సరస్సు దాటుతుండగా యేసు తుఫానును శాంతింపజేయడం

అదే రోజు. గలిలయ సముద్రం

క్రీ.శ. 27 నుండి 29 వరకు

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

మత్తయి రాసిన సువార్త 8:18, 23–27

8:18 యేసు తన చుట్టూ ఉన్న పెద్ద గుంపులను చూసి గలిలయ సరస్సు అవతలికి వెళ్దామని ఆదేశించాడు.

23 ఆయన పడవ ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయనతో వెళ్ళారు.

24 అప్పుడు సముద్రం మీద తీవ్రమైన తుఫాను చెలరేగి, పడవ మీదికి అలలు ముంచుకు వచ్చాయి. అయితే యేసు నిద్రపోతూ ఉన్నాడు.

25 శిష్యులు ఆయనను నిద్ర లేపి, “ప్రభూ, చచ్చిపోతున్నాం. మమ్మల్ని రక్షించండి” అంటూ కేకలు వేశారు.

26 యేసు వారితో, “అల్ప విశ్వాసులారా, మీరెందుకు భయపడుతున్నారు?” అని చెప్పి, లేచి గాలినీ సముద్రాన్నీ గద్దించాడు. అప్పుడు అంతా చాలా ప్రశాంతమై పోయింది.

27 శిష్యులు ఆశ్చర్యపడి, “ఈయన ఎలాంటివాడో! గాలీ సముద్రం ఈయన మాట వింటున్నాయే” అని చెప్పుకున్నారు.

మార్కు రాసిన సువార్త 4:35–41

4:35 ఆ రోజు సాయంత్రం ఆయన తన శిష్యులతో, “సరస్సు అవతలి ఒడ్డుకు వెళ్దాం పదండి” అన్నాడు.

36 శిష్యులు జనసమూహాలను విడిచి యేసుతో పడవలో బయలుదేరారు. మరి కొన్ని పడవలు కూడా వారివెంట వచ్చాయి.

37 అప్పుడు పెద్ద తుఫాను వచ్చింది. అలలు లేచి పడవను నీళ్ళతో నింపేశాయి.

38 పడవ వెనుక భాగంలో యేసు తలకింద దిండు పెట్టుకుని నిద్రపోతూ ఉన్నాడు. శిష్యులు ఆయనను నిద్ర లేపి ఆయనతో, “బోధకా! మేము మునిగిపోతుంటే నీకేమీ పట్టదా?” అని అన్నారు.

39 ఆయన లేచి గాలిని, సముద్రాన్ని గద్దిస్తూ, “శాంతించు! ఆగిపో!” అని ఆజ్ఞాపించాడు. వెంటనే గాలి ఆగిపోయింది. అంతా ప్రశాంతంగా మారింది.

40 అప్పుడాయన శిష్యులతో, “మీరెందుకు భయపడుతున్నారు? మీలో ఇంకా విశ్వాసం కలగలేదా?” అని అన్నాడు.

41 వారికి చాలా భయమేసింది. ఒకరితో ఒకరు, “ఎవరీయన? గాలి, సముద్రం సహా ఈయన మాటకు లోబడుతున్నాయే!” అని చెప్పుకుని ఆశ్చర్యపడ్డారు.

లూకా రాసిన సువార్త 8:22–25

8:22 మరొక రోజు ఆయన తన శిష్యులతో కలిసి పడవ ఎక్కి, “సరస్సు అవతలి వైపుకు వెళ్దాం” అన్నాడు. వారు ఆ పడవను నీటిలోకి తోసి బయలుదేరారు.

23 వారు ప్రయాణమయ్యాక ఆయన నిద్రపోయాడు. ఈలోగా సరస్సు మీద బలమైన గాలివాన వచ్చి పడవలోకి నీళ్ళు వచ్చేశాయి. వారి స్థితి ప్రమాదకరంగా మారింది.

