ఉపమానాల మొదటి పెద్ద సమూహం

ఇక్కడ మనకు ఉపమానాల మొదటి పెద్ద సమూహం, దానితోపాటు గెరాసా సందర్శన, నజరేతుకు తిరిగి రావడం కనిపిస్తాయి.

అదే రోజు. గలిలయ సముద్రం ఒడ్డున

క్రీ.శ. 27 నుండి 29 వరకు

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

మత్తయి రాసిన సువార్త 13:1–53

ఈ సమూహానికి పరిచయం

13:1 ఆ రోజు యేసు ఇంట్లో నుండి వెళ్ళి సముద్రం ఒడ్డున కూర్చున్నాడు.

2 ప్రజలు పెద్ద గుంపులుగా తన చుట్టూ చేరినపుడు ఆయన పడవ ఎక్కి కూర్చున్నాడు. ప్రజలంతా ఒడ్డున నిలుచున్నారు.

3 ఆయన వారిని చూసి చాలా సంగతులు ఉపమాన రీతిగా చెప్పాడు. ఆయన వారితో, “విత్తనాలు చల్లేవాడు చల్లడానికి బయలుదేరాడు.

విత్తేవాని ఉపమానం

సముద్రం ఒడ్డున ఉన్న జనసమూహాలకు: విత్తేవాని ఉపమానం.

4 అతడు విత్తనాలు చల్లుతూ ఉంటే కొన్ని విత్తనాలు దారి పక్కన పడ్డాయి. పక్షులు వచ్చి వాటిని మింగివేశాయి.

5 కొన్ని విత్తనాలు మట్టి ఎక్కువగా లేని రాతి నేలమీద పడ్డాయి. అక్కడ మట్టి లోతుగా లేకపోవడం చేత అవి వెంటనే మొలకెత్తాయిగానీ,

6 ఎండ వచ్చినప్పుడు అవి మాడిపోయి వేరులు లేకపోవడంతో ఎండిపోయాయి.

7 కొన్ని విత్తనాలు ముళ్ళ కంపల్లో పడ్డాయి. ముళ్ళ కంపలు ఎదిగి వాటిని అణిచి వేశాయి.

8 మరికొన్ని విత్తనాలు మంచి నేలపై పడి పంటకు వచ్చాయి. వాటిలో కొన్ని వంద రెట్లు, కొన్ని అరవై రెట్లు, కొన్ని ముప్ఫై రెట్లు ఫలించాయి.

9 చెవులున్నవాడు విను గాక!” అన్నాడు.

10 తరువాత శిష్యులు వచ్చి, “నీవు ఉపమానాలతో ఎందుకు వారితో మాట్లాడుతున్నావు?” అని అడిగారు. ఆయన వారికి జవాబిస్తూ ఇలా అన్నాడు,

11 “పరలోక రాజ్య మర్మాలు గ్రహించే భాగ్యం దేవుడు మీకు అనుగ్రహించాడు, వారికి అనుగ్రహించలేదు.

12 కలిగిన వాడికి ఇంకా ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది. అతనికి సమృద్ధిగా ఉంటుంది. లేని వాని నుంచి అతని దగ్గర ఉన్న కొంచెం కూడా తీసివేయడం జరుగుతుంది. 13 ఇందుకోసమే నేను వారికి ఉపమానాలతో బోధిస్తున్నాను. వారు చూస్తున్నారు గానీ నిజానికి చూడరు. వింటున్నారు గానీ నిజానికి వినరు, అర్థం చేసుకోరు.

14 యెషయా చెప్పిన ప్రవచనం వీరి విషయంలో నెరవేరింది.

‘మీరు వినడానికి వింటారు గాని గ్రహించనే గ్రహించరు.

చూడడానికి చూస్తారు గాని ఏ మాత్రం తెలుసుకోరు.

15 ఈ ప్రజల హృదయం బండబారి పోయింది.

వారికి చెముడు వచ్చినట్టుగా ఉంది.

వారి కళ్ళు మూసుకుపోయాయి.

వారు కళ్ళారా చూసి, చెవులారా విని, హృదయంతో గ్రహించి,

మనసు తిప్పుకుని నా వలన బాగుపడే వీలు లేకుండా అయిపోయింది.’

