కపెర్నహూములో శతాధిపతి సేవకుణ్ణి స్వస్థపరిచిన యేసు

క్రీస్తు ప్రభావం వేగంగా వ్యాపించడం, చెరసాలలో ఉన్న బాప్తిసమిచ్చే యోహాను విచారణ చేయడం ఇక్కడ మనం చూస్తాం.

క్రీ.శ. 27 నుండి 29 వరకు

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

మత్తయి రాసిన సువార్త 8:5–13

8:5 యేసు కపెర్నహూములో ప్రవేశించినప్పుడు రోమా సైన్యంలో ఒక శతాధిపతి ఆయన దగ్గరికి వచ్చి,

6 “ప్రభూ, నా పనివాడు పక్షవాతంతో ఇంట్లో పడి ఉన్నాడు. చాలా బాధపడుతున్నాడు” అని చెప్పాడు.

7 “నేను వచ్చి అతణ్ణి బాగు చేస్తాను” అని యేసు అతనికి జవాబిచ్చాడు. 8 ఆ శతాధిపతి, “ప్రభూ, నీవు నా యింట్లోకి వచ్చేటంత యోగ్యత నాకు లేదు. మాట మాత్రం అనండి. నా పనివాడు బాగుపడతాడు.

9 నేను కూడా అధికారం కింద ఉన్నవాడినే. నా చేతి కింద కూడా సైనికులున్నారు. నేను ఎవడినైనా ‘వెళ్ళు’ అంటే వాడు వెళ్తాడు. ఎవడినైనా ‘రా’ అంటే వాడు వస్తాడు. నా పనివాణ్ణి ‘ఇది చెయ్యి’ అంటే చేస్తాడు” అని జవాబిచ్చాడు.

10 యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి, తన వెంట వస్తున్న వారితో ఇలా అన్నాడు, “ఇశ్రాయేలు ప్రజల్లో కూడా ఎవరికైనా ఇంత గొప్ప విశ్వాసం ఉన్నట్టు నేను చూడలేదని కచ్చితంగా చెబుతున్నాను. 11 తూర్పు నుంచీ పడమర నుంచీ చాలా మంది వచ్చి అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులతో పాటు పరలోక రాజ్యంలో విందులో కూర్చుంటారు. 12 అయితే రాజ్య కుమారులను మాత్రం బయట చీకట్లోకి తోసేయడం జరుగుతుంది. అక్కడ ఏడుపు, పళ్ళు కొరుక్కోవడం ఉంటాయి.” 13 యేసు శతాధిపతితో, “వెళ్ళు. నీవు నమ్మినట్టే నీకు జరుగుతుంది” అన్నాడు. ఆ క్షణంలోనే అతని పనివాడు బాగుపడ్డాడు.

లూకా రాసిన సువార్త 7:1–10

7:1 ఆయన తన మాటలన్నీ ప్రజలకు పూర్తిగా వినిపించి కపెర్నహూముకి వచ్చాడు. 2 అక్కడ ఒక శతాధిపతికి ఇష్టమైన సేవకుడు ఒకడికి జబ్బు చేసి చావడానికి సిద్ధంగా ఉన్నాడు. 3 ఈ శతాధిపతి యేసును గురించి విని, ఆయన వచ్చి తన సేవకుణ్ణి బాగు చేయాలని ఆయనను బతిమాలడానికి యూదుల పెద్దలను ఆయన దగ్గరికి పంపించాడు.

4 వారు యేసు దగ్గరికి వచ్చి, “నువ్వు తప్పక ఈ మేలు చేయాలి. ఎందుకంటే ఈ వ్యక్తి చాలా యోగ్యుడు.

5 అతడు మన ప్రజలను ప్రేమించాడు. మన సమాజ మందిరాన్ని మన కోసం కట్టించింది ఇతడే” అని ఆయనను ఎంతో బతిమాలారు.

6 కాబట్టి యేసు వారితో వెళ్ళాడు. ఆయన అతని ఇంటి దగ్గరలోకి వచ్చినప్పుడు, ఆ శతాధిపతి తన స్నేహితులను కొందరిని పంపి వారితో యేసుకు ఇలా చెప్పించాడు. “ప్రభూ, నువ్వు శ్రమ తీసుకోవద్దు. నువ్వు నా ఇంట్లోకి వచ్చేటంత యోగ్యత నాకు లేదు. 7 అలాగే నీ దగ్గరికి వచ్చే యోగ్యత కూడా నాకు లేదు. నువ్వు మాట మాత్రం చెప్పు. నా సేవకుడికి పూర్తిగా నయమవుతుంది.

8 నేను కూడా అధికారం కింద ఉన్నవాణ్ణే. నా చేతి కింద సైనికులు ఉన్నారు. నేను ఒకణ్ణి ‘వెళ్ళు’ అంటే వెళ్తాడు, ఒకణ్ణి ‘రా’ అంటే వస్తాడు. నా సేవకుణ్ణి ఫలానా పని చేయమంటే చేస్తాడు.”

9 యేసు ఈ మాటలు విని, ఆ వ్యక్తి విషయం ఆశ్చర్య పోయాడు. తన వెనక వస్తున్న జనసమూహం వైపు తిరిగి, “ఇశ్రాయేలు ప్రజల్లో కూడా ఇంత గొప్ప విశ్వాసం నేను చూడలేదని మీతో చెబుతున్నాను” అన్నాడు. 10 అతడు పంపిన వారు తిరిగి వచ్చి ఆ పనివాడు జబ్బు నయమై పూర్తి ఆరోగ్యంతో ఉండడం చూశారు.

నాయీనులో విధవరాలి కుమారుణ్ణి బ్రతికించిన యేసు

లూకా రాసిన సువార్త 7:11–17

7:11 ఇది జరిగిన తరువాత ఆయన నాయీను అనే ఒక ఊరికి వెళ్తున్నాడు. ఆయన శిష్యులు, ఇంకా పెద్ద జనసమూహం ఆయనతో వెళ్తున్నారు. 12 ఆయన ఆ ఊరి పొలిమేరకు వచ్చినప్పుడు కొందరు చనిపోయిన వాణ్ణి మోసుకుపోతూ ఎదురయ్యారు. చనిపోయిన వాడు అతని తల్లికి ఒక్కగానొక్క కొడుకు. ఆమె వితంతువు. గ్రామస్తులు చాలామంది ఆమెతో ఉన్నారు.

13 ప్రభువు ఆమెను చూసి ఆమెపై జాలిపడి, “ఏడవ వద్దు” అని ఆమెకు చెప్పి, దగ్గరికి వచ్చి ఆ పాడెను ముట్టుకున్నాడు. దాంతో దాన్ని మోసేవారు నిలబడి పోయారు. 14 ఆయన, “అబ్బాయ్, నేను చెబుతున్నాను, లే!” అన్నాడు. 15 ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుని మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆయన అతణ్ణి ఆ తల్లికి అప్పచెప్పాడు.

16 అందరూ భయంతో నిండిపోయి, “మనలో గొప్ప ప్రవక్త లేచాడు. దేవుడు తన ప్రజలను సందర్శించాడు” అంటూ దేవుణ్ణి కీర్తించారు. 17 ఆయనను గురించిన ఈ సమాచారం యూదయ ప్రాంతమంతటా ప్రాంతాల్లో వ్యాపించింది.