అవకాశం పొందిన పట్టణాలపై శ్రమ ప్రకటనలు
అవకాశం పొందిన పట్టణాలపై శ్రమ ప్రకటనలు, తండ్రి గురించి బోధించే గురువుగా క్రీస్తు తన గురించి చేసిన ప్రకటనలు.
గలిలయ
క్రీ.శ. 27 నుండి 29 వరకు
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
మత్తయి రాసిన సువార్త 11:20–30
11:20 అప్పుడాయన ఏ పట్టణాల్లో ఎక్కువ అద్భుతాలు చేశాడో ఆ పట్టణాలను గద్దించడం మొదలుపెట్టాడు. ఎందుకంటే అవి పశ్చాత్తాప పడలేదు. 21 “అయ్యో కొరాజీనూ! నీకు శిక్ష తప్పదు. అయ్యో బేత్సయిదా! నీకు శిక్ష తప్పదు. మీలో జరిగిన అద్భుతాలు తూరు, సీదోను పట్టణాల్లో గనక జరిగి ఉంటే అక్కడి ప్రజలు చాలా కాలం ముందే పశ్చాత్తాపపడి గోనె పట్ట కట్టుకుని బూడిద పూసుకునేవారే.
22 తీర్పు దినాన మీకు పట్టే గతి కంటే తూరు సీదోను పట్టణాల వారి గతే ఓర్చుకోదగినది అవుతుంది అని మీతో చెప్తున్నాను. 23 కపెర్నహూమా, పరలోకానికి హెచ్చిపోగలను అని నీవు అనుకుంటున్నావా? నీవు పాతాళంలోకి దిగి పోతావు. నీలో జరిగిన అద్భుతాలు సొదొమలో గనక జరిగి ఉంటే అది ఈనాటి వరకూ నిలిచి ఉండేదే! 24 తీర్పు దినాన నీకు పట్టే గతి కంటే సొదొమ నగరానికి పట్టే గతే ఓర్చుకోదగినది అవుతుంది, అని మీతో చెప్తున్నాను.”
25 ఆ సమయంలో యేసు ఇలా అన్నాడు, “తండ్రీ, పరలోకానికీ భూమికీ ప్రభూ, నీవు జ్ఞానులకూ తెలివైన వారికీ ఈ సంగతులను మరుగు చేసి చిన్న పిల్లలకు వెల్లడి పరచావు. అందుకు నిన్ను స్తుతిస్తున్నాను. 26 అవును తండ్రీ, ఈ విధంగా చేయడం నీకెంతో ఇష్టం. 27 సమస్తాన్నీ నా తండ్రి నాకు అప్పగించాడు. తండ్రి తప్ప కుమారుణ్ణి ఎవరూ ఎరగరు. కుమారుడూ, ఎవరికి వెల్లడించాలని కుమారుడు ఉద్దేశిస్తాడో వాడూ తప్ప మరి ఎవరూ తండ్రిని ఎరగరు.
28 “మోయలేని బరువు మోస్తూ అలిసిపోయిన మీరంతా నా దగ్గరికి రండి. నేను మీకు విశ్రాంతి నిస్తాను. 29 నేను దీనుణ్ణి, వినయ మనసు గల వాణ్ణి. కాబట్టి మీ మీద నా కాడి ఎత్తుకుని నా దగ్గర నేర్చుకోండి. అప్పుడు మీ ప్రాణాలకు విశ్రాంతి లభిస్తుంది. 30 ఎందుకంటే నా కాడి సుళువు. నా భారం తేలిక.”
క్రీస్తు పాదాలను అభిషేకించిన పాపాత్మురాలు
పరిసయ్యుడైన సీమోను ఇంట్లో ఒక పాపాత్మురాలు క్రీస్తు పాదాలను అభిషేకిస్తుంది. ఇద్దరు రుణగ్రస్తుల ఉపమానం.
గలిలయ
లూకా రాసిన సువార్త 7:36–50
7:36 పరిసయ్యుల్లో ఒకడు తనతో భోజనం చేయాలని ఆయనను ఆహ్వానించాడు. ఆయన ఆ పరిసయ్యుడి ఇంటికి వెళ్ళి భోజనానికి కూర్చున్నాడు.
37 ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ, యేసు పరిసయ్యుడి ఇంట్లో భోజనానికి వచ్చాడని తెలుసుకుని, ఒక బుడ్డిలో అత్తరు తీసుకు వచ్చి 38 ఆయనకు వెనుకగా ఆయన పాదాల దగ్గర ఏడుస్తూ నిలబడింది. ఆమె కన్నీళ్ళతో ఆయన పాదాలు తడిసి పోయాయి. ఆమె తన వెంట్రుకలతో ఆయన పాదాలు తుడిచి వాటిని ముద్దు పెట్టుకుని వాటికి అత్తరు పూసింది.
39 ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూసి, “ఈయన ప్రవక్తే అయితే తనను ముట్టుకున్న స్త్రీ ఎవరో, ఎలాంటిదో తెలుసుకోగలడు. ఈమె పాపాత్మురాలు” అని తనలో తాను అనుకున్నాడు. 40 దానికి యేసు, “సీమోనూ, నీతో ఒక మాట చెప్పాలి” అని అతనితో అన్నాడు. అతడు, “బోధకా, చెప్పు” అన్నాడు.
41 అప్పుడు యేసు, “అప్పులిచ్చే ఒకడి దగ్గర ఇద్దరు అప్పు చేశారు. వారిలో ఒకడు ఐదువందల వెండి నాణేలూ మరొకడు యాభై వెండి నాణేలూ బాకీ పడ్డారు. 42 ఆ అప్పు తీర్చడానికి వారి దగ్గర ఏమీ లేదు కాబట్టి ఆ వ్యక్తి వారిద్దరినీ క్షమించేశాడు. కాబట్టి వీరిద్దరిలో అతణ్ణి ఎవరు ఎక్కువగా ప్రేమిస్తారో చెప్పు?” అని అడిగాడు.
43 అందుకు సీమోను, “అతడెవరిని ఎక్కువ క్షమించాడో వాడే అని నాకు అనిపిస్తుంది” అన్నాడు. దానికి యేసు, “సరిగ్గా ఆలోచించావు” అని అతనితో చెప్పి, 44 ఆ స్త్రీ వైపు తిరిగి, సీమోనుతో ఇలా అన్నాడు, “ఈ స్త్రీని చూస్తున్నావు కదా. నేను నీ ఇంట్లోకి వచ్చినప్పుడు నువ్వు కాళ్ళు కడుక్కోడానికి నాకు నీళ్ళివ్వలేదు, కానీ ఈమె కన్నీళ్ళతో నా పాదాలు తడిపి తన తల వెంట్రుకలతో తుడిచింది. 45 నువ్వు నన్ను ముద్దు పెట్టుకోలేదు, కానీ నేను లోపలికి వచ్చిన దగ్గర్నించి ఈమె నా పాదాలను ముద్దు పెట్టుకోవడం ఆపలేదు. 46 నువ్వు నా తలకి నూనె పూయలేదు కానీ ఈమె నా పాదాలకు అత్తరు పూసింది. 47 దీన్ని బట్టి నేను చెప్పేదేమిటంటే ఎక్కువ పాపాలు చేసిన ఈమె అధికమైన క్షమాపణ పొందింది, అధికంగా ప్రేమించింది. ఎవరికి కొంచెం క్షమాపణ దొరుకుతుందో వాడు కొంచెమే ప్రేమిస్తాడు” అని చెప్పాడు.
48 తరువాత యేసు ఆమెతో, “నీ పాపాలకు క్షమాపణ దొరికింది” అన్నాడు. 49 అప్పుడు ఆయనతో పాటు భోజనానికి కూర్చున్న వారు, “పాపాలు క్షమించడానికి ఇతనెవరు?” అని తమలో తాము అనుకోవడం మొదలు పెట్టారు. 50 అప్పుడు ఆయన, “నీ విశ్వాసం నిన్ను రక్షించింది. శాంతిగా వెళ్ళు” అని ఆమెతో చెప్పాడు.
గలిలయలో రెండవసారి పర్యటించిన యేసు
ఇక్కడ యేసు గలిలయలో రెండవసారి పర్యటిస్తాడు (మొత్తం మూడు పర్యటనల్లో ఇది రెండవది). ఈసారి పన్నెండుమంది అంతా ఆయనతో ఉన్నారు. ఈ పని పరిసయ్యుల్లో తీవ్రమైన శత్రుత్వాన్ని రేకెత్తిస్తుంది. యేసు సాతానుతో కుమ్మక్కయ్యాడనే దైవదూషణకరమైన నిందను వారు మోపుతారు. ఈ కలకలం, ఆరోపణల కారణంగా యేసు మతి చలించిందేమోనని ఆయన సొంత కుటుంబం కూడా భయపడుతుంది.
లూకా రాసిన సువార్త 8:1–3
8:1 ఆ తరువాత ఆయన ప్రతి పట్టణానికీ ప్రతి గ్రామానికీ దేవుని రాజ్య సువార్త బోధిస్తూ, ప్రకటిస్తూ సంచారం చేస్తున్నాడు. 2 పన్నెండుగురు శిష్యులు, అపవిత్రాత్మలనుంచీ, రోగాలనుంచీ ఆయన బాగుచేసిన కొందరు స్త్రీలూ, అంటే ఏడు దయ్యాలు వదిలిపోయిన మగ్దలేనే మరియ, 3 హేరోదు గృహ నిర్వాహకుడైన కూజా అనే అతని భార్య యోహన్నా, సూసన్నా ఇంకా అనేకమంది ఇతర స్త్రీలూ ఆయనతో కూడా ఉన్నారు. వారంతా తమ స్వంత ధనం, సామగ్రిని వెచ్చించి ఆయనకు, ఆయన శిష్యులకు సహాయం చేసేవారు.