16 “అయితే మీ కళ్ళు చూస్తున్నాయి కాబట్టి అవి ధన్యమయ్యాయి. మీ చెవులు వింటున్నాయి, కాబట్టి అవి ధన్యమయ్యాయి. 17 చాలామంది ప్రవక్తలూ నీతిమంతులూ మీరు చూస్తున్నవాటిని చూడాలని ఆశించారు గానీ చూడలేక పోయారు. మీరు వింటున్న వాటిని వినాలనుకున్నారు గానీ వినలేకపోయారని మీతో కచ్చితంగా చెబుతున్నాను.

18 “విత్తనాలు చల్లే వాడి గురించిన ఉపమానం అర్థం వినండి. 19 ఎవరైనా రాజ్యం గురించిన వాక్కు విని కూడా గ్రహించకపోతే దుష్టుడు వచ్చి అతని హృదయంలో పడిన విత్తనాలను ఎత్తుకు పోతాడు. దారిపక్కన చల్లిన విత్తనాలు వీరే.

20 రాతినేలను చల్లిన విత్తనాలు ఎవరంటే, వాక్యం విని వెంటనే సంతోషంతో దాన్ని అంగీకరించేవారు.

21 అయితే అతనిలో వేరు లేకపోవడంతో అతడు కొద్ది కాలమే నిలిచి ఉంటాడు. వాక్యం కారణంగా కష్టాలు గానీ హింసలు గానీ కలగగానే తొట్రుపడిపోతాడు.

22 ముళ్ళ మొక్కల్లో చల్లిన విత్తనాలు ఎవరంటే, వాక్యం వింటారు గానీ ఈ లోక చింతలూ, సంపదలోని మోసమూ ఆ వాక్యాన్ని అణచివేస్తాయి. కాబట్టి వారు ఫలించకుండా పోతారు.

23 మంచి నేలపై చల్లిన విత్తనాలు ఎవరంటే, వాక్కు విని దాన్ని అర్థం చేసుకునేవాడు. అలాటి వారు నిజంగా ఫలించి వృద్ధి పొందుతారు. కొందరు వంద రెట్లు, కొందరు అరవై రెట్లు, మరికొందరు ముప్ఫై రెట్లు ఫలిస్తారు.”

కలుపు మొక్కల ఉపమానం

24 ఆయన మరొక ఉపమానం వారితో చెప్పాడు, “పరలోక రాజ్యం తన పొలంలో మంచి విత్తనాలు చల్లించిన రైతులా ఉంది. 25 మనుషులు నిద్రపోతూ ఉంటే అతని శత్రువు వచ్చి గోదుమల మధ్య కలుపు మొక్కల విత్తనాలు చల్లి పోయాడు.

26 మొక్కలు పెరిగి కంకులు వేసినప్పుడు ఆ కలుపు మొక్కలు కూడా కనిపించాయి. 27 అప్పుడు ఆ రైతు పనివారు అతని దగ్గరికి వచ్చి ‘అయ్యా, నువ్వు నీ పొలంలో మంచి విత్తనం చల్లించావు గదా, అందులో కలుపు మొక్కలు ఎలా వచ్చాయి?’ అని అడిగారు. 28 ‘ఇది పగవాడు చేసిన పని’ అని అతడు వారితో అన్నాడు. ఆ పనివారు ‘మేము వెళ్ళి ఆ కలుపు మొక్కలను పీకేయమంటారా?’ అని అతన్ని అడిగారు. 29 అందుకు ఆ యజమాని, ‘వద్దు. కలుపు మొక్కలను పీకితే వాటితోబాటు గోదుమ మొక్కలనుకూడా పెళ్లగిస్తారేమో. 30 కోతకాలం వరకూ రెంటినీ కలిసి పెరగనివ్వండి. కోతకాలంలో మొదట కలుపు మొక్కలను పోగు చేసి కాల్చివేయడానికి కట్టలు కట్టండి. గోదుమలను నా గిడ్డంగిలో చేర్చండి, అని కోత కోసే వారికి చెబుతాను’ అన్నాడు.”

ఆవగింజ ఉపమానం

31 ఆయన మరొక ఉపమానం వారితో చెప్పాడు. “పరలోకరాజ్యం ఇలా ఉంది. ఒకడు తన పొలంలో ఒక ఆవ విత్తనం నాటాడు. 32 అది విత్తనాలన్నిటిలో చిన్నదే గాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటినీ మించిన పెద్ద చెట్టు అవుతుంది. పక్షులు వచ్చి దాని కొమ్మల్లో గూళ్ళు కట్టుకుంటాయి.”

పులిసిన పిండి ఉపమానం, అలాంటివే మరెన్నో

33 ఆయన ఇంకొక ఉపమానం వారితో చెప్పాడు, “పరలోక రాజ్యం ఒక స్త్రీ మూడు మానికల పిండిలో వేసి కలిపి అది అంతా పులిసేలా చేసిన పులిపిండిలాగా ఉంది.”

34-35 “నేను నా నోరు తెరచి ఉపమానాలతో బోధిస్తాను.

లోకం సృష్టి మొదలుకొని రహస్యంగా ఉండిపోయిన విషయాలు చెబుతాను.”

అని ప్రవక్త చెప్పిన మాట నెరవేరేలా యేసు ఈ సంగతులన్నీ ప్రజలకు ఉపమానాలతో బోధించాడు. ఉపమానం లేకుండా ఆయన వారికి దేన్నీ బోధించలేదు.

యేసు కలుపు మొక్కల ఉపమానాన్ని వివరించడం

ఇంట్లో శిష్యులకు: కలుపు మొక్కల ఉపమానానికి వివరణ.

36 అప్పుడాయన ప్రజలను పంపివేసి, ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఆయన శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి, “పొలంలోని కలుపు మొక్కలను గురించిన ఉపమానం అర్థం మాకు చెప్పు” అని అడిగారు. 37 అందుకాయన ఇలా అన్నాడు, “మంచి విత్తనం చల్లేది మనుష్య కుమారుడు. 38 పొలం ఈ లోకం. మంచి విత్తనాలు పరలోక రాజ్యానికి సంబంధించిన వారు. కలుపు మొక్కలు దుష్టుని సంబంధులు. 39 వాటిని చల్లే ఆ శత్రువు సాతాను. కోతకాలం లోకాంతం. కోత కోసే వారు దేవదూతలు. 40 కలుపు మొక్కలను పోగుచేసి మంటల్లో కాల్చినట్టే ఈ లోకాంతంలో జరుగుతుంది. 41 మనుష్యకుమారుడు తన దూతలను పంపుతాడు. వారాయన రాజ్యంలో నుండి పాపానికి కారణమయ్యే ప్రతి దానినీ దుర్మార్గం చేసే వారందరినీ సమకూర్చి అగ్నిగుండంలో పడవేస్తారు. 42 అక్కడ ఏడుపూ పళ్ళు కొరుక్కోవడమూ ఉంటాయి. 43 అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని లాగా ప్రకాశిస్తారు. వినగలిగే చెవులున్నవాడు విను గాక.

దాచిన నిధి ఉపమానం

44 “పరలోకరాజ్యం పొలంలో దాచిన నిధి లాగా ఉంది. ఒక మనిషి దాన్ని చూసి దాచి పెట్టి, అది దొరికిన సంతోషంతో వెళ్ళి, తనకున్నదంతా అమ్మి ఆ పొలం కొంటాడు.

అమూల్యమైన ముత్యం ఉపమానం

45 “పరలోకరాజ్యం మంచి ముత్యాలను కొనడానికి వెతుకుతున్న ఒక వ్యాపారస్తుడి లాగా ఉంది. 46 అతడు చాలా విలువైన ఒక ముత్యం కనబడగానే పోయి తనకు ఉన్నదంతా అమ్మేసి దాన్ని కొనుక్కుంటాడు.

వల ఉపమానం

47 “పరలోకరాజ్యం సముద్రంలో వేసే వలను పోలి ఉంది. అందులో రకరకాల చేపలు పడతాయి. 48 అది నిండినప్పుడు తీరానికి లాగి, కూర్చుని మంచి వాటిని గంపల్లో వేసుకుని పనికి రాని వాటిని విసిరి పారేస్తారు. 49 అలాగే ఈ లోకాంతంలో జరుగుతుంది. దేవ దూతలు వచ్చి నీతిమంతుల్లో నుండి దుష్టులను వేరు చేసి, 50 వారిని అగ్ని గుండంలో పడవేస్తారు. అక్కడ ఏడుపూ పళ్ళు కొరుక్కోవడం ఉంటాయి.

ఇంటి యజమాని ఉపమానం

51 వీటినన్నిటిని మీరు గ్రహించారా?” అని ఆయన వారిని అడిగినప్పుడు వారు జవాబిస్తూ, “గ్రహించాము” అన్నారు. 52 ఆయన, “అందువలన దేవుని రాజ్యాన్ని గురించి ఉపదేశం పొందిన ప్రతి ధర్మశాస్త్ర పండితుడూ తన ఖజానాలో నుండి కొత్త వాటినీ పాత వాటినీ బయటికి తెచ్చే ఇంటి యజమానిలాగా ఉన్నాడు” అని వారితో చెప్పాడు.

53-54 యేసు ఈ ఉపమానాలు చెప్పి ఊరుకున్న తరువాత, ఆయన అక్కడ నుండి వెళ్ళి తన సొంత ఊరు వచ్చి, సమాజ మందిరాల్లో వారికి బోధిస్తూ ఉన్నాడు. వారు ఆశ్చర్యపడి, “ఈ జ్ఞానం, ఈ అద్భుతాలు ఇతనికి ఎక్కడ నుంచి వచ్చాయి?

మార్కు రాసిన సువార్త 4:1–34

ఈ సమూహానికి పరిచయం

4:1 మరొకసారి ఆయన సముద్రం ఒడ్డున ఉపదేశించడం ప్రారంభించాడు. ఆయన చుట్టూ చాలా మంది ప్రజలు ఉండడం వల్ల, ఆయన ఒక పడవ ఎక్కి కూర్చున్నాడు. ప్రజలు ఒడ్డున ఉన్నారు.

2 ఆయన ఉదాహరణల సహాయంతో అనేక విషయాలు వారికి బోధించాడు. ఆయన వారితో ఇలా అన్నాడు.

విత్తేవాని ఉపమానం

సముద్రం ఒడ్డున ఉన్న జనసమూహాలకు: విత్తేవాని ఉపమానం.

3 “వినండి! ఒక రైతు విత్తనాలు చల్లడానికి వెళ్ళాడు.

4 విత్తనాలు చల్లుతూ ఉండగా, కొన్ని దారి పక్కన పడ్డాయి, పక్షులు వచ్చి వాటిని తినేశాయి.

5 మరికొన్ని విత్తనాలు, మట్టి ఎక్కువగా లేని రాతినేల మీద పడ్డాయి. అవి త్వరగానే మొలకెత్తాయి.

6 కాని వాటి వేర్లు లోతుగా లేనందువల్ల సూర్యుడు రాగానే అవి ఆ వేడికి మాడిపోయాయి.

7 ఇంకా కొన్ని విత్తనాలు ముళ్ళ తుప్పల్లో పడ్డాయి. ఆ ముళ్ళ తుప్పలు పెరిగి మొక్కలను అణచి వేయడం వల్ల అవి పంటకు రాలేదు.

8 మిగిలిన విత్తనాలు మంచి సారవంతమైన నేలలో పడ్డాయి. అవి మొలకెత్తి, పెరిగి ముప్ఫై రెట్లు, అరవై రెట్లు, వంద రెట్లు పండి కోతకు వచ్చాయి.”

9 యేసు ఇలా చెప్పి, “వినడానికి చెవులు ఉన్నవాడు వినుగాక” అన్నాడు.

10 తరువాత ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు ఆయన పన్నెండు మంది శిష్యులు, ఆయన సన్నిహితులు కొందరు ఆ ఉదాహరణల గురించి ఆయనను అడిగారు.

11 ఆయన వారితో, “దేవుని రాజ్యం గురించిన రహస్య సత్యం మీకు చెప్పాను. కాని బయటి వారికి ప్రతి విషయమూ ఉపమానాల రూపంలోనే లభిస్తుంది.

12 ఎందుకంటే,

వారు చూస్తూనే ఉన్నా గ్రహించకుండా ఉండాలి.

వింటూ ఉన్నా అర్థం చేసుకోకుండా ఉండాలి.

లేకపోతే వారు దేవుని వైపు తిరిగి పాపక్షమాపణ పొందుతారేమో.”

13 ఆయన వారితో ఇలా అన్నాడు, “ఈ ఉపమానం మీకు అర్థం కాలేదా? అయితే మిగతా ఉపమానాలు ఎలా అర్థం చేసుకుంటారు? 14 విత్తనాలు చల్లేవాడు చల్లేది దేవుని వాక్కు.

15 దారి పక్కన ఉన్నవారెవరంటే, వాక్కు వారిలో పడింది గాని, వారు విన్న వెంటనే సైతాను వచ్చి వారిలో పడిన వాక్కును తీసివేస్తాడు.

16 అలాగే కొంతమంది రాతినేల లాంటి వారు. వీళ్ళు వాక్కును విని ఆనందంతో దాన్ని స్వీకరిస్తారు.

17 కానీ వారిలో వాక్కు లోతుగా వేరు పారని కారణంగా కష్టం, హింస కలిగితే దాన్ని వదిలివేస్తారు.

18 కొంతమంది ముళ్ళతుప్పలు మొలిచే నేల లాంటి వారు. దేవుని వాక్కు వింటారు. 19 కాని, జీవితంలో కలిగే చింతలు, ధనం కలిగించే మోసం, ఇతర విషయాల పట్ల కోరికలు ఆ వాక్కును అణచివేసి ఫలించకుండా చేస్తాయి.

20 మరి కొందరు సారవంతమైన నేలలాంటి వారు, వీళ్ళు దేవుని వాక్కు విని, అంగీకరించి కొందరు ముప్ఫై రెట్లు, కొందరు అరవై రెట్లు, కొందరు వంద రెట్లు ఫలిస్తారు.”

21 ఆయన వారితో ఇంకా ఇలా అన్నాడు, “దీపాన్ని తెచ్చి బోర్లించిన పాత్ర కింద, లేక మంచం కింద ఉంచుతారా? దాన్ని దీపస్తంభం మీద ఉంచుతాం గదా!

22 దాచి ఉంచినవన్నీ బహిర్గతమౌతాయి. అన్ని రహస్యాలూ బయట పడిపోతాయి.

23 వినడానికి చెవులు గలవాడు వినుగాక.”

24 యేసు వారితో ఇంకా ఇలా అన్నాడు, “నేను మీతో చెప్పేది జాగ్రత్తగా గమనించండి. మీరు ఏ కొలతలో కొలిచి ఇస్తారో అదే కొలతలో ఇంకా ఎక్కువగా కొలిచి దేవుడు మీకిస్తాడు. 25 కలిగిన వారికి దేవుడు ఇంకా ఎక్కువగా ఇస్తాడు. లేని వారి దగ్గర నుండి ఉన్నది కూడా తీసివేస్తాడు.”

దానంతట అదే పెరిగే విత్తనం ఉపమానం

26 ఆయన మళ్ళీ ఇలా అన్నాడు, “దేవుని రాజ్యం ఒక మనిషి భూమి మీద విత్తనాలు చల్లినట్టు ఉంటుంది. 27 ఆ వ్యక్తి నిద్ర పోతున్నా మెలకువగా ఉన్నా రాత్రి, పగలు అతనికి తెలియకుండానే ఆ విత్తనాలు మొలకెత్తి పెరుగుతూనే ఉంటాయి. 28 ఎందుకంటే భూమి దానంతట అదే పండుతుంది. మొదట మొలక, ఆ తరువాత కంకి, ఆ కంకి నిండా గింజలు పుడతాయి. 29 పంట పండినప్పుడు అతడు కోతకాలం వచ్చిందని వెంటనే కొడవలితో కోస్తాడు.”

ఆవగింజ ఉపమానం

30 ఆయన మళ్ళీ ఈ విధంగా అన్నాడు. “దేవుని రాజ్యాన్ని దేనితో పోల్చగలం? ఏ ఉపమానం ఉపయోగించి దాన్ని వర్ణించగలం? 31 అది ఆవగింజ లాంటిది. మనం భూమి మీద నాటే విత్తనాలన్నిటిలోకీ అది చిన్నది. 32 కాని దాన్ని నాటిన తరువాత తోటలో ఉన్న అన్ని మొక్కల కన్నా అది పెద్దగా పెరుగుతుంది. దాని కొమ్మలు పెద్దగా ఎదుగుతాయి. పక్షులు దాని నీడలో గూడు కట్టుకుంటాయి.”

పులిసిన పిండి ఉపమానం, అలాంటివే మరెన్నో

33 యేసు ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉపయోగించి, వారు అర్థం చేసుకోగలిగిన కొద్దీ వారికి ఉపదేశించాడు.

34 ఉపమానం లేకుండా వారికి ఏ ఉపదేశమూ చేయలేదు. తరువాత ఆయన తన శిష్యులతో ఒంటరిగా ఉన్నప్పుడు వారికి అన్నీ వివరించి చెప్పాడు.

లూకా రాసిన సువార్త 8:4–18

ఈ సమూహానికి పరిచయం

8:4 ఒకసారి ప్రతి పట్టణం నుండీ ప్రజలు పెద్ద గుంపులుగా యేసు దగ్గరికి వస్తున్నారు. అప్పుడు ఆయన వారికి ఒక ఉపమానం చెప్పాడు.

విత్తేవాని ఉపమానం

సముద్రం ఒడ్డున ఉన్న జనసమూహాలకు: విత్తేవాని ఉపమానం.

5 “విత్తనాలు చల్లేవాడు చల్లడానికి బయలుదేరాడు. అతడు చల్లుతూ ఉండగా కొన్ని విత్తనాలు దారి పక్కన పడి మనుషుల కాళ్ళ కింద నలిగిపోయాయి. కాబట్టి గాలిలో ఎగిరే పక్షులు వాటిని మింగివేశాయి.

6 మరి కొన్ని రాతి నేల మీద పడ్డాయి. అవి మొలిచాయి కానీ లోపల తడి లేకపోవడంతో ఎండిపోయాయి.

7 మరి కొన్ని ముళ్ళపొదల మధ్యలో పడ్డాయి. ముళ్ళపొదలు వాటితో కూడా మొలిచి వాటిని అణచి వేశాయి.

8 మరి కొన్ని మంచి నేలపై పడ్డాయి. అవి మొలిచి నూరు రెట్లుగా ఫలించాయి.” ఆయన ఇలా చెప్పి, “వినడానికి చెవులున్నవాడు విను గాక” అని బిగ్గరగా అన్నాడు.

9 ఆయన శిష్యులు, “ఈ ఉపమానం అర్థం ఏమిటి?” అని అడిగారు

10 ఆయన, “దేవుని రాజ్య రహస్య సత్యాలు తెలుసుకునే ఆధిక్యత మీరు పొందారు. ఇతరులైతే చూస్తూ ఉన్నా నిజంగా చూడకుండా, వింటూ ఉన్నా అర్థం చేసుకోకుండా ఉంటారు గనక వారికి ఉపమానాల్లోనే బోధిస్తున్నాను.

11 ఈ ఉపమానానికి అర్థం ఏమిటంటే విత్తనం దేవుని వాక్యం.

12 దారి పక్కన పడిన విత్తనాలు ఎవరంటే వీరు వాక్కును వింటారు గానీ నమ్మి రక్షణ పొందకుండా అపవాది వచ్చి వారి హృదయాల్లో నుండి ఆ వాక్యాన్ని తీసివేస్తాడు.

13 రాతి నేలపై పడిన విత్తనాలు ఎవరంటే వింటున్నప్పుడు వాక్యాన్ని సంతోషంగా అంగీకరించే వారు. కానీ వారిలో వేరు లేదు కాబట్టి కొంతకాలం నమ్మి తరువాత విషమ పరీక్షల కాలంలో తొలగిపోతారు.

14 ముళ్ళ పొదల్లో పడిన విత్తనాలు ఎవరిని పోలిన వారంటే, వీరు వింటారు గానీ కాలం గడిచే కొద్దీ జీవితంలో ఎదురయ్యే చింతలతో, సుఖాలతో, సంపదలతో ఉక్కిరి బిక్కిరై అణగారి పోతారు. వీరి ఫలం పక్వానికి రాదు.

15 మంచి నేలపై పడే విత్తనాలు ఎవరంటే యోగ్యమైన మంచి మనసుతో వాక్కును విని, భద్రంగా చేపట్టి ఓపికతో ఫలించేవారు.

16 “ఎవరూ దీపాన్ని వెలిగించి బుట్టతో కప్పివేయడు, మంచం కింద పెట్టడు. ఇంట్లోకి వచ్చే వారికి వెలుగు కనిపించేలా దీపస్తంభంపై ఉంచుతాడు.

17 తేటతెల్లం కాని రహస్యమేదీ లేదు. తెలియకుండా, బయట పడకుండా, దాగి ఉండిపోయేది ఏదీ లేదు.

18 కలిగిన వ్యక్తికే ఇస్తారు, లేని వ్యక్తి నుండి తనకు ఉంది అనుకున్నది కూడా తీసివేస్తారు. కాబట్టి మీరు ఎలా వింటున్నారో చూసుకోండి” అన్నాడు.