24 కాబట్టి వారు ఆయన దగ్గరికి వచ్చి, “ప్రభూ! ప్రభూ! నశించిపోతున్నాం” అంటూ ఆయనను లేపారు. ఆయన లేచి, గాలినీ, ఉవ్వెత్తున లేచే కెరటాలనూ గద్దించాడు. అవి అణిగిపోయి అంతా నిశ్శబ్దంగా అయింది.

25 అప్పుడు ఆయన, “మీ విశ్వాసం ఎక్కడ?” అన్నాడు. వారు భయపడి, “ఈయన గాలికీ నీళ్లకూ ఆజ్ఞాపిస్తే అవి లోబడుతున్నాయి. ఈయన ఎవరో” అని ఒకరితో ఒకరు చెప్పుకుంటూ ఆశ్చర్యపోయారు.

దయ్యాలు పట్టిన గెరాసేనువాణ్ణి యేసు బాగుచేయడం

సరస్సు అవతల యేసు దయ్యాలు పట్టిన గెరాసేనువాణ్ణి బాగుచేస్తాడు.

గెరాసా (కుర్సీ). అదే రోజు

మత్తయి రాసిన సువార్త 8:28–34

8:28 ఆయన అవతలి ఒడ్డున ఉన్న గదరేనీయుల ప్రాంతం చేరుకున్నప్పుడు దయ్యాలు పట్టిన ఇద్దరు వ్యక్తులు సమాధుల్లో నుంచి బయలుదేరి ఆయనకు ఎదురు వచ్చారు. వారు చాలా క్రూరంగా ప్రవర్తిస్తుండడం వలన ఎవరూ ఆ దారిన వెళ్ళలేక పోయేవారు.

29 ఆ దయ్యాలు, “దైవకుమారా, నీతో మాకేంటి? మా కాలం రాకముందే మమ్మల్ని వేధించడానికి వచ్చావా?” అని కేకలు వేశారు.

30 వారికి కొంత దూరంలో పెద్ద పందుల మంద మేస్తూ ఉంది.

31 “నీవు మమ్మల్ని బయటికి వెళ్ళగొడితే, ఆ పందుల మందలోకి పోనియ్యి” అని ఆ దయ్యాలు యేసును ప్రాధేయపడ్డాయి.

32 యేసు “సరే, పో” అని వాటితో అన్నాడు. అవి బయటికి వచ్చి ఆ పందుల మందలోకి చొరబడ్డాయి. వెంటనే ఆ మంద అంతా నిటారుగా ఉన్న కొండ మీద నుంచి వేగంగా పరుగెత్తుకుంటూ పోయి సముద్రంలో పడి చచ్చాయి.

33 ఆ పందుల మందను కాసేవారు పరిగెత్తుకుంటూ ఊరిలోకి వెళ్ళి జరిగిన సంగతి, ఇంకా దయ్యాలు పట్టిన వాడికి జరిగిన సంగతీ తెలియజేశారు.

34 అప్పుడు ఆ ఊరి వారంతా యేసును కలవడానికి వచ్చారు. ఆయనను చూసి తమ ప్రాంతాన్ని విడిచి వెళ్ళిపొమ్మని ఆయనను బతిమాలారు.

మార్కు రాసిన సువార్త 5:1–20

5:1 వారు సముద్రం దాటి అవతలి ఒడ్డున ఉన్న గెరాసేను ప్రాంతానికి వెళ్ళారు.

2 యేసు పడవ దిగగానే దయ్యం పట్టిన వాడొకడు స్మశానం నుండి ఆయన దగ్గరికి వచ్చాడు. 3 వాడు స్మశానంలోనే నివసించేవాడు. ఇనప గొలుసులతో సైతం వాణ్ణి ఎవ్వరూ కట్టెయ్యలేకపోయారు. 4 వాడి చేతులు, కాళ్ళు ఎన్నిసార్లు గొలుసులతో సంకెళ్ళతో కట్టినా ఆ సంకెళ్ళను తెంపి, కట్లను చిందరవందర చేసే వాడు. వాణ్ణి అదుపు చేసే శక్తి ఎవరికీ లేదు. 5 వాడు స్మశానంలో, కొండల మీదా రేయింబవళ్ళు తిరుగుతూ పెద్దగా కేకలు పెడుతూ తన శరీరాన్ని గాయపరచుకొనేవాడు.

6 వాడు యేసును దూరం నుండి చూసి పరుగెత్తుకు వచ్చి ఆయన ముందు మోకరించి నమస్కారం చేశాడు.

7 “యేసూ, మహోన్నత దేవుని కుమారా! నాతో నీకేం పని? దేవుని పేరిట నిన్ను బతిమాలుతున్నాను, నన్ను బాధ పెట్టవద్దు!” అని అన్నాడు.

8 ఎందుకంటే యేసు అతనితో, “అపవిత్రాత్మా! ఈ మనిషిని వదలి బయటకు రా!” అని అన్నాడు.

9 ఆయన, “నీ పేరేమిటి?” అని అతణ్ణి అడిగాడు. “నా పేరు సేన, మేము చాలా మందిమి,” అని అతడు సమాధానం చెప్పాడు.

10 అతడు ఆ ప్రాంతం నుండి వాటిని పంపివేయవద్దని ఎంతో బతిమాలాడు.

11 ఆ కొండ పక్కన పెద్ద పందుల గుంపు మేస్తూ ఉంది.

12 ఆ దయ్యాలు యేసుతో, “మమ్మల్ని ఆ పందుల గుంపులో చొరబడడానికి అనుమతి ఇవ్వు” అని వేడుకున్నాయి.

13 యేసు వాటికి అనుమతి ఇచ్చాడు. దయ్యాలు అతణ్ణి వదిలి ఆ పందుల్లోకి చొరబడ్డాయి. ఆ మందలో సుమారు రెండు వేల పందులు ఉన్నాయి. అవి వాలుగా ఉన్న కొండమీద నుండి వేగంగా పరుగెత్తి సముద్రంలో పడి మునిగి చచ్చాయి.

14 ఆ పందులు మేపేవారు పారిపోయి పట్టణంలో, పల్లెప్రాంతాల్లో ఈ సంగతి చెప్పారు. ప్రజలు జరిగినదాన్ని చూడాలని వచ్చారు.

15 వారు యేసు దగ్గరికి వచ్చినప్పుడు దయ్యాల సేన పట్టిన వాడు బట్టలు వేసుకుని బుద్ధిగా కూర్చుని ఉండడం గమనించారు. వారికి భయం వేసింది.

16 అదంతా స్వయంగా చూసినవారు, దయ్యాలు పట్టిన వాడికి జరిగిన దాన్ని గురించి, పందుల గురించి అందరికీ చెప్పారు.

17 వారు యేసును తమ ప్రాంతం విడిచి వెళ్ళమని వేడుకున్నారు.

18 యేసు పడవ ఎక్కుతూ ఉండగా దయ్యాలు పట్టినవాడు వచ్చి తనను కూడా వెంట రానిమ్మని బతిమాలాడు. 19 కాని యేసు దానికి అంగీకరించకుండా అతనితో, “నువ్వు ఇంటికి తిరిగి వెళ్ళి ప్రభువు నీకు చేసినదాని గురించీ నీపై చూపిన దయ గురించీ నీ వారికి చెప్పు” అని అన్నాడు. 20 అతడు వెళ్ళి, యేసు తనకు చేసిన గొప్ప కార్యం గురించి దెకపొలి ప్రాంతంలో ప్రకటించాడు. అందరికీ ఎంతో ఆశ్చర్యం కలిగింది.

లూకా రాసిన సువార్త 8:26–39

8:26 వారు గలిలయకి ఎదురుగా ఉండే గెరాసేను ప్రాంతానికి వచ్చారు.

27 ఆయన ఒడ్డున దిగగానే ఆ ఊరి వాడు ఒకడు ఆయనను ఎదుర్కోడానికి వచ్చాడు. వాడికి దయ్యాలు పట్టి చాలా కాలం నుండి బట్టలు కట్టుకోకుండా తిరుగుతున్నాడు. సమాధులే వాడి నివాసం. ఇంట్లో ఉండేవాడు కాదు.

28 వాడు యేసును చూసి, కేకలు వేశాడు. వచ్చి ఆయన ఎదుట సాష్టాంగ నమస్కారం చేశాడు. అతడు “సర్వోన్నత దేవుని కుమారా, యేసూ, నా జోలి నీకెందుకు? నన్ను బాధించకు. నిన్ను బతిమాలుకుంటున్నాను” అంటూ కేకలు పెట్టాడు.

29 ఎందుకంటే ఆయన, “ఈ వ్యక్తిని వదిలి బయటకు రా” అని ఆ అపవిత్రాత్మకు ఆజ్ఞ ఇచ్చాడు. అది చాలాసార్లు వాణ్ణి పట్టి పీడిస్తుంది. వాణ్ణి గొలుసులతోనూ, కాలి సంకెళ్ళతోనూ బంధించి వాడికి కాపలా పెట్టారు గానీ వాడు ఆ బంధకాలన్నిటినీ తెంచుకునేవాడు. దయ్యాలు వాణ్ణి చవిటి భూముల్లోకి తీసుకుపోయేవి.

30 యేసు, “నీ పేరు ఏమిటి?” అని వాడిని అడిగాడు. చాలా దయ్యాలు వాడిలో చొరబడి ఉన్నాయి. కాబట్టి వాడు, “నా పేరు సైన్యం” అన్నాడు.

31 పాతాళంలోకి వెళ్ళమని తనకు ఆజ్ఞ ఇవ్వవద్దని అవి ఆయనను ఎంతో బతిమాలాయి.

32 అక్కడ పెద్ద పందుల మంద ఒకటి కొండ మీద మేస్తూ ఉంది. వాటిలో చొరబడడానికి అనుమతినిమ్మని ఆయనను బతిమాలినప్పుడు ఆయన వాటికి అనుమతినిచ్చాడు.

33 అప్పుడు దయ్యాలు ఆ వ్యక్తిని విడిచి పెట్టి వెళ్ళి పందుల్లో చొరబడ్డాయి. అప్పుడు ఆ మంద ఎత్తయిన కొండపై నుండి పరుగెత్తుకుంటూ వెళ్ళి సరస్సులో పడి ఊపిరాడక చచ్చాయి.

34 ఆ పందులను మేపుతున్న వారు ఇదంతా చూసి పారిపోయారు. వారు పట్టణంలోనూ చుట్టుపక్కల గ్రామాల్లోనూ జరిగిందంతా చెప్పారు.

35 ఆ ఊరి ప్రజలు అదంతా చూడడానికి వెళ్ళారు. వారంతా యేసు దగ్గరికి వచ్చారు. అక్కడ దయ్యాలు వదిలిన వాడు బట్టలు కట్టుకుని స్థిమితంగా యేసు పాదాల దగ్గర కూర్చుని ఉండడం చూసి భయపడ్డారు.

36 జరిగిన దాన్ని దగ్గరగా చూసిన వారు వాడు ఎలా బాగయ్యాడో ప్రజలకు చెప్పారు.

37 గెరాసేను ప్రాంతాల్లో ఉన్నవారంతా ఎంతో భయపడ్డారు. తమను విడిచి వెళ్ళమని ఆయనను బతిమాలుకున్నారు.

38 ఆయన తిరిగి పడవ ఎక్కి వెళ్ళబోతుంటే దయ్యాలు వదిలిన వ్యక్తి తనను కూడా ఆయనతో ఉండనిమ్మని బతిమాలాడు. 39 కానీ ఆయన, “నువ్వు నీ ఇంటికి వెళ్ళి దేవుడు నీకు చేసిన గొప్ప విషయాలను చెప్పు” అని వాణ్ణి పంపివేశాడు. వాడు వెళ్ళి యేసు తనకు చేసిన గొప్ప కార్యాన్ని గురించి ఆ పట్టణమంతా ప్రకటించాడు.