ఇప్పటి వరకూ పరలోకరాజ్యం దాడులకు గురి అవుతూ ఉంది. తీవ్రత గలవారు బలవంతంగా దానిలో ప్రవేశిస్తున్నారు. 13 ఎందుకంటే యోహాను కాలం వరకూ ప్రవక్తలూ, ధర్మశాస్త్రమూ ప్రవచిస్తూ వచ్చారు. 14 ఈ సంగతిని అంగీకరించడానికి మీకు మనసుంటే రాబోయే ఏలీయా ఇతడే.
15 వినే చెవులున్నవాడు విను గాక.
16-17 ఈ తరం వారిని దేనితో పోల్చాలి? పిల్లలు వీధుల్లో ఆడుకుంటూ ‘మీ కోసం వేణువు ఊదాం గాని మీరు నాట్యం చేయలేదు. ప్రలాపించాం గాని మీరు ఏడవలేదు’ అని ఒకరితో ఒకరు చెప్పుకునే విధంగా ఉన్నారు.
18 ఎందుకంటే యోహాను వచ్చి రొట్టె తినకుండా, ద్రాక్షరసం తాగకుండా ఉండేవాడు. ‘అతనికి దయ్యం పట్టింది’ అని వారంటున్నారు.
19 మనుష్య కుమారుడు తింటూ, తాగుతూ వచ్చాడు. కాబట్టి ‘వీడు తిండిబోతూ, తాగుబోతూ, పన్నులు వసూలు చేసే వారికీ పాపులకూ స్నేహితుడు’ అని వారంటున్నారు. అయితే జ్ఞానం అది చేసే పనులను బట్టి తీర్పు పొందుతుంది.”
లూకా రాసిన సువార్త 7:18–35
7:18 యోహాను శిష్యులు ఈ సంగతులన్నటినీ యోహానుకు తెలియజేశారు. 19 అప్పుడు యోహాను తన శిష్యుల్లో ఇద్దరిని పిలిచి, “రావలసిన వాడివి నువ్వేనా? లేక మరొకరి కోసం మేము ఎదురు చూడాలా?” అని అడగడానికి వారిని ప్రభువు దగ్గరికి పంపించాడు.
20 వారు ఆయన దగ్గరికి వచ్చి, “‘రావలసిన వాడివి నువ్వేనా? లేక మరొకరి కోసం ఎదురు చూడాలా?’ అని అడగమని మమ్మల్ని బాప్తిసమిచ్చే యోహాను నీ దగ్గరికి పంపాడు” అని చెప్పారు. 21 అదే సమయంలో ఆయన అనేకమంది రోగులనూ, బాధితులనూ, దయ్యాలు పట్టిన వారిని బాగు చేస్తూ ఉన్నాడు. గుడ్డివారికి చూపు ప్రసాదిస్తూ ఉన్నాడు.
22 అప్పుడాయన వారికి ఇలా జవాబిచ్చాడు, “వెళ్ళి మీరు చూసిన వాటినీ వినిన వాటినీ యోహానుకు చెప్పండి. గుడ్డివారు చూస్తున్నారు, కుంటివారు నడుస్తున్నారు, కుష్ట రోగులు బాగుపడుతున్నారు, చెవిటివారు వింటున్నారు. చనిపోయిన వారు తిరిగి ప్రాణంతో లేస్తున్నారు. పేదవాళ్ళకు సువార్త ప్రకటన జరుగుతూ ఉంది.
23 నా విషయంలో అభ్యంతరాలేమీ లేని వాడు ధన్యుడు.”
24 యోహాను దగ్గర నుండి వచ్చిన శిష్యులు వెళ్ళిపోయిన తరువాత యేసు యోహాను గురించి జన సమూహంతో ఇలా చెప్పాడు, “మీరు ఏం చూద్దామని అడవిలోకి వెళ్ళారు? గాలికి ఊగే రెల్లునా?
25 అది కాకుంటే మరేం చూడ్డానికి వెళ్ళారు? సన్నని వస్త్రాలు ధరించుకున్నవాడినా? వినండి, విలువైన వస్త్రాలు ధరించుకుని సుఖంగా జీవించే వారు రాజ మందిరాల్లో ఉంటారు.
26 అది కాకపోతే ఇంకేం చూద్దామని వెళ్ళారు? ప్రవక్తనా? అవును. కానీ యోహాను ఒక ప్రవక్త కంటే గొప్పవాడని మీకు చెబుతున్నాను.
27 ‘చూడు! నేను నా దూతను నీకు ముందుగా పంపుతున్నాను,
అతడు నీకు ముందుగా నీ మార్గాన్ని సిద్ధపరుస్తాడు’ అని ఎవరిని గురించి రాశారో అతడే ఈ యోహాను.
28 స్త్రీ గర్భాన పుట్టిన వారిలో యోహాను కంటే గొప్పవాడెవడూ లేడు. అయినా దేవుని రాజ్యంలో అల్పుడు అతని కంటే గొప్పవాడని మీతో చెబుతున్నాను.”
29 ప్రజలందరూ, పన్ను వసూలుదారులూ యోహాను సందేశం విని, దేవుడు నీతిమంతుడని అంగీకరించారు. అతని ద్వారా బాప్తిసం పొందారు. 30 కానీ పరిసయ్యులూ, ధర్మశాస్త్రాన్ని ఉపదేశించే వారూ అతని చేత బాప్తిసం పొందకుండా వారి జీవితాల్లో దేవుని సంకల్పాన్ని నిరాకరించారు.
31 కాబట్టి ఈ తరం మనుషులను నేను దేనితో పోల్చాలి? వీళ్ళు దేనిలాగా ఉన్నారు?
32 సంతవీధుల్లో కూర్చుని, ‘మేము వేణువు ఊదాం, మీరు నాట్యం చేయలేదు, ఏడుపు పాట పాడాం, మీరేమో ఏడవలేదు’ అని ఒకరితో ఒకరు చెప్పుకుంటూ ఆటలాడుకునే చిన్న పిల్లల్లా ఉన్నారు.
33 బాప్తిసమిచ్చే యోహాను రొట్టెలు తినకుండా ద్రాక్షారసం తాగకుండా ఉన్నాడని ‘వీడికి దయ్యం పట్టింది’ అని మీరు అంటున్నారు.
34 మనుష్య కుమారుడు తింటూ తాగుతూ ఉన్నాడని ‘వీడు తిండిబోతూ, తాగుబోతూ, సుంకరులకూ పాపులకూ స్నేహితుడు’ అంటున్నారు.
35 అయితే జ్ఞానం దాని పిల్లలను బట్టి జ్ఞానమని తీర్పు పొందుతుంది